ఆటాపోటీ

‘ప్రక్షాళన’లో చివరి మజిలీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలంగా వాయదాపడుతూ వస్తున్న బిసిసిఐ ప్రక్షాళన అంశం చివరి మజిలీకి చేరింది. లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడంలో తలెత్తుతున్న అవరోధాలను అధిగమించడానికి నిబంధనావళిని సవరించడం ఒక్కటే మార్గమని నిర్ధారణకు వచ్చింది.
తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా బిసిసిఐ అధికారులను అదేశించిన కోర్టు
ఈ కేసును 30వ తేదీకి వాయదా వేసింది. బోర్డు పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే అధికారుల బృందం (సిఒఎ) రూపొందించిన ముసాయదాను, దానిపై బిసిసిఐ అధికారులు చేసే సూచనలను పరిశీలించిన తర్వాత సుప్రీం కోర్టు తుది తీర్పును ఇవ్వనుంది.
లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాల్సిందేనని గతంలో పలుమార్లు బిసిసిఐకి
స్పష్టం చేసిన నేపథ్యంలో, అందుకు అనుగుణంగానే తీర్పు ఉండవచ్చు. మొత్తం మీద
వచ్చే నెలలో బిసిసిఐ కొత్త రూపంతో సాక్షాత్కరించడం ఖాయంగా కనిపిస్తున్నది.

