ఆంధ్రప్రదేశ్‌

చివరి అంకానికి ‘పురుషోత్తపట్నం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 19: అఖండ గోదావరి ఎడమ గట్టుపై సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామం వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం చివరి అంకానికి చేరుకుంది. తాజా బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించడంతో పనులు మరింత ఊపందుకున్నాయి. రూ.1638 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టిన ఈ పథకం వాస్తవానికి గత ఏడాది నవంబర్ నాటికి పూర్తికావాల్సివుంది. పథకం పూర్తి కాకుండానే గత ఏడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితంచేశారు. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపు నిధులతో మొత్తం పథకం పూర్తయ్యేందుకు మార్గం సుగమం అయింది. చిన్న చిన్న పనులు మినహా అన్ని పనులు పూర్తయ్యాయి. మోటార్లు, పంపులు పూర్తి స్థాయిలో బిగించారు. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయింది. రెండు స్టేజ్‌ల పంపు హౌస్‌ల నిర్మాణం పూర్తయింది. పురుషోత్తపట్నం ప్రధాన కాల్వ దారిలో వున్న ఏలేరు ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరణ, విశాఖ కార్పొరేషన్‌కు తాగునీరు అందించడం ఈ పధకం ప్రధాన లక్ష్యం. గత ఏడాది అక్టోబర్ నాటికి తొలి దశ పనులు పూర్తిచేసి పుష్కర కాల్వ ద్వారా ఏలేరు జలాశయంలోకి 1.5 టిఎంసీల నీటిని విడుదలచేశారు. ఈ నెలాఖరుకు పథకాన్ని పూర్తిచేసి గోదావరి వరదల సమయంలో ఏలేరుకు నీరు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మిస్తున్న పంపుహౌస్ పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి. పురుషోత్తపట్నం గ్రామం వద్ద నిర్మించిన స్టేజ్ 1 పంపుహౌస్‌లో 10 మోటార్లు, 10 పంపులు బిగించారు. ఈ పథకానికి సంబంధించి 50.5 కిలో మీటర్ల మేర ఐదు వరుసల్లో పైపులైన్లు ఏర్పాటుచేయాల్సివుండగా ఇప్పటి వరకు 48.5 కిలో మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం నుంచి రబీకి సాగునీరు విడుదలవుతుండటంతో రెండు కిలోమీటర్ల పైపులైన్ పనులు కాస్తంత మెల్లగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు తొర్రిగడ్డ నుంచి నీటిని నిలిపివేసిన తర్వాత పనులు పూర్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించి జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పథకానికి గత ఏడాది జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిఠాపురంలో శంకుస్థాపన చేశారు. భూసేకరణ ప్రక్రియలో కాస్తంత ఇబ్బందులు ఎదురుకావడంతో పనుల్లో మొదట్లో కాస్తంత జడత్వం చోటు చేసుకుంది. కేవలం రెండు మోటార్ల ద్వారా నీటిని ఏలేరుకు పంపే ప్రయత్నంచేశారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా నీటిని ఏలేరు జలాశయానికి పంపించాల్సి వుంది. కానీ పుష్కర ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వ ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు. మార్గమధ్యలో మూడు చోట్ల రహదారుల క్రాసింగ్ పనులు పూర్తి కావాల్సివుంది. ప్రస్తుతం రెండు చోట్ల 16వ నెంబర్ జాతీయ రహదారిపై వంతెనల నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ మళ్లించారు. మరో రెండు చోట్ల రాష్ట్ర జాతీయ రహదారులపై వంతెనల నిర్మాణం పూర్తి కావాల్సివుంది. పోలవరం ఎడమ కాలువపై వంతెన పనులు పూర్తికాకపోవడంతో పుష్కర కాల్వ ద్వారా నీటిని మళ్లించారు. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకోవడంతో ఈ నెలాఖరుకు మొత్తం పనులు పూర్తయ్యే పరిస్థితి వుంది. ఏప్రిల్ మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగుళూరు వద్ద పోలవరం పవర్ హౌస్ కాంక్రీటు పనులను ప్రారంభించడానికి వచ్చే అవకాశం వుందని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పురుషోత్తపట్నం పూర్తయిన తర్వాత గోదావరి వరదల సమయంలో 10 పంపుల ద్వారా రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని తోడి ఏలేరు జలాశయానికి సరఫరాచేస్తారు. జలాశయంలో నిత్యం 24 టీఎంసీల నీరు నిల్వచేస్తారు. ఈ నీరు ఇటు రబీ అవసరాలకు, అటు విశాఖ తాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు స్టాండ్‌బైగా వినియోగించుకోవడానికి కూడా అవకాశంవుంది. ఏలేరు జలాశయం పరిధిలోని 67వేల ఎకరాల ఆయకట్టుతోపాటు మరో 50వేల ఎకరాలకు ఖరీఫ్‌లో సాగునీరు అందించనున్నారు. రబీ కాలంలో అపరాల సాగుకు నీరందిస్తారు.