ఆటాపోటీ

క్రీడా రంగానికి కొత్త ఊపిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిఫాను ఆశ్చర్యంలో ముంచెత్తిన అంశాల్లో కనీవినీ ఎరుగని ప్రజాదరణ ఒకటి. అండర్-17 వరల్డ్ కప్ టోర్నీకే కాదు, అండర్-20 టోర్నీకి కూడా ఎప్పుడూ, ఎక్కడా ఇంత భారీ సంఖ్యలో అభిమానులు రాలేదు. 1985లో చైనాలో జరిగిన అండర్-20 వరల్డ్ కప్‌ను 12,30,976 మంది తిలకించగా, భారత్‌లో అండర్-17 వరల్డ్ కప్‌ను 13,47,143 మంది వీక్షించారు. అంటే, వివిధ ఏజ్ గ్రూప్స్‌లో ఫిఫా నిర్వహించిన రికార్డు టోర్నీలను అధిగమిస్తూ భారత్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఎక్కువ మంది వీక్షించిన ఫిఫా ఆధ్వర్యంలోని ఏజ్ గ్రూప్ టోర్నీగానే కాదు... అత్యధిక గోల్స్ నమోదైన టోర్నీగానూ భారత్‌లో జరిగిన అండర్-17 వరల్డ్ కప్ రికార్డు సృష్టించింది. మొత్తం 52 మ్యాచ్‌ల్లో 177 గోల్స్ నమోదయ్యాయి. 2013లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 172 గోల్స్ నమోదైతే ఆ రికార్డు బద్దలైంది. ఈసారి ఒక మ్యాచ్‌కి గోల్స్ సగటు 3.40. 2005 వరకూ ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొనేవి. 2007 నుంచి జట్ల సంఖ్యను ఫిఫా 24కు పెంచింది. దీనితో అంతకుముందు 32 మ్యాచ్‌లు ఆడగా, ఆ తర్వాత వాటి సంఖ్య 52కు పెరిగింది.

