ఆటాపోటీ

ఐపిఎల్‌తో డబ్బే డబ్బు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కేవలం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కే కాదు.. ఆటగాళ్లకు కూడా బంగారు బాతుగా మారింది. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చి పడుతున్న భారీ మొత్తాలకు క్రికెటర్లు గులాములవుతున్నారు. నిన్నమొన్న క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వారి నుంచి ఎప్పుడో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి దాదాపుగా కనుమరుగైన వెటరన్స్ వరకూ అందరూ ఐపిఎల్ వెంట పడడానికి ప్రధాన కారణం డబ్బే. కనీవినీ ఎరుగని రీతిలో దక్కుతున్న మొత్తాలను కాదనడానికి ఎవరూ సుముఖంగా లేరు. ఐపిఎల్ వేలంలో ఎవరిని, ఏ ఫ్రాంచైజీ ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తుందో చెప్పడం కష్టంగా మారింది. ఫ్రాంచైజీలు పాటిస్తున్న ప్రమాణాలు ఏమిటో ఇప్పటి వరకూ ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఈసారి ఐపిఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు అత్యధికంగా 9.5 కోట్ల రూపాయలు లభించాయ. ఆస్ట్రేలియా దేశవాళీ చాంపియన్‌షిప్ బిగ్ బాష్‌లో కూడా అతనికి ఇంత మొత్తం లభించలేదు. వేలం పాటకు 351 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉంటే 94 మందిని మాత్రమే వివిధ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయ. వాట్సన్ కంటే ప్రతిభావంతులుగా పేరు సంపాదించిన ఎంతో మంది అమ్ముడు కాలేదు. కొంత మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేసినప్పటికీ, వారిలో ఎవరికీ వాట్సన్‌కు లభించినంత మొత్తం దక్కలేదు. ఐపిఎల్ వేలంలో క్రికెటర్లను కొనడానికి ఫ్రాంచైజీలు అనుసరిస్తున్న ప్రామాణికాలు ఏమిటో అన్న ప్రశ్నకు సమాధానం లభించాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇది ఓ సస్పెన్స్. వాట్సన్‌కు 9.5, పవన్ నేగీకి 8.5 కోట్ల రూపాయలు దక్కడమే ఇందుకు ఉదాహరణ.

ఈసారి ఐపిఎల్‌లో నాలుగు కోట్ల రూపాయల కంటే ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లు 12 మంది ఉన్నారు. వారిలో ఐదుగురిని ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొనుగోలు చేసింది. ముగ్గురిని సన్‌రైజర్స్
హైదరాబాద్ కొన్నది. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఇద్దరిని తీసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చెరి ఒక్కో ఆటగాడికి నాలుగు కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేశాయి. భారీ ధర పలికిన 12 మంది ఆటగాళ్లలో నలుగురు అంతర్జాతీయ క్రికెట్ ఆడని వారే. కాగా, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆచితూచి, ఎంతో పొదుపుగా ఖర్చు చేసింది. జయదేవ్ ఉనాద్కత్‌కు 1.6 కోట్ల రూపాయలు
వెచ్చించింది. ఈసారి వేలంలో ఆ ఫ్రాంచైజీ చెల్లించిన
అత్యధిక మొత్తం ఇదే.

