కడప

బెడిసికొట్టిన సిండికేట్ల వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 15: రెండురోజుల క్రితం జిల్లాలో ఇసుక రీచ్‌ల టెండర్లలో అనేక అవకతవకలు చోటుచేసుకోవడంతో కడప జిల్లా ఇసుక రీచ్‌ల టెండర్లను రద్దుచేస్తూ సోమవారం జిల్లా కేంద్రానికి ఆదేశాలు అందాయి. మంత్రి పీతల సుజాత, మైనింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గిరిజాశంకర్‌లు ఇసుక టెండర్లలో సిండికేట్ల తీరుతో ఇసుక సరఫరా అస్తవ్యస్తంగా మారుతుందని గుర్తించారు. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇసుక టెండర్లు రద్దుచేయడంతో జిల్లా నేతలు ఖంగుతిన్నారు. జిల్లాలో 12రీచ్‌లకు టెండర్లు పిలవగా, 11 రీచ్‌లను సిండికేట్ లీడర్లు వ్యూహాత్మకంగా దక్కించుకున్నారు. ప్రభుత్వం క్యూబిక్ మీటర్‌కు రూ.550లు ధర నిర్ణయించగా, కొంతమంది అత్యుత్సాహంతో రూ.720కు గరిష్టంగా కోట్‌చేశారు. పార్టీలకు అతీతంగా పరపతి కలిగిన నేతలు సిండికేట్ అయి ఇష్టారాజ్యంగా టెండర్లు దాఖలు చేయడం వల్ల ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో ఇసుక టెండర్లను రద్దుచేసి మరోమారు నిబంధనలను కఠినతరం చేసి టెండర్లను పిలిస్తే తప్ప ప్రజలకు న్యాయం జరగదని సర్కారు నిర్ణయానికి వచ్చింది. అన్నివిధాలా ఆలోచించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఇసుక టెండర్లను రద్దుచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే కొంతమంది ఎక్కువ ధరతో, మరికొంతమంది మరీ తక్కువ ధరతో స్థానిక నేతలు పార్టీలకు అతీతంగా లోపాయికారీ ఒప్పందంతో టెండర్లు దాఖలు చేశారు. ప్రభుత్వం నిబంధనలు మేరకు క్యూబిక్ మీటరుకు రూ.550లు లోపు టెండర్లు దాఖలు చేయాల్సివుంది. ప్రభుత్వం అమ్మకాలు జరిపేందుకు కూడా క్యూబిక్ మీటరు రూ.550లు ధర ఉండగా, ఇసుక రీచ్‌ల టెండరు దారులు రూ.700 పైబడి ధర కోడ్ చేశారు. సంబంధిత టెండర్ దారులు ఇసుక క్యూబిక్ మీటరుకు రూ.1000 పైబడి అమ్మకాలు చేస్తే తప్ప గిట్టుబాటు కాదు. ఈ గిట్టుబాటు ధరకోసం అక్రమంగా ఇసుకను తరలించడం, పొరుగు రాష్ట్రాలకు విక్రయించడం వంటి అడ్డదార్లు సిండికేట్ల వ్యూహంలో భాగంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వమే స్వయంగా డ్వాక్రాసంఘాల ద్వారా దాదాపు 20లక్షల క్యూబిక్ మీటర్లను ఇసుకను విక్రయించగా, 60కోట్లరూపాయల ఆదాయం లభించింది. జిల్లాలో మేదరపేట, ఏటూరు, జ్యోతి, శేషమాంబపురం, అనిమెల, టంగుటూరు, కాలువపల్లె, కోనంతరాజుపురం, బుగ్గపట్నం, హనుమనగుత్తి, పొన్నతోట, కుమ్మరాంపల్లి, కొండాపురం, ఓబన్నపేట, చెరువుకింద పల్లె, కోమరునిపల్లె, ములపాక, బాలరాజుపల్లి, ఓబులంపల్లె, ఉలవలపల్లె, పైడికాలువ, గంగవరం, కుప్పంరాజుపల్లెల్లో ఇసుక రీచ్‌లను గుర్తించడం జరిగింది. తాజాగా 12 రీచ్‌లకు మాత్రమే టెండర్లు పిలిచి ఒక రీచ్‌కు నిబంధనలు సక్రమంగా లేకపోవడంతో అధికారులు ఈ రీచ్‌ను నిలిపివేశారు. క్యూబిక్‌మీటర్ రూ.550లు మించకుండా ప్రజలకు ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరికొత్త నిబంధనలతో త్వరలో ప్రభుత్వం ఇసుక టెండర్లను మళ్లీ ఆహ్వానించనుంది. సర్కారు తాజా నిర్ణయం సిండికేట్‌ల వ్యూహానికి గండికొట్టినట్లయింది.

