ఖమ్మం

భక్తరామదాసు కీర్తనలకు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 24: వైకుంఠ రాముని క్షేత్రంగా ఇప్పటికే ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న శ్రీరామదివ్యక్షేత్రం భద్రాచలం కీర్తి మరోమారు విశ్వవ్యాప్తమైంది. అపర రామభక్తుడు, వాగ్గేయకారుడు భక్తరామదాసు రచించి, ఆలపించిన కీర్తనలకు తెలుగు రాష్ట్రాల చిన్నారులు ఆదివారం ఏకకాలంలో 1100 మంది కూచిపూడి నృత్యాలతో రామయ్యకు అభిషేకం చేశారు. ‘ అదిగో భద్రాద్రి...ఇదిగో గౌతమి చూడండి...’, ‘పలుకే బంగారమాయెరా...’, ‘చరణములే నమ్మితి...’ అనే కీర్తనలకు 13 నిముషాల 39 సెకన్లపాటు నృత్యం చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్సు, వరల్డ్ సూపర్ కిడ్స్ ఆఫ్ రికార్డ్సు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధుల మనసు దోచుకున్నారు. వారి సమక్షంలో అందెల సవ్వడి చేసి భక్తరామదాసు కీర్తనలతో శ్రీసీతారామచంద్రస్వామికి కళాభిషేకం చేశారు. గతంలో కేవలం అన్నమయ్య కీర్తనలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. తాజాగా భక్తరామదాసు కీర్తనలకు స్థానం లభించడంతో రామభక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది.
అపూర్వం... ఈ సన్నివేశం
అంతకు ముందు ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ డీజీపీ గోపీనాథ్‌రెడ్డి, ఎంపీపీ ఊకే శాంతలు జ్యోతి ప్రజ్వలన చేసి భక్తరామదాసు కీర్తనల నృత్యాభిషేకాన్ని ప్రారంభించారు. చిన్నారుల ప్రతిభను, వారి క్రమశిక్షణపూర్వ నృత్యాన్ని చూసి వారంతా అబ్బురపడ్డారు. ఇది ఒక అపూర్వఘట్టంగా వారు పేర్కొన్నారు. ఈ సన్నివేశం జన్మజన్మలా మా వెంటే ఉంటుందని, రాముని సాక్షిగా ఈ చిన్నారులు చేసిన నృత్యాలు మధురఘట్టాలని వారు కొనియాడారు. ఈ రికార్డుల్లోకి భద్రాచల క్షేత్రం నిర్మాత, అపర రామభక్తుడు, వాగ్గేయకారుడి కీర్తనకు చోటు దక్కడం తెలుగు ప్రజలు గర్వించదగ్గ చారిత్రాత్మక దినంగా వారు అభివర్ణించారు.
రామాయణ ఘట్టాల్ని కళ్లకు కట్టారు...
రామాయణంలోని ఘట్టాల్ని చిన్నారులు కళ్లకు కట్టారు. భక్తరామదాసు కీర్తనల నృత్యాభిషేకం అనంతరం చిన్నారులు రామాయణ ఘట్టాలపై ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని 25 జిల్లాల నుంచి వచ్చిన చిన్నారులు రామాయణంలోని పాత్రల వేషధారణలతో అభినయం, నృత్యం చేసి అపూర్వగాధను వివరించిన తీరు నభూతో నభవిష్యత్‌లా సాగింది. నిర్వాహకులు బెక్కంటి శ్రీనివాసరావు, తాళ్లూరి పంచాక్షరయ్య, పాకల దుర్గాప్రసాద్, చావా లక్ష్మీనారాయణ, డైరక్టర్లను వచ్చిన వారంతా కొనియాడారు. వారి ప్రయత్నాన్ని ప్రశంసించారు.