ప్రపంచ క్రికెట్‌ను కొత్త మలుపు తిప్పిన టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్). అంతకు ముందు ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఆటగాళ్లను డబ్బుల్లో ముంచెత్తుతోంది. వివిధ దేశాల్లో జాతీయ జట్లకు ఎంపికయ్యేందుకు పోటీపడుతున్న యువ ఆటగాళ్ల నుంచి దశాబ్దం క్రితమే రిటైరైన వెటరన్ల వరకూ అపతి ఒక్కరూ కనీసం ఒక్క ఐపిఎల్‌లో ఆడినా చాలని అనుకోవడానికి డబ్బే ప్రధాన కారణం. ఫిట్నెస్ లేకపోయినా బరిలోకి దూకేస్తున్న చాలా మంది క్రికెటర్లు ఆతర్వాత జాతీయ సేవలకు దూరమవుతున్నారు. గత ఏడాది ఐపిఎల్ తర్వాత బంగ్లాదేశ్, వెస్టిండీస్ టూర్ల నుంచి తమకు విశ్రాంతినివ్వాలని భారత పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ వంటి ఆటగాళ్లు సెలక్టర్లను కోరడం వారు జాతీయ జట్టుకు ఏమాత్రం ప్రాధాన్యతనిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లాల్సిందేనని ఆటగాళ్లపై ఒత్తిపి తెచ్చిన సెలక్టర్లు వెస్టిండీస్ టూర్‌కు మాత్రం ద్వితీయ శ్రేణి జట్టును పంపారు. కాసులు కురిస్తున్న ఐపిఎల్‌తో పోలిస్తే టెస్టు, వనే్డ, టి-20 ఇంటర్నేషనల్స్ అటు క్రికెటర్లకు, ఇటు సెలక్టర్లకు పనికిమాలినవిగా కనిపిస్తున్నాయి.
పెరుగుతున్న మోజు
ఐపిఎల్ అంటే అందరికీ ఎందుకు అంత మోజు ఉందన్న ప్రశ్నకు ఇటీవల జరిగిన ఆటగాళ్ల వేలమే సమాధానం చెప్తున్నది. ఏడాది కాంట్రాక్టు.. ఏప్రిల్ 8 నుంచి మే 29 వరకు జరిగే టోర్నీ.. తుది జట్టులో ఆడినా, ఆడకపోయినా గ్యారంటీగా లభించే ఆక్షన్ డబ్బు.. ప్రొఫెషనల్ క్రికెటర్‌కు ఇంతకంటే ఏం కావాలి? ముందు తరం ఆటగాళ్లు కెరీర్ మొత్తం చెమటోడ్చినా లభించని పేరుప్రఖ్యాతులు, కోట్ల రూపాయల డబ్బు ఒక ఏడాదిలోనే వచ్చిపడుతున్న కారణంగానే ఐపిఎల్ పట్ల మోజు పెరుగుతున్నది. యువరాజ్ సింగ్‌కు గత ఏడాది ఏకంగా 16 కోట్ల రూపాయలు లభించాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక ధరతో సంచలనం రేపింది. అంతకు ముందు ఏడాది అతనికే 14 కోట్ల రూపాయలు దక్కాయి. ఈసారి హఠాత్తుగా యువీ ప్రాభవం కొడిగట్టింది. అతని డిమాండ్ ఒక్కసారిగా ఏడు కోట్లకు పడిపోయింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9.5 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించిందనేది ప్రస్తుతానికి మిస్టరీ. అతని కంటే సమర్థులు, అంతర్జాతీయ రంగంపై అద్భుతంగా రాణిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ, ఈసారి వేలంలోనే అత్యధిక మొత్తం పొందిన ఆటగాడిగా వాట్సన్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. అదే విధంగా సంచలనం రేపిన మరో ఆటగాడు పవన్ నేగీ. నిన్నమొన్నటి వరకూ ఎవరికీ అంతగా పరిచయం లేని ఈ స్పిన్నర్ వరుసగా రెండు రోజుల పాటు పతాక శీర్షికల్లో స్థానం సంపాదించాడు. ఆసియా కప్, టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే టీమిండియాలో స్థానం దక్కించుకున్న అతను, మరుసటి రోజే ఐపిఎల్ వేలంలో 8.5 కోట్లు సంపాదించుకొని మరోసారి అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. నిర్వాహకులు అతనికి నిర్ణయించిన కనీస ధర 30 లక్షల రూపాయలు. కానీ, ఢిల్లీ డేర్‌డెవిల్స్ అతనిని భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అతను గొప్పగా ఆడిన సందర్భాలుగానీ, అద్భుతాలు సృష్టించిన సంఘటనలుగానీ లేవు. పైగా కెరీర్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయాన్ని పక్కకు ఉంచి, దేశవాళీ పోటీల్లోనైనా రాణించిన దాఖలాలు లేవు. కేవలం రెండే రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నేగీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎందుకు అంత ప్రాధాన్యతనిచ్చిందనే ప్రశ్నకు సమాధానం లేదు. ఏ ఆటగాడికి ఎప్పుడు భారీ ధర పలుకుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. వేలం పాటలో ఏఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. పేరుపొందిన ఆటగాళ్లను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, సాధారణ క్రికెటర్‌పై కోట్లకోట్లు కుమ్మరించడం ఐపిఎల్ వేలంలో ఆనవాయితీగా మారింది. మరోసారి అది పునరావృతమైంది.