వైకాపా డిసిసిబి డైరక్టర్‌కు ఉద్వాసన?
ఆంధ్రభూమి బ్యూరో
కడప,్ఫబ్రవరి 15: తెలుగుదేశం ఆధీనంలో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో వైకాపా డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి తరచూ అడ్డుతగులుతుండటంతో డిసిసిబి చైర్మన్ జి.అనిల్‌కుమార్‌రెడ్డి ఆయనను డైరెక్టర్ పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. కమలాపురం నియోజకవర్గం వీరపునాయునిపల్లె మండలం గిడ్డంగివారిపల్లె ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు, డిసిసిబి డైరెక్టర్ అయిన సుదర్శన్‌రెడ్డికి ఆ సంఘంలోనే ఎసరు పెట్టారు. ఆ సంఘంలో 13మంది సభ్యులుండగా సోమవారం నలుగురు వైసిపి డైరెక్టర్లను, ముగ్గురు టిడిపి డైరెక్టర్లను పదవి నుంచి తొలగించారు. ఆ పాలక వర్గంలో 6 మంది డైరెక్టర్లు మిగలడంతో కోరం లేకపోవడంతో ఆ సంఘం రద్దుకానుంది. సంఘం రద్దయితే సుదర్శన్‌రెడ్డి జిల్లా డైరెక్టర్ పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపధ్యంలో డిసిసిబి చైర్మన్ జి.అనిల్‌కుమార్‌రెడ్డి తన తండ్రి సీనియర్ టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి తరహాలోనే వైకాపా డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డిని తొలగించేందుకు వ్యూహం సిద్ధంచేశారు. ఈ వ్యవహారం తెలుసుకున్న వెంటనే కమలాపురం వైకాపా ఎమ్మెల్యే పి.రవీంద్రనాధరెడ్డి డిసిసి బ్యాంకుకు చేరుకుని పరిస్థితి తెలుసుకున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటడంతో ఆయన తిరుగుముఖం పట్టారు. వైకాపా మద్దతుదారులు, టిడిపి మద్దతు దారుల మద్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డిసిసిబి చైర్మన్ జి.అనిల్‌కుమార్‌రెడ్డి చక్రం తిప్పడంతో అసలు విషయం తెలుసుకున్న వైకాపా నేతలు ఖంగుతిన్నారు. అయితే కొంతమంది వైకాపా నేతలు కోర్టును ఆశ్రయించాలని భావించినా ఫలితం ఉండదని తెలుసుకొని వెనుదిరిగారు.

సిఎంను కలిసిన మాజీమంత్రి రామసుబ్బారెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
కడప,్ఫబ్రవరి 15: జమ్మలమడుగు టిడిపి ఇన్‌చార్జ్, రాష్ట్ర మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును క్యాంప్ కార్యాలయంలో కలిశారు. చాలా కాలంగా వైకాపా జమ్మలమడుగు ఎమ్మెల్యే టిడిపిలో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో రామసుబ్బారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆది చేరికను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో వైకాపా ప్రాబల్యం తగ్గించేందుకు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను ఏదుర్కోవడానికి ఆదిని పార్టీలోకి తీసుకోవడం పార్టీ అవసరమని రామసుబ్బారెడ్డికి ముఖ్యమంత్రి నచ్చిచెప్పినట్లు తెలిసింది. రాష్ట్రంలో నెలకొన్న కాపు ఉద్యమం, బిసిల ఉద్యమం, ఎస్సీల ఉద్యమంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చీటికి మాటికి జోక్యం చేసుకుంటున్నారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకొస్తే జగన్ చర్యలను బలహీన పర్చవచ్చన్నది పార్టీ అధిష్టానం యోచనగా ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి వుండాలని, అన్నివిధాలా ఆలోచించాకే ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవాల్సివస్తుందని సిఎం చెప్పినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, రామసుబ్బారెడ్డి కుటుంబానికి అన్యాయం జరగకుండా చూస్తామని, సముచిత స్థానం కల్పిస్తామని గట్టిహామీ ఇచ్చినట్లు తెలిసింది.

