మెయన్ ఫీచర్
కమ్యూనిస్టుల ఖమ్మం డిక్లరేషన్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు కలిసి పనిచేయగలరని, తమను తాము ఒక బలమైన వేదికగా నిర్మించుకోగలరని ఇంకా భావిస్తుండి ఉంటే, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల దృశ్యం వారికొక పెద్ద ప్రశార్థకాన్ని మిగిల్చి ఉంటుంది. ఇకనుంచి కలిసి పనిచేయగలమని, ఇతరులకు ప్రత్యామ్నాయ ప్రకటనలు చేసిన ఆ పార్టీలు ఖమ్మంలో దేనికదిగా నిలబడ్డాయి. సిపిఎం, న్యూడెమోక్రసీలు ఇతర వామపక్షాలతో పొత్తు పెట్టుకోకపోయినా, సిపిఐ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. పది కమ్యూనిస్టు పార్టీల వేదిక అనే దానిలో కొంత బలం ఉన్నవి ఈ మూడే. తక్కినవి కాగితం పార్టీలు. ఇప్పుడు ఈ మూడు కూడా దేనికదిగా మారిపోయాయి. వామపక్షాలు.. కలయిక, ప్రజల సమస్యలపై ఉద్యమాలు అన్నవి వేరే విషయాలని, ఎన్నికలలో విడిగా పోటీ చేసినంతమాత్రాన కలయికలు-ఉద్యమాల అజెండాకు నష్టం లేదని ఆ పార్టీల నాయకత్వాలు వాదించవచ్చు. ఖమ్మం ఎన్నికలు పూర్తి కాగానే తిరిగి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోనో మరొక చోటనో సమావేశపై, ఐక్యతలు-ఉద్యమాలంటూ మరొకసారి భీకర ప్రతిజ్ఞలు చేస్తే ఆశ్చర్యపడవలసి ఉండదు. కాని కలిసి ఎందుకు పోటీ చేయలేదన్న ప్రశ్నకు, సూటి సమాధానం ఇవ్వగలరా? పైగా, ప్రజాస్వామ్యంలో ఏ ఐక్యతలు-ఉద్యమాలు, ఎట్లున్నా అంతిమంగా ప్రభావం చూపగలిగేది కాని, తమతమ శ్రేణులకు అభిమానులైన ప్రజలకు విశ్వాసాన్ని కలిగించగలిగేది గాని ఎన్నికలలో బలాన్ని నిరూపించుకోవడం ద్వారానే కదా!
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో జరిగిన మొదటి ఉప ఎన్నిక మెదక్ లోక్‌సభది. అప్పుడు వారు బిజెపిని నిలువరించేందుకోసమంటూ అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చారు. తర్వాత జరిగిన వివిధ ఉప ఎన్నికలు, ఎన్నికలలో తమంతట తామైతే పోటీ చేసారు కాని, కొంత గజిబిజి కావడం కూడ మొదలైంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక వచ్చినప్పుడు మొదట కాంగ్రెస్, టిడిపితో సహా అందరిని కలుపుకొని ఉమ్మడి అభ్యర్థి అని, లేదా లెఫ్ట్ అభ్యర్థికి ఇతరుల మద్దతు సంపాదించటమని ఆలోచించారు. అదే ఒక పెద్ద ఆశ్చర్యకరమైంది. సిపిఐ, సిపిఎంలు జాతీయ పార్టీలు. ఇక ‘బూర్జువా’ పార్టీలతో పొత్తులు, అవగాహనల ప్రసక్తే లేదని ప్రకటించగా అదుకు విరుద్ధమైన ఆలోచనలు ఎట్లా జరిగాయి? బిజెపికి మిత్రపక్షమైన టిడిపి తమతో రాగలదని ఏవిధంగా అనుకున్నారు? తెలంగాణలో టిడిపి బాగా అప్రతిష్టను మూటగట్టుకున్నదని తెలిసి కూడా వారి మద్దతును ఎట్లా ఆశించారు? పోనీ వ్రతం చెడినా ఫలం దక్కే అవకాశమైనా వరంగల్‌లో ఉందా? చివరకు ఏదీ లేక తమ పరువును అన్నివిధాలా అక్కడి భద్రకాళి చెరువులో కలుపుకున్నారు. పది వామపక్షాలు మద్దతిచ్చినా తమ అభ్యర్థికి లభించినవి పదివేల ఓట్లేనన్నది కాదు సమస్య. కమ్యూనిస్టులకు గెలుపు ఓటములకన్నా, రాజకీయ నైతికతలు, ప్రజల్లో ప్రతిష్ఠలు ముఖ్యం. అవి కాస్తా గాలిలో కలిసిపోయాయి. అక్కడి రాజకీయ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసినప్పుడు తమకు మాత్రమే ఎందుకు అర్థంకావడంలేదు? ఓడితే ఓడారు, పరువెందుకు పోగొట్టుకున్నారు?