351 మంది ఆటగాళ్లు
ఈసారి ఐపిఎల్ వేలంలో 351 మంది ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. అయితే, 94 మందికి మాత్రమే అవకాశం దక్కింది. మిగతా వారంతా తదుపరి మార్పులు చేర్పులపై భారం వేసి వేచిచూడక తప్పదు. ఈ వేలంలో అమ్ముడైన ఆటగాళ్లలో భారతీయులు 66 మందికాగా, 13 మంది ఆస్ట్రేలియన్లు, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌కు చెందిన చెరి నలుగురు, ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు, న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి ఒకొక్కరు చొప్పున ఐపిఎల్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకట్టుకోగలిగారు. 94 మంది క్రికెటర్ల కోసం ఐపిఎల్ ఫ్రాంచైజీలు ఏకంగా 136 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. అంటే సగటున ఒక్కో ఆటగాడిపై ఫ్రాంచైజీలు పెట్టిన ఖర్చు 1.44 కోట్ల రూపాయలు. ఈ మొత్తంలో భారత ఆటగాళ్ల వాటా 81.75 కోట్లు (సగటున 1.23 కోట్ల రూపాయలు), విదేశీ ఆటగాళ్లు దక్కించుకున్నది 54.25 కోట్లు (సగటున 1.93 కోట్లు).
జాతీయ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న పలువురు యువ క్రికెటర్లకు ఐపిఎల్‌లో చోటు దక్కింది. గత ఏడాది అత్యధికంగా 16 కోట్ల రూపాయల ధర పలికిన యువరాజ్ సింగ్‌కు ఈసారి చుక్కెదురైంది. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తాన్ని సంపాదించిన అతనికి ఈసారి అందులో సగం కూడా దక్కలేదు. దాదాపు చివరి క్షణం వరకూ యువీని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అతనికి ఈసారి ఐపిఎల్‌లో స్థానం దక్కుతుందా అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే, చివరిలో ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య పోటీ నెలకొంది. సన్‌రైజర్స్ ఏడు కోట్ల వరకూ బిడ్‌ను పెంచడంతో, మిగతా రెండు ఫ్రాంచైజీలు వెనక్కు తగ్గాయి. షేన్ వాట్సన్ 9.5 కోట్లు, పవన్ నేగీ 8.5 కోట్ల రూపాయలు సంపాదించుకుంటే, ఏడు కోట్ల ధరతో క్రిస్ మోరిస్‌తో కలిసి యువీ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. వేలం జాబితాలో మొత్తం 230 మంది భారత ఆటగాళ్లు ఉంటే, మిగతా వారు విదేశీయులు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)లో పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న దేశాలకు చెందిన జట్ల తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వారు 130 మంది ఉన్నారు. టెస్టు క్రికెటర్లలో ఆస్ట్రేలియాకు చెందిన వారు 29 మందికాగా, భారత ఆటగాళ్లు 26 మంది ఉన్నారు. వేలం జాబితాలో ఉన్న 351 మంది ఆటగాళ్లలో అత్యధికంగా 116 మందికే అవకాశం ఉంటుందని ముందుగానే ప్రకటించారు. కానీ, 94 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు పాడుకున్నాయి.
బదిలీ అవకాశం
యూరోపియన్ సాకర్‌లో ఆటగాళ్లను ఒక క్లబ్ నుంచి మరో క్లబ్‌కు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఇదే విధానాన్ని ఐపిఎల్‌లోనూ అమలు చేస్తున్నారు. బదిలీకి మరోపేరే తాత్కాలిక ప్రాతిపదికన అమ్మడం. అంటే ఒక ఫ్రాంచైజీని కొంత మొత్తానికి ఆటగాడిని వేలంలో పాడుకుంటుంది. ఆతర్వాత అతనిని వద్దనుకున్నా లేదా తాము చెల్లించిన ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఎవరైనా ఇవ్వడానికి ముందుకొచ్చినా ‘బదిలీ’ పేరుతో ఇచ్చేస్తుంది. కొంత మంది కాంట్రాక్టును పొడిగిస్తుంది. ఐపిఎల్ వేలానికి ముందే నిర్ధిష్టమైన సమయంలోగా ఈ ప్రక్రియ పూర్తికావాలి. తొమ్మిదో ఐపిఎల్‌కు వేలం ఈనెల జరిగితే, ట్రాన్స్‌ఫర్, రిటెన్షన్ ప్రక్రియకు గడువు గత ఏడాది డిసెంబర్ 31వ తేదీతో ముగిసింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ ముంబయి ఎక్కువ మంది ఆటగాళ్లను వేలానికి విడుదల చేయడం ద్వారా, కొత్త ఆటగాళ్ల కొనుగోలుకు ఎక్కువ మొత్తాన్ని నిలువ చేసుకున్నాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్ పవన్ నేగీకి 8.5 కోట్ల రూపాయలు చెల్లిస్తే, యువరాజ్ సింగ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 కోట్ల రూపాయలకు పాడుకోగలిగింది. వేలంలో సాదాసీదా ఆటగాళ్లకు కూడా కనీసం పది లక్షల ధర పలికింది. ఒకప్పుడు ఆరు రోజులు, ఆతర్వాతి కాలంలో ఐదు రోజుల తరబడి టెస్టు మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు ఐదారు సిరీస్‌లలో సంపాదించిన మొత్తం కంటే, ఐపిఎల్‌లో గల్లీ ఆటగాడు సంపాదించే మొత్తం ఎక్కువ. అందుకే జాతీయ జట్లను కాదని మరీ ఆటగాళ్లు ఐపిఎల్ వెంట పరుగులు తీస్తున్నారు. క్రికెట్‌ను ఒక ప్రొఫెషన్‌గా మార్చుకోవడాన్నిగానీ, డబ్బు సంపాదించడాన్నిగానీ ఎవరూ తప్పుపట్టరు. కానీ, దేశానికి అందించాల్సిన సేవలను తుంగలో తొక్కి, ఐపిఎల్‌లో విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడి, ఫిట్నెస్ సమస్యలతో అల్లాడుతూ అభిమానులను నిరాశ పరచడం ఎంత వరకు సమంజసం అన్నదే ప్రశ్న. దీనికి బిసిసిఐ అధికారులే సమాధానం చెప్పాలి.
ఊహించని మొత్తం!
బేస్‌ప్రైస్‌తో పోలిస్తే, ఎవరూ ఊహించనంత ఎక్కువ మొత్తాన్ని సంపాదించుకున్న ఆటగాడు ఎం. అశ్విన్. అతని బేస్‌ఫ్రైస్ 10 లక్షల రూపాయలుకాగా, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ జట్టు అతనిని 4.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. బేస్‌ప్రైజ్ కంటే ఇది 45 రెట్లు ఎక్కువ. తమతమ బేస్‌ప్రైస్ కంటే దీపక్ హూడాకు 42, కరుణ్ నాయర్‌కు 40 రెట్లు ఎక్కువ మొత్తాలు లభించాయి. బేస్‌ప్రైస్ కంటే ఎక్కువ లేదా తక్కువ కాకుండా అంతే మొత్తానికి అమ్ముడైన ఆటగాళ్లు 52 మంది ఉన్నారు. బేస్‌ప్రైజ్ కంటే ఎక్కువ మొత్తాన్ని సంపాదించిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో క్రిస్ మోరిస్, కార్లొస్ బ్రాడ్‌వెయిట్ స్థానం దక్కించుకున్నారు. వీరిద్దరికీ బేస్‌ప్రైస్ కంటే 14 రెట్లు అధికంగా ధర పలికింది. - ఎస్‌ఎంఎస్

