కథ

తోడు-నీడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(కథల పోటీలో ఎంపికైన రచన)

మామ్మగారేం చేస్తున్నారో?’ వంటింట్లోకి తొంగి చూస్తూ అన్నాడు నరసింహం.
‘తాతగారికి చపాతీ కూర చేస్తున్నారు...’ ముసిముసిగా నవ్వుకుంటూ, బాణలిలో కూర కలియబెడుతూ అన్నది సుభద్ర.
‘ఏం కూరో?’ అడిగాడు నరసింహం వంటింట్లోకి ఆమె దగ్గరగా వస్తూ.
‘మిక్స్‌డ్ వెజిటబుల్స్...’ తల తిప్పి చూసి చెప్పిందామె నవ్వుతూనే.
‘ఏం వెజిటబుల్స్?’ బాణలిలోకి తొంగి చూస్తూ అడిగాడు.
‘రెండు క్యారెట్లు, రెండు బంగాళా దుంపలు, రెండు టొమాటోలు, కాసిన్ని బీన్సున్నూ..’ కూర కలియబెడుతూనే ఓసారి అతడికేసి చూసి చెప్పిందామె.
‘్భషయిన ఆధరవన్నమాట!’
‘పార్కులో తాతగారి వాకింగులూ గట్రా అయ్యాయా?’ మళ్లీ తల తిప్పి అతడికేసి చూసి అడిగింది నవ్వును పెదాల మధ్య దాచుకుంటూ సుభద్ర.
‘అయ్యిందిలే గానీ.. నువ్వలా వంటచేస్తూ, ఓరగా ఇటు తిరిగి చూస్తుంటే భలే బాగున్నావే సుబ్బూ..!’ దగ్గరకొచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు నరసింహం.
‘చాల్లెండి సంబడం.. నలభయ్యేళ్ల కాపురంలో ఈ మాట వేల సార్లు విన్నాను..’ నవ్వుతూనే, అతడికేసి మరోసారి ఓరగా చూస్తూ అన్నదామె.
‘ఎన్నివేల సార్లన్నా నాకు మాత్రం కొత్తగానే ఉంటుందే సుబ్బూ..’ ఆమెను తనవైపు తిప్పుకుని అన్నాడు.
‘పిచ్చిమాలోకం..’ గొణిగినట్లు అని, ‘వెళ్లి హాల్లో కూర్చోండి... కూర అయ్యింది.. ఓ అరగంటాగి చపాతీలు చేస్తాను. వేడివేడిగా తిందురుగాని..’ అతడి చెంప మీద చిన్నగా మీటింది. ఆ చేష్టతో నరసింహం క్షణకాలం ముప్పయ్యేళ్ల కుర్రాడయిపోయాడు. అతడి వాలకం గమనించిన సుభద్ర అన్నది, ‘మిమ్మల్నే.. హాల్లోకి వెళ్లమన్నానా?’ నవ్వుతూ గదమాయించింది. అతడూ నవ్వేశాడు. అలాగే అన్నట్లు తల ఊపి, ఆనందంగా భార్యకేసి చూసి, హాల్లోకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు నరసింహం.
వాళ్లిద్దరి మధ్యా ప్రతిరోజూ ఈ పరిహాసపు పలకరింపులు, ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటాయి. అంతలోనే చిన్నపిల్లల్లా అయిపోతారు. మరి కొంతసేపటికి పిల్లల తల్లిదండ్రుల్లా, ఇంకాస్సేపటికి వయస్సు మీద పడ్డవాళ్లల్లా అయిపోతారు.
సుభద్ర సరదా అయిన మనిషి. ఎవరితో అయినా కలివిడిగా మాట్లాడుతుంది. ఆమెకు అసూయ పడ్డాలు, అయ్యో మనకి లేదే అని దిగులు పడ్డాలూ లేవు. ఎదుటివాడిని ప్రేమించడం, వారిలో ఉన్న మంచితనాన్ని మాత్రమే చూడడం అన్నది ఆమె చిన్నతనంలో నేర్చుకున్న మంచి గుణం. ఎక్కడికక్కడే సర్దుకు పోతుంటే జీవితం చాలా హాయిగా ఉంటుందన్నది ఆమె సిద్ధాంతం.
ఆ మాటకొస్తే నరసింహమూ సరదా అయిన మనిషే. జీవితంలో సరదాని, సందడినీ, వెతుక్కుని వాటిని అనుభవించి, ఆనందించాలంటాడు నరసింహం. ఆవేమీ తనకి లేవంటూ స్తబ్దంగా కూర్చుంటే జీవితంలో అంతకంటే నిస్సారం మరేం లేదంటాడు.
అంత పల్లెటూరూ, పట్నవాసమూ కాని మధ్యస్తంగా ఉన్న ఆ ఊళ్లో ఇప్పుడు తాముంటున్న ఓ చిన్న డాబా ఇల్లు మినహా నరసింహానికి పెద్దలిచ్చిన ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. డిస్పాచ్ క్లర్క్‌గా తాలూకా ఆఫీసులో ఉద్యోగంలో చేరి, బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి, ఏడేళ్ల క్రిందటే ఆఫీసరుగా పదవీ విరమణ చేశాడు.
