ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్ర శాసనసభ, మండలి సమావేశాలు 5న సాయంత్రం 3 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. అసెంబ్లీ, మండలి బడ్జెట్ సమావేశాలు 18 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. అంతకుమించి శాసనసభ కొనసాగింపు అంశంపై బిఏసిలో చర్చిస్తారు. 10న వ్యవసాయ బడ్జెట్, సాధారణ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. అనంతరం మూడు రోజులపాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు. తర్వాత 10న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీ ఆమోదానికై రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2016-17) వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్కడా ఇబ్బంది రాకుండా బయట హైదరాబాద్ నగర పోలీసులతో, అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీ పోలీసులతో ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న సమావేశాల భద్రతా ఏర్పాట్లను మరోమారు ఉన్నతాధికారులు శుక్రవారం పర్యవేక్షించారు. మొన్నటి సమావేశాల వరకూ సభ్యుల సెల్‌ఫోన్లను సభలోకి అనుమతిస్తూ, జామర్ల సాయంతో వాటిని పనిచేయకుండా నిలువరించేవారు. అయితే ఇకపై వాటిని సభలోకి కూడా తీసుకురాకుండా ఉండేలా చర్యలు తీసుకునే అంశాన్ని స్పీకర్ పరిశీలిస్తున్నారు. గత అసెంబ్లీలో జరిగిన కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో కనిపించిన నేపథ్యంలో ఫోన్లు, ట్యాబ్‌ల అనుమతి నిరాకరిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన స్పీకర్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రవేశద్వారం, బయటకువెళ్లే ద్వారాల వద్ద బందోబస్తు అధికార్ల నియామకం వంటి వాటిని స్పీకర్ కోడెల సమీక్షించారు. శాఖాపరమైన గుర్తింపుకార్డులతో పాటు అసెంబ్లీ విధులకు అనుమతితో ప్రత్యేకంగా జారీ చేసిన కార్డులు ఉంటేనే ప్రాంగణంలోకి అనుమతిస్తారు. అవసరమైతే పాస్‌లను ఒకరోజుకు కాకుండా రోజులో నిర్ణీత సమయానికే జారీ చేస్తే మేలనే భావన కూడా వ్యక్తమైంది.
ఇప్పటి వరకూ సమాధానాలు లేవు
గత సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను వెంటనే పంపించాలని, ఈ సమావేశాల్లో సభ్యుల ప్రశ్నలకు ఎప్పటికపుడు లిఖిత పూర్వకంగా ఇచ్చేందుకు సిద్ధం కావాలని వివిధ శాఖల అధికారులను స్పీకర్ కోడెల ఆదేశించారు. గత సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో అవే ప్రశ్నలు తిరిగి సభ ముందుకు వస్తున్నాయని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు సరికాదని కూడా స్పీకర్ పేర్కొన్నారు. మరోవైపు అధికార పక్షం నుండి అమాత్యులు ఇచ్చే ప్రశ్నలకు సంబంధించిన సమాచారం కూడా ఉండటం లేదని, వాటిని సభ్యులకు అందించిన తర్వాతే మంత్రులు చదవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు వివిధ రకాల బిల్లుల ప్రవేశానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి సమాచారం సభ ముందుండాలని, హడావుడిగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని స్పీకర్ అధికారులను ప్రశ్నించారు.
ఎన్టీఆర్ ఘాట్‌కు చంద్రబాబు
శనివారం సాయంత్రం రెండు గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం చంద్రబాబు సహా తెదేపా నేతలు అంతా అసెంబ్లీకి చేరుకుంటారు. ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లేవారిలో టిడిపి నేతలతో పాటు బాలకృష్ణ కూడా ఉంటారని టిడిపి వర్గాలు తెలిపాయి.
పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు
కాగా అసెంబ్లీ సమావేశాల వేదికగా ఇటు అధికార తెలుగుదేశం తమ సత్తాచూపేందుకు ప్రయత్నిస్తుంటే, మరో పక్క విపక్ష పార్టీ వైకాపా కూడా అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు భూదందాలపై వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తోంది. వైకాపా నుండి 8మంది ఎమ్మెల్యేలు తెదేపాలో చేరడంతో వారందరి సభ్యత్వాన్ని రద్దు చేయించేందుకు ఉన్న మార్గాలను వైకాపా అనే్వషిస్తోంది. మరోపక్క ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా రచన చేస్తోంది.
రామ్‌దేవ్ బాబా యోగా
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాబా రాం దేవ్ ద్వారా యోగా శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత 12న ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నా ఆరోజు సిఎం అందుబాటులో ఉండకపోవడంతో 19న కార్యక్రమం నిర్వహించనున్నారు.