పర్యాటకం

అరుణగిరివాసం.. ముక్తిదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేరులోనే శివశక్తుల సమన్వయ స్వరూపం నిక్షిప్తమై ఉంది. దివ్యాతి దివ్యమైన నామం స్మరించినంత మాత్రమునే ముక్తిని ప్రసాదించే దివ్యక్షేత్రం అరుణాచలం.
తమిళనాడులో ఈ పర్వతాన్ని ‘అణ్ణామలై’ అంటారు. ఈ పేరుతోనే ‘తిరువణ్ణామలై’ పట్టణం పిలువబడుతున్నది. జిల్లాకు కూడా అదే పేరు ‘తిరు’ అంటే ’శ్రీ’. ‘శ్రీ’తో కూడి (పార్వతితో) ఉన్న అచలుడు (శివుడు) ఉండడం చేత ‘తిరువణ్ణామలై’గా ప్రసిద్ధి పొందింది.
2668 అడుగుల ఎత్తుగల పర్వతం- అరుణాచలం. ఈ గిరి మహిమ ఎన్నో పురాణాల్లో వర్ణించారు. శివ పురాణం, స్కాంద పురాణం, లింగ పురాణం మొదలగు పురాణాలలోనేగాక, ఋగ్వేద, అధర్వణ వేద మంత్రాలలో అరుణాచల ప్రసక్తి, ప్రశస్తి ఉన్నాయి. ఇవేకాక సూత సంహిత, రుద్ర సంహిత, భాస్కర సంహిత మున్నగు సంహితలలో అరుణగిరి ప్రశస్తి ఉంది.
అరుణాచలాన్ని శోణాద్రి (ఎర్రని కొండ)గా పిలుస్తారు. పలు గ్రంథాల్లో అరుణాచలం ఊరు పేరుకు ఎన్నో వ్యవహార నామాలున్నాయి. జ్ఞాన నగరం, ముక్తినగరం, అరుణగిరి, అనలగిరి, శివలోకం, స్థలేశ్వరం- అన్నీ అరుణాచలానికి సంబంధించినవే.
అరుణాచలానికి- శివరాత్రికి గల సంబంధాన్ని గురించిన పురాణగాథ అరుణాచలానికి గల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది.
పురాణ కథ ప్రకారం- ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మకు, స్థితి కర్త మహావిష్ణువుకు మధ్య అధికులెవ్వరు? అన్న ప్రశ్న ఉదయించింది. వాద వివాదాలు ముదిరి, చినికి చినికి గాలివానైనట్లు, కలహానికి కాలు దువ్వినట్లయింది. ఇరువురి మధ్య యుద్ధానికి తెరలేపింది. యుద్ధం భీకరమై సమస్త జగత్తును అల్లకల్లోల పరిచింది. అప్పుడు దేవతలందరూ పరమ శివుణ్ణి శరణం వేడారు.
నిర్గుణుడు (నిరాకారుడు), సగుణుడు (సాకారుడు) అయిన పరబ్రహ్మ బ్రహ్మ-విష్ణువుల నడుమ ఒక మహా అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. కనీ వినీ ఎరుగని ఆ మహా తేజాగ్నిని దర్శించి బ్రహ్మ విష్ణువులు అప్రతిభులయ్యారు.
ఆ మహాగ్ని స్తంభం తుది మొదలు ఎవరు తెలుసుకుంటారో వారే అధికులని అశరీరవాణి పలికింది. అందుకు ఇరువురూ సిద్ధపడ్డారు. వరాహ రూపం ధరించి విష్ణువు ఆదిని తెలుసుకోడానికీ, హంస రూపంతో బ్రహ్మ అంతం కనుగొనడానికి ప్రయాణమయ్యారు. ఇద్దరూ తుది మొదలు తెలుసుకొనడంలో విఫలమయ్యారు.