ఇద్దరు మగపిల్లలు పుట్టాక, ఇక ఫుల్‌స్టాప్ పెట్టేద్దామనుకుంటుండగా ఆడపిల్ల పుట్టేసింది. మగపిల్లలిద్దరూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. కోడళ్లిద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. రెండేళ్ల క్రిందటే కూతురికి పెళ్లి చేశాడు నరసింహం. అల్లుడు కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగే. కూతురికి ఉద్యోగం చెయ్యాలని ఉన్నా అవసరం లేదన్నాడు అల్లుడు. కూతురూ, అల్లుడూ బెంగుళూరులో ఉంటారు.
‘రిటైరయ్యారు.. ఇంక ఆ పల్లెటూళ్లో ఏం అవస్థ పడతారు.. హాయిగా మా దగ్గరికి వచ్చేయండి నాన్నా.. అమ్మా నువ్వూను..’ అంటారు పిల్లలు.
పుట్టి పెరిగిన ఊరూ, తాతలనాటి ఇల్లూ - లాంటి విపరీతమైన సెంటిమెంట్లు ఏమీ లేవు నరసింహానికి. పరిస్థితులకు తగ్గట్టు, అవసరానికి అనుగుణంగా జీవితాన్ని మలచుకోవాలని, సాధ్యమైనంత వరకు సర్దుకుపోవటం అలవాటు చేసుకోవాలన్నది నరసింహం సిద్ధాంతం. తన సంతానానికీ అదే బోధిస్తూ వచ్చాడు. ఒక విధంగా పిల్లలూ అలాగే పెరిగారు.
పోనీ పిల్లలు కోరినట్లు తామిద్దరూ వెళ్లి వాళ్ల దగ్గరే ఉందామా అనుకున్నాడు నరసింహం. భార్య సుభద్రతో ఆలోచించాడు. తాము వాళ్ల మీద ఆధారపడటం అంటూ లేదు. తనకు పెన్షన్ వస్తుంది. అందులోంచి ఎంతో కొంత వాళ్ల చేతిలో పెట్టక మానదు.
భర్త ఆలోచనకి ఏం చెప్పాలో సుభద్రకు తోచలేదు. పిల్లల దగ్గరికి వెళ్లి ఉండాలంటే అందులో పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు. కానీ ఏదో సన్నటి పొర ఆమె మనసుని కప్పేస్తున్నట్లుంది.
‘ఏమంటావు సుబ్బూ?.. వాళ్ల దగ్గరకు వెళ్లిపోదామా? పెద్దాడు మరీమరీ అడుగుతున్నాడు..’ భార్య ముఖంలోకి చూసి అడిగాడు నరసింహం.
‘మీ ఇష్టం...’ అన్నదామె క్షణం పోయాక. అంతకు మించి ఆమె ఇతమిత్థంగా ఎటూ చెప్పలేకపోయింది.
‘నా ఇష్టం కాదే.. స్పష్టంగా నీ అభిప్రాయం చెప్పు..’ అంటూ భార్యని సూటిగా అడిగాడు.
‘ఇందులో స్పష్టంగా చెప్పడానికేం ఉందండి? వాళ్లంతటా రమ్మంటుంటే మనం ఆలోచించాల్సిందేం ఉంది.. వెళదాం..’ అన్నదామె నవ్వుతూ.
పిల్లల దగ్గరికి వెళ్లి ఉండాలని భర్త ఉబలాట పడుతున్నాడని అనుకున్నదామె. భార్య అలా చెప్పిన తర్వాత, రెండు రోజులు తర్జనభర్జన పడ్డాడు నరసింహం. తన స్నేహితులతో చెప్పాడు ‘హైదరాబాద్ వెళ్లిపోతున్నాం’ అని. ‘అయితే పిల్లల దగ్గరికి వెళ్లిపోతున్నారన్నమాట ఊరొదిలి?..’ తనకి దూరపు బంధువు, పొరుగింటి వెంకట్రావు అన్నాడు.
‘వాళ్లు మరీమరీ అడుగుతున్నారు మరి.. అయినా ఇక్కడ మాత్రం చేసేదేముంది కనక?!’ నరసింహం చెప్పాడు.
‘అదృష్టవంతుడివిరా!.. మా త్రాష్టుడూ ఉన్నాడు.. ఎందుకూ?.. మాట వరసకైనా నా దగ్గరికి వచ్చి ఉండండి నాన్నా.. అనడు’ ఒకింత బాధగా అన్నాడు వెంకట్రావు.
త్రాష్టుడు అన్నది అతడి కొడుకు నుద్దేశించి అని నరసింహానికి అర్థమయింది. వెంకట్రావు కొడుకు విశాఖపట్నంలో బ్యాంకులో ఉద్యోగస్థుడు. కోడలికి, అత్తగారికి పడదని సుభద్ర చెప్పగా విన్నాడు నరసింహం.
‘దేనికైనా పెట్టి పుట్టాలిరా.. నువ్వు అదృష్టవంతుడివి..’ అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు వెంకట్రావు. అతడి పరిస్థితికి జాలి, తన పరిస్థితికి సంతృప్తి క్షణంపాటు ఉక్కిరిబిక్కిరి చేశాయి నరసింహాన్ని. తన పిల్లలు మాట వరుసకు పిలిచినట్లుగా లేదనిపించిందతడికి. అందుకే భార్యతో సహా బయల్దేరాడు నరసింహం.
