కడప

బద్వేలులో నాలుగు స్తంభాలాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బద్వేలు, మార్చి 11: బద్వేలు నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా రంగులు మారుతోంది. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గంలో టిడిపి తరుపున పోటీ చేసి ఓటమి పాలైన విజయజ్యోతి వుండగా ప్రస్తుతం వైకాపా నుంచి ఎమ్మెల్యే జయరాములు ఫిబ్రవరి 24న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి బిజినేముల వీరారెడ్డి హయాంలో బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వుండేది. అయితే 2000 డిసెంబర్ 25వ తేదీన వీరారెడ్డి మృతిచెందడంతో ఆయన కుమార్తె కె.విజయమ్మ రాజకీయ రంగప్రవేశం చేశారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది విజయమ్మ తన తండ్రి వారసత్వాన్ని అందుకున్నారు. అయితే డిలిమిటేషన్‌లో భాగంగా బద్వేలు నియోజకవర్గం 2009లో ఎస్సీలకు కేటాయించబడడంతో అంతవరకు అగ్ర కులస్తులే పోటీలో వున్న బద్వేలు రాజకీయాల్లోకి ఎస్సీలు తెరపైకి వచ్చారు. ఈ నేపద్యంలో 2009లో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తన ఆధ్వర్యంలో లక్కినేని చెన్నయ్యను తెలుగుదేశం పార్టీ తరుపున అభ్యర్థిగా నిలబెట్టినప్పటికీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అనంతరం మాజీ మంత్రి వీరారెడ్డికి ప్రత్యర్థిగా వుంటూ రాజకీయంలో కురువృద్ధుడుగా పేరుపొందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వి.శివరామక్రిష్ణారావు కాంగ్రెస్‌పార్టీని వీడి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకిచేరి మాజీ ఎమ్మెల్యే విజయమ్మతో కలిసి నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా విజయజ్యోతిని ఎంపిక చేశారు. అంతవరకు బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తూ వచ్చిన విజయజ్యోతి తన ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని టిడిపిలో చేరింది. నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా వున్న మాజీ ఎమ్మెల్యేలు విజయమ్మ, శివరామక్రిష్ణారావు 2014 ఎన్నికల్లో ఒకేచోటకు చేరి విజయజ్యోతి గెలుపు కోసం తమ వంతు ముమ్మరంగా కృషి చేశారు. అయితే వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ తరుపున మాజీ ఎమ్మెల్యే డిసి.గోవిందరెడ్డి అప్పట్లో పులివెందుల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న తిరువీధి జయరాములును వైసిపి అభ్యర్థిగా నిలబెట్టి విజయాన్ని సొంతం చేసుకున్నారు. టిడిపిలో ఇరువురు నేతలు ఏకమైనప్పటికీ వైసిపి ఘన విజయాన్ని సాధించడంతో అప్పట్లో జగన్ ప్రాబల్యం వుందని, కనుకే తమ పార్టీ అభ్యర్థి టిడిపి పవనాలు బలంగా వీస్తున్నా ఓడిపోవడం జరిగిందని నేతలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టిడిపి తరుపున ఎమ్మెల్యేగా పోటీచేసిన విజయజ్యోతిల మధ్య తీవ్ర అంతరాలు ఏర్పడ్డాయి. ఇక అప్పటి నుంచి ఎవరి తరహాలో వారు వర్గాలను ఏర్పరుచుకొని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సేవ చేస్తూ వచ్చారు. ఈ నేపద్యంలో ఓడిపోయిన వారికి అసెంబ్లీ ఇన్‌చార్జి పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించడంతో అప్పటి నుండి తానే ఇన్‌చార్జినని విజయజ్యోతి చెప్పుకునేందుకు ప్రయత్నించినా విజయమ్మ, ఆమె వర్గీయులు ససేమిరా అంటూ ఇన్‌చార్జిగా విజయజ్యోతి పేరును ప్రకటించకుండా ఉండేందుకు జిల్లా అధిష్టానం వద్ద తమ వంతు ప్రయత్నాలు సాగించినట్లు