ఆటాపోటీ

ఐపిఎల్‌కు 3 ‘స్టార్’ హోదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లోని ఎనిమిది ఫ్రాంచైజీలకు అనుకోని లాభం వచ్చింది. 11వ ఐపిఎల్‌కు ఇంకా సన్నాహాలు మొదలుపెట్టక ముందే, ఒక్కో ఫ్రాంచైజీకి ఉమారు 150 కోట్ల రూపాయలు దక్కడం విశేషం. ఐదేళ్ల కాలానికి ఈ టోర్నీ మ్యాచ్‌ల ప్రసార హక్కులను స్టార్ ఇండియా సంస్థ 16,347.50 కోట్ల రూపాయల బిడ్‌తో దక్కించుకోవడం ప్రత్యక్షంగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసి)కి, పరోక్షంగా ఫ్రాంచైజీలకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. గత పదేళ్ల కాలంలో దక్కిన మొత్తంతో పోలిస్తే, ఈ ఒక్క ఒప్పందం ద్వారా ఫ్రాంచైజీలకు రెట్టింపు మొత్తం అందుతుంది. వచ్చే ఐదేళ్లలో ఒక్కో ఫ్రాంచైజీకి సీజన్‌కు 50 కోట్ల రూపాయల చొప్పున లాభం వస్తుందని అంచనా.
యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్ నుంచి ఇంగ్లీష్ కౌంటీస్ వరకూ వివిధ రకాల టోర్నీల మేలుకలయికగా రూపుదిద్దుకున్న ఐపిఎల్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ఫ్రాంచైజీల విధానాన్ని ఇంగ్లీష్ కౌంటీలు, యుఫా సాకర్ నుంచి స్వీకరించారు. చీర్‌లీడర్లు క్రికెట్‌లో తొలిసారి రంగ ప్రవేశం చేశారు. టి-20 ఫార్మెట్ కావడంతో, సుమారు మూడు గంటల వ్యవధిలోనే ఫలితం తేలిపోతుంది. అన్నిటినీ మించి క్రికెట్‌లో పేరొందిన ఎంతోమంది ప్రస్తుత క్రికెటర్లతోపాటు మాజీ ఆటగాళ్లను చూసే అవకాశం రావడం ప్రేక్షకులను ఐపిఎల్ మ్యాచ్‌లకు పరుగులు తీయించింది. సినిమా స్టార్లు వివిధ ఫ్రాంచైజీల్లో భాగస్వాములుగా మారడంతో టోర్నీలో గ్లామర్ కూడా చోటుచేసుకుంది. క్రికెట్ ఒక మతంలా మారితే, క్రికెటర్లు సాక్షాత్తు దేవతల్లా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నారు. సినీ తారలకు ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ పారితోషికాలు క్రికెట్ దిగ్గజాలను సైతం ఐపిఎల్‌కు క్యూ కట్టిస్తున్నాయి. తాము తీసుకున్న మొత్తాలకు న్యాయం చేయడంతోపాటు, భవిష్యత్తు డిమాండ్‌ను మరింతగా పెంచుకోవాలన్న తాపత్రయం క్రికెటర్లను పోరాట యోధులుగా మారుస్తున్నది. ఈ యుద్ధాలే ఐపిఎల్‌కు ప్రత్యేక ఆకర్షణను తెచ్చింది. క్రేజీతోపాటు చీకటి కోణం కూడా ఐపిఎల్‌లో ఇప్పటికే ఆవిష్కృతమైంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఈ టోర్నీలో ఒక భాగమైందన్న ఆరోపణలున్నాయి. పందాలు పెరగడం, భారీ మొత్తాలు చేతులు మారడంతో ఐపిఎల్ క్రమంగా అవినీతి ఊబిలో కూరుకుపోయింది. ఆరో ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయర్స్ బౌలర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాను స్పాట్ ఫిక్సింగ్ నేరంపై పోలీసులు అరెస్టు చేయడం నుంచి మొదలుపెడితే, ముకుల్ ముద్గల్ విచారణ, లోధా కమిటీ ప్రతిపాదనలు, బిసిసిఐ వ్యవహారాలను పరిశీలించేందుకు పాలనాధికారుల బృందం (సిఒఎ) ఏర్పాటు వరకు ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌కు ఆదరణ తగ్గుతుందని, ఐపిఎల్ వెలవెలబోతుందని చాలామంది జోస్యం చెప్పారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది పదో ఐపిఎల్ కూడా విజయవంతమైంది. ఐపిఎల్‌కు ఉన్న విశేష ఆదరణను సొమ్ము చేసుకోవడానికి సహజంగానే బహుళ జాతి సంస్థలు పోటీపడ్డాయి. స్టార్ ఇండియా అత్యధిక మొత్తాన్ని చెల్లించి, ప్రసార హక్కులను సొంతం చేసుకుంది.