ఆ తర్వాత నుంచి ఇక అదే ధోరణి. స్థానిక సంస్థల నియోజక వర్గాల నుంచి ఎంఎల్‌సి ఎన్నికలు జరగగా, ఖమ్మంలో లెఫ్ట్ అభ్యర్థికి న్యూడెమోక్రసీ వారు ఓటు వేయలేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో ఒకటి రెండు నామమాత్రపు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు కాని, విశాల ప్రజాస్వామిక ఐక్యవేదిక అనే తరహా అందమైన పేర్ల మాటున అది చెల్లిపోతుంది కనుక పట్టించుకోనక్కరలేదు. నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఏమి చేసారన్నది అసలు బయటకు వినిపించలేదు. తర్వాత వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఆ రెండింటిలో బలమంటూ లేని వరంగల్‌లో కలిసి పోటీ చేస్తుండగా, తగినన్ని స్థానాలు గెలవగలరనుకునే ఖమ్మంలో మాత్రం ఎవరికి వారు కావడం విచిత్రం! ఇందుకు కారణాలేమిటో ఎవరూ పైకి చెప్పినట్లు లేరు. ఇతరత్రా వినిపించే వాటిలో సైద్ధాంతికం ఏదీ కనిపించదు. ఉభయ కమ్యూనిస్టుల వైరానికి మొదటినుంచి కూడా ఖమ్మం ప్రసిద్ధిచెందింది. అప్పటి కారణాలన్నీ నాయకుల వ్యక్తిగత వైరాలు, వసూళ్లలో ముడిబడినవి. అహంకారాలు. ఇతర ‘బూర్జువా’ పార్టీలు మచ్చిక చేస్తే ఎవరికి లాభసాటి అనుకున్నవైపు వారు పోవడం. ఇంచుమించి అటువంటివే ఈ మున్సిపల్ ఎన్నికలలోనూ పని చేసాయన్నది మనకు వినిపించే మాట. కాని గతానికి ఇప్పటికీ వామపక్షాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఇక్కడనే గాక దేశవ్యాప్తంగా. ఆ స్థితి నుంచి బయటపడేందుకంటూ వారు అనేక చర్చలు చేసి గట్టి తీర్మానాలు కొన్ని చేసుకున్నారు. ఇక తమ బంధం విడిపోనిదంటూ తమ కార్యకర్తలకు నమ్మ జెప్పారు. ఈ మొత్తం పరిస్థితితో పోల్చినప్పుడు ఖమ్మం మున్సిపల్ ఎన్నికలన్నది ఒక చిన్న అంగం. అక్కడ గెలిచినా ఓడినా కమ్యూనిస్టులకు విడివిడిగా గాని, ఉమ్మడిగా కాని వచ్చేది పోయేది లేదు. అటువంటప్పుడు కలిసి పోటీ చేసి ఉంటే ప్రతిష్ఠ నిలిచేది. అందువల్ల విస్తృత స్థాయిలో, దీర్ఘకాలికంగా జరిగే మేలుండేది. కాని ఇప్పుడు? వ్రతమూ, ఫలమూ రెండూ దక్కే స్థితి లేదు. ఆశ్చర్యమేమంటే కనీసం వారి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులైనా (రెండు పార్టీల జాతీయ ప్రధాన కార్యదర్శులు కూడా యాదృచ్ఛికంగా తెలుగువారే) వారికి నచ్చజెప్పలేకపోయినట్లున్నారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగు మాసాలకు ఆగస్టు 28న పది వామపక్షాలు హైదరాబాద్‌లో సమావేశమై ఐక్య కార్యాచరణ కోసం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. తర్వాతి కాలంలో, ఇక నుంచి తాము పరస్పరం కలిసి ఎన్నికలలో పోటీ చేయగలమని, ఇతరులతో పొత్తులు ఉండబోవని నిర్ణయించుకున్నాయి. సిపిఐ, సిపిఎంల జాతీయ పార్టీలు కాడ అవే తీర్మానాలు చేసాయి. ఇంచుమించు అదేకాలంలో పలువురు ప్రజాసంఘాల నాయకులు, యాక్టివిస్టులు, రచయితలు, కళాకారులు, మేధావులతో పలు విడతలుగా నిర్మొహమాటమైన సమావేశాలు జరిపారు. వారు తమగురించి ఎంత తీవ్రమైన విమర్శలు చేసినా, సూచనలు చేసినా ఎంతో ఓపికగా విని, భరించి అందరినీ ఆశ్చర్యపరచారు. కమ్యూనిస్టులు విమర్శల విషయంలో అంత ప్రజాస్వామిక వైఖరి చూపడం అంతకు ముందెన్నడూ జరగలేదు. ఇటువంటి రకరకాల పరిణామాలు వెంటవెంటనే చోటు చేసుకోవడం చూసిన ఆ పార్టీల కార్యకర్తలకు కొత్త ఆశాభావాలు కలిగాయి. రాగల కాలంలో తమకు ఎంతో మేలు జరుగుతుందనుకున్నారు. కాని అటువంటి ఆగస్టు నెల ‘హైదరాబాద్ డిక్లరేషన్’ కాస్తా ఏడాదిన్నర తిరిగే సరికి ‘ఖమ్మం డిక్లరేషన్’గా రూపాంతరం చెందింది.
ఇటువంటి రూపాంతరానికి గీటురాయిగా తీసుకుంటున్నది కేవలం ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం, సిపిఐ అంతటితో ఆగక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు. అది కూడా ముఖ్యమే కావడం, వారిని నలుగురిలో నవ్వుల పాలు చేయడం సరేసరి. తమ ప్రతిజ్ఞపై తమ కార్యకర్తలకే నమ్మకం లేకుండా చేయడం కూడా సరేసరి. కాని అంతకన్నా ము ఖ్యమైనవి ఉన్నాయి. తాము కలిసికట్టుగా ఏమి చేయగలదీ 2014 ఆగస్టు ప్రకటనలో చా లా చెప్పారు. తర్వాత 2015 మార్చిలో భూపోరాటాలని, జూలైలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాటాలని ఇంకా అటువంటివే పలు భారీ ప్రకటనలు చేసారు. కాని అప్పటినుంచి వరుసగా ఏడాది మీద, ఏడు మాసాలు గడిచిన తర్వాత వెనుదిరిగి సమీక్షిస్తే జరిగింది ఏమిటి, జరగనిది ఏమిటి? అదే పది పార్టీల కూటమికి చెందిన వారే చెబుతున్న దాని ప్రకారం, అందరూ కలిసి సమీక్షించుకున్నదే లేదు. సిపిఎం యధావిధిగా పెద్దన్న తరహాలోనే వ్యవహరిస్తున్నది. పలు కార్యక్రమాలు ఎవరికి వారు ఏకపక్షంగా నిర్వహించుకుంటున్నారు. ఒకరి ఖ్యాతి ఒకరికి దక్కడం, ఒకరి ఇలాకాలోకి మరొకరు రావడం పెద్ద పార్టీలకు ఇష్టం లేదు. ఎవరి ఆధిక్యం వారికి ఉండాలి.