బిసిల ఆందోళనతో దద్దరిల్లిన కలెక్టరేట్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 15: కాపులను బిసిలో చేర్చవద్దంటూ జాతీయ, రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, కె.శంకర్‌రావుల పిలుపుమేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట బిసి నేతల ఆందోళనతో దద్దరిల్లింది. బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి చిదానందగౌడ్ నేతృత్వంలో పలు కులాలకు చెందిన బిసి నేతలు , కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చి సోమవారం ఒక రోజు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు వందలాది మంది బిసిలు, బిసి కుల సంఘాల నేతలు తరలివచ్చారు. ఈసందర్భంగా 72 మంది బిసి కుల సంఘాల నేతలు దీక్షలో పాల్గొనగా, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బాలకృష్ణయాదవ్ , బిసి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గురుమూర్తి, రాష్ట్ర, జిల్లా వివిధ శాఖల బిసి సంఘం నేతలు బంగారు వెంకటరమణయాదవ్, శివప్రసాద్, మునెయ్య, ఈశ్వరయ్య, వెంకటేసు, ఆనందరావు, ఖాదర్‌బాష, రాజేష్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. వీరంతా రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. బిసిల జనాభా 54 శాతం వరకు ఉండగా అతి తక్కువగా ఉన్న కాపుల జనాభా ఓట్లకోసం, సీట్లకోసం రాష్ట్రప్రభుత్వం వారికోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేయడం, ఏకంగా వెయ్యికోట్లరూపాయలు విడుదల చేయడం అక్రమమని, బిసిలకు న్యాయం చేసే వరకు తమ ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కాపులను అడ్డగోలుగా బిసిల్లో చేరిస్తే రాజ్యాంగపరంగా తాము న్యాయపోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. బిసి అడహక్ కమిటీ జిల్లా చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బిసి సంఘం నేతలు తరలివచ్చారు.
బిసిలకోసం వివిధ ఫెడరేషన్లు ఏర్పాటుచేసిన ప్రభుత్వం ఇంతవరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని అన్నారు. తాము కోరేది రాజ్యాంగపర హక్కులేనని, భిక్ష కాదని జిల్లా అధ్యక్షుడు దాసరి చిదానందగౌడ్ అన్నారు. తమకు సామాజిక , రాజకీయ , ఆర్థికరంగాల్లో ఏ ప్రభుత్వం కూడా పెద్దపీట వేయలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి బిసిలకు న్యాయం చేయాలన్నారు. తమకు న్యాయం జరిగే వరకు దశలవారీగా ఆందోళనను ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం దీక్షలు విరమించి కలెక్టరేట్ కార్యాలయం అధికారి గంగయ్యకు వినతిపత్రం సమర్పించారు.

