అనంతపురం

కాగితాల్లోనే యువజన సంఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 19 : ఒకప్పుడు గ్రామాల్లో యువజన సంఘాలు గ్రామాభివృద్ధి, అటవీ సంరక్షణ, సేవా కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర పోషించేవి. తమ గ్రామానికి ఏదో ఒక మంచి పనిచేయాలన్న తపన ఉండేది. ఈక్రమంలో కొందరు సొంతంగా యువజన సేవా సంఘాలను ఏర్పాటు చేసుకుని, వాటిని రిజిస్టర్ చేయించుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల కోసం ప్రయత్నాలు చేసేవి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం యువశక్తిని వినియోగించుకునే దిశగా ప్రోత్సాహకాలు ఇచ్చి ఆర్థిక వెసులుబాటు కల్పించేది. అలాగే గ్రామాల్లో యువ శక్తిని సద్వినియోగం చేసుకుని వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యువజన సంఘాలను ఏర్పాటుచేస్తోంది. ఒక్కో గ్రామంలో ఒకటి, లేదా రెండు చొప్పున ఔత్సాహిక యువకులను కార్యవర్గంలో కనీసం 7 మంది నుంచి 10 మంది వరకు సభ్యులుగా గుర్తించి సంఘాల్ని ఏర్పాటు చేయడం పరిపాటి. జిల్లాలో కొంతమంది సేవా దృక్పథం కలిగి ఉన్న యువత వారే స్వచ్ఛందంగా యువజన సంఘాలను ఏర్పాటుచేసుకుంటూ రిజిస్టర్ చేయించుకుంటున్నారు. వీరితోపాటు నెహ్రూ యువ కేంద్రం, డిస్ట్రిక్ట్ స్పోర్ట్ అథారిటీ, యువజన సంక్షేమ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ప్రధానంగా యువజన సంఘాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వివిధ విభాగాల పరిధిలో 300 పైగా చురుగ్గా పనిచేస్తున్న సంఘాలున్నట్లు అంచనా. అయితే తగిన ప్రోత్సాహం, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం లేకపోవడంతో సేవా కార్యక్రమాల్లో తమవంతు భాగస్వామ్యం కల్పించేందుకు గ్రామీణ యువత ముందుకు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగ యువత ఏదో ఒక ఉపాధిని వెతుక్కుంటూ వెళుతుండటంతో గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న యువజన సంఘాలు నిర్వీర్యమై పోతున్నట్లు సమాచారం. గ్రామాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలో యువజన సంఘాలను బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమైనప్పటికీ, వాటిని బలోపేతం చేసే ప్రణాళికగానీ, భరోసాగానీ లేకపోవడంతో సేవా కార్యక్రమాల్లో ఆసక్తి ఉన్నా యువత ముందుకు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్‌వంటి కార్యక్రమాలకు కొంతైనా ఆదరణ కల్పించి నామమాత్రంగానైనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, యువజన సర్వీసుల శాఖ ద్వారా ఏర్పాటుచేస్తున్న సంఘాలకు దిక్కూ మొక్కూ లేకుండా పోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాలకు వెళ్లి అధికారులు సంఘాలను ఏర్పాటుచేయించడానికి సైతం వెనుకంజ వేస్తున్నారు. గ్రామాల్లో ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయాలన్న ఉద్దేశం యువతకు ఉన్నా, కనీస ఖర్చులకు కూడా ప్రభుత్వం పైసలు విదల్చడం లేదని, దీంతో యువత సైతం ఉచిత సేవలు చేయడమే కాకుండా, చేతి నుంచి డబ్బు ఖర్చు చేసుకోవడం మా వల్ల కాదంటూ సంఘాలుగా ఏర్పడటానికి విముఖత చూపుతున్నారు. యువజన సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలతో, ఒత్తిడి మేరకు గ్రామాలకు వెళ్లే అధికారులకు మొహమాటం లేకుండా తమ వైఖరిని వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఏదో విధంగా సంఘాలను ఏర్పాటు చేద్దామనుకున్నా, సంబంధిత సిబ్బందికి టీఏ బిల్లులు సైతం ఏళ్లుగా ఇవ్వకపోవడంతో సొంత ఖర్చులు పెట్టుకోలేక, చేతిచమురు వదిలించుకోలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయిలోనూ, ముఖ్యమంత్రి పర్యటనలతోపాటు వివిధ కార్యక్రమాల్లో యువతను భాగస్వాముల్ని చేసేందుకు ఈ సంఘాలు దోహదపడుతుంటాయి. ఈ సంఘాల వారిని ఇతర జిల్లాలకు పంపించి అక్కడి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ అధిక శాతం యువజన సంఘాల సభ్యులు భాగస్వాములయ్యేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తుండటం పరిపాటి. తమను ఉచిత సేవలకే పరిమితం చేయకుండా, మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్న స్థాయిలో కాకున్నా, కనీసం గ్రామస్థాయిలో తమకంటూ గుర్తింపు ఉండేలా కొంత ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ వివిధ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇస్తే ఉత్సాహంగా పనిచేస్తామంటూ యువత కోరుకుంటుండటం విశేషం.