రూ.600 కోట్లు దాటిన మద్యం ఆదాయం
* పెరిగిన బెల్టుషాపులు
* అన్ని చోట్లా దొరుకుతున్న మద్యం
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జనవరి 24: గడిచిన ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో మద్యం ద్వారా ఆదాయం 600కోట్లకు పైగా వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నాటుసారాను పారద్రోలేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. నాటుసారాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖకు ఇతర శాఖల సహకారం కూడా అందడంతో గ్రామాల్లో నాటుసారా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 20లక్షల లీటర్ల గుడుంబాను అధికారులు ధ్వంసం చేశారు. ఏడువేలకు పైగా కేసులు కూడా నమోదు చేశారు. ఐదువేల మందిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 450వాహనాలను స్వాదీనం చేసుకోవడమే కాకుండా మూడువేల మందికి పైగా నాటుసారా తయారీ, అమ్మకం దారులపై బైండోవర్ కేసులు పెట్టి 5లక్షలకు పైగా జరిమానాను కూడా విధించారు.
ఇదిలా ఉండగా నాటుసారాను అరికట్టడంలో సత్ఫలితాలు సాధించిన అధికారులు మద్యం గ్రామాల్లో బెల్టుషాపుల ద్వారా ఏరులై పారుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 13లక్షల మద్యం పెట్టెలు, 10లక్షలకు పైగా బీర్ల పెట్టెలను అమ్మారంటే మద్యం ఏ స్థాయిలో ప్రజలకు చేరుతుందో ఆర్థం చేసుకోవచ్చు. నాటుసారా తయారీని, అమ్మకాన్ని అరికట్టడంలో చూపించిన శ్రద్దను బెల్టు షాపులపై చూపించకపోవడంతో నాటుసారా దొరక్కపోయినా మద్యం ఎక్కడైనా దొరుకుతుందనే నానుడి కనిపిస్తోంది. ఎక్సైజ్ శాఖ కార్యాలయాల సమీపంలోనే అనధికారికంగా మద్యం అమ్ముతున్నా స్పందించే వారు లేరు.
నాటుసారా తక్కువగా దొరుకుతుండటం, మద్యం ఎక్కడైనా దొరుకుతుండటంతో అనేక మంది మద్యం వైపు మళ్ళారు. కానీ ధరలు అధికంగా ఉండటంతో కొనడం తగ్గించారు. అయితే ఈ విషయాన్ని గమనించిన కొందరు వ్యాపారులు మద్యంలో కల్తీ జరుపుతూ అవసరమైతే ఎంఆర్‌పి కంటే తక్కువ ధరకు కూడా మద్యాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నల్లోనే ఈ కల్తీ జరుగుతున్నదనే ప్రచారం కూడా ఉంది. మరి కొంతమంది రహస్యంగా గుడుంబాను తయారు చేసి మద్యం బాటిళ్ళలో నింపి అమ్ముతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపై ఎక్కడా ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. గుడుంబాను అరికట్టేందుకు ఉమ్మడిగా దాడులు చేసిన ఆయా శాఖల అధికారులు బెల్టుషాపులు, కల్తీ మద్యంపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఐక్యంగా ఉద్యమాలు చేసేందుకు మహిళా సంఘాలు సమాయత్తమవుతున్నాయి. ఇటీవల కొందరు బెల్టుషాపులపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆధారాలతో సహా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ప్రయత్నించడం గమనార్హం.

విద్యుత్ మిగులు రాష్ట్ర సాధనకు
ఉద్యోగులంతా సహకరించాలి
* టిఎస్ జెన్‌కో సిఎండి ప్రభాకర్
* 7వ దశ పనులకు శంకుస్థాపన
పాల్వంచ, జనవరి 24: విద్యుత్ మిగులు రాష్ట్ర సాధనకు ఉద్యోగు లంతా సహకరించాలని టిఎస్‌జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు పిలుపునిచ్చారు. పాల్వంచలో రూ 5, 250 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల సామర్ధ్యంతో నూతనంగా నిర్మిస్తున్న కెటిపిఎస్ 7వ దశ యూనిట్‌ను ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కెటిపిఎస్ అధికారులు సిఎండికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న 7వ దశలోని ఇఎస్‌పి యూనిట్ పనులకు, బాయిలర్ కాలమ్స్ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుండి 5వ దశలో నూతనంగా నిర్మాణం చేసిన సర్వీసుబిల్డింగ్‌ను ప్రారంభించారు. అదేవిధంగా 6వ, 7వదశ ఉద్యోగుల కోసం బస్టాండ్‌సమీపంలో నిర్మాణం చేస్తున్న క్వార్టర్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సిఎండి మాట్లాడుతూ భూపాలపల్లిలో 600మెగావాట్ల సామర్ధ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయడం జరిగిందన్నారు. ఇదే తరహాలో కెటిపిఎస్, దామరచర్ల, భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 2018నాటికి రాష్ట్రంలో 5880మెగావాట్ల విద్యుదుత్పత్తికి కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు ఉత్పత్తి జరిగితే రాష్ట్రం మిగులు విద్యుత్ సాధిస్తుందన్నారు. ఈ దశకు చేరాలంటే తెలంగాణ జెన్‌కోలోని ఇంజనీర్లు, ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో కొన్ని విద్యుదుత్పత్తి కేంద్రాలపై కొంతమంది వ్యక్తులు స్వార్థంతో కోర్టుకు వెళ్తున్నారన్నారు. దీనివలన నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. విద్యుదుత్పత్తి సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. సిఎండికి కెటిపిఎస్‌లో పలు కార్మికసంఘాల నాయకులు పలుడిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. సిఎండి వెంట ప్రాజెక్టు డైరెక్టర్ రాధాకృష్ణ, థర్మల్ డైరెక్టర్లు సచ్చితానందం, టిఎస్‌ఎన్ మూర్తి, వెంకటరాజేశం, కెటిపిఎస్ సిఇలు లక్ష్మయ్య, సిద్దయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.