మరో అశ్విన్
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు పోటీగా మరో అశ్విన్ తెరపైకి వస్తున్నాడు. చెన్నైకే చెందిన మురుగన్ అశ్విన్ లెగ్ స్పిన్నర్. ఐపిఎల్ వేలంలో 10 లక్షల రూపాయల ట్యాగ్ ప్రైస్ ఉన్న అతనికి రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ 4.5 కోట్ల రూపాయలను చెల్లించడం అందరినీ ఆశ్చర్య పరచింది. అయితే, ఛోటా అశ్విన్ గురించి తెలిసిన వారు మాత్రం అతనికి సరైన గుర్తింపు లభించిందనే అంటున్నారు. 2015-16 సీజన్‌లో తమిళనాడు తరఫున అత్యధికట వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో అతను రెండో స్థానంలో ఉన్నాడు. తమిళనాడు మాజీ బ్యాట్స్‌మన్ సిఎస్ సురేష్ కుమార్ నిర్వహిస్తున్న అకాడెమీలో శిక్షణ పొందిన అశ్విన్ భారత అండర్-3 జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. చాలకాలంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు నెట్ బౌలర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు ఇమ్రాన్ తాహిర్ వద్ద బౌలింగ్‌లో సలహాలు, సూచనలు తీసుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నంత కాలం మురుగన్ అశ్విన్‌కు జాతీయ జట్టులో స్థానం దక్కకపోవచ్చు. అయితే, ఆ స్థాయిలో రాణించే సత్తా ఛోటా అశ్విన్‌కు ఉందనేది వాస్తవం.

ఎవరికీ పట్టని ప్రముఖులు
కొంత మంది ప్రముఖ క్రీడాకారులను ఈసారి అన్ని ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడం విచిత్రం. ఈ జాబితాలో మార్టిన్ గుప్టిల్‌తోపాటు, హషీం ఆమ్లా, జార్జి బెయిలీ, ఉస్మాన్ ఖాజా, మనోజ్ తివారీ, డారెన్ సమీ, అజంతా మేండిస్, రాహుల్ శర్మ, డారెన్ బ్రేవో వంటి మేటి క్రికెటర్లు ఉన్నారు. మైఖేల్ హస్సీ సోదరుడు డేవిడ్ హస్సీ, మహేల జయవర్ధనే, బ్రాడ్ హాడిన్, ప్రజ్ఞాన్ ఓఝా, మార్లొన్ శామ్యూల్స్ వంటి మేటి క్రికెటర్లు కూడా ఈసారి నిర్లక్ష్యానికి గురయ్యారు. ఐపిఎల్ వేలంలో ఎలాంటి విచిత్రాలైనా
జరగవచ్చనడానికి ఇదో నిదర్శనం.

నేగీ రికార్డు

పవన్ నేగీ 8.5 కోట్ల రూపాయల ధరతో సంచలనం సృష్టించాడు. ఈసారి ఐపిఎల్ వేలంలో ఇది రెండో అత్యధిక మొత్తం. అంతేగాక, ఐపిఎల్ చరిత్రలోనే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించకుండానే అత్యధిక మొత్తాన్ని సంపాదించిన క్రికెటర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ స్పిన్నర్‌పై ఇంత భారీ మొత్తాన్ని ఎందుకు ఖర్చు చేసిందనేది ఎవరి ఊహకూ అంతుచిక్కడం లేదు. రెండేళ్లలో వరుసగా 14, 16 కోట్ల రూపాయలతో ఐపిఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన యువరాజ్ సింగ్‌కు ఈసారి ఆ స్థాయిలో ధర పలకలేదు. అయితే, షేన్ వాట్సన్ (9.5 కోట్లు), పవన్ నేగీ (8.5 కోట్లు) తర్వాత అత్యధిక మొత్తాన్ని పొందిన ఆటగాడిగా క్రిస్ మోరిస్‌తో కలిసి అతను మూడో స్థానాన్ని ఆక్రమించాడు. వీరిద్దరికీ ఏడు కోట్ల రూపాయలు
లభించాయి.