రూ. 214కోట్లతో దళితవాడలకు వౌలిక సదుపాయాలు
నందలూరు, ఫిబ్రవరి 15:రాష్టవ్య్రాప్తంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ క్రింద రూ. 214.63 కోట్ల నిధులు మంజూరైనట్లు విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని న్యూతిమ్మరాచపల్లె ఎస్టీకాలనీలో సబ్‌ప్లాన్ క్రింద రూ. 8 లక్షలతో నిర్మితమైన సీసీ రోడ్‌లను మేడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం చంద్రబాబునాయుడు ఎస్సీ, ఎస్టీ కాలనీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి పరచాలని కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. రాజంపేట నియోజకవర్గంకు రూ. 13 కోట్ల నిధులు మంజూరు కాగా, తొలి విడతగా రూ. 6 కోట్లతో పలు కాలనీలలో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. సుండుపల్లె మండలంలో రూ. 1.25 కోట్లతో తారురోడ్డు, ఉడుంపాడు-ఆరోగ్యపురంకు రూ. 95 లక్షలతో తారురోడ్డు, సుండుపల్లె నుండి ఆర్‌అండ్‌బి రోడ్డును రూ. 36 లక్షలతో తారురోడ్డు, గుర్రప్పగారిపల్లె నుండి ఎం.మాలపల్లె వరకు రూ. 34 లక్షలతో తారురోడ్డు, బింకివాళ్లపల్లె-బయనేని మాలపల్లెకు రూ. 90 లక్షలతో తారురోడ్డు, రాజంపేట మండలంలో రేణింతల, పులపుత్తూరుల మధ్య రూ. 1.50 కోట్లతో, తాళ్లపాక-హేమాద్రిపల్లె వరకు రూ. 85 లక్షలతో తారురోడ్డు, నేకనాపురం నుండి మాధవరం 2 వరకు రూ. 70 లక్షలతో బిటి రోడ్ పనులు చేపట్టామన్నారు. సిఎం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఈ కాలనీలలో వౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు ఆయన చెప్పారు. బద్వేల్‌కు రూ. 49 లక్షలు, జమ్మలమడుగుకు రూ.1.81 కోట్లు, ప్రొద్దుటూరుకు రూ. 1.30 కోట్లు, కమలాపురంకు రూ. 26 లక్షలు, రాయచోటికి రూ. 40 లక్షలు, కోడూరుకు రూ. 1.74 కోట్లు, పుల్లంపేటకు రూ. 46 లక్షలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ క్రింద నిధులు మంజూరయ్యాయన్నారు. పంచాయితీరాజ్‌లో 282 పనులకు గాను 214.63 కోట్ల నిధులతో చేపట్టే ఈ పనులు టెండర్ల ప్రాతిపదికపై నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మరిన్ని ప్రతిపాదనలు పంపామన్నారు. రాష్ట్రంలో 5 వేల కిలోమీటర్ల రోడ్డు పనులు సాగుతున్నాయన్నారు. ఇసుకను అధిక ధరలకు అమ్మే సమస్య లేకుండా తక్కువ ధరకే అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మేడా చెప్పారు. కొంతమంది ప్రజలను దోపిడీ చేసే మార్గాన్ని అరికట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో డ్వాక్రా మహిళలు నిర్వహించే క్వారీలలో ఇసుకను తీసుకోవాలంటే ఎక్కువ ధర పడుతుందని ప్రజలు చెప్పడంతో తక్కువ ధరకే వారికి అందేలా చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కడ బెల్ట్‌షాపులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మద్యం విక్రయాలు ఎమ్మార్పీ మేరకు నిర్వహించాలని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకొంటామన్నారు. పిఆర్ ఇఇ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మండలంలో రూ. 22 లక్షలతో ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్లు వేయడం జరుగుతుందని, అందులో భాగంగా 8 లక్షలతో న్యూతిమ్మరాచపల్లె, రూ. 7 లక్షలతో కుంపిణీ పురంలో రోడ్డుపనులు పూరె్తైనట్లు చెప్పారు. టంగుటూరులో రూ. 7 లక్షలతో పనులు సాగుతున్నాయన్నారు. ఈ పనులు టిఎస్‌వి 13, 14 ఆర్థిక సంఘ నిధులతో చేపడుతున్నట్లు చెప్పారు. పాటూరులో రూ. 17.5 లక్షలు, ఆడపూరులో రూ. 9.75 లక్షలు, నాగిరెడ్డిపల్లెలో రూ. 58 లక్షలు, నందలూరులో రూ. 26 లక్షలు, ఎన్‌టి పల్లెలో రూ. 5.5 లక్షలు, లేబాకలో రూ. 7 లక్షలు, టివిపురంలో రూ. 2.75 లక్షలు, 14 లక్షలతో ఇనిమినేషన్ పనులు, టంగుటూరులో రూ. 