ఆద్యంత రహితమైన మహత్తేజ స్వరూపమే ఇదియని గ్రహించిన విష్ణువు వెనుదిరిగాడు. రజోగుణ రూపుడైన బ్రహ్మ అహంకారాన్ని చంపుకోలేక అసత్యమాడడానికి వెనుదీయలేదు. శివుడు ప్రత్యక్షమై అసత్యమాడినందుకు బ్రహ్మను మందలించాడు. బ్రహ్మవిష్ణువులు పశ్చాత్తాపం చెంది శివుని భజించారు.
ఇక్కడ త్రిమూర్తులమధ్యే భేదం ఉందనుకోరాదు. ‘‘క్వంచిద్బ్రహ్మ, క్వచిద్విష్ణుః, క్వచ్చిద్రుద్రః’’ అని పురాణాలు వచిస్తున్నాయి. అంటే ఒకచోట బ్రహ్మ, మరొకచోట విష్ణువు, వేరొకచోట రుద్రుడు ప్రశక్తికానవస్తుంది. అంతమాత్రాన వారి మధ్య అసమానతలున్నాయనుకోరాదు. సృష్టిగత అహంకారం, స్థితిగత అహంకారం బ్రహ్మవిష్ణువులుగా సంకేతింపబడ్డారు తప్ప వేరు కాదు. అహంకారాలు పోగొట్టుకోవడమంటే మహాలయ స్వరూపంలో లయంకావడమే అంతరార్థం.
మహత్తేజ స్వరూపంగా నిలిచిన అగ్నిస్తంభంకు గల తత్త్వం- అనంతకాలంగా విస్తరించిన పరమాత్మ చైత్యన్యమే కాలాగ్ని రుద్ర స్వరూపం. అదే ఈ మహాలింగం. గతాన్ని తవ్వుకుని వెళ్ళే లక్షణం వరాహంగా, భవిష్యత్తును తెలుసుకోవాలన్న లక్షణం హంసగా చెప్పడం ఈ తత్త్వానికిగల ముఖ్యోద్దేశ్యం. గతాగతాలు ఎప్పటికీ అంతుపట్టనివి. ఆద్యంతాలు తెలుసుకొనడం అసాధ్యం.
బ్రహ్మవిష్ణువులివురికీ ఆ మహాగ్ని స్తంభంలో తన శబ్దబ్రహ్మాకృతిని, అనంత జ్యోతిర్మయ తత్త్వాన్ని శివుడు దర్శింపజేసాడు. ఆ మహత్తేజోరాశిని చూడలేక వారివురువూ ప్రసన్నవదనంతో సాక్షాత్కరింపమని వేడుకున్నారు. వారి కోరికను మన్నించి శివుడు ధవళకాంతులు వెదజల్లే దివ్యదేహంతో, త్రినేత్రాలతో, చంద్రరేఖతో, జటాజూటధారియై ప్రసన్నమూర్తిగా పృథ్విపై అవతరించాడు. బ్రహ్మమురారులు అర్చించారు. అతడే అరుణాచలేశ్వరుడు. ఆ మహత్తేజ స్తంభమే అరుణాచలంగా ప్రసిద్ధి పొందింది.
అగ్నిస్తంభం- ఒక మహాపర్వతంగాను, అగ్ని లింగంగాను (ఆద్యంతములు లేనిది) ఆవిర్భవించిన సమయం మాఘ బహుళ చతుర్దశి. మహాశివరాత్రిగా ప్రసిద్ధి పొందింది. పర్వత రూపంలో సాక్షాత్కరించిన శివుడే ‘అరుణగిరి’గా నిలిచి మహిమాన్వితమైన కారుణ్యాన్ని ప్రకటిస్తున్నాడు. గిరి సానువున ‘అగ్నిలింగం’గా వెలసిన వాడు అరుణాచలేశ్వరుడు.
‘‘మాఘకృష్ణ చతుర్దశ్యామాది దేవో మహానిశి శివలింగ తయోద్భూతః కోటి సూర్య సమప్రభ॥ కోటి సూర్య సమప్రభా భాసమైన ఈ మహాలింగోద్భవం జరిగినరోజే మహాశివరాత్రి. పంచభూత స్ఫటిక లింగాలలో అగ్ని లింగమైన దానిని ఆది శంకరులు అరుణగిరి సానువునందు అరుణాచలేశ్వరునిగా ప్రతిష్ఠించాడని కథనం.