* * *
‘మీరు ఇంత తొందరలో ఆ ఊరు వదిలి వస్తారనుకోలేదు నాన్నా! ఇప్పటికైనా వచ్చారు చాలా సంతోషం. లక్కీగా తమ్ముడు కూడా ఈ రోడ్డులోనే ఆ చివర ఉన్న అపార్ట్‌మెంటులో చేరాడు. మీకు ఇక్కడ బోర్‌గా ఉంటే, అక్కడికి, అక్కడ బోర్ అనిపిస్తే ఇక్కడికీ సరదాగా అటూ ఇటూ తిరుగుతూ కాలక్షేపం చెయ్యొచ్చు. సాయంత్రాలు ఆ పక్కనే ఉన్న పార్కులో కూర్చోవచ్చు. హాయిగా టీవీ చూసుకోండి. అన్నట్లు పార్కులో లైబ్రరీ కూడా ఉంది. మార్నింగూ, ఈవినింగూ మీరు మీకు కావాల్సిన పుస్తకం చదువుకోవచ్చు’ అన్నాడు పెద్ద కొడుకు భాస్కరం రెండో రోజు ఉదయం కాఫీ తాగుతూ, అవునన్నట్లు కోడలు కమల నవ్వుతూ తలూపింది.
‘అలాగేరా’ అన్నట్లు నరసింహం కూడా తలూపాడు. సుభద్ర అభావంగా కూర్చుండిపోయింది. అప్పటికి కమల మినహా అందరూ కాఫీలు తాగారు. మనవడు నరేష్ వచ్చి తాత ప్రక్కన కూర్చున్నాడు. సుభద్ర లేచి వెళ్లి వాడికి పాలు కలిపి తెచ్చించింది. అప్పుడు కమల వాష్‌బేసిన్ దగ్గర బ్రష్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఇంతలో కోడలికి కాఫీ కలిపి సిద్ధం చేసింది సుభద్ర. కమల కాఫీ తాగడం పూర్తయ్యాక సుభద్ర అడిగింది. ‘ఏం కూర తరగమంటావే’ అని. సమాధానంగా ‘మీ ఇష్టం’ అనేసి తన గదిలోకి వెళ్లింది కమల.
ఫ్రిజ్ తీసి చూసింది సుభద్ర. కొడుకు గుత్తి వంకాయ కూర అంటే ఇష్టంగా తింటాడు. వంకాయలు తరగడానికి కత్తిపీట ముందు కూర్చుంటూ అడిగింది సుభద్ర కోడల్ని, ‘కూరలో కారం ఉందే కమలా?’ అని.
‘మిక్సీలో వేస్తాను...’ గదిలోంచే సమాధానం చెప్పింది కమల.
‘ఇప్పుడు కారాలు, పొడులూ ఎక్కడ చేసుకుంటున్నారే అమ్మా.. అన్నీ అమ్ముతున్నారు. దొరకనిదంటూ ఏదీ లేదు.. అసలు అవన్నీ ఇంట్లో చేసుకోవడానికి టైమేదీ.. ఎక్కడలేని టైమూ ఉద్యోగాలతోటే సరిపోతోంది..’ అన్నాడు కొడుకు భాస్కరం.
‘అంతే! అంతే!..’ అన్నాడు నరసింహం. సుభద్ర విననట్లే వౌనంగా కూర తరగడంలో నిమగ్నమయింది.
‘ఎంత ముందుగా బయల్దేరినా ఈ ట్రాఫిక్ జామ్‌లతో టైమంతా వేస్టయిపోతోందనుకో నాన్నా.. ఇంట్లోంచి బయటికి వెళ్లిన దగ్గర్నుంచీ ఇంటికి చేరేవరకూ గుండెలు దడదడలాడుతున్నాయనుకో..’ భాస్కరం అన్నాడు.
‘అవున్రా!.. సిటీలైఫ్ అంటే అంతే...’ నరసింహం అన్నాడు పెదవులు సాగదీసి. ఈసారీ సుభద్ర అవేవీ విననట్లు ఉండిపోయింది.
ఇంతలో కమల గదిలోంచి బయటికి వచ్చి, గీజర్ ఆన్ చేసి, కిచెన్‌లోకి వెళ్లి కుక్కర్ స్టౌ మీద పెట్టింది. వెళుతూ భర్త భాస్కరం కేసి చూసింది. ఆ చూపులు అతడు అర్థం చేసుకున్నాడు. కుక్కర్ మూడు కూతలొస్తే ఆపేయండి అన్న సంకేతం అని అతడికి తెలిసిన విషయమే. కమల బాత్‌రూమ్ నుంచి వచ్చేలోగా సుభద్ర కూరకి అన్నీ సిద్ధం చేసింది. పావుగంటయ్యాక భార్య పిలిస్తే కిచెన్‌లోకి వెళ్లిన భాస్కరం టిఫిన్ ప్లేట్లు తెచ్చి తల్లికి, తండ్రికి ఇచ్చాడు. ఎనిమిదిన్నరకి కొడుకుని సిద్ధం చేసి కానె్వంట్ బస్సు ఎక్కించి వచ్చాడు భాస్కరం. తొమ్మిదిన్నరకి బాక్స్‌లు సర్దుకుని ఆదరాబాదరా టిఫిన్ తినేసి భాస్కరం, కమల వెళ్లిపోయారు.