గెలిచిందా? ఓడిందా?
పోటీదారులను సమర్థంగా ఎదుర్కొని, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఐపిఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్ ఇండియా ఈ రేసులో గెలిచిందా? లేక వాస్తవ విలువను గుర్తించలేక భారీ మూల్యాన్ని చెల్లించుకోనుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ రంగంలో హాట్ టాపిక్‌గా మారాయి. 2018 నుంచి 2022 వరకూ, ఐదేళ్లకు ప్రసార హక్కుల కింద స్టార్ ఇండియా చెల్లించాల్సిన మొత్తం అక్షరాలా 16,347 కోట్ల రూపాయలు. అయితే, ఖర్చు అక్కడితో ఆగదు. ఏడాదికి సుమారు 100 కోట్ల రూపాయలు చొప్పున, కనీసం 500 కోట్ల రూపాయలను టీవీ ప్రొడక్షన్, మార్కెటింగ్ కోసం వెచ్చించాలి. బ్యాంక్ గ్యారంటీ కింద ఒక శాతం, బిసిసిఐకి అడ్వాన్స్ కింద చెల్లించిన మొత్తానికి వడ్డీ కింద మూడు శాతం (ఐదేళ్లకు 15 శాతం) చొప్పున చెల్లించాలి. ఈ లెక్కలన్నీ చూస్తే, ఐదేళ్లకు స్టార్ ఖర్చు 17,347 కోట్ల రూపాయలు అవుతుంది.
సబ్ లీజ్ ఇవ్వాల్సిందే!
గ్లోబల్ ప్రసార హక్కులను సంపాదించుకున్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా స్టార్‌కు నెట్ వర్క్ లేదు. దీనితో తప్పనిసరిగా సబ్ లీజ్ ఇవ్వాల్సి వస్తుంది. భారత ఉప ఖండాన్ని మినహాయించి, మిగతా ప్రాంతాల్లో ప్రసార హక్కుల సబ్ లీజ్‌ను 860 కోట్ల రూపాయలుగా స్టార్ సంస్థ నిర్ధారించింది. అయితే, మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కనీసం 1,000 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. అయితే, కేవలం టీవీ హక్కులను మాత్రమే ఇచ్చి, డిజిటల్ హక్కులను స్టార్ తన వద్దే ఉంచుకుంటున్నది. స్టార్ అనుబంధ సంస్థ హాట్‌స్టార్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్‌కు వెళ్లాలన్నది స్టార్ ఆలోచన. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో, సబ్‌లీజ్ ద్వారా ఎంత లభిస్తుందో చూడాలి.
ఆశలు లేకపోలేదు!
స్టార్ ఏకమొత్తంగా నష్టపోతుందనిగానీ, దివాలా తీయక తప్పదనిగానీ అనుకోవడానికి వీల్లేదు. ఆశాజనకమైన పరిస్థితులు లేకపోలేదు. గణకాలను పరిశీలిస్తే, ప్రస్తుత హక్కుదారు సోనీ నెట్ వర్క్ లాభాల్లో 15 శాతం వృద్ధిరేటు కనిపిస్తుంది. ఈ ఏడాది సోనీ ఆదాయం 1,300 కోట్ల రూపాయలకు చేరింది. స్టార్ కూడా దాదాపుగా అదేస్థాయిలో ఆదాయాన్ని పొందుతుందనేది విశే్లషకుల అభిప్రాయం. 15 శాతం వృద్ధిరేటును ఆశించలేకపోయినా, 10 శాతం సాధ్యమవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1,300 కోట్ల రూపాయల నుంచి మొదలుపెట్టి, ఐదేళ్ల పాటు ఏటా 10 శాతం వృద్ధి ఉంటుందని స్టార్ కూడా అంచనా వేస్తున్నది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే బాగానే ఉంటుంది. లేకపోతేనే కష్టం. ఏది ఏమైనా 3స్టార్2 బిడ్ కారణంగా ఐపిఎల్‌కు స్టార్ హోదా వచ్చేసింది.

- శ్రీహరి