ఆటాపోటీ

సమర్థుడికే పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలంగా వినిపిస్తున్న డిమాండ్‌ను జాతీయ సెలక్టర్లు ఎట్టకేలకు తీర్చారు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకే వనే్డ, టి-20 ఫార్మాట్లలోనూ నాయకత్వ పగ్గాలను అప్పగించారు. మహేంద్ర సింగ్ ధోనీతో ఏ విధంగా పోల్చడానికి వీల్లేనప్పటికీ, అతని మాదిరిగానే కోహ్లీ కూడా సమర్థుడే. జట్టుకు విజయాలను అందించగల సమర్థుడే. ఇంగ్లాండ్‌ను టెస్టు సిరీస్‌లో చిత్తు చేయడం, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో పూర్తికాల కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, అదే జట్టుపై వనే్డ సిరీస్‌ను సాధించడం కోహ్లీ నాయకత్వ పటిమకు నిదర్శనం. మైదానంలో నింపాదిగా ఉండే ధోనీకి పూర్తి భిన్నంగా దూకుడుగా వ్యవహరించే కోహ్లీ కెప్టెన్సీ ఎలా ఉంటుందో? అతని వేగవంతమైన నిర్ణయాలు ఎలాంటి ఇబ్బందులను సృష్టిస్తాయోనన్న అనుమానాలకు తెరపడింది. టీమిండియాను అన్ని ఫార్మాట్లలోనూ సమర్థంగా నడించగల సత్తా ఉన్న కెప్టెన్‌గా కోహ్లీ నీరాజనాలు అందుకుంటున్నాడు. ధోనీ మాదిరిగానే అతను ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ టైటిళ్లతోపాటు, వివిధ మేటి జట్లపై తిరుగులేని విజయాలను సాధించిపెడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. వారి అంచనాల మేరకు రాణించే సామర్థ్యం కోహ్లీకి ఉంది.

అంతర్జాతీయ టెస్టులు, వనే్డ క్రికెట్ మ్యాచ్‌లలో ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ సృష్టించిన రికార్డులను అధిగమించే సామర్ధ్యం యువ ఆటగాడు, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. చాలా మంది వాదన ప్రకారం, ఇటీవలి కాలంలో కోహ్లీ భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదగడమేగాక, చాలా సందర్భాల్లో స్థిరమైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు. ఈ తీరు చూస్తుంటే అతను సచిన్‌ను సైతం అధిగమించడం ఖాయమన్న భావన బలపడుతోంది. భారత జట్టులోని ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్లు చక్కటి స్కోర్లు సాధించడంలో ఘోరంగా విఫలం కావడం ఆనవాయతీగా మారడంతో కోహ్లీపై బాధ్యత మరింత పెరిగింది. దానిని నిలబెట్టుకునే సత్తా అతనికి ఉందనడంలో అతిశయోక్తి లేదు.

భారత క్రికెట్ పగ్గాలు సమర్థుడికే లభించాయి. మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేసిన జాతీయ సెలక్టర్లు విజ్ఞతను, ముందు చూపును చాటుకున్నారు. 2014లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు టెస్టు సిరీస్ పూర్తికాకముందే, ఆ ఫార్మాట్ నుంచి వైదొలగుతున్నట్టు మహేంద్ర సింగ్ ధోనీ ప్రకటించడంతో, స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్ ఆరంభానికి ముందు, తాను పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో నాయకత్వాన్ని వదులుకుంటున్నట్టు ధోనీ ప్రకటించడంతో, అంతకు ముందు నుంచే అందరూ అనుకుంటున్నట్టుగానే కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. సమర్థుడైన ఆటగాడిగానే కాకుండా, మైదానంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ, యువ ఆటగాళ్లకు అభిమానిగా మారిపోయిన కోహ్లీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. కెప్టెన్‌గా ఎన్నోసార్లు జట్టును ఆదుకున్నాడు. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ, పరుగుల వరద పారిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ ఒకే తీరులో రాణించే సత్తా ఉంది కాబట్టే, భారత క్రికెట్‌పై అతను ఇప్పటికే తనదైన ముద్ర వేయగలిగాడు.
నిరుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోహ్లీ పలు రికార్డులను తిరగరాశాడు. ఒక ఐపిఎల్ సీజన్‌లో నాలుగు సెంచరీలు సాధించాడు. నిరుడు ఐపిఎల్‌లో మొత్తం ఐదు శతకాలు నమోదుకాగా, వాటిలో నాలుగు కోహ్లీవే. మరో అతను నాయకత్వం వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకే చెందిన ఎబి డివిలియర్స్ సాధించాడు. ఐపిఎల్ టోర్నీ చరిత్రలోనే ఒక సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతేగాక, 4,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాట్స్‌మన్‌గానూ రికార్డు నెలకొల్పాడు. మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన అతను 973 పరుగులు సాధించాడు. ఒక ఐపిఎల్ సీజన్‌లో 800 పరుగులను అధిగమించిన తొలి బ్యాట్స్‌మన్‌గానూ అతని ఖాతాలో మరో రికార్డు చేరింది. సన్‌రైజర్స్‌కు చెందిన డేవిడ్ వార్నర్ 17 మ్యాచ్‌ల్లో 848 పరుగులు చేసి, ఈ జాబితాలో స్థానం సంపాదించాడు. టి-20 ఫార్మెట్‌లో ఆడుతూ ఒక టోర్నీలో అత్యధికంగా మూడు సెంచరీలు చేసి మైఖేల్ క్లింగర్ నెలకొల్పిన రికార్డు కూడా కోహ్లీ దెబ్బకు తుడిచిపెట్టుకుపోయింది. క్లింగర్ 2015లో జరిగిన నాట్‌వెస్ట్ బ్లాస్ట్ టి-20 టోర్నీలో మూడు సెంచరీలు చేయగా, కోహ్లీ నిరుటి ఐపిఎల్‌లో నాలుగు శతకాలను నమోదు చేశాడు. ఏడాది చివరిలో ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడి, 655 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ 491 పరుగులతో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. నాలుగు వందల కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో చటేశ్వర్ పుజారా (401 పరుగులు) మాత్రమే ఉన్నాడు. ఆడిన ఐదు టెస్టుల్లో కోహ్లీ రెండు శతకాలు సాధించాడు. ఐపిఎల్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లను గమనిస్తే, అతి చిన్న, అతి పెద్ద ఫార్మాట్స్‌లో అతను ఒకే తీరులో రాణించగలడన్న విషయం స్పష్టమవుతుంది. కోహ్లీ దృష్టిలో ప్రతి మ్యాచ్‌కీ ఎంతో ప్రాధాన్యం ఉంది. ఫార్మాట్లతో సంబంధం లేకుండా, మైదానంలో మ్యాచ్ ఆడుతున్న ప్రతిసారీ సర్వశక్తులు ఒడ్డాలన్నదే అతని సూత్రం. జయాపజయాలతో, సాధించిన పరుగులతో నిమిత్తం లేకుండా అతను ప్రతి మ్యాచ్‌లోనూ పోరాటం సాగిస్తాడు. అందుకే, జట్టులో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోగలిగాడు.
భిన్న ధ్రువాలు
ఆటగాళ్లుగా, కెప్టెన్లుగా కోహ్లీ, ధోనీ భిన్న ధ్రువాలుగా కనిపిస్తారు. మైదానంలో కోహ్లీ దూకుడుగా వ్యవహరిస్తే, ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ధోనీని ‘మిస్టర్ కూల్’ అంటే, కోహ్లీని ‘మిస్టర్ అగ్రెషన్’ అని అనక తప్పదు. దూకుడు అంటే ప్రత్యర్థులతో మాటామాటా అనుకోవడం కాదని ధోనీ చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించాడు. ఘర్షణకు దిగడం, నవ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం దూకుడుగా వ్యవహరించడం అనిపించుకోదని కోహ్లీపై విమర్శలు గుప్పించాడు. కోహ్లీ కూడా ఎంతమాత్రం వెనక్కు తగ్గలేదు. ఆస్ట్రేలియా టూర్‌లో ధోనీ టెస్టు సిరీస్ నుంచి హఠాత్తుగా వైదొలగడానికి ముందు మ్యాచ్‌ల్లో ధోనీ తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టాడు. అతని ఎత్తుగడలను, వ్యూహాలను బాహాటంగానే విమర్శించాడు. ఇద్దరూ చాలా సందర్భాల్లో మీడియాకు ఎక్కారు. ఏదో ఒక రకంగా పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, చాలాకాలంగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం కొనసాగింది. వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ), సెలక్షన్ కమిటీ ప్రకటనలు గుప్పించడం, వారు మాత్రం నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు వ్యవహరించడం ఆనవాయితీగా మారింది. 2015 వరల్డ్ కప్ కంటే ముందు, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతూ, ఐదు మ్యాచ్‌లు పూర్తికాక ముందే ఆ ఫార్మెట్ నుంచి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడం పలు అనుమానాల తెరతీసింది. అప్పట్లో వెల్లువెత్తిన విమర్శలను దృష్టిలో ఉంచుకున్నాడో ఏమోగానీ వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్టు ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆరంభానికి ముందే ప్రకటించి తనను తాను కాపాడుకున్నాడు.