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రక్షాళన పర్వం తుది ఘట్టానికి చేరుకుంది. ఈ చివరి మజిలీలో ఎలాంటి మలుపులు ఉంటాయో? ఎనె్నన్ని కొత్త పిట్టకథలు పుట్టుకొస్తాయో? నిన్నమొన్నటి వరకూ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన బిసిసిఐకి సుప్రీం కోర్టు కళ్లాలు బిగిస్తున్నది. నిబంధనావళిని మార్చడం ద్వారా జవాబుదారీకి తెరతీయాలని నిర్ణయించింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేసి, బోర్డు సంపూర్ణ ప్రక్షాళన ప్రక్రియను పూర్తి చేయనుంది. లోధా ప్రతిపాదనల అమలును జాగ్రత్తగా పర్యవేక్షించి, విజయవంతంగా పూర్తి చేయడానికి సుప్రీం కోర్టు నియమించిన బిసిసిఐ పాలనాధికారుల బృందం (సిఒఎ) ఇప్పటికే సరికొత్త నిబంధనావళి ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా చేసిన సూచనకు సానుకూలంగా స్పందించని బోర్డు అధ్యక్షుడు సికె ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరీ, కోశాధికారి అనిరుద్ధ్ చౌదరీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనవాళిపై సిఒఎకు అభిప్రాయాలను తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెలాఖరుకు వాయిదా వేసింది. అంటే, వచ్చే నెలలో బిసిసిఐ కొత్త రూపంతో మనకు సాక్షాత్కారం ఇవ్వడం ఖాయం. లోధా సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని, సిఒఎ రూపొందించిన ముసాయిదా నిబంధనావళిని ఉన్నది ఉన్నట్టు అమలు చేస్తే, బిసిసిఐలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో మంత్రుల అవసరం ఇకపై ఉండదు. బోర్డు కార్యవర్గంలో మంత్రులకు చోటు ఉండదు. కోట్లాది రూపాయల లావాదేవీలను ఎవరి జోక్యం లేకుండా స్వతంత్రంగా చూసుకోవాలనుకుంటున్న బోర్డు అధికారుల ప్రయత్నాలకు తెరపడుతుంది. బోర్డు కార్యవర్గ సభ్యులకు గరిష్ట వయఃపరిమితి అమల్లోకి వస్తుంది. అత్యధిక ఆదాయ వనరులతో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బిసిసిఐ వ్యవహారాలు పారదర్శకంగా ఉండాలంటే లోధా సిఫార్సులను అమలు చేసి తీరాల్సిందేనని సుప్రీం కోర్టు ఇది వరకే స్పష్టం చేసిన నేపథ్యంలో, కొత్త నిబంధనల్లో వాటికే పెద్దపీట వేయక తప్పదు. గతంలో మాదిరి ప్రజలకు జవాబుదారీ వహించకుండా తప్పించుకునే అవకాశం బోర్డు కార్యవర్గానికి ఇకపై ఉండదు.
కీలకాంశాలు ఇవే..
బిసిసిఐ తీసుకుంటున్న నిర్ణయాలు, లావాదేవీలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో లోధా కమిటీ పలు పలు సూచనలు చేసింది. అవే బోర్డు కొత్త నిబంధనావళిలో ప్రతిబింబిస్తాయి. క్రికెట్‌తో సంబంధం లేనివారే క్రికెట్ బోర్డు, సంఘాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కారణంగానే సమస్యలు తలెత్తుతున్నాయన్న విమర్శలకు ఇకపై తెరపడుతుంది. రాజకీయ నేతలను క్రికెట్ నుంచి సాధ్యమైనంత దూరంగా ఉంచేందుకు సరికొత్త విధానాలు అమల్లోకి వస్తాయి. మంత్రలు ఎవరూ బిసిసిఐ లేదా దాని అనుబంధ సంఘాల పాలక మండళ్లలో సభ్యులుగా ఉండడానికి వీల్లేదు. అంతేగాక, బిసిసిఐ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి వంటి పోస్టులను నిర్వహించే వారికి కొన్ని ప్రత్యేక అర్హతలు ఉండి తీరాలి. 70 సంవత్సరాలు దాటిన వారెవరూ బోర్డులో ఎలాంటి పదవులను నిర్వహించడానికి వీల్లేదు. మంత్రులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు బోర్డు పదవులకు అనర్హులవుతారు. అదే విధంగా కార్యవర్గ సభ్యుల పదవీకాలంపై సీలింగ్ విధానం అమల్లోకి వస్తుంది. బిసిసిఐ పాలక మండలికి ఒక వ్యక్తి వరుసగా రెండు, మొత్తం మీద గరిష్టంగా మూడుసార్లు ఎన్నికకావచ్చు. అంతకంటే ఎక్కువ పర్యాయాలు లేదా తొమ్మిది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పదవిలో ఉండకూడదు. గతంలో మాదిరి దశాబ్దాలకు దశాబ్దాలు పదవులను పట్టుకొని వేళ్లాడే అవకాశం లేదు. సర్వీసెస్, రైల్వేస్ వంటి యూనిట్లకు సరిహద్దులంటూ ఏవీ లేని కారణంగా వాటిని రద్దు చేయాలన్న ప్రతిపాదన కూడా నిబంధనావళిలో చేరవచ్చు. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి మూడేసి సంఘాలకు బిసిసిఐలో సభ్యత్వం ఉంది. ఇకనుంచి ఒక రాష్ట్రానికి ఒకే సంఘం, ఒకే ఓటు అనే విధానాన్ని అమలు చేస్తారని అంటున్నారు. ఇది కూడా లోధా సిఫార్సుల్లో కీలకమైన అంశం. కొత్త నిబంధనావళి అమల్లోకి వస్తే, ఇకపై బోర్డు అధ్యక్షుడికి మూడు ఓట్లు వేసే హక్కు ఉండదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం తాను ప్రాతినిథ్యం వహించే క్రికెట్ సంఘం తరఫున ఒకటి, బోర్డు అధ్యక్షుడి హోదాలో మరొకటి చొప్పున ఓట్లు ఉంటాయి. ఏదైనా అంశంపై జరిగిన ఓటింగ్‌లో సమాన సంఖ్యలో ఓట్లు పోలైతే, కాస్టింగ్ ఓటు వేసే అధికారం కూడా అధ్యక్షుడికి ఉంటుంది. లోధా సిఫార్సును అమలు చేస్తే, ఇక మీదట ఒక వ్యక్తికి మూడు ఓట్లు ఉండవు. వ్యాపారేతర సంస్థగా నమోదైంది కాబట్టి ఎవరికీ జవాబుదారి కాదని ఇన్నాళ్లూ బిసిసిఐ వాదిస్తూ వస్తున్నది. కొత్త నిబంధనలు అమలైతే, బోర్డు కూడా సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి వస్తుంది. బిసిసిఐ కార్యకలాపాల్లో ఎక్కువ శాతం ప్రజలతో ముడిపడి ఉంటాయి కాబట్టి ఇది సరైన నిర్ణయమే. బిసిసిఐలో ఏం జరుగుతున్నదో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. క్రికెట్‌పై ప్రజలకు ఉన్న ఆదరణ వల్లే బిసిసిఐ ఎదిగిందనేది వాస్తవం. అందుకే, బోర్డును ఆర్‌టిఐ పరిధిలోకి తీసుకొస్తున్నారు.
మరో కీలకమైన మార్పుగా తొమ్మిది మందితో బిసిసిఐ పాలక మండలి ఏర్పాటు కావడాన్ని పేర్కోవాలి. వీరిలో ఐదుగురిని బోర్డు సర్వసభ్య సమావేశం ఎన్నుకుంటే, ఇద్దరు క్రికెటర్ల ప్రతినిధులు ఉంటారు. ఒక మహిళకు కూడా స్థానం కల్పిస్తారు. బోర్డు రోజువారీ వ్యవహారాలను పరిశీలించే బాధ్యతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇవో)కు అప్పగిస్తారు. సదరు సిఇవోకు ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ సహాయసహకారాలు అందిస్తారు. మొత్తం మీద ఈ నెల 30న సుప్రీం కోర్టు కొత్త నిబంధనావళిని ఆమోదించి, అమలు చేయాల్సిందిగా ఆదేశిస్తే, చాలా తొందరలో బిసిసిఐ రూపురేఖలు మారిపోతాయి. అయితే, లోధా సిఫార్సులను ఆసాంతం అమలు చేస్తారా? లేక కొన్ని మినహాయింపులు, పరిమితులు ఉంటాయా? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం లేదు. సిఒఎ రూపొందించిన నిబంధనావళి ముసాయిదాలో ఏయే అంశాలు ఉన్నాయో సుప్రీం కోర్టు వెల్లడించే వరకూ బోర్డు ప్రక్షాళన విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడదు.

- శ్రీహరి