పనితీరు ఎవరికి వారుగా కాని, కలిసి కాని, ఒకప్పటి శైలికన్నా మారకపోవడం వారే ఎత్తి చూపుతున్న విషయం. కార్యక్రమాలు అధికభాగం హైదరాబాద్ నగరానికి, ఇందిరా పార్క్‌కు, సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి పరిమితమై సాగుతాయి. తమతమ కార్యకర్తలతో ‘జన సమీకరణాలు’ జరుగుతాయి. తమ స్వం త పత్రికలు, ఛానళ్లతో పాటు రెండు మూడు ‘బూర్జువా’ పత్రికలు, ఛానళ్లలో తగినంతగా వార్తలు వస్తాయి గనుక ఆ కార్యక్రమాలు జరిగిపోయినట్లే, విజయవంతమైనట్లే. కాకపోతే ఎప్పుడైనా తమ విద్యార్థి యువజనులు జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు పోలీసు లాఠీ దెబ్బలు తినవచ్చు. విషయమేమంటే ఈ శైలి అంతా అందరూ కొద్ది దశాబ్దాలుగా చూస్తున్నదే. అందులో ముందుకు పోవడం, వెనుకకు పోవడం అంటూ ఏమీ ఉండదు. అంతా కొయ్యగుర్రం పద్ధతి. కదలడం కదులుతూనే ఉంటుంది. అది విరిగినప్పుడల్లా మరో కొయ్యగుర్రం తయారు చేస్తారు. లేదా కొత్త పరిస్థితుల ఏవైనా వచ్చినప్పుడు.
ఆవిధంగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడినప్పుడు కొత్త పరిస్థితి, సరికొత్త అవకాశాలు ఏవో వచ్చినట్లు తమంతట తామే ప్రకటించారు. ఒకప్పటి తెలంగాణ రైతాంగ పోరాట వారసత్వాన్ని తెలంగాణ ప్రజలకు దుమ్ముదులిపి గుర్తు చేశారు. ఆ స్ఫూర్తి తాము తిరిగి అవగాహన చేసుకుంటున్నామన్నారు. ఇకనుంచి అదేవిధమైన త్యాగనిరతితో ప్రజలకోసం నిరంతర పోరాటాలు సాగిస్తామన్నారు. అటువంటి చరిత్ర గల తెలంగాణ గడ్డ ఒక రాష్ట్రంగా ఏర్పడటంతో ఇక తమకు గొప్ప రాజకీయ అవకాశం లభించినట్లు నమ్మారు. ఇటువంటి మాటలన్నీ అనేక ప్రజా సంఘాలకు, యాక్టివిస్టులకు, రచయితలూ, కళాకారులకు చెప్పి అదంతా నిజమన్న భావన కలిగించారు. కాని హైదరాబాద్ డిక్లరేషన్‌కు ఏడాదిన్నర అనంతరం వెనుక ప్రశ్నార్థకాలే తిరిగి ముసురుకుంటున్నాయి. మొదటినుంచే ఆరంభించి ఒక కన్ను ఎన్నికల లాభాలపై వేసారు. ప్రజా సంఘాలన్నీ కలిసి వరంగల్‌లో గెలిపించగలవని అంచనా వేయగా, సంఘాలైతే కలిసివచ్చాయి కాని, డిపాజిట్ దక్కించుకోలేకపోయాయి. దానితో గ్రేటర్ ఎన్నికలో సంఘాల ప్రసక్తి రాలేదు. పొరుగున గల ఖమ్మంలోనైతే ఒక కొత్త డిక్లరేషన్ జారీ అయిపోయింది. 2019 ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉంది. ఇలోగా మరేమీ ఎన్నికలు లేవు సరే. కాని హైదరాబాద్ డిక్లరేషన్ పనిచేయగలదని గత ఏడాదిన్నరను సమీక్షించినప్పుడు వారికైనా అనిపిస్తున్నదా?