‘గాలివాన వెలిసిందోయ్..’ నవ్వుతూ అన్నాడు నరసింహం. నవ్వి ఊరుకున్నది సుభద్ర.
‘ఇద్దరూ ఉద్యోగాలన్నప్పుడు ఈ జంఝాటన తప్పదు సుబ్బూ.. పాపం దూరం వెళ్లాలి.. పోనీ దగ్గర్లో ఇళ్లు తీసుకుందామంటే అద్దెలు ఎక్కువ.. జీవన పోరాటంలో ఈ వెంపర్లాట తప్పదు..’ స్వగతంలా అనుకున్నాడు నరసింహం.
‘అంతేలెండి.. రెండు జీతాల్లేకపోతే ఈ సిటీలో బ్రతకడమూ కష్టమే మరి!’ సుభద్ర కూడా స్వగతంగానే అన్నది.
ఆ సాయంత్రం ఏడుగంటలప్పుడు చిన్నకొడుకు విశ్వం, అతడి భార్య భావన వచ్చారు. అప్పటికి భాస్కరం, కమల కూడా ఆఫీసు నుంచి వచ్చేశారు.
‘ఏరా! ఎలా ఉన్నారు?.. ఆఫీసు నుంచేనా రావడం?’ నరసింహం అడిగాడు కొడుకు విశ్వాన్నీ, కోడలు భావననీ.
‘అవున్నాన్నా.. ఆఫీసు నుంచే.. మార్నింగ్ హడావిడి కదా..’ చెప్పాడు విశ్వం. మర్యాదకి అత్తగారిని పలకరించింది భావన. తోటికోడలు ఇచ్చిన మంచినీళ్లు తాగి ఆమెతో గదిలోకి వెళ్లింది. హాల్లో తండ్రీ, కొడుకులు, తల్లీ కూర్చున్నారు. అవీ ఇవీ మాట్లాడుకుంటూ. తోటికోడళ్లిద్దరూ గదిలో కూర్చున్నారు. ఇరవై నిమిషాలయినా వాళ్లు బయటికి రాలేదు. కబుర్లలో మునిగిపోయారు. ఆ ధోరణి సుభద్రకి అదోలా అనిపించింది. మనస్సు కాస్త చివుక్కుమనీ అనిపించింది.
మరో పావుగంటకి గదిలోంచి బయటికి వచ్చారు తోటికోడళ్లిద్దరూ. భావన బయటికి రాగానే విశ్వం లేస్తూ అన్నాడు ‘వస్తాం నాన్నా.. అమ్మా..’ అని.
‘కొంచెం కాఫీ ఇస్తాను వస్సూ’ అన్నది కమల.
‘వద్దొదినా.. భోజనం చేసే టైము కదా..’
వెళుతూ భావన అత్తగారికేసి, మామగారికేసీ చూసింది. ఆ చూడ్డమే వెళ్లొస్తాం అని చెప్పడం.. అనుకున్నది సుభద్ర. కొడుకు కనీసం ‘మా ఇంటికి రండి..’ అని కూడా అనకపోవడం సుభద్రకి మళ్లీ మనస్సు చివుక్కుమనక తప్పలేదు. వాళ్లు వెళ్లాక కమల భర్త భాస్కరం కేసి చూసి కనుబొమలెగరేసింది. తనను ఎవరూ గమనించలేదనుకున్నది కానీ, సుభద్ర దృష్టిలో పడ్డాయి. ‘మీ అమ్మనీ, నాన్ననీ కనీసం రమ్మని కూడా అనలేదు మీ తమ్ముడు...’ అన్నట్లు ఆ చూపులు సుభద్రకి అర్థమయ్యాయి. నరసింహం మనస్సులోనూ కెలికినట్లనిపించింది. కానీ దృష్టి టీవీ మీదకి మళ్లించాడు. అలా నాలుగు రోజులు గడిచిపోయాయి.
మర్నాడు ఆదివారం కావడంతో ఉదయం చిన్న కొడుకు విశ్వం ఇంటికి వెళ్లొస్తామని నరసింహం దంపతులు బయల్దేరారు. భాస్కరం కూడా వచ్చి ఇల్లు చూపించాడు. హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న విశ్వం, తల్లిదండ్రుల్ని చూసి, ‘రండి నాన్నా..’ అంటూ హడావిడి చేశాడు. వచ్చింది ఎవరో తెలిసినా గదిలో ఉన్న భావన బయటికి రాలేదు. భాస్కరం పది నిమిషాలు కూర్చుని వెళ్లిపోయాడు. మరో పది నిమిషాలకి భావన బయటికి వచ్చి అత్తామామల్ని చూసి పలకరింపుగా నవ్వింది. ఐదు నిమిషాలు పోయాక రెండు గ్లాసులలో కాఫీలు తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. ‘తీసుకోండి నాన్నా..’ అన్నాడు విశ్వం. తర్వాత దాదాపు పావుగంటసేపు ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. భావన కిచెన్‌లో ఏదో చేస్తూండిపోయింది. టీవీలో ఏదో వస్తుంటే విశ్వం చూస్తున్నాడు.