14.5 లక్షలు, వైసి పల్లెలో రూ. 7.5 లక్షలు, ఇనిమినేషన్ క్రింద రూ. 14 లక్షలు, పొత్తపిలో రూ. 15.5 లక్షలు, కుందానెల్లూరులో రూ. 2.25 లక్షలు, ఇనిమినేషన్ క్రింద రూ. 14 లక్షలతో పనులు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగల్‌విండో అధ్యక్షులు మేడా విజయభాస్కర్‌రెడ్డి, జెడ్పీటీసీ శివరామరాజు, మాజీ ఎంపిపి బి.లక్ష్మీనరసయ్య, సమ్మెట శివప్రసాద్, టిడిపి నాయకులు పొత్తపి చంద్ర, ఎంపీటీసీ శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి, లంకా గంగయ్య, సుబ్బారెడ్డి, ఎం.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓవైపు దుర్గంధం...మరోవైపు ఆక్రమణలు
ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 14: వంద సంవత్సరాల ఘన చరిత్ర కలిగి జిల్లాలో రెండవ అతిపెద్ద పట్టణంలో విరాజిల్లుతున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఓ వైపు దుర్గంధం - మరోవైపు ఆక్రమణలతో కునారిల్లుతోంది. పదిరూపాయలు మనది కాదనుకుంటే ఏదైనా అక్రమంగా నిర్మించుకోవచ్చుననే తలంపుతో నిర్మాణదారులు రోడ్లు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటుంటే అరికట్టాల్సిన అధికారులు తమ జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అధికారుల అవినీతి కంపు రాజధానిని తాకిందంటే ఇక్కడ అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగాల్సినప్పటికీ ఇందుకు విరుద్ధంగా పట్టణంలో రోడ్లు రోజురోజుకూ కుచించుకుపోతున్నాయి. దాదాపు 500 మంది పారిశుద్ధ్య సిబ్బంది నిత్యం పనిచేస్తున్నప్పటికీ పట్టణంలో ఏ సందు చూసినా వ్యర్థాలతో నిండి దుర్ఘంధంతో ప్రజలను అనారోగ్యాల బారిన పడవేస్తోంది. ముఖ్యంగా వ్యర్థాలు తరలించడానికి వాహనాల కొరత, ఉన్న వాహనాలు సరైన కండీషన్‌తో లేకపోవడంతో దుర్ఘంధం తాండవిస్తోంది. పర్మినెంట్ కార్మికులలో విధినిర్వహణ పట్ల నిర్లక్ష్యం, కాంట్రాక్టు కార్మికులలో ఉద్యోగ భధ్రతపై అనుమానాలతో చేసే పని పట్ల చిత్తశుద్ధి లేదన్నది అందరికీ తెలిసిన సత్యం. కార్మికులతో పనిచేయించాల్సిన అధికారులలో కొందరు తమ జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యతనిస్తూ పట్టణ పరిశుభ్రతను గాలికొదిలేశారు. పాలకపక్షానికి సహకరిస్తూ, అభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిన ప్రతిపక్షం, ప్రతిపక్షాన్ని కలుపుకొని పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన పాలకపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికే ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధిని మరిచారు. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకీ లేని విధంగా దాదాపు వందకోట్ల రూపాయల నిధులున్నప్పటికీ పట్టణం మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో వుండటం అందరినీ బాధిస్తున్న వాస్తవం. మున్సిపాలిటీలో అతి కీలక శాఖలలో పనిచేస్తున్న కొందరు అధికారులు మున్సిపాలిటీ ఖజానా నింపడం కంటే తమ ఆదాయానికే అధిక ప్రాధాన్యతనిస్తుండటంతో ప్రభుత్వానికి లక్షల రూపాయలు నష్టం వాటిల్లుతోంది. ప్రజల సొమ్ము జీతాల రూపంలో తీసుకుంటున్న అధికారులు బాధ్యతారాహిత్యంతోను, ప్రజల ఓట్లతో పదవులు పొందిన నాయకులు నిర్లిప్తత, నిర్లక్ష్యంతో మున్సిపాలిటీని అదోగతిలోకి నెట్టివేయడంతోపాటు ప్రజలను అంటురోగాల బారిన పడవేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిజంగా నాయకులు సొంత లాభం మానుకొని బాధ్యతతో మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనుకుంటే అధికారులతో పనులు చేయించుకోలేరా అన్నది పట్టణంలోని సగటు మానవుడి మదిలో వెయ్యి డాలర్లగా ప్రశ్నగా మారింది. ఇప్పటికైనా నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేస్తారని మనమూ ఆశిద్ధాం.