మొన్న ఫుట్‌బాల్.. నిన్న బాక్సింగ్.. నేడు హాకీ..
ఒకదాని తర్వాత మరొకటిగా అంతర్జాతీయ పోటీలకు భారత్ వేదికగా మారుతోంది. ఈ టోర్నీలు భారత క్రీడా రంగానికి కొత్త ఊపిరి పోస్తున్నాయి. ప్రపంచ టి-20 చాంపియన్‌షిప్ వరకూ క్రికెట్‌కు కొమ్ముకాస్తున్నట్టు కనిపించిన భారత్ అండర్-17 సాకర్ వరల్డ్ కప్‌ను సమర్థంగా నిర్వహించి ‘ఔరా’ అనిపించుకుంది. ప్రపంచ స్థాయి పోటీలకు భారత్‌ను మించిన వేదిక లేదని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ ఆధ్వర్యంలో జరిగిన అండర్-17 వరల్డ్ కప్ నిరూపించింది. ఎన్నో విధాలుగా ఆ చాంపియన్‌షిప్ మన దేశ క్రీడారంగ దిశను మార్చేసింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీకి తొలిసారి ఆతిథ్యమిచ్చినప్పటికీ, గతంలో ఎన్నడూ లేని రీతిలో ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ విజయంవంతమైంది. దీనితో క్రికెట్‌ను తప్ప మరో ఆటకు దేశంలో ప్రాధాన్యం లేదన్న వాదనకు బలం తగ్గింది. ప్రేక్షకులను ఉర్రూతలూగించిన యువ ఆటగాళ్ల అద్భుత విన్యాసాలు.. క్రికెట్‌కు మాత్రమే ప్రాధాన్యమిచ్చి, మిగతా క్రీడలను పట్టించుకోని భారత్‌లో ఫుట్‌బాల్‌కూ మంచి రోజులు వచ్చాయని నిరూపిస్తూ ప్రతి మ్యాచ్‌కీ వెల్లువెత్తిన అభిమానులు.. అంతర్జాతీయ స్థాయి టోర్నీలను నిర్వహించే శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని నిరూపించిన ఏర్పాట్లు.. అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దిన మైదానాలు.. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా2 ఆధ్వర్యంలో జరిగిన అండర్-17 వరల్డ్ కప్ విజయవంతమైందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. ఈ టోర్నమెంట్‌కు ఇంత భారీస్థాయిలో స్పందన రావడం, స్టేడియాలు కిక్కిరిసిపోవడం ఇదే మొదటిసారి. క్రికెట్‌తోపాటు ఇతర క్రీడలకు, ప్రత్యేకించి ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఈ టోర్నమెంట్ స్పష్టం చేసింది. ఆసక్తికరంగా సాగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్ 5-2 తేడాతో హాట్ ఫేవరిట్ స్పెయిన్‌ను చిత్తుచేసి, తొలిసారి టైటిల్ సాధించింది. గ్రూప్ దశలో మొదటి మ్యాచ్ నుంచి ఫైనల్ వరకూ ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠ రేపిందని, అటు ఆట, ఇటు సౌకర్యాలు కనీవినీ ఎరుగని రీతిలో ఉన్నాయని నెదర్లాండ్స్ లెజెండరీ ఫుట్‌బాలర్ మార్కో వాన్ బాస్టెన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మొదటిసారి ఒక అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చిన భారత్ ఇప్పుడు అండర్-20 వరల్డ్ కప్‌ను నిర్వహించాలని ఉత్సాహపడుతోంది. అండర్-17 వరల్డ్ కప్ ఊహించని రీతిలో విజయవంతం కావడంతో వచ్చిన ఆత్మస్థైర్యమే అధికారుల ఉత్సాహానికి కారణం.
అందరూ అనుకున్నట్టుగానే భారత జట్టు గ్రూప్ దశను అధిగమించలేకపోయింది. ఘనా, కొలంబియా, అమెరికా జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొంది. మొత్తంమీద టోర్నీలో ఒక్క మ్యాచ్‌ని కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయినప్పటికీ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో ఆడే సత్తా తనకు ఉందని నిరూపించే రీతిలో అద్భుత పోరాట పటిమను కనబరచింది. సమీప భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించడం ఖాయమని చెప్పకనే చెప్పింది. విదేశీ జట్లతో పోటీపడే అవకాశాలు భారత జట్టుకు దాదాపుగా రాలేదనే చెప్పాలి. అంతేగాక, చాలాకాలంగా అరకొర సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్న భారత ఫుట్‌బాల్ సంఘం ప్రపంచ మేటి కోచ్‌లను నియమించలేకపోయింది. అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నప్పటికీ, పట్టుదలతో ముందడుగు వేసిన భారత జట్టు గ్రూప్ దశలోని మూడు మ్యాచ్‌ల్లోనూ చేసిన పోరాటం అభిమానులను ఆకట్టుకుంది. ఇది శుభసూచకం. కొలంబియాతో జరిగిన మ్యాచ్ ఆరంభంలో జీక్సన్ సింగ్ గోల్ చేశాడు. ఫిఫా ఆధ్వర్యంలో జరిగే ఒక వరల్డ్ కప్‌లో గోల్ చేసిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. కానీ, ఆ తర్వాత కొలంబియా రెండు గోల్స్ చేసి, విజయం సాధించింది. భారత్ ఓడినప్పటికీ, ప్రత్యర్థులకు గట్టిపోటీనిచ్చిందని కోచ్ లూయిస్ నార్టన్ డి మటోస్ వ్యాఖ్యానించాడు. ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో కూడా ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేయడం గమనార్హం. ఆటలో ప్రమాణాల పరంగా భారత్‌కు, ఇతర జట్లకు పెద్ద తేడా ఏమీ లేదని అతను స్పష్టం చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోవడం వల్ల భారత్ కొంత వెనుకంజ వేసిందని, లేకపోతే, ఫలితాలు మరో విధంగా ఉండేవని అతను అన్నాడు. ఈ మాటలు అక్షర సత్యాలు. భారత యువ ఆటగాళ్లు అద్వితీయ ప్రతిభావంతులని, రాబోయే కాలంలో వారు అంతర్జాతీయ స్టార్లుగా వెలుగుతారని ఇన్‌ఫాంటినోసహా చాలామంది ప్రముఖులు కితాబునిచ్చారు. ఇంతకు మించిన రివార్డు ఇంకేముంటుంది?
అండర్-17 వరల్డ్ కప్ తర్వాత ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ భారత్ ప్రతిష్ఠను ఇనుమడింప చేసింది. 11 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రపంచస్థాయి బాక్సింగ్‌కు భారత్ వేదికైంది. 2006లో సీనియర్ మహిళల బాక్సింగ్‌కు ఆతిథ్యమిచ్చిన దేశం ఇప్పుడు యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించింది. 2021 సీనియర్ పురుషుల వరల్డ్ చాంపియన్‌షిప్స్ హక్కులను సంపాదించే అవకాశాలను మెరుగుపరచుకుంది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబీఏ) భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించడం, యూత్ చాంపియన్‌షిప్స్ ఏ స్థాయిలో జరిగాయో స్పష్టం చేస్తున్నది. ఎఐబీఏ మాత్రమేకాదు... ఫిఫా, అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) కూడా భారత్‌ను నూతన క్రీడా హబ్‌గా ప్రశంసించడం విశేషం.
ఇప్పుడు జరుగుతున్న హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్ సైతం భారత క్రీడలకు కొత్త దిశానిర్దేశనం చేసేదే. ఒకప్పుడు హాకీ ప్రపంచాన్ని శాసించి, తర్వాత క్రమంగా అథఃపాతాళానికి పడిపోయిన భారత్ ఈ మధ్యకాలంలోనే మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో, వరల్డ్ లీగ్ టోర్నీ భారత హాకీకి సరికొత్త ఊపిరినివ్వడం ఖాయం. మొత్తం మీద వరుస అంతర్జాతీయ టోర్నీలు, చాంపియన్‌షిప్స్‌ను అద్భుతంగా నిర్వహించడం ద్వారా భారత్ కొత్త పుంతలు తొక్కుతున్నది. క్రీడారంగం శరవేగంగా ముందుకు దూసుకెళ్లడానికి దారులు సిద్ధం చేస్తున్నది. ఈ ఒరవడి ఇదే రీతిలో కొనసాగుతుందని ఆశిద్దాం.

- బిట్రగుంట