‘ఏమిట్రా విశేషాలు?.. ఆఫీసు అదీ బావుందా?’ వౌనంగా కూర్చోవడం ఇష్టం లేకన్నట్లు అడిగాడు నరసింహం.
‘ఏమున్నాయ్ నాన్నా.. మామూలే.. ప్రొద్దున్న లేచిన దగ్గర్నుంచీ ఉరుకులు పరుగుల జీవితం.. మంచీ చెడూ మాట్లాడుకోవడానికే టైముండడం లేదు.. ఏం చేస్తాం తప్పదు.. ఇక్కడ ఖర్చులు తట్టుకోవాలంటేనూ.. పది మందిలో కాస్త గౌరవంగా బతకాలంటేనూ.. ఇద్దరూ ఉద్యోగాలు చెయ్యకా తప్పదు..’ విశ్వం చెప్పుకొచ్చాడు.

అవునన్నట్లు నరసింహం తలూపాడు. సుభద్ర అభావంగా విని ఊరుకుంది. ఇంతలో మనవరాలు సౌమ్య వచ్చి నానమ్మ పక్కన చేరింది. సౌమ్యను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది సుభద్ర. నరసింహం తన బ్యాగ్‌లోంచి స్వీట్ పాకెట్ తీసి ఇచ్చాడు మనవరాలికి. సుభద్ర పాకెట్ మూత తీసి స్వీట్ తీసుకో అని నవ్వుతూ మనవరాలికి అందించింది.
‘ప్రొద్దునే్న స్వీట్లు తింటూ కూర్చోకు.. బుక్స్ సర్దుకుని రెడీ అవ్వాలి.. బస్సు మిస్సవుతుంది..’ కిచెన్‌లోంచి అరిచింది భావన. దాంతో ‘తర్వాత తింటాలే బామ్మా’ అనేసి బాత్‌రూమ్‌కి వెళ్లిపోయింది సౌమ్య. సుభద్ర మనస్సు చివుక్కుమన్నది. భర్త కేసి చూసింది సుభద్ర.
‘సాయంత్రం తింటుందిలే అమ్మా.. స్కూలు బస్సుకి అందుకోవాలి..’ విశ్వం అన్నాడు. ఇంక ఆ విషయం మీద తర్కించాలనుకోలేదు నరసింహం.
అలా మరో ఇరవై నిమిషాలు గడిచిపోయాయి. ముగ్గురూ ఒకటీ అరా మాట్లాడుకున్నారు. భావన కిచెన్‌లోనే ఉండిపోయింది ఏదో చేస్తూ. కాస్సేపటికి రెండు ప్లేట్లల్లో ఉప్మా తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. మరో ప్లేటు తెచ్చి భర్తకీ ఇచ్చింది. తను కూడా తెచ్చుకుని అక్కడ వాళ్లతో కూర్చుంటుందేమోనని ఎదురుచూసింది సుభద్ర. కానీ, భావన ఉప్మా ప్లేటుతో తన గదిలోకి వెళ్లిపోయింది.
తమకి కాఫీ, టిఫిన్లు పెట్టడం కాదు.. సరదాగా వచ్చి తమతో కబుర్లు చెప్పడం ఆమె కోరుకుంటుంది. కానీ.. భావన దగ్గర అది లేదు. పెద్ద కోడలు కమల ధోరణీ అలాగే ఉన్నా, మరీ అంత కాదు. అప్పుడప్పుడు అత్తయ్యా అని పిలుస్తుంది. ఒకటీ అరా మాట్లాడుతుంది. భావన ధోరణి అందుకు పూర్తి వ్యతిరేకం. ఇద్దరి మధ్యా శత్రుత్వం ఉన్నట్లు అసలు మాట్లాడదు. అయితే సమయానికి ఉద్యోగ బాధ్యత అన్నట్లు అమర్చి పెడుతుంది. కాపురానికొచ్చిన కొత్తల్లో ఫర్వాలేదనిపించినా, రానురాను ఆమె ప్రవర్తనలో ఈ ధోరణి వచ్చేసింది.
అందుక్కారణం ఏమిటో సుభద్రకి అర్థం కాలేదు. భర్త నరసింహం దగ్గర ఈ విషయం చెప్పుకుని బాధపడింది.
ఇంతలో భావన కుక్కర్ పెట్టి స్నానానికి వెళ్లింది. ఆమె బాత్‌రూము నుంచి వచ్చాక విశ్వం స్నానానికి వెళ్లాడు. సుభద్ర, నరసింహం అలా సోఫాలోనే కూర్చున్నారు. కాస్సేపయ్యాక ఇక బాగుండదని సుభద్ర లేచి కిచెన్‌లోకి వెళ్లి ‘ఏమన్నా కూర తరగమంటావా భావనా..’ అనడిగింది.
‘అబ్బే అవసరం లేదు... వంట అయిపోయింది..’ అన్నది భావన కనీసం అత్తగారి ముఖమైనా చూడకుండా.
