రాష్ట్ర వార్తలు

‘కార్పొరేట్’కు కల్పవృక్షం

  • 05/05/2013

విజయవాడ, మే 4: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం పేదలకు మేలు చేయడం అటుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు శాపంగా, కార్పొరేట్ ఆస్పత్రులకు వరంలామారి యావత్ పథకం కార్పొరేట్‌శ్రీగా మారింది. పథకం అమల్లో కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ధాటికి ప్రభుత్వమే తలొగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ఆసుపత్రుల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం మరో 30 శాతం ఖర్చు భరించేందుకు సైతం అంగీకరించింది. ఈ పథకం కింద రాష్టవ్య్రాప్తంగా ఏటా వందల కోట్లలో ప్రజాధనం వెచ్చిస్తున్నా, ఆరంభం నుంచీ సరైన పర్యవేక్షణ -తనిఖీలు, ఆపై ఆడిట్ లేకపోవటంతో పైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నాయి. దీన్ని గమనించిన ఆడిట్ విభాగం ప్రత్యక్షంగా కేసులు, శస్త్ర చికిత్సల జోలికి పోకుండా కేసు షీట్లను పరిశీలిస్తేనే అనేక అక్రమాలు బట్టబయలు అవుతున్నాయి. ఇక కేసులు, శస్త్ర చికిత్సలపై దృష్టి సారిస్తే ఎన్ని అవినీతి పాములు బయటకు వస్తాయో చూడాలి. ఒక్కొక్కటిగా బయటపడుతున్న అవినీతి ఆసుపత్రుల చిట్టా రోజురోజుకూ పెరుగుతుండటంతో మేల్కొన్న విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. దీంతో ఒక్క కృష్ణా జిల్లాలోనే ఆరు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు ‘ఆరోగ్యశ్రీ’ రద్దయింది. నకిలీ ఫోటోలు, దొంగసంతకాలతో తాజాగా ‘ఆరోగ్యశ్రీ’ పేరిట ప్రభుత్వ సొమ్ము కొట్టేయాలని చూసిన బెజవాడలోని ‘టైమ్’ ఆసుపత్రి వ్యవహారం బయటపడ్డంతో, ఆ ఆసుపత్రికీ ప్రభుత్వ అనుమతి రద్దు చేసింది. అంతేకాకుండా ఆసుపత్రి యజమాని, మరో ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ, మచిలీపట్నంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులు, నందిగామ, గుడివాడ, నూజివీడు, అవనిగడ్డ వంటి పట్టణాల్లోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించబడింది. జిల్లాలో 22 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు అనుమతించారు. ఈ పథకం కింది ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కేవలం 48 కోట్ల రూపాయలు వెచ్చించగా ప్రైవేటు ఆసుపత్రులకు రికార్డుస్థాయిలో 300 కోట్ల రూపాయలు చెల్లించింది. వాస్తవానికి ఈ మొత్తంలో కొంతభాగం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మందులు, శస్త్ర చికిత్సల కోసం ఖర్చు చేస్తే ఎంతో మెరుగైన ఫలితాలు వచ్చేవి. ఈ విషయమూ ప్రభుత్వానికి తెలిసినా ‘తిలా పాపం తలాపిడికెడు’ చందంగా ‘ప్రైవేటు కార్పొరేట్’కే అగ్ర తాంబూలం ఇచ్చింది. ఘనకీర్తి కలిగిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అన్నీ ఉన్నా ‘అల్లుడి నోట్లో శని’ చందంగా ఆధునిక వైద్య పరికరాలతోపాటు ప్రతిభావంతులైన వైద్యులున్నప్పటికీ, ఆసుపత్రికి మందుల కోసం అరకొర బడ్జెట్ కేటాయిస్తుండటం, నాల్గో తరగతి సిబ్బంది కొరత అధికంగా ఉంది. ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేసే 70మంది గత కొన్ని మాసాలుగా వేతనాలకు నోచుకోవడం లేదు.
ఇదిలా ఉంటే పథకం ప్రారంభం నుంచి ఈ ‘వ్యవహారం’పై సరైన నిఘా, పర్యవేక్షణ లేమివల్ల కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు ఆడింది ఆటగా... పాడింది పాటగా తయారైందని ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె సుధాకర్ ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. ఉదాహరణకు ఆంధ్ర హాస్పిటల్, చరితశ్రీ ఆసుపత్రి, గుడివాడలోని అన్నపూర్ణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో నియమ నిబంధనలకు విరుద్ధంగా మహిళలకు గర్భసంచులు తీసేసి సొమ్ము రాబట్టుకున్నాయి. దీనివల్ల మహిళలు జీవితాంతం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం సొమ్ము కోసం ‘ఆరోగ్యశ్రీ’ని అడ్డం పెట్టుకుని ఎడాపెడా ఆపరేషన్లు చేసిపారేస్తుండటం వైద్య సమాజానికే సిగ్గుచేటు. ఉషా కార్డియాక్, ప్రవీణ్ కార్డియాక్ ఆసుపత్రుల్లో రోగులకు సంబంధించి కేసు షీట్లు పరిశీలిస్తే ప్రధానంగా మృతుల కేసు షీట్లలోనే అనేక లోపాలు బట్టబయలవుతుంటాయి. ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం ఆసుపత్రికి ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్, లిఫ్ట్ సదుపాయం ఉండి తీరాలి. ఈ లోపాలను విజిలెన్స్ విభాగం గుర్తించి కొరడా ఝళిపించడం ప్రారంభించింది. ‘ఇటువంటి ఆసుపత్రుల చిట్టా’ తయారు చేసి ఒక్కొక్కటిగా రద్దు చేయడం ప్రారంభించింది. ఈ వ్యవహారంపై ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే లక్ష 25 వేల కేసులు ఈ పథకం కింద అమలయ్యాయి. ఈ పథకం అమలుకు ఆరోగ్యశ్రీ కార్డు అవసరం లేదు, తెల్లకార్డు లేదా రచ్చబండలో ఇచ్చిన కూపన్ చాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 938 రకాల వ్యాధులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో 805 రకాల వ్యాధులు ఈ పథకం కింద ‘లబ్ధి’ పొందొచ్చన్నారు. ఏదేమైనా ప్రజలందరికీ వైద్య ఆరోగ్య సేవలందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. అయితే 1997 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ విధానాలకు అనుగుణంగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం ప్రారంభించాయి. 2004 తర్వాత ప్రభుత్వాసుపత్రుల్లో యూజర్ చార్జీలు రద్దయినా సామాన్య ప్రజలకు అందుతున్న వైద్య సహాయం అంతంత మాత్రమే అనడంలో సందేహం లేదు. చిత్తశుద్ధితో పేదలకు ‘కార్పొరేట్’ వైద్య సాయం అందించాలన్న లక్ష్యం మంచిదే అయినా కొన్ని అవినీతి చీడపురుగుల వల్ల పథకంతోపాటు వ్యవస్థకే మాయని మచ్చ ఏర్పడుతోంది. ఈ చీడపురుగులను ఆదిలోనే అంతమొందించకపోతే ‘ఆరోగ్యశ్రీకే కేన్సర్’ వచ్చే ప్రమాదం ఉంది.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading