ఆటాపోటీ

సమరానికి సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్‌లు ఆధిపత్య పోరాటానికి వేదికలుగా మారుతాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంకోసం ప్రతిసారీ పోటీపడుతున్న ఈ రెండు జట్లు ఏ విభాగంలోనూ ఒకదానికొకటి తీసిపోని రీతిలో సర్వశక్తులు కేంద్రీకరిస్తాయి. అమీతుమీ తేల్చుకోవాలన్న ఏకైక లక్ష్యంతో సమరానికి సై అంటాయి. దీనితో క్రికెట్ పిచ్‌లు యుద్ధ మైదానాలను తలపిస్తాయి. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరోసారి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయ. ఈ రెండు జట్ల మధ్య వనే్డ మ్యాచ్‌ల్లో ఎన్నో చిరస్మరణీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం నాటి మొదటి మ్యాచ్‌తో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆరంభం కానుండగా, ఈ జట్ల పోరాటాల్లో అందరికీ గుర్తుండిపోయే సందర్భాలను ప్రస్తావించుకోవాలి. భారత్, ఆసీస్ వనే్డ సిరీస్ అంటే 2013 నవంబర్ 2న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పోరాటమే అందరికీ ముందుగా గుర్తుకొస్తుంది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. 158 బంతులు ఎదుర్కొన్న అతను 12 ఫోర్లు, 16 సిక్సర్లతో 209 పరుగులు సాధించి, ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అవుటయ్యాడు. అతని విజృంభణతో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 383 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 45.1 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటై, 57 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. సిరీస్‌ను భారత్ 3-2 తేడాతో సొంతం చేసుకుంది. అదే ఏడాది అక్టోబర్ 16న జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఆస్ట్రేలియాను ఢీకొన్నప్పుడు విరాట్ కోహ్లీ 52 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన భారతీయుల జాబితాలో అతనికి అగ్రస్థానం దక్కింది. కోహ్లీ సెంచరీలో ఎనిమిది పోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అదే ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 123 బంతులు ఎదుర్కొని 141 పరుగులు సాధించారు. వీరిద్దరూ చెలరేగిపోవడంతో, టీమిండియా 43.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి 362 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించగలిగింది.
అహ్మదాబాద్‌లో, 2011 మార్చి 24న ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా ఢీకొన్నాయి. 50 ఓవర్లలో ఆసీస్ 6 వికెట్లకు 260 పరుగులు చేసింది. అనంతరం పరుగుల వేటలో తడబడిన భారత్ 37.3 ఓవర్లలో 187 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో యువరాజ్ సింగ్ (57 నాటౌట్), సురేష్ రైనా (34 నాటౌట్) ఆరో వికెట్‌కు అజేయంగా 74 పరుగులు జోడించి, భారత్‌ను గెలిపించారు. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత్ టైటిల్ అందుకోవడానికి క్వార్టర్ ఫైనల్‌లో యువీ, రైనా చూపిన ప్రతిభ ఎంతగానో ఉపయోగపడింది. అంతకుముందు ఏడాది, 2010 అక్టోబర్ 20న విశాఖపట్నంలోని అభిమానులకు కోహ్లీ బ్యాటింగ్ ప్రతిభను ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అజేయంగా 111 పరుగులు చేయడంతో, ఆ జట్టు 3 వికెట్లకు 269 పరుగులు సాధించగలిగింది. అయితే, కోహ్లీ శతకంతో రాణించడంతో, టీమిండియా మరో ఓవర్ మిగిలి ఉండగానే, ఐదు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. ఇలాంటి ఉత్కంఠ ఫలితాలు, హోరాహోరీ పోరాటాలు ఎన్నో ఉన్నాయి కాబట్టే, భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే సిరీస్‌లు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
సమవుజ్జీలు..
ఒకప్పుడు భారత్‌పై అన్ని విభాగాల్లోనూ ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని చలాయించింది. కొన్ని దశాబ్దాలపాటు ఇదే ధోరణి కొనసాగింది. కానీ, క్రమంగా ప్రపంచ మేటి జట్లను కూడా మట్టికరిపించే ప్రమాణాలను టీమిండియా అందుకోవడంతో పరిస్థితి మారింది. ఇప్పుడు రెండు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. అందుకే, ఆదివారం నుంచి మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో రెండు జట్లూ నువ్వా? నేనా? అన్న చందంగా పోరాటం సాగించడం ఖాయం. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ 123 వనే్డ ఇంటర్నేషనల్స్ జరిగాయి. ఆస్ట్రేలియా 72 విజయాలు సాధిస్తే, భారత్ 41 మ్యాచ్‌లను గెల్చుకుంది. వివిధ కారణాల వల్ల 10 మ్యాచ్‌ల్లో ఫలితాలు తేలలేదు. జయాపజయాల చిట్టాను పరిశీలిస్తే, భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయిగా మారుతుందనే అభిప్రాయం కలుగుతుంది. కానీ, ఇటీవలి కాలంలో జరిగిన సిరీస్‌ల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా సై అంటే సై అంటున్నది.
హోరాహోరీ
భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడిన ప్రతిసారీ హోరాహోరీ పోరాటాన్ని అభిమానులు కోరుకుంటారు. ఎన్నో మ్యాచ్‌ల ఫలితాలు ఈ జట్లు ఏ స్థాయిలో తలపడతాయో స్పష్టం చేస్తాయి. 1987 అక్టోబర్ 9న చెన్నైలో, 1992 మార్చి ఒకటిన బ్రిస్బేన్‌లో జరిగిన వనే్డల్లో భారత్‌పై ఆస్ట్రేలియా కేవలం ఒక పరుగు తేడాతో గెలిచింది. 2009 నవంబర్ 5న హైదరాబాద్‌లో మూడు పరుగులు, 2009 అక్టోబర్ 25న వడోదరలో నాలుగు పరుగుల తేడాతో ఆసీస్ విజయాలు సాధించింది. 1996 నవంబర్ 3న మొహాలీలో జరిగిన వనే్డలో భారత్ ఐదు పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. ఈ రెండు జట్లు ఏ స్థాయిలో సవాళ్లు విసురుకుంటాయో, ఏ విధంగా సర్వశక్తులూ ఒడ్డుతాయో ఈ ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి. రెండు వికెట్ల తేడాతో భారత్ రెండు, ఆస్ట్రేలియా ఒకసారి విజయాలను నమోదు చేశాయి. 3 వికెట్ల తేడాతో భారత్, ఆసీస్ జట్లు చెరి మూడుసార్లు గెలిచాయి. ఈ గణాంకాలు రెండు జట్ల పోరు మైదానంలో ఏ స్థాయిలో ఉంటుందో స్పష్టం చేస్తాయి.
అత్యధిక స్కోర్ల విషయానికి వస్తే, ఆస్ట్రేలియా కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉంది. ఈ జాబితాలో మొదటి రెండు స్థానాలను టీమిండియా ఆక్రమిస్తే, మూడు, నాలుగు స్థానాల్లో ఆస్ట్రేలియా ఉంది. 2013 నవంబర్ 2న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్లకు 383 పరుగులు సాధించింది. అదే ఏడాది అక్టోబర్ 16న జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక వికెట్ కోల్పోయి 362 పరుగులు చేసింది. కాగా, 2003 మార్చి 23న జొహానె్నస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 2 వికెట్లకు 359 పరుగులు నమోదు చేసింది. 2003 ఫిబ్రవరి 8న సిడ్నీ వనే్డలో 5 వికెట్లకు 359 పరుగులు సాధించింది. అత్యధికమే కాదు.. అత్యల్ప స్కోర్ల విషయంలోనూ మొదటి రెండు స్థానాలను భారత్ ఆక్రమించడం గమనార్హం. 1981 జనవరి 8న సిడ్నీలో జరిగిన వనే్డలో ఆస్ట్రేలియా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన భారత్ 63 పరుగులకే కుప్పకూలింది. 2000 జనవరి 14న సిడ్నీ మైదానంలోనే జరిగిన వనే్డలో 36.3 ఓవర్లలో 100 పరుగులు చేసి ఆలౌటైంది. కాగా, భారత్‌పై ఆస్ట్రేలియా అత్యల్ప స్కోరు 101 పరుగులు. 1991 డిసెంబర్ 8న పెర్త్‌లో జరిగిన వనే్డలో ఆసీస్ ఈ స్కోరుకే చాపచుట్టేసింది.
రెండు జట్ల మధ్య భారీ విజయాల్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జాబితాలో మొదటి నాలుగు స్థానాలను ఆ జట్టు దక్కించుకోవడమే ఇందుకు నిదర్శనం. 2004 ఫిబ్రవరి 8న సిడ్నీలో జరిగిన వనే్డలో ఆసీస్ 208 పరుగుల తేడాతో గెలిచింది. 1983 జూన్ 13న నాటింహామ్‌లో 162 పరుగులు, 2000 జనవరి 26న అడెలైడ్‌లో 152 పరుగులు, 2003 మార్చి 23న జొహానె్నస్‌బర్గ్‌లో 125 పరుగులు తేడాతో భారత్‌ను చిత్తుచేసింది. కాగా, ఆసీస్‌పై ఇటీమిండియా అత్యుత్తమంగా, రెండు పర్యాయాలు 118 పరుగుల తేడాతో గెలిచింది. 1983 జూన్ 20న చేమ్స్‌ఫర్డ్‌లో, 2001 మార్చి 31న ఇండోర్‌లో భారత్ ఈ విజయాలను నమోదు చేసింది. ఇక వికెట్ల పరంగా చూస్తే, ఆస్ట్రేలియా ఐదు పర్యాయాలు, భారత్ ఒకసారి తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచాయి. ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మూడుసార్లు, భారత్ రెండు పర్యాయాలు విజయాలు సాధించాయి. ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే గెలిచిన మ్యాచ్‌ల వివరాలను తీసుకుంటే, మొదటి ఐదు స్థానాలను ఆస్ట్రేలియానే ఆక్రమించడం విశేషం. 1981 జనవరి 8న సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో మరో 174 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ను ఆసీస్ చిత్తుచేసింది. అదే విధంగా 2003 ఫిబ్రవరి 15న సెంచూరియన్‌లో 166 బంతులు, 2007 అక్టోబర్ 11న వడోదరలో 145 బంతులు, 2000 జనవరి 14న సిడ్నీలో 139 బంతులు, 2004 ఫిబ్రవరి ఒకటిన పెర్త్‌లో 108 బంతులు మిగిలి ఉండగానే భారత్‌పై ఆసీస్ విజయాలను నమోదు చేసింది. మొత్తం మీద భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్‌లు, ప్రత్యేకించి వనే్డ సిరీస్‌లు ప్రేక్షకులకు ఒక అద్భుత విందును అందిస్తాయి. ఒక క్షణం పాటు ఏమరుపాటుగా ఉంటే, ఏదైనా అద్భుత ఘట్టాన్ని మిస్ అవుతామేమోనన్న భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతుంది. అసాధారణ సందర్భాలను మినహాయిస్తే, భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వనే్డ మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా జరుగుతాయి. అభిమానులకు అసలుసిసలైన క్రికెట్ విందును పంచుతాయి. మరోసారి అలాంటి అరుదైన అనుభూతిని పొందడానికి, క్రికెట్ మజాను ఆసాంతం ఆస్వాదించడానికి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. మ్యాచ్‌లు మొదలుకావడమే తరువాయి.

ఆస్ట్రేలియా Vs భారత్

సెప్టెంబర్ 17: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మొదటి వనే్డ
సెప్టెంబర్ 21: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో వనే్డ
సెప్టెంబర్ 24: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మూడో వనే్డ
సెప్టెంబర్ 28: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నాలుగో వనే్డ
అక్టోబర్ 1: నాగపూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో ఐదో వనే్డ.

- బిట్రగుంట