సరైన సమయంలో..
కెప్టెన్సీ నుంచి వైదొలగాలని ధోనీ సరైన సమయంలోనే నిర్ణయం తీసుకున్నాడన్నది వాస్తవం. సెలక్టర్లు అప్పటికే పరోక్షంగా హెచ్చరించారని, బలవంతంగా కెప్టెన్సీ నుంచి గెంటివేతకు గురయ్యేకంటే ముందు జాగ్రత్త పడడమే మేలని అతను నిర్ణయించుకున్నాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు ఎంతోకాలంగా భగ్గు మంటున్నాయన్నది అందరికీ తెలిసిన సత్యం. సీనియర్, యువ ఆటగాళ్ల మధ్య సఖ్యత కొరవడింది. ఒక రకంగా చెప్పాలంటే, ఆటగాళ్లంతా ధోనీ, కోహ్లీ వర్గాలుగా చీలిపోయారు. కోహ్లీ దూకుడును ఆదర్శంగా తీసుకున్న యువ ఆటగాళ్లలోనూ ధిక్కారణ ధోరణి పెరిగి ఉండవచ్చు. జట్టు ఎవరి కనుసన్నల్లో నడవాలన్న విషయంలోనూ అభిప్రాయ భేదాలు చాలా సందర్భాల్లో తెరపైకి వచ్చాయి. కోచ్, మేనేజర్, కెప్టెన్‌ను కలిపి జట్టు మేనేజ్‌మెంట్‌గా పేర్కొంటారు. వ్యూహ రచన నుంచి, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వరకూ అడుగడుగునా జట్టు మేనేజ్‌మెంట్ ఎంతో చురుగ్గా వ్యవహరిస్తుంది. మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలను ఆటగాళ్లంతా ఖచ్చితంగా అమలు చేయాలి. లేకపోతే, క్రమశిక్షణా రాహిత్యం కింద జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
జట్టు మేనేజ్‌మెంట్‌కు, ఆటగాళ్లకు మధ్య సరైన అవగాహన లేకపోతే ఏం జరుగుతుందనే విషయం 2015 వరల్డ్ కప్ వైఫల్యాలు కళ్లకు కట్టాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ అనూహ్యంగా అన్ని విధాలుగా విఫలం కావడం కారణాలు ఏమిటన్న ప్రశ్న గత రెండేళ్లుగా అందరినీ వేధిస్తున్నది. వరల్డ్ కప్ వైఫల్యాలకు ఎవరు బాధ్యత వహించాలి? కలహాల కాపురంగా మారిన టీమిండియాను ఎవరు చక్కదిద్దాలి? ఆటగాళ్లను ఎవరు క్రమశిక్షణలో పెట్టాలి? లోపాలు, పొరపాట్లు పునరావృతం కాకుండా ఎవరు వ్యూహ రచన చేయాలి? అన్న ప్రశ్నలకు ఇన్నాళ్లు సమాధానం లభించలేదు. టెస్టు ఫార్మాట్‌కు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు వేరువేరుగా కెప్టెన్లు ఉండడం సమస్యను మరింత తీవ్రం చేసింది. జట్టు మొత్తం ఒకేతాటిపైన నడవాలంటే, ధోనీని తప్పించి, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ కోహ్లీనే కెప్టెన్‌గా నియమించాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తునే ఉంది. సెలక్టర్లు కూడా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారన్న అనుమానం కలిగినందుకే ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడని అంటున్నారు. కారణాలు ఏవైనా ధోనీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. సమర్థుడైన కోహ్లీకే అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా పగ్గాలు అందాయి. అతని సారథ్యంలో భారత్ కొత్త పుంతలు తొక్కడం, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి ప్రొఫెషనల్ జట్ల మాదిరిగా దూకుడును కొనసాగిస్తూ, విజయాలను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.

- శ్రీహరి