హోటల్స్‌లో పోలీసుల తనిఖీలు
ఖమ్మం(మామిళ్ళగూడెం), జనవరి 24: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం, నిఘా వర్గాలు హెచ్చరించడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. త్రీటౌన్ సిఐ కె మొగిలి ఆధ్వర్యంలో గాంధీచౌక్‌లోని ఎస్‌పార్క్, బడ్జెట్, క్లాసిక్, హర్ష తదితర హోటల్‌లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హోటల్‌లో బస చేసేవారి వివరాలను పరిశీలించడంతో పాటు హోటల్ యాజమాన్యం వారి వివరాలను నమోదు సక్రమంగా చేసుకుంటున్నారా లేదా అని మినిట్ బుక్‌ను పరిశీలించారు. హోటల్‌లో బస చేసే వారి వద్ద గుర్తింపు కార్డులను పరిశీలించిన సిఐ వారు ఎక్కడి నుండి వచ్చారో, ఏ పని మీద ఖమ్మంలో బస చేస్తున్నారని ప్రశ్నించారు. హోటల్‌లో దిగే ప్రతి వ్యక్తి సమాచారం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ఎలాంటి అనుమానిత వ్యక్తులు హోటల్‌కు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సిఐ హోటల్ మేనేజ్‌మెంట్‌కు సూచించారు. ఈ సందర్భంగా సిఐ మొగిలి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే నగరంలో నిఘా పెట్టామని, త్రీటౌన్ ప్రాంతంలోని ప్రతి హోటల్‌ను సందర్శించి అక్కడ ఉండే వారి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలో ఎస్‌ఐలు సంజీవ్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా నగరంలోని పలు హోటల్‌లలో వన్‌టౌన్, టూటౌన్ సిఐల ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేసి అక్కడ బస చేస్తున్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు.

రాముడు పుణ్యపురుషుడు
భద్రాచలం, జనవరి 24: పుణ్యపురుషుడు శ్రీరాముడు మనందరికీ ఆదర్శమని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల సంఘం ఆటా ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పావన గోదావరి తీరంలో పుణ్య నదీహారతి, గో హోమాలు జరిగాయి. గోదావరికి నదీ హారతి ఇచ్చి, గో హోమంలో పాల్గొని నవధాన్యాలు, ఆవు పిడకలు హోమంలో వేసి నమస్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామాయణం మన నడవడికకు దిక్సూచి లాంటిదన్నారు. ఎందరో చిన్నారులు నేడు రామాయణ ఘట్టాలపై నృత్యరూపకాలు ఇవ్వడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు, సర్పంచి భూక్యాశే్వత, నిర్వాహకులు బెక్కంటి శ్రీనివాసరావు, తాళ్లూరి పంచాక్షరయ్య, చావా లక్ష్మీనారాయణ, పాకల దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.
కూచిపూడి నృత్యం...నదీ హారతి
పౌర్ణమి వేళ గోదావరి తీరంలో అపూర్వఘట్టం ఆవిష్కృతం అయ్యింది. 1108 మంది చిన్నారులు కూచిపూడి నృత్యం చేస్తూ గోదావరికి నదీ హారతిని ఇచ్చారు. చీకటి పడుతున్న వేళ కుందుల్లో దీపాలు వెలిగించి ఒకేసారి వారంతా నృత్యం చేస్తూ మూడుసార్లు నదీమాతల్లికి హారతి ఇచ్చిన దృశ్యం కమనీయంగా...రమణీయంగా సాగింది.
గోహోమంతో: విశ్వశాంతి కోరుతూ గో హోమం నిర్వహించారు. గోవుల పరిరక్షణకు నేటి యువత నడుం బిగించాలని గోమాతకు పూజలు చేయడం వల్ల కల్గే ప్రయోజనాలు వివరిస్తూ ప్రతి ఒక్కరితో గోపూజ చేయించారు. దేశం సస్యశ్యామలమవ్యాలంటే గోమాతను నిత్యం పూజించాలన్నారు. నవధాన్యాలు, ఆవుపిడకల, సుగంధ ద్రవ్యాలతో హోమం నిర్వహించారు.