విమర్శలున్నాయి. ఈ నేపద్యంలో వారిరువురి మధ్య విబేధాలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దాని కారణంగా చివరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరయ్యే నిధుల విషయంలోను, సాగునీరు, సొసైటీ తదితర ఎన్నికల విషయంలోను ఎవరి తరహాలో వారు వర్గాలను పెంచిపోషిస్తూ వచ్చారు. ఇరువురు నేతల మధ్య సమన్వయం కుదిర్చేందుకు జిల్లా నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలీకృతం కాలేదు. దాంతో విజయమ్మ వర్గం ఒకపక్క, మాజీ ఎమ్మెల్యే శివరామ అనుచరులతో కూడిన మరో వర్గాన్ని విజయజ్యోతి ఏర్పరుచుకున్నారు. ఈ తరుణంలో యోగివేమన యూనివర్శిటీ పాలకమండలి సభ్యురాలుగా విజయజ్యోతిని ఎన్నిక చేశారు. ఆమె వర్గంలో ఆ పదవి ఆనందాన్ని కలిగించినా ఇక అతి త్వరలో ఇన్‌చార్జ్జి పదవి తనకే వస్తుందన్న ఆలోచనలో ఉన్న నేపద్యంలో వైసిపి ఎమ్మెల్యే జయరాములు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఇన్‌చార్జి పదవి మాట పక్కనబెట్టి చంద్రబాబు తనయుడు లోకేష్ సూచనల మేరకు నియోజకవర్గంలో టిడిపిలోకి ఇతర పార్టీ నేతలను తీసుకోవడం కోసం పావులు కదుపుతున్నారు. జయరాములు పార్టీలో చేరిన నేపద్యంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తన సొంత ఖర్చుతో జయరాములును ఘనంగా స్వాగతించింది. కేవలం విజయజ్యోతి ప్రాబల్యాన్ని నియోజకవర్గంలో తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే విజయమ్మ ఇటువంటి విధానాలకు పాల్పడుతోందని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. అదే తరుణంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సమక్షంలో ముగ్గురినీ ఒకే వేదికపై చేర్చినప్పటికీ తనకూ విజయమ్మకూ మధ్య పలు కారణాల దృష్ట్యా సమన్వయ లోపం ఏర్పడిందని, దాంతో నియోజకవర్గంలో రెండు వర్గాలయ్యాయని, ఇకపై అలా కాకుండా అందరం కలిసి పనిచేస్తే బాగుంటుందని విజయజ్యోతి సభా వేదికపై బాహాటంగానే చెప్పుకొచ్చింది. ఆ మేరకు ముగ్గురు నేతలు కలిసి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని జిల్లా నేతలు సూచించినప్పటికీ, విజయజ్యోతిల మధ్యమాత్రం అనైక్యత స్పష్టంగా కొనసాగుతోంది. ఎట్టకేలకు వైసిపిని వదిలి టిడిపిలోకి వచ్చిన జయరాములు ఇరువురు నేతలను కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారా లేదా అన్న ప్రశ్నలు విశే్లషకుల్లో తలెత్తుతున్నాయి. నియోజకవర్గంలో ముచ్చటగా ముగ్గురైన ఈ నేతలు ఎంతమేరకు కలిసి పనిచేస్తారో వేచిచూద్దాం.
మండుతున్న శీతల పానీయాల ధరలు
కడప, మార్చి 11: జిల్లాలో క్రమేణా వేసవి తమ ప్రతాపాన్ని చూపుతోంది. జిల్లాఅంతటా ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతుండటంతో సీజన్ సమస్యలు మొదలవుతున్నాయి. మండుటెండల నేపథ్యంలో చల్లదనాన్ని ఇచ్చే పుచ్చకాయలు, కొబ్బరిబోండాలకు గిరాకీ పెరిగింది. నగరంలో ఒక్కో పుచ్చకాయ 30 నుంచి 50 రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. నగరంలోని ప్రతిచోటా పుచ్చకాయల విక్రయ వ్యాపారులు ఎక్కువయ్యారు. అదేవిధంగా కొబ్బరి బోండాలకు కూడా గిరాకీ పెరగడంతో వాటిని అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఒక్కో బోండా సైజుల వారీగా రూ.15 నుంచి 35 రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. వేసవి తాపానికి ప్రజలు వాటిని వినియోగించక తప్పడం లేదు. కాగా క్రమేణా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా నీటి కొరత కూడా అధికమవుతోంది.
