ఆరోగ్య భాగ్యం

ఊబకాయానికి పరిష్కారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి పుట్టిన దగ్గర్నుంచీ పెరుగుతూ వచ్చి చివరిదశలో తగ్గుతూండేవి మూడు విషయాలు... ఒకటి బరువు, రెండోది కంటిచూపు, మూడోది వినికిడి శక్తి. వీటిలో రెండోది, మూడోది సమస్యలే కానీ పరిష్కార మార్గాలు చాలా నికరంగా ఉంటాయి. కానీ బరువు గురించి ఏకసూత్రం ఏకాభిప్రాయం ఉండదు. ఈ బరువు ఆయా వ్యక్తుల వంశపారంపర్యత, ఆహారపు అలవాట్లు.. వాళ్ల శరీర వ్యాయామం, పనులపై ఆధారపడి ఉంటుంది. ఈ సమస్య స్ర్తిలలో ఎక్కువగా ఉండటానికి కారణం వారి హార్మోనుల అసమతుల్యత (హార్మోనల్ ఇంబాలెన్స్), గర్భధారణ, కాన్పులు.. తర్వాత తీసుకునే విశ్రాంతి కాస్త ఎక్కువ కావడం కారణాలు. దీనికి తోడు కొన్ని దీర్ఘకాల వ్యాధులు, వాటికోసం వాడే మందులు, చికిత్సల వల్ల కూడా బరువు తేడాలు వస్తాయి.
ఉదాహరణకు సంతానలేమి, చక్కెరవ్యాధి ఇటువంటి వాటికి కొన్ని మందులు, ఇంజెక్షన్లు, హార్మోన్లు వాడడం అనివార్యం. వాటివల్ల బరువు ఎక్కువగాని, తక్కువగాని అవ్వచ్చు. అంటే ఐవీఎఫ్ లాంటివన్నమాట. స్ర్తిల విషయంలో బరువు చాలా తక్కువగా ఉన్నా లేదా ఉండవలసిన దానికంటే అధికంగా ఉన్నా వైద్య సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. చాలా తక్కువ బరువు ఆహారలోపం వల్లగానీ అంటే తగినన్ని కేలరీలు కలిగిన సమతులాహారం (బాలెన్స్‌డ్ డైట్) తీసుకోవడం వల్లనూ, కొన్ని దీర్ఘవ్యాధులు టీబీ లాంటివి, థైరాయిడ్ ఎక్కువ వల్ల వచ్చే గాయిటర్ వల్లగానీ ఉండవచ్చు. వారికి రక్తపరీక్ష, ఉమ్ము పరీక్ష, ఎక్స్‌రే వంటి పద్ధతుల వల్ల కారణం కనిపెట్టాలి. ఆ వ్యాధులు నిమ్మళిస్తే బరువు పెరుగుతుంది. ఆహార విషయాల్లో తగిన సలహా ఇవ్వడం డాక్టర్లుగానీ, డైటీషియన్లు గానీ చేయవచ్చు. ఎక్కువ మాంసకృత్తులు గల కోడిగుడ్డు, మాంసము వంటివి తినడం వల్ల బరువు పెరుగుతారు. విటమిన్లు, కాల్షియం ఉంటే ఆకుకూరలు, చేపలు, పాలు, పెరుగు, జున్నులాంటివి తినిపించాలి.
ఇక బరువు ఎక్కువైనవారికి (బి ఎం ఐ) మెటబాలిక్ ఇండెక్సును గుణించి, లెక్కచేసి వారికి తగిన ఆహారం, వ్యాయామం, నడక, జాగింగులాంటివి చేయమని సలహా ఇవ్వాలి. కొవ్వు పదార్థాలు తినరాదు. నెయ్యి, నూనె వాటితో తయారైనవీ, తీపి పదార్థాలు విసర్జించాలి. ఈమధ్య కాలంలో కీటోజెనిక్ డైటింగు అనే ఒక పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది. మన శరీరం పిండి పదార్థం అంటే గ్లూకోజు ఎక్కువుండే పదార్థాలని జీర్ణించుకుని శరీరాన్ని పోషిస్తుంది. కానీ దీనివల్ల ఒంట్లోని కొవ్వు కరగదు. ఈ కొత్త పద్ధతిలో పూర్తిగా పిండిపదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ మూసివేసి, కొవ్వు తినమని చెప్తున్నారు. దాంతో శక్తి (కేలరీస్) కోసం శరీరం వంట్లోని కొవ్వు కరిగించి దానిద్వారా శరీరానికి కావలసిన ఎనర్జీని పుట్టిస్తుంది. దాంతో కొవ్వు మెల్లమెల్లగా కరిగి ఎనర్జీగా మారుతుందన్నమాట. దీంతో బరువు తగ్గుతారు. అయితే ఒక హెచ్చరిక.. శరీరంలోని ఫాటీ ఆసిడ్లు కీటోన్లుగా మారి ఎనర్జీ వస్తుంది కనుక కీటోన్లు ఎక్కువైతే కీటోసిస్ అనే ఒక ప్రమాద పరిస్థితి రావచ్చు. అందుకని తరచుగా కీటోన్ల పరిమాణం కొలుచుకుంటూ ఉండాలి. అలసట, నీరసం, చెమటలు, ఆయాసం వంటివి ఏవైనా సూచనలుంటే వెంటనే వైద్యుల పర్యవేక్షణ, చికిత్స అవసరం. దీనివల్ల నష్టాలు కూడా రావచ్చు. ఫాటీ ఆసిడ్స్ ఎక్కువైతే లిపిడ్ మెటబాలిజమ్ దెబ్బతిని గుండె జబ్బులు, స్ట్రోకు రావడం జరగవచ్చు. అందుకే ఏ పద్ధతి అవలంబించినా డాక్టర్లు తరచూ పరీక్షిస్తూ ఉండాలి. విటమిన్ల లోపం కూడా కలుగవచ్చు. ఆటలు, పోటీలకి ఈ కీటోజెనిక్ డైట్ మంచిది కాదు. ఎందుకంటే వారికి కావలసిన ఎనర్జీ రాదు కాబట్టి చురుకుగా ఆడే ఆటలు, పరుగు పందేలు చేయలేరు. ఒక్కోసారి బ్రెయిన్ ఫాగింగ్.. అంటే కీలక నిర్ణయ శక్తి కూడా లోపిస్తుంది.
ఇవన్నీ మనసులో బాగా ఆలోచించి, బరువు తగ్గే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. తప్పక డాక్టరు సలహా మేరకే చేయాలి. ఎడ్వర్టెయిజ్‌మెంట్లు చూసి మోసపోకండి. ప్రాణానికి లేనిపోని ఆపదలు తెచ్చుకోవద్దు.

డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో