ఆంధ్రప్రదేశ్‌

11నుంచి మళ్లీ ఆమరణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఆమరణ దీక్షకు సిద్ధపడుతున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలన్న ప్రధాన డిమాండుతో ఇటీవల తన భార్యతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా సిఎం ఇచ్చిన హామీలపై ఈనెల 10లోగా లిఖితపూర్వక హామీ ఇవ్వాలని, లేనిపక్షంలో 11నుంచి మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తన దీక్షా సమయంలో ఇచ్చిన ప్రధానమైన ఆరు డిమాండ్లపై 10లోగా లిఖిత పూర్వక హామీని నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత బడ్జెట్‌లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు వెయ్యి కోట్లు కేటాయించాలని, బడ్జెట్‌తో సంబంధం లేకుండా రూ.500 కోట్లు తక్షణం కేటాయించాలన్నారు. వచ్చిన దరఖాస్తులన్నిటికీ తక్షణం రుణాలు మంజూరు చేయాలని, జన్మభూమి కమిటీల ప్రమేయం మంజూరులో ఉండరాదన్నారు. ఆన్‌లైన్‌లో వచ్చిన వరుస ఆధారంగా, ఏ మండలానికి ఆ మండలంలోనే రుణాలు పంపిణీ చేయాలని కోరారు. జీవో నెంబర్ 10 ప్రకారం ప్రతి యూనిట్ ఖరీదు రూ.2 లక్షలుగా ఉండాలన్నారు. మంజునాథ కమిషన్ కేబినేట్ నిర్ణయం చేసిన నాటినుండి 9 నెలల్లోగా నివేదిక సిద్ధం చేయాలని, ఈ నివేదిక ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను బీసీల్లో కలపాలని ముద్రగడ డిమాండ్ చేశారు. హామీలపై సిఎం సంతకంతో అధికారికంగా హామీపత్రం ఈనెల 10లోగా తనకు పంపాలని, అలా పంపని పక్షంలో 11 ఉదయం 10 గంటల నుండి తన ఇంటి ఆవరణలో ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని హెచ్చరించారు.
వైకాపా అధినేత జగన్ ప్రోత్సాహంతో, ఆయన చెప్పినట్టుగా తాను లేఖలు రాస్తున్నట్టు చంద్రబాబు, మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారని ముద్రగడ అన్నారు. తన రాజకీయ అనుభవమంత వయసులేని జగన్ చెబితే ఉత్తరాలు రాసే స్థితిలో తానులేనని, అలా అని రుజువుచేస్తే నేను, నా కుటుంబం భవిష్యత్‌లో రాజకీయాలు, ఉద్యమాల జోలికి రాకుండా ఇంటికే పరిమితమవుతామని స్పష్టం చేశారు. అలా నిరూపించకపోతే మీరు, మీ కుటుంబీకులు రాజకీయ సన్యాసం తీసుకోగలరా? అని చంద్రబాబును ప్రశ్నించారు. తాను కుల రాజకీయాలు చేయడం లేదని, కాపులను బీసీలుగా చేర్చుతామని హామీ ఇచ్చింది మీరేనంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మీరు, నేనూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాం. ఆ విషయం గుర్చుంచుకోండి అంటూ చంద్రబాబుకు ముద్రగడ సూచించారు. ఆమరణ దీక్ష విరమించిన సమక్షంలో తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పానని, అందులో భాగంగానే జగన్‌కూ కృతజ్ఞతలు చెప్పానన్నారు. చంద్రబాబుకు చెప్పాలని రోజంతా వేచిచూసినా ఆయన ఫోన్‌లైన్ దొరకలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో ఆయన కుమారుడు జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్రలో ఒకే ఒకసారి మాత్రమే పాల్గొన్నానన్నారు. తనకున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తనకు సహాయం చేస్తానని అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పినా సున్నితంగా తిరస్కరించానని గుర్తు చేసుకున్నారు. కాపు నాయకులతోనే తనపై విమర్శలు చేయిస్తున్నారంటూ తెలుగుదేశం నేతలపై ముద్రగడ అసహనం వ్యక్తం చేశారు. విలేఖర్ల సమావేశంలో కాపు నాయకులు నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, వివై దాసు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... మీడియాతో మాట్లాడుతున్న ముద్రగడ పద్మనాభం