కొత్త కలెక్టరేట్ పనులు వెంటనే పూర్తిచేయండి
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 15: కొత్త కలెక్టరేట్ సముదాయాన్ని ఈ నెల 25 లేక 27 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రారంభించే అవకాశమున్నందున మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఏపి మెడికల్ సర్వీసులు, వౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఇంజనీరర్లను జిల్లాకలెక్టర్ కెవి రమణ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కొత్త కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణ పనులను పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త భవనానికి పెయింటింగ్ చేయడం, ల్యాండ్ స్కేపింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే విద్యుచ్చక్తి అంతరాయం లేకుండా ఉండేందుకు జనరేటర్ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త భవనానికి సంబంధించి మిగిలి ఉన్న పనులన్నీ మరోవారం రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శే్వత టియోటియ, ఎస్‌ఐడి కార్పొరేషన్ ఎస్‌ఇ శ్రీనివాసరావు, ఇఇ సత్యనారాయణమూర్తి, డిఇ పోతురాజు, కలెక్టరేట్ ఎవో బాలక్రిష్ణ పాల్గొన్నారు.

ఎఆర్ పోలీసుల సేవలు ప్రశంసనీయం
కడప (క్రైమ్), ఫిబ్రవరి 15: శాంతి భద్రతల పరిరక్షణలో ఆర్మ్‌డ్ రిజర్వుడ్ పోలీసు సిబ్బంది సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక పెరేడ్ గ్రౌండ్‌లో ఎఆర్ పోలీసు సిబ్బంది మొబిలైజేషన్ ముగింపు పెరేడ్‌కు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పెరేడ్‌ను తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆందోళనలు,శాంతి భద్రతలకు విఘాతం కలిగి సందర్భాలలో పరిస్థితిని సాదారణ స్థాయికి తీసుకొచ్చేందుకు గతంలో నెర్చుకున్న అంశాలను మరోమారు పునశ్చరణ చేసుకునేందుకు మొబిలైజేషన్ ప్రక్రియ దోహదపడుతుందన్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్దవహించాలని ఆయన అన్నారు. వ్యాయమం, యోగా,సైకిలింగ్ ద్వారా ఫిట్‌నెస్‌ను పెంపొందించుకోవాలన్నారు. మనిషి నిరంతరం ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయమం చక్కటి సాధనమన్నారు. ఇటీవల జిల్లాపోలీసు కార్యాలయంలో సిబ్బంది ఫిట్‌నెస్ ఉండేందుకు వీలుగా సైకిళ్లను అందుబాటులో ఉంచామని, అవసరమైతే మరిన్ని సైకిళ్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఎ ఆర్ డి ఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.మొబిలైజేషన్‌లో భాగంగా ఫైరింగ్‌లో మెలుకువలతో పాటు పలు అంశాలపై సుశిక్షతమైన నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహించామన్నారు. స్వతహాగా వైద్యులైన ఎస్పీ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అధిక బరువు ఉన్న వారిని గుర్తించేందుకు బి ఎం ఐ సూచి పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎ ఆర్ సిబ్బందిలో 90 శాతం మందికి నిపుణులైన వారితో పరీక్షలు చేశామన్నారు. ఫైరింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన ఎన్ శ్రీనివాసులు ( ఎఆర్‌పిసి 2437), ద్వితీయ స్థానంలో నిలిచిన టి త్రిలోక్ నాధ్‌రెడ్డి ( ఎ ఆర్‌పిసి 3012), తృతీయ స్థానంలో ఆర్ రామకృష్ణ ( ఎఆర్‌పిసి 2241)లు నిలిచిన వారికి ఎస్పీ బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(పాలన) పివి విజయ్‌కుమార్, ఒయస్‌డి ( ఆపరేషన్) బి సత్య ఏసుబాబు, కడప డీఎస్పీ ఇ.జి అశోక్‌కుమార్, ట్రైనీ ఎఎస్పీ అమిత్‌బాద్దాద్, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ టివి సత్యనారాయణ, ఆర్ ఐ హరికృష్ణ, వన్‌టౌన్ సిఐ రమేష్, ఆర్‌ఎస్సైలు, ఎ ఆర్ సిబ్బంది పాల్గొన్నారు.