కార్పొరేషన్ ఎన్నికల్లో
లౌకికవాద శక్తులతో కలిసి పయనం

* పార్టీ నిర్ణయమే శిరోధార్యం * సిపిఐ జాతీయ నాయకుడు పువ్వాడ
ఖమ్మం(జమ్మిబండ), జనవరి 24: త్వరలో జరగనున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య లౌకిక వాద శక్తులతో ముందుకు వెళ్తామని సిపిఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం బైపాస్‌రోడ్డులో జరిగిన సిపిఐ కార్పొరేషన్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరానికి పైపై మెరుగులు దిద్దేందుకు టిఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందని, రెండేళ్ళుగా గుర్తుకు రాని అభివృద్ధి ఇప్పుడు గుర్తొచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నగరంలో పర్యటించేందుకే తీరిక లేని ముఖ్యమంత్రి ఇప్పుడు ఏదో చేస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. సిపిఐ మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, సిపిఐ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. లౌకిక ప్రజాస్వామ్య శక్తులతో కలిసి ముందుకెళ్తామని, కాబట్టి పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా పార్టీల వైఖరి స్పష్టమైందని, ఆ పార్టీలు ఎన్నికల తర్వాత ప్రజలను పట్టించుకోవని ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇతర పార్టీల నేతలను ప్రలోభాలకు గురిచేస్తుందని దుయ్యబట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని, చివరకు సెంట్రల్ యూనివర్సిటి విద్యార్థి రోహిత్ ఆత్మహత్యను కూడా రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో సిపిఐ ఓటుబ్యాంకు ఉన్నదని, తాము పోటీచేసే వార్డులతో పాటు మిగిలిన వార్డులలో గెలుపు, ఓటములను నిర్ణయించవచ్చన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు మాట్లాడుతూ నగరంలో పేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇచ్చిన ఘనత సిపిఐకే దక్కిందన్నారు. సిపిఐకి ప్రజలు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టివి చౌదరి, మహ్మద్ వౌలానా, పోటు ప్రసాద్, జానీమియా, జితేంధర్‌రెడ్డి, రంగయ్య, పోటు కళావతి, సలాం పాల్గొన్నారు.

కార్యకర్తలే పార్టీకి కొండంత ధైర్యం
*ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడి
ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 24: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే కొండంత ధైర్యమని, దివంగత వైఎస్‌ఆర్ సంక్షేమాన్ని స్మరించుకుంటూ జిల్లాలో వందలాది మంది వివిధ పార్టీలను వీడి వైసిపిలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వైరా నియోజకవర్గ ఇంచార్జ్ బొర్రా రాజశేఖర్, నియోజకవర్గ నాయకుడు చండ్ర నరేందర్ ఆధ్వర్యంలో ఆదివారం జూలూరుపాడు, ఏన్కూరు మండలాలకు చెందిన సుమారు 500కుటుంబాలు ఎంపి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి పార్టీ సత్తా చాటేందుకు, వైఎస్‌ఆర్ ఆశయ సాధన కోసమే జిల్లా వ్యాప్తంగా వేలాది మంది పార్టీలోకి చేరుతున్నారని స్పష్టం చేశారు. రోజురోజుకు భలమైన శక్తిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని తయారు చేస్తున్న పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రభావం ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు చిత్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకులమూర్తి, జైపాల్, నిరంజన్‌రెడ్డి, ముస్త్ఫ, రామారావు, నర్సింహరావు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
వికలాంగులు అన్ని రంగాల్లో రాణించాలి
వికలాంగులు విద్యా, క్రీడలతో పాటు అన్ని రంగాలలో రాణించి తమ సత్తా చాటాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక రిక్కాబజార్ స్కూల్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో 50మంది వికలాంగులకు ట్రైసైకిళ్ళు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వికలాంగుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలు వికలాంగులను విస్మరించాయని, వారికి అందాల్సిన ఫలాలని కుదిస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. వైఎస్ హయంలో ప్రతి వికలాంగుడికి 200రూపాయల ఫించన్ అందచేసి వారికి భరోసా కల్పించే వారని, ప్రస్తుత పాలకులు ఆ ఫించన్‌ను 1500రూపాయలకు పెంచి సగానికి పైగా అర్హులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా చేతకాని హామీలను గుప్పించడం మాని ప్రజాసంక్షేమానికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సాదు రమేష్‌రెడ్డి, దుంపల రవికుమార్, వెంకట్‌రెడ్డి, గోపే వెంకన్న, గురుమూర్తి, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.