కాగా పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండని విధంగా చల్లని కూల్ డ్రింక్స్ ధరలు పెంచేస్తున్నారు. వాటి డిమాండ్‌కు అనుగుణంగా అధిక ధరలకు విక్రయించి దోచుకుంటున్నా కడప నగరపాలక సంస్థ లేదా సంబంధిత శాఖాధికారులు స్పందించడం లేదు. అలాగే కడప నగరంలో నీటి కొరత ఇప్పుడిప్పుడే ఆరంభమవుతోంది. ప్రత్యామ్నాయ చర్యలపై కడప కార్పొరేషన్ దృష్టి సారించడం లేదు. నగరంలో పారిశుద్ధ్యం అటకెక్కగా డ్రైనేజీ సమస్య ప్రజలను ఇబ్బందిపెడుతోంది. నగరంలో పారిశుద్ధ్యం లోపించినప్పటికీ దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. కడప నగరంలో ఈ సమస్య సాధారణమే అయినా వేసవి కాలంలో మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేగాకుండా మురికివాడలు, అధికారులు తొంగిచూడని ప్రాంతాల్లో సమస్య మరీ జటిలమవుతోంది. రాత్రి వేళల్లో నీటి సరఫరా ప్రజలను కుంగదీస్తోంది. మురికినీరు, నీటికొళాయిల ద్వారా లభించే నీళ్లు కలుషితమవుతున్నాయి. తాగునీటి సమస్య, పారిశుద్ధ్యంపై కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బీమా సొమ్ము చెల్లించకపోతే ఇన్సూరెన్స్ కార్యాలయం ముట్టడి
వీరపునాయునిపల్లె, మార్చి 11: పంటలబీమా చెల్లించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో వీరపునాయునిపల్లె మండలంలోని తంగెడుపల్లె క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం రాష్ట్ర కిసాన్‌రైతు సంఘం అధ్యక్షుడు జి.సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, అఖిలపక్ష నేతలు రోడ్డుపై బైఠాయించి ఆంధోళన చేపట్టారు. ఈ సందర్భంగా కడప ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ 2013-14కు సంబంధించి రబీ సీజన్‌లో రైతన్నలు సాగుచేసిన బుడ్డశనిగ, పొద్దుతిరుగుడు, వరి, వేరుశనగ, ఉల్లి తదితర పంటలకు బీమా చెల్లించిన వారికి ఇంతవరకు బీమా మొత్తం మంజూరు కాలేదన్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులతో చర్చించడం, బీమా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారని, దానిని ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. మాజీ మంత్రి వై ఎస్.వివేకానందరెడ్డి మాట్లాడుతూ 80,200 మంది రైతులు బీమా చెల్లించినా వారికి బీమా మొత్తం రాలేదని, అందువలన రైతులతో కలిసి కడపజిల్లా నుండి హైదరాబాద్ ఇన్సూరెన్స్ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామని, కార్యాలయం వద్ద ఆంధోళన చేపడుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ఇన్సూరెన్స్ కంపెనీ రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఈనెలాఖరులోగా చెల్లించాలని ఆయన కోరారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు జరుగుతున్న అన్యాయంపై శాసనసభలో ప్రస్థావిస్తానని ఆయన అన్నారు. రాష్ట్ర కిసాన్‌కాంగ్రెస్ కన్వీనర్ జి.సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఇన్సూరెన్స్ చెల్లించాలని అధికారులకు ఎన్నోసార్లు హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ కార్యాలయంలోని అధికారులతో మాట్లాడినా ఇంతవరకు వారు స్పందించలేదన్నారు. దాని ఫలితంగా ఎన్నోసార్లు రైతులతో కలిసి అధికారులను హెచ్చరించినా వారికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రైతులను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడినందున రైతులు వరదరాజులరెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఒకదశలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఎర్రగుంట్ల