టైము తొమ్మిది గంటలు దాటుతోంది. హడావిడిగా విశ్వం బట్టలు మార్చుకుని హాల్లోకి వచ్చాడు. అప్పటికి భావన ఇద్దరికీ లంచ్ బాక్స్‌లు సర్దేసింది.
‘నాన్నా మాకు ఆఫీసుకు వెళ్ళే టైమవుతోంది.. మీరు అన్నయ్యా వాళ్లింటికి వెళతారా?..’ అడిగాడు విశ్వం తండ్రిని.
నరసింహానికి ఏమనాలో అర్థం కాలేదు. చిన్న కొడుకు దగ్గర ఓ రెండు రోజులు ఉందామనే వాళ్లు వచ్చింది. కొడుకు అలా అడిగేసరికి వౌనంగా లేచాడు నరసింహం. సుభద్రకి చచ్చేంత అవమానంగా అనిపించింది.
‘అక్కడ అక్కయ్య వంట చేసే ఉంటుందని నేను వండలేదు..’ భర్తకేసి చూస్తూ భావన అన్నది.
భార్యతో నరసింహం బయటికి వచ్చాడు చిన్న బ్యాగు భుజాన తగిలించుకుని. వాళ్లు వచ్చేసరికి పెద్దకొడుకు భాస్కరం, కోడలు కమల ఆఫీసుకు వెళ్లడానికి తలుపు వెయ్యబోతున్నారు. తల్లినీ, తండ్రినీ చూసి క్షణం ఆగాడు.
‘వాళ్లు ఆఫీసుకి వెళ్లార్రా..’ అన్నాడు నరసింహం.
‘మరి మీ భోజనం?’ అడిగాడు భాస్కరం.
‘అయ్యో మీరు అక్కడ తింటారని నేను వండలేదు..’ కమల అన్నది చిన్నగా.
‘్ఫర్వాలేదమ్మా.. మీరు వెళ్లండి.. ఎంతసేపు.. నేను వండుతానే్ల..’ సుభద్ర చెప్పింది. కొడుకూ, కోడలూ ఆఫీసుకు వెళ్లిపోయారు.
లోపలికి వచ్చి నరసింహం కుర్చీలో కూలబడిపోయాడు. వౌనంగా సుభద్ర పక్కనే ఉన్న మరో కుర్చీలో కూర్చుంది. భార్య ముఖం చూడ్డానికి నరసింహానికి ధైర్యం చాలలేదు. చిన్నతనంగా అనిపించింది. చిన్న కొడుకు దగ్గరికి వాళ్లు పొద్దునే్న వెళ్లారు. అప్పటికింకా స్టౌ కూడా వెలిగించలేదు. వేళ దాటినప్పుడు వెళితే అక్కడ తమ కోసం వంట చెయ్యలేకపోవచ్చు. కానీ.. చిన్న కోడలు ప్రవర్తన, కొడుకు ఉదాసీనత.. అతడి మనస్సు కలచివేశాయి. కాస్సేపయ్యాక సుభద్ర లేచి కిచెన్‌లోకి వెళ్లింది తమ కోసం వంట చెయ్యడానికి.
అలా ఓ పది రోజులు భారంగా గడిచిపోయాయి ఆ దంపతులిద్దరికీ. మధ్యలో ఓ ఆదివారం విశ్వం ఇంటికి భోజనానికి వెళ్లారు. అలా వెళ్లినప్పుడు, ‘రేపు ఫస్టు నుంచి మీరిద్దరూ ఇక్కడికి వచ్చెయ్యండి నాన్నా.. కొన్నాళ్లు పోయాక అన్నయ్య దగ్గరికి వెళ్దురుగాని..’ అన్నాడు విశ్వం. ఆ పిలుపు, పిలుపులో ఉన్న ఉద్దేశం నరసింహానికి బాగానే అర్థమయింది. అంటే తమను కొన్నాళ్లు, పెద్ద కొడుకు, మరి కొన్నాళ్లు చిన్న కొడుకు పంచుకుని ఉంచుకుంటారన్న మాట- అనుకున్నాడు.
పోనీ అదీ మంచిదే. తాము ఒక్కరి మీదనే ఆధారపడితే ఎలా..?! అనీ సరిపెట్టుకున్నాడు. మరో పది రోజులు గడిచాక చిన్నకొడుకు విశ్వం ఇంటికి వచ్చారు నరసింహం, సుభద్ర. తల్లిదండ్రీ అలా వెళుతున్నప్పుడు పెద్దకొడుకు భాస్కరం అన్నాడు నవ్వుతూ, ‘అక్కడ బోరుగా అనిపిస్తే ఇటు వచ్చెయ్యండి నాన్నా’ అని. ఆ మాటకి నరసింహం నవ్వుకున్నాడు. ఆ నవ్వులో హుషారు లేదు. నిర్వేదం ఉంది.
