నిజామాబాద్

అతివ వేదన .. అరణ్య రోదనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నియంత్రణ లేని హత్యలు..అత్యాచారాలు
కాగితాలకే పరిమితమవుతున్న చట్టాలు
నిజామాబాద్, మార్చి 7: సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలు ఆధునిక యుగంలోనూ అణిచివేతకు గురవుతూ ద్వితీయశ్రేణి పౌరులుగానే కొనసాగుతున్నారు. అనాదిగా స్ర్తిలను తల్లిగా, చెల్లిగా, దేవతగా ఆరాధిస్తున్న పుణ్యభూమిలో క్రమంగా వేళ్లూనుకుంటున్న పెడధోరణి, పాశ్చాత్య సంస్కృతి మహిళలకు శాపంలా మారుతోంది. దేవతగా పూజింపబడిన మహిళ నేడు తనను కాపాడాలంటూ అర్థించే పరిస్థితి కనిపిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించి వందేళ్లు గడుస్తున్నా, పాలకుల నిర్లక్ష్యం, సమాజపు అసంబద్ధ పోకడల వల్ల మహిళలపై హత్యలు, అత్యాచార ఘటనలు, పైశాచిక దాడులు నానాటికి పెట్రేగిపోతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. నిర్భయ, గృహహింస వంటి చట్టాలను అమల్లోకి తెచ్చినా, మృగాళ్ల ఆగడాలకు మాత్రం అవి కళ్లెం వేయలేకపోతున్నాయి. ఫలితంగా మహిళలపై వరకట్న హత్యలు, కిడ్నాప్‌లు, దౌర్జన్యాలు, వేధింపులు షరామామూలుగా మారాయి. అర్ధరాత్రి స్ర్తి ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రమని చెప్పిన మహాత్ముని మాటలు కలగానే మిగిలిపోయాయి. అర్ధరాత్రి మాట అటుంచి కనీసం పగటి పూటైనా మహిళ స్వేచ్ఛగా తిరుగలేని పరిస్థితులు ప్రస్తుతం నెలకొనడం సమాజ విపరీత ధోరణులకు అద్దం పడుతున్నాయి. పట్టపగలు మహిళల మెడలో నుండి బంగారు గొలుసులు లాక్కెళ్తూ అతివలను చైన్‌స్నాచర్లు కన్నీటిపర్యంతం చేస్తున్నారు. అనేక పోరాటాల ఫలితంగా మహిళలు సాధించుకున్న హక్కులు, చట్టాలు సైతం పాలకుల నిర్లక్ష్యంతో కాగితాలకే పరిమితం అవుతున్నాయి. స్ర్తి, పురుషుల మధ్య అసమానత అన్ని రంగాల్లో కొనసాగుతోంది. మహిళలు రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం సాధించాలనే పలుకులు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. దాదాపు గత రెండు దశాబ్దాల కాలంగా చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లును పాలకులు పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లింగ నిర్ధారణ, వరకట్న నిషేధం, కుటుంబ హింస, అత్యాచార నిరోధక చట్టాలు అమలుకు నోచుకోకపోవడం వల్ల మహిళలపై దాడులు మరింతగా పెరిగిపోతున్నాయి. శ్రామిక మహిళల్లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, కనీస వేతనాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మహిళా సాధికారత జపం చేస్తున్న ప్రభుత్వాలు మహిళలకు విద్య, ఉపాధి, ఆహార భద్రత, రేషన్ కార్డులు తదితర సంక్షేమ అంశాల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. మహిళల్లో అధిక శాతం అసంఘటిత రంగంలో పని చేస్తుండడం వల్ల హక్కులు, సామాజిక భద్రత కోల్పోతున్నారు. స్వయం ఉపాధి, పొదుపు పేరుతో వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలపై మహిళలు ఆధారపడి దోపిడీకి గురవుతున్న సంఘటనలు కోకొల్లలు అనే చెప్పాలి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు మహిళా ఉద్యోగులకు శాపంగా మారుతున్నాయి. మున్సిపల్, అంగన్‌వాడి, మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వహకులు, ఆశా వర్కర్లు, గృహ నిర్మాణ కార్మికులు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులు శ్రమ దోపిడీతో పాటు పని భద్రత లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం జనాభా 25.80లక్షలుండగా, పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య లక్ష వరకు ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో జిల్లాలో మహిళా ఓటర్లు ఉన్నారు. జనాభా, ఓటర్లలో సింహభాగంలో ఉన్న మహిళలు అక్షరాస్యతలో మాత్రం వెనుకబడి ఉన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేయడంతో ప్రస్తుతం సగానికి పైగా స్థానాల్లో అతివలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే చట్టసభల్లో మాత్రం మహిళలకు వారి సంఖ్యకు అనుగుణంగా తగిన న్యాయం లభించలేకపోతోంది. మహిళలు ఇప్పటికైనా ఐక్యంగా పోరాడి తమ సమస్యలను సాధించుకోవాలని మహిళా సంఘాలు పిలుపునిస్తున్నాయి. సమానత్వం కోసం సమరం కొనసాగించాలని, ఎన్నికల్లో మహిళలకు సరైన నిష్పత్తిలో సీట్లు కేటాయించని పార్టీలను నిలదీయాలని పేర్కొంటున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కేంద్రం ఆమోదించేలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తిగా పోరాటానికి సిద్ధం కావాలని పలువురు సూచిస్తున్నారు.