రివ్యూ

రామ.. రామ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అయ్యోరామా (బాగోలేదు)

తారాగణం:
పవన్ సిద్ధు, కామ్నాసింగ్, చంద్రమోహన్, పూర్ణిమ, జీవా, మేల్కొటె, జబర్దస్త్ బృందం తదితరులు
సంగీతం: సంతోష్ కవల
నిర్మాత:
గంటా రామకృష్ణ
దర్శకత్వం:
కిరణ్‌కుమార్ చేబోలు

సహజంగా ఏ ప్రేమకథల్లో అయినా అమ్మాయి వెనుక అబ్బాయి తిరిగి తిరిగి చివరికి విజయం సాధిస్తాడు. సాధించకపోయాడా కథ దుఃఖాంతం అవుతుందని చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ చిత్రంలో అమ్మాయే అబ్బాయి చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతుంది. పోనీ అతనికి ఎవరైనా ప్రేమికురాలు ఉన్నారా? అంటే అదీ లేదు. ఎందుకో ఏం సమాధానం చెప్పకుండా దాటవేసి ఇంత రాద్ధాంతం చేశాడు.
కథేంటి?
రామకృష్ణ (పవన్ సిద్ధు)కు ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం. అయినా ఏ పనీ చేయకుండా బాస్‌కి తలనొప్పిగా మారి అల్లరి చిల్లరిగా తిరగేస్తుంటాడు. అదే కంపెనీలో ఉద్యోగానికి వస్తుంది మహాలక్ష్మి (కామ్నాసింగ్). పని తప్పించుకోవడం కోసం రామకృష్ణ చెప్పే సుద్దులు విన్న మహాలక్ష్మి అతని ప్రేమలో పడుతుంది. తనే అతనిని ప్రేమిస్తున్నట్లుగా ప్రపోజ్ చేస్తుంది. దానికి కథానాయకుడు రెస్పాండ్ కాడు. అతన్ని గమనించిన మహాలక్ష్మి మొదట అనుమానించినా, తరువాత అతనికి తగిన శాస్తి చేయాలని నిర్ణయించుకుంటుంది. మహాలక్ష్మికి యాక్సిడెంట్ అవడంతో గతం మర్చిపోతుంది. వాళ్ళ కుటుంబం మొత్తం వైజాగ్‌నుండి ఏలూరుకు వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయాక ప్రేమ చిగురించిన రామకృష్ణ ఆమె కోసం వెతుకుతాడు. ఎక్కడా దొరకదు. చివరికి ఓ న్యూస్ పేపర్‌లో ఆమె గురించి చదివి ఏలూరు చేరతాడు. తీరా అక్కడికెళితే తండ్రి ఆమెకు గతమేదీ గుర్తులేదని, కాలేజీ అమ్మాయిలా రోజూ కాలేజీకి వెళ్లి వస్తుందని, నువ్వు వీలైతే ఆమెకు గతాన్ని గుర్తుచేయకుండా ప్రేమించే పని పెట్టుకోమని చెబుతాడు. మధ్యలో మహాలక్ష్మి బావతో తన పని చేయించుకుంటూ అతనికి తెలియకుండా, హీరోయినే్న ప్రేమలో దించే పనిలో రామకృష్ణ చివరికి విజయం సాధించాడా లేదా అన్నదే కథాంశం.
ఎలా వుంది?
చెప్పుకోవడానికి ఓ చిన్న దారం లాంటి కథ ఇది. ఈ కథను వైజాగ్ నుండి ఏలూరు తీసుకొచ్చి శ్రీనువైట్ల దూకుడు మార్కుతో రెండువైపులా ఆడుకున్నట్లుగా ఓ వైపు హీరోయిన్‌తో, మరోవైపు హీరోయిన్ బావ చంటితో చేసిన హాస్యం ఏ మాత్రం ఆకట్టుకోదు. అది హాస్యమనాలో, ట్రాజెడీ అనాలో, డ్రామా అనాలో దర్శకుడికే తెలియాలి. మొదటి సగమంతా చమ్మక్ చంద్ర, రామ్‌ప్రసాద్‌లతో కామెడీకే పెద్దపీట వేశారు. అయితే అందులో సరైన సారం లేకపోవడంతో ఏ మాత్రం ఆకట్టుకోదు. గతంలో అనేక చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాలు చూసినవే. ఒక్క నటులే మారారంతే. మొదటి సగమంతా కామెడీకోసం పట్టి పట్టి లాగినట్లుగా సన్నివేశాలు సాగుతాయి. రెండో సగంలో ఏమీ తెలియని అమాయకురాల్లా నటించే కథానాయిక చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఒక్కటే ప్రేక్షకులకు గుర్తుంటుంది. మొత్తం కలిపి కథానాయకుడే అయ్యోరామా అనుకునేలా చేశారు. నటీనటుల్లో హీరో ఫర్వాలేదనిపించినా, హీరోయిన్ మాత్రం ఎటువంటి భావాలు పలికించలేకపోయింది. చంద్రమోహన్, పూర్ణిమ, జీవా లాంటివాళ్లు తాము ఎప్పటినుంచో చేస్తున్న పాత్రలను మరోసారి చేశారు. జబర్దస్త్ బృందం టీవీ మీడియాలో విపరీతంగా నవ్విస్తూ సినిమా మీడియంకు వచ్చేసరికి ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోవడం విచారకరం. అసలు ఇలాంటి పాత్రలు వెయ్యకపోవడమే ఉత్తమం. పాటలు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం మాత్రం మాటలు వినపడకుండా వాయించేసి ఆకట్టుకున్నారు. నిర్మాణ విలువలు సోసో. ఒక్క కెమెరా మాత్రమే చూడదగిన విధంగా వుంది. దర్శకత్వ పరంగా ఎంతో అనుభవం సంపాదించాల్సిన అవసరం అతనికి వుంది.

-సరయు