సిఐ, పోలీసులు రైతులకు నచ్చజెప్పి వరదరాజులరెడ్డిని అక్కడి నుంచి పంపించివేశారు. పులివెందుల, కడప, వేంపల్లె, ప్రొద్దుటూరుకు వెళుతున్న వాహనాలను రైతులు నిలిపివేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయి మూడుగంటలపాటు ట్రాఫిక్ స్థంభించిపోయింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఎర్రగుంట్ల సిఐ రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, పోలీసులు బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కన్వీనర్ వెంకట్, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, వైకాపా జిల్లా నాయకులు సమ్మటూరు ప్రకాష్, మండల వైకాపా నాయకులు రఘునాధరెడ్డి, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బాబు బడ్జెట్ అంకెల గారడీ
కడప, మార్చి 11: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈమారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏదీ లేదని వైకాపా ఎమ్మెల్యేలు, నేతలు శుక్రవారం ధ్వజమెత్తారు. వైకాపా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఏ.అమరనాధరెడ్డి, వైకాపా ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాధరెడ్డి, ఎస్‌బి అంజద్‌బాష, మేయర్ కె.సురేష్‌బాబులు మాట్లాడుతూ ఈ ఏడాది సీమ ప్రాజెక్టులకు కేవలం రూ.500కోట్లు మాత్రమే కేటాయించారని, ఈ నిధులు ఒక మూలకు సరిపోవని అన్నారు. అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల్లో ప్రజాసంక్షేమం, అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కేవలం బాబు తన జిమ్మిక్కులతో ప్రజలను మభ్యపెడుతున్నారని వారు ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన బాబు రెండేళ్లు పూర్తిచేసుకుంటున్నా కనీసం రైతులకు పంటల నష్టపరిహారం కానీ, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ కాని అమలుచేయలేక పోయారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వచ్చే జూన్‌నాటికి పట్టిసీమ నీరు సీమ జిల్లాలకు తెస్తానని ప్రగల్బాలు పలుకుతున్న బాబు... జిఎన్‌ఎస్‌ఎస్ దశ -1, జిఎన్‌ఎస్‌ఎస్ దశ -2, తెలుగుగంగ, జికె -సిబిఆర్, జికె -ఎల్‌ఐ, జివిఆర్ కుడికాలువ వావికొండ రిజర్వాయర్, సర్వారాయ సాగర్ జలాశయాలకు ముష్టితరహాలో నిధులను విధిలించారే తప్ప దీనివల్ల జిల్లాకు ఒరిగేది ఏమీలేదని వారు ఆరోపించారు. కృష్ణామిగులు జలాలు జిల్లాకు వచ్చే పరిస్థితులే లేవని, గత ఏడాది బడ్జెట్ ప్రకటనలకే పరిమితమయ్యారని అన్నారు. ఈ ఏడాది బడ్జెట్ జిల్లాకు పెద్దగా ప్రాధాన్యత కల్పించలేదని వారు ఆరోపించారు. గ్రిడ్‌లు, మిషన్లు, ఆయన ఊహించిన ఏ ఒక్క పథకం కూడా గాలి కబుర్లే తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీలేదని వారు ధ్వజమెత్తారు. అలాగే రాయలసీమపై ఇక్కడి ప్రజలపై చిన్నచూపు చూశారన్నారు. రైతులకు కాలువల ద్వారా నీరు రావడానికి నిధులు కేటాయించాలి గానీ, నీళ్లు వచ్చేంతవరకు కాలువ గట్లపై పడుకుంటానని చెబితే నీళ్లు వస్తాయా అని వారు ప్రశ్నించారు. హౌసింగ్‌కు కేటాయించిన నిధుల్లో వైఎస్సార్ హయాంలో నిర్మాణాలు చేపట్టిన ఇందిరమ్మ గృహాల పెండింగ్ బిల్లులకు కూడా సరిపడవని తెలిపారు. గండికోటకు నీరు రావాలంటే దాదాపు రూ.1300కోట్లు ఖర్చుపెట్టాలని, ఇందుకు రూ.345కోట్లు బడ్జెట్‌లో కేటాయించడం అన్యాయమన్నారు. అన్ని బిసి కులాలకు, ఫెడరేషన్లకు కూడా అరకొరనిధులు విడుదల చేశారని ఆరోపించారు.