రోజులు భారంగా గడుస్తున్నట్లనిపిస్తున్నాయి ఆ దంపతులకి. ఓ నెల రోజులు గడిచిపోయాయి. కానీ వాళ్లకి మాత్రం ఇంకా నెల కూడా కాలేదా తాము వచ్చి అన్నట్లుంది. అటు అంటీ ముట్టనట్లు మాట్లాడే పెద్ద కోడలు కమల, ఇటు అస్సలు మాటామంతీ లేని చిన్నకోడలు భావన.. ఇద్దర్నీ సుభద్ర బేరీజు వేసుకుంది. పేర్లూ, హోదా వేరైనా, ఇద్దరి తత్వం ఒకటే అనిపించిందామెకు. నెల మీద పదిరోజులు గడిచేసరికి ఓ రోజు ఆఫీసుకు వెళుతూ భాస్కరం, ‘నాన్నా..’ అని ఏదో చెప్పబోయాడు. నరసింహానికి అర్థమయింది అతడేం చెప్పాలనుకుంటున్నాడో.
‘రేపు అన్నయ్య ఇంటికి వెళతాంరా..’ అన్నాడు నరసింహం.
‘సరేసరే!...’ అన్నాడు విశ్వం. నరసింహం మళ్లీ నవ్వుకాని నవ్వుకున్నాడు.
చిన్నకోడలు, కొడుకూ ఆఫీసుకు వెళ్లిపోయాక భర్తకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నది సుభద్ర. ‘ఇక్కడ ఉండడం మనకి అవసరమా?’ అని. వెంటనే నరసింహం ఏ సమాధానమూ చెప్పలేదు. ఆమె భర్త ముఖంకేసి చూసింది.
‘ఎంత మాత్రం అవసరం లేదు సుబ్బూ..’ నరసింహం అన్నాడు.
‘మరయితే టిక్కెట్ బుక్ చెయ్యండి మన ఊరు వెళ్లిపోదాం..’ చాలా సౌమ్యంగా అన్నదామె.
‘మన పిల్లలు చాలా తెలివైన వాళ్లే సుబ్బూ.. లౌక్యం బాగా నేర్చుకున్నారు..’ నరసింహం ఏదో చెప్పబోయాడు.
‘పోనీలెండి.. ఇప్పటి పరిస్థితులకి అది చాలా అవసరం కదా!..’ అన్నదామె.
‘ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయాక కూడా మనం ఇంకా ఏదో కావాలని ప్రాకులాడటం అత్యాశే అవుతుంది.. ఎవరి జీవితం వాళ్లది.. ఎవరి కుటుంబం వాళ్లది.. ఎవరి పద్ధతులు వాళ్లవి..’ స్వగతంగా అన్నాడు నరసింహం.
‘అంతేకదా!.. బట్టలు సర్దుతాను..’ అంటూ లేచిందామె.
* * *
‘ఏంటి నరసింహం అప్పుడే వచ్చేశావ్? అక్కడే ఉంటావనుకున్నాను..’ తమ ఇంటికి వచ్చిన మర్నాడు స్నేహితుడు వెంకట్రావు అడిగాడు ఆశ్చర్యంగా ముఖం పెట్టి.
‘ఉండాలనే అనుకున్నానోయ్!.. మరీ బొత్తిగా హౌస్ అరెస్ట్‌లా ఉంది సుమా!..’
‘అదేంటి ఆదివారాలు సరదాగా సిటీలో తిరగరా?’
‘తిరుగుతాం అనుకో.. మిగిలిన రోజులు?!.. ఎంతసేపని టీవీ చూస్తాం చెప్పు? మహా బోరు కొట్టేసింది వెంకట్రావ్.. అందుకే వచ్చేశాం. పాపం మావాళ్లు ఉండమనే గొడవ చేశారు..’ నరసింహం చెప్పాడు తాము అక్కడ నుంచి బయల్దేరి వస్తున్న రోజును జ్ఞాపకం చేసుకుంటూ.
‘ఇంటికి వెళతాంరా అన్నప్పుడు - వెళతారా.. వచ్చి చాలా రోజులయ్యిందిగా.. సరే!’ అన్నాడు పెద్దకొడుకు. వెళ్లాక ఫోన్ చెయ్యండి అన్నాడు చిన్నకొడుకు.
‘అవును అదీ నిజమే.. ఇక్కడ ఇంతమందిని వదిలేసుకుని ఎక్కడికి వెళతార్లే.. బోరు కొట్టి చావదూ!’ అనుకుంటూ వెంకట్రావు వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయాక వాలుకుర్చీలో కూర్చున్నాడు నరసింహం. మనస్సంతా శూన్యంగా అనిపించిందతనికి. భర్తని అలా చూసిన సుభద్రకి జాలిగా అనిపించింది. బాధగానూ అనిపించింది.
‘ఏంటి?.. బాధగా ఉందా?’ అనడిగిందామె.
‘లేదు సుబ్బూ.. హాయిగా ఉంది.. ఇక్కడ మనకిష్టమైనట్లు ఉంటాం.. ఇష్టమైనది తింటాం.. తల్లిదండ్రులుగా మన బాధ్యతలు మనం నెరవేర్చాం.. కొడుకులుగా వాళ్లు చేయాల్సింది..’ మాట పూర్తి చెయ్యలేదు నరసింహం. చెయ్యి గాలిలో ఊపాడు.
