ఆటాపోటీ

సమర్థుడు.. పద్మభూషణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియాకు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించిన వారిలో కపిల్ దేవ్ తర్వాత సౌరవ్ గంగూలీ పేరు చెప్పుకోవాలి. అతని నుంచి 3ది వాల్2 రాహుల్ ద్రవిడ్‌కు జట్టు పగ్గాలు లభించాయి. సమర్థుడైన బ్యాట్స్‌మన్‌గా భారత్‌ను ఎన్నోసార్లు ఆదుకున్న ద్రవిడ్ కెప్టెన్‌గా అదేస్థాయిలో రాణించలేకపోయాడు. వరుస వైఫల్యాల కారణంగా ద్రవిడ్‌ను తప్పించిన భారత సెలక్టర్లు అతని స్థానంలో అప్పటి యువ వికెట్‌కీపర్ ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఆ క్షణం నుంచే టీమిండియా సరికొత్త ఉత్తేజాన్ని పొందింది. కొత్త రూపాన్ని సంతరించుకుంది. క్రమంగా విజయాల బాట పట్టింది. ప్రపంచ మేటి జట్టుగా ఎదిగింది. 2007లో 26 ఏళ్ల ధోనీకి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పచెప్పడాన్ని ఒక సంచలనంగా పేర్కోవాలి. ఐసిసి ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించడంతో ద్రవిడ్ స్థానంలో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు, చాలామంది సీనియర్ క్రికెటర్లు ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకోవడానికి వెనుకంజ వేశారు. ఆ సమయంలో, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ధోనీ ఎంతో ధైర్యంతో సానుకూలంగా స్పందించాడు. అదే ఏడాది టీ-20 ప్రపంచ కప్‌ను ఐసీసీ ప్రవేశపెట్టింది. దానిని భారత్‌కు అందించి, తన సత్తా ఏమిటో నిరూపించాడు. ఆ తర్వాత అతని సారథ్యంలోనే భారత జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెల్చుకుంది. 1983 తర్వాత మరోసారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. భారత క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో ధోనీకి చోటుదక్కింది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే రెండు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్స్‌తోపాటు చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్‌కు టైటిళ్లను అందించిన ఏకైక కెప్టెన్ ధోనీ. అతని నాయకత్వంలో టీమిండియా 2007లో టి-20 వరల్డ్ కప్‌ను, 2011లో వనే్డ ప్రపంచ కప్‌ను, 2013లో చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అదేవిధంగా అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌ను రెండుసార్లు (2010, 2011) విజేతగా నిలిపాడు. అంతేగాక, అదే జట్టును చాంపియన్స్ లీగ్ టి-20 టోర్నీలోనూ రెండు పర్యాయాలు (2010, 2014) విజయాలను సాధించిపెట్టాడు.
ధోనీకి దక్కిన అవార్డులు, రివార్డులకు లెక్కేలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) రెండుసార్లు (2008, 2009) అతనిని బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఏడుసార్లు (2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014) ఐసిసి వరల్డ్ వనే్డ ఎలెవెన్ జట్టులో స్థానం సంపాదించాడు. 2009, 2010, 2013 సంవత్సరాల్లో అతనికి ఐసిసి టెస్టు టీమ్స్‌లో చోటు దక్కింది. 2007-08 సీజన్‌కు అతను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్ రత్న’ను అందుకున్నాడు. 2013లో ఎల్‌జి పీపుల్స్ చాయిస్ అవార్డును స్వీకరించాడు. 2011లో
డి మోంట్‌ఫోర్ట్ యూనివర్శిటీ ధోనీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు అతనిని వరించింది. ఒక సమర్థుడికి అరుదైన గౌరవం దక్కింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పద్మభూషణ్ అవార్డు వరించింది. వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌తోపాటు చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్‌కు టైటిళ్లను అందించి, ఈ ఘనతను అందుకున్న ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన ధోనీకి భారత మూడో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మభూషణ్‌ను ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) చేసిన ప్రతిపాదనకు అవార్డుల కమిటీ సానుకూలంగా స్పందించింది. దేశానికి అత్యుత్తమ సేవలు అందిస్తున్న అతనిని ఈ పురస్కారంతో గౌరవించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈసారి పద్మ అవార్డులకు బీసీసీఐ ధోనీ పేరును మాత్రమే ప్రతిపాదించింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఈ అవార్డుకు అతనికంటే మెరుగైన వ్యక్తిని తాము సూచించలేమని బీసీసీఐ వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో సచిన్ తెండూల్కర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, చందూ బోర్డే, ప్రొఫెసర్ డిబి దేవధర్, కల్నల్ సికె నాయుడు, లాలా అమర్‌నాథ్‌తోపాటు కెరీర్‌లో 13 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రాజా భలీంద్ర సింగ్, విజయనగరం మహారాజు విజయ ఆనంద్‌కు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఆ జాబితాలో ఇప్పుడు ధోనీ కూడా చేరాడు. అతని పేరును బీసీసీఐ ప్రతిపాదించడంలో, కేంద్రం ఆమోదించడంలో ఎంతమాత్రం పొరపాటు లేదు. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సహజంగా పద్మ అవార్డుల ప్రకటన వెలువడిన వెంటనే, తమను నిర్లక్ష్యం చేశారంటూ పలువురు క్రీడాకారులు విమర్శించడం చాలాకాలంగా జరుగుతున్నదే. కానీ, ధోనీ ఎంపికను ఎవరూ తప్పు తప్పడం లేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. భారత క్రికెట్‌కు సరికొత్త దిశానిర్దేశనం చేసిన క్రికెటర్‌గా, కెప్టెన్‌గా ధోనీ అత్యుత్తమ సేవలు అందించడంవల్లే అతనికి పద్మభూషణ్ అవార్డు రావడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు.
వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్‌గా భారత క్రికెట్‌పై ధోనీ చెరగని ముద్ర వేశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోనుకాకపోవడం అతని ప్రత్యేకత. ఈ లక్షణమే ధోనీకి 3మిస్టర్ కూల్2 అన్న పేరును సార్థకం చేసింది. భారత క్రికెట్‌లో అతను 2004 డిసెంబర్ 23న చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వనే్డ మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. సమారు ఏడాది తర్వాత, 2005 డిసెంబర్ 2నుంచి 6 వరకు శ్రీలంకతో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో టెస్టు క్రికెట్‌లో రంగ ప్రవేశం చేశాడు. మరో ఏడాది అనంతరం, 2006 డిసెంబర్ ఒకటిన అతను జొహానె్నస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై తొలి టీ-20 ఇంటర్నేషనల్ ఆడాడు. కెరీర్‌లో ఇప్పటివరకూ 312 వనే్డలు (268 ఇన్నింగ్స్) ఆడిన అతను 76 పర్యాయాలు నాటౌట్‌గా నిలిచాడు. 9,898 పరుగులు సాధించాడు. అత్యధికంగా 183 (నాటౌట్) పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 10 శతకాలు, 67 అర్ధ శతకాలు ఉన్నాయి. 765 ఫోర్లు, 212 సిక్సర్లు కొట్టిన అతను 293 క్యాచ్‌లు పట్టాడు. 105 స్టంపింగ్స్ చేశాడు. టెస్టు ఫార్మాట్ నుంచి 2014లో రిటైర్మెంట్ ప్రకటించిన అతను 90 మ్యాచ్‌లు ఆడి, 16సార్లు నాటౌట్‌గా నిలిచి, 4,876 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 224 పరుగులు. ఆరు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు సాధించాడు. 544 ఫోర్లు, 78 సిక్సర్లు కొట్టాడు. 256 క్యాచ్‌లు పట్టి, 38 స్టంపింగ్స్ చేశాడు. టీ-20 ఇంటర్నేషనల్స్ విషయానికి వస్తే అతను 86 మ్యాచ్‌లు ఆడాడు. 38 పర్యాయాలు నాటౌట్‌గా నిలిచాడు. 1,364 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 56 పరుగులు. 94 ఫోర్లు, 43 సిక్సర్లు సాధించిన అతను 47 క్యాచ్‌లు పట్టి, 29 స్టంపింగ్స్ చేశాడు.
వికెట్‌కీపర్లు బౌలింగ్ చేయరు. కానీ, ధోనీ చాలా అరుదుగా, సరదాగా బౌలింగ్ చేశాడు. టెస్టుల్లో 96, వనే్డల్లో 36 బంతులు వేశాడు. టెస్టు ఫార్మాట్‌లో 67 పరుగులు ఇచ్చిన అతను వనే్డల్లో 31 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా సాధించడం విశేషం. అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్న అతనికి 2019 వరల్డ్ కప్‌లో ఆడే సత్తా ఉంది. అయితే, అతనిని పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం ద్వారా అతనికి బీసీసీఐ పరోక్షంగా రిటైర్మెంట్ హెచ్చరికలను పంపిందన్న వాదన వినిపిస్తున్నది. ఏదిఏమైనా ఒక ప్రతిభావంతుడికి సరైన గౌరవం, గుర్తింపు లభించడం సంతోషకరం.

-విశ్వమిత్ర