శివలింగం పానవట్టంపై ఉంటుంది. పానవట్టం లింగపీఠం. ప్రకృతీ శక్తికి ప్రతీక పాదవట్టం. అర్ధనారీశ్వర తత్త్వమే పానవట్టం చేత ఆవృతమైన శివలింగ తత్త్వం.
పానవట్టమే యోని పీఠం. శక్తిపీఠం. ఆ శక్తిని అధిష్ఠించిన నిష్కల పరబ్రహ్మము శివుడు. ఈ విధంగా పార్వతికి ప్రతీకమైనది పీఠం. చిన్మయ రూపుడైన శివుడులింగంగా దర్శనమిస్తాడు.
వ్యాపకశీలమైన ప్రకృతి తత్త్వయోనిగా, ఉత్పత్తికి ఉపాదానకారణంగా పరమశివుని కలయికతో జగత్రృష్టి జరుగుతున్నది. జగత్తుకు మూలాధారులు పార్వతీపరమేశ్వరులు మాతాపితరులుగా వ్యవహరింపబడుతున్నారు.
అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు తండ్రిగా, ఆపీతాకుచాంబ (దేవేరి) తల్లిగా పూజలు అందుకుంటున్నారు. అరుణాచలం అనగానే రమణ మహర్షి గుర్తుకు వస్తారు. చిన్నతనంలోనే అక్కడకు వచ్చిన రమణులు జీవితాంతం అరుణగిరివద్దనే జీవించారు. అరుణాలానికి తాను తరచు ప్రదక్షిణం చేయడమే కాకుండా భక్తులందరికీ గిరి ప్రదక్షణ చేయమని ఆదేశించేవారు. ఆత్మతత్త్వ ఆవిష్కరణకి అరుణగిరి ప్రదక్షిణం మార్గమని బోధించేవారు. మహర్షి మాటల్లో ‘‘స్మరణ మాత్రమున పరముక్త్ఫిలద కరుణామృత జలధి అరుణాచలమిది’’ అని కీర్తించారు. అంతేకాదు- ‘ఈ అరుణాచలాన్ని చూసి ఇది రాళ్ళతో, చెట్లూ చేమలతో కూడిన సాధారణ పర్వతమని భావించవద్దు. ఇది పరమేశ్వర స్వరూపం’’ అనేవారు. ‘‘అరుణగిరి వాసం, ఇక్కడ మరణం- రెండూ ముక్తిదాయకం’’ సాక్షాత్తూ శివుడే పార్వతికి చెప్పినట్లు శివపురాణం ఉటంకిస్తున్నది.
‘‘అరుణం’’- శక్తి- పార్వతి (డైనమిక్ ఫోర్స్). అచలం- శివుడు - నిశ్చలాత్మ (స్టాటిక్ ఫోర్స్) సగుణ నిర్గుణాల ఏక రూపం ఇది’’ అని రమణ మహర్షి మాట.
అదే అరుణాచలం.
అరుణాచలంలో ఎన్నో పర్వాలు నిర్వహిస్తుంటారు. అరుణాచలంలో ముఖ్య పర్వదినాలలో శివరాత్రి ప్రముఖమైనది. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో గుడి గంటలన్నీ మ్రోగించి హారతులిస్తారు. వసంత రుతువులో వసంతోత్సవం, కార్తీక పూర్ణిమ దినోత్సవం, వినాయక చవితికి నవరాత్రులు, సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా బ్రహ్మోత్సవాలు, దేవీ నవరాత్రులలో ఆపీతాకుచాంబ (దేవేరి)కి కుంకుమ పూజలతోపాటు ప్రతి మాసంలో వచ్చే ఆయా దేవతలకు సంబంధించిన తిథులు, నక్షత్రాలననుసరించి జరిపే ఉత్సవాలతో ఆలయం నిత్యకల్యాణం- పచ్చతోరణంగా అలరారుతుంది.

-ఎ.సీతారామారావు