‘వాళ్లకి రెక్కలొచ్చాయి.. మనకి రెక్కలు ఉడిగిపోయాయి. అయినా ఎక్కడ ఉండాల్సిన వాళ్లు అక్కడే ఉండాలి.. అది శ్రేయస్కరం కూడానూ.. లేవండి భోజనం చేద్దాం’ అన్నది సుభద్ర వాతావరణాన్ని తేలిక చేద్దామన్నట్లు. అతడు పేలవంగా నవ్వి భోజనానికి లేచాడు.

ఓ రెండు నెలల పాటు తనలో నిద్రపోయిన సందడిని నెల గడిచేసరికి మళ్లీ తెచ్చుకున్నాడు నరసింహం. ఇప్పుడు రోజులు పరుగెడుతున్నట్లు అనిపిస్తున్నాయి ఆ దంపతులకి. పిల్లలు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అమ్మానాన్నల ఆరోగ్యం గురించి చాలాచాలా జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు.
అలా ఓ మూడు నెలలు గడిచిపోయాయి. ఈ మధ్య భార్య సుభద్రలో ఏదో మార్పు కనిపిస్తోంది నరసింహానికి. మునుపటికన్నా చిక్కింది. తిండి కూడా తగ్గింది.
‘ఏమిటే సుబ్బూ అలా ఉంటున్నావ్?’ అని ఓ రోజు నరసింహం అడిగితే ఆమె నవ్వేస్తూ అన్నది. ‘ఇంకెలా ఉంటాను?! మనమేమన్నా కుర్రాళ్లమా?.. ముసలాళ్లం.. వయసు పెరిగింది తాతగారూ..’ అంటూ ఆట పట్టించింది. కానీ, ఆమె చెప్పిన సమాధానం నరసింహానికి సంతృప్తిగా అనిపించలేదు.
‘నీకేమన్నా నలతగా ఉంటే ఆసుపత్రి కెళదాం సుబ్బూ.. డబ్బు కోసం చూడకు’ అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ.
‘ఇంకా నయం. నెల తప్పావా అనలేదు.. నాకేం సుబ్బరంగా ఉన్నాను దుక్కలా.. మీరేం ఆలోచనలు పెట్టుకోకండి’ అంటూ అతడు కూర్చున్న కుర్చీ ప్రక్కనే కూర్చుని అతడి ఒడిలో తల పెట్టుకుంది. అంత పరిహాసంగా ఆమె చెప్పినా నరసింహానికి ఏ మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. ఆమె దేనికోసమో మనోవేదన పెట్టుకుందని చటుక్కున అనిపించిందతనికి. ఆ భావన రాగానే అతడు గిలగిల్లాడిపోయాడు. ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరాడు.
‘ఇదిగో మీకే చెప్పేది.. నేను దుక్కముక్కలా ఉన్నాను.. ఊరికే ఆలోచనలు పెట్టుకుని ఇదయిపోకండి..’ అంటూ తల ఎత్తి భర్త ముఖంలోకి చూసిందామె. నరసింహం నవ్వాడు. కొడుకులు గుర్తుకొచ్చారు. కోడళ్ళు గుర్తుకొచ్చారు. వాళ్ల తీరుతెన్నులూ గుర్తుకొచ్చాయి.
ఈ సంభాషణ జరిగిన సరిగ్గా మూడో రోజు ఉదయం నరసింహం కళ్లు తెరిచేసరికి పక్కనే మడత మంచం మీద పడుకున్న సుభద్ర ఇంకా నిద్ర లేవకపోవడం అతడికి ఆశ్చర్యంగా అనిపించింది. చటుక్కున లేచి, సుబ్బూ.. అంటూ ఆమెను లేపాడు. ఆమె లేవలేదు. ఎంత తట్టినా ఆమె లేవలేదు. శరీరం చల్లగా తగిలింది. కంగారుగా వెళ్లి డాక్టర్‌ని తీసుకొచ్చాడు. ఆయన వచ్చి చూసి ‘అంతా అయిపోయింది..’ అని పెదవి విరిచి వెళ్లిపోయాడు. ఒక్కసారిగా మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయాడు నరసింహం.
మిత్రుడు నరసింహాన్ని చూస్తే వెంకట్రావుకి జాలేసింది. బాధతో కళ్లనీళ్లు ఉబికాయి. మిత్రుడికి ఇష్టమైన వాలు కుర్చీ తెచ్చి సుభద్ర భౌతిక కాయానికి కొంచెం దగ్గరగా వేశాడు ‘ఇలా కూర్చో నరసింహం’ అని. మాట్లాడకుండా నరసింహం కూర్చున్నాడు. సుభద్ర మృతదేహానే్న తదేకంగా చూస్తూ కళ్లు మూసుకున్నాడు. ‘తన తోడు వెళ్లిపోయింది. నీడా వెళ్లిపోయింది. ఇక తను మాత్రం ఎందుకు?’- ప్రశ్న గుండె నిండా ఆవహించింది. ఆ ప్రశ్నకి సమాధానంగా అతడు శాశ్వతంగా కళ్లు మూసుకున్నాడు. *

పి.సూర్యనారాయణ
ప్లాట్ నెం.170బి, ఫ్లాట్ నెం.101
దివ్య ఆర్కేడ్, మోతీనగర్
హైదరాబాద్-500 018
9010196842

- సర్వజిత్