మాతృభాషను మరుస్తున్న నవతరం
రైల్వేకోడూరు, మార్చి 11:ఆంగ్లభాషను ఈతరం ఆరాధిస్తూ మాతృభాష తెలుగును మరచి పోతున్నారని ప్రముఖ సహాస్ర ఆవధాని నరాల రామారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని పాలకొండ్రాయ డిగ్రీ కళాశాలలో మైనంపాటి లలిత కళాపీఠం అధ్యక్షులు బి.రాజగోపాల్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన తెలుగుభాష అవగాహన సదస్సుకు నరాల ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం సైతం ఆంగ్లభాషను ఒకటో తరగతి నుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థులకు నేర్పించాలన్న ఉద్ధేశ్యంతో ఉన్న ఈ తరుణంలో మాతృభాష తెలుగును రోజు రోజుకు మరచి పోవడం తల్లిని మరచి పోయినట్లేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కవులు, కళాకారులకు కొదవ లేని రాష్ట్రంలో విదేశీ భాషయైన ఆంగ్ల మోజులో విద్యార్థులు మొదలుకుని వారి తల్లిదండ్రులు సైతం పిల్లలకు ఆంగ్లభాష బోధన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో మాతృభాష కనుమరుగు కావడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం తెలుగుభాష అభ్యున్నతి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నామంటూ ప్రకటనలు గుప్పించడమే తప్ప మాతృభాష విషయంలో సరియైనటు వంటి శ్రద్ధ తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలన్ని తెలుగుభాషతోనే ముడి పడి ఉన్నాయన్న విషయాన్ని సైతం పాలకులు, అధికారులు గుర్తించక పోవడం దౌర్భాగ్యమన్నారు. ఉద్యోగాల కోసం ఆంగ్లభాషను నేర్చుకోవచ్చు గాని మన భాషను మరచి పోరాదన్న విషయాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు సైతం మరవ రాదన్నారు. తెలుగుభాషను మరవడం వలన ఎంతో మంది కవులు, కళాకారులు రచించిన రచనలు, పాడిన మన పాటలు కనుమరుగు కావడంతో కవులు కూడా రచనలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కవులు, కళాకారులను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కవులు రచించిన కావ్యాలను, మన దేశ చరిత్రను ఈ తరం విద్యార్థులకు అందించే విధంగా పాఠ్యాంశాలలో నేర్పించాలని నరాల రామారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో కవులు డాక్టర్ వెంకటసుబ్బయ్య, డాక్టర్ అజయ్‌చైతన్య, సుబ్బరాఘవరాజు, కళాశాల కరస్పాండెంట్ మందల ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొని, ప్రసంగించారు.

మీసేవను సద్వినియోగం చేసుకోండి
జమ్మలమడుగు, మార్చి 11: మీసేవ అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మున్సిపాలిటీ పన్నులు చెల్లింపుల సర్వీసును పట్టణంలోని మీసేవ కేంద్రంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగకుండా చాలా సేవలను మీసేవ ద్వారా అందిస్తోందన్నారు. మీసేవా ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మారుతున్న సమాజంతో పాటు మనం కూడా మారాల్సి వుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది దిశలోభాగంగా త్వరలో రూ.150లకే వైఫై ద్వారా ఇంటర్నెట్‌తో పాటు సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుందన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై ప్రజలు కూడా అవగాహన కలిగివుండాలన్నారు. 100 రోజుల ప్రణాళిక ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా పెండింగ్‌లో వున్న అన్ని పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ టి.తులసి, కమీషనర్ మధుసూధన్ రెడ్డి, మీసేవ జిల్లా అధికారి చంద్రమోహన్, తహశీల్దార్ వెంకటరెడ్డి, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
బడ్జెట్ ఖర్చులను ప్రజలకు బహిరంగపర్చాలి
ప్రొద్దుటూరు, మార్చి 11: 2016-17 సంవత్సరాకిగాను రూ.1,35,689 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించినట్లు చెబుతున్న ప్రభుత్వం 2014-15లో ప్రవేశపెట్టిన బెడ్జట్‌లో ఏఏ పనులకోసం ఎంతెంత డబ్బు ఖర్చు చేసిన విషయం, కేటాయించిన బడ్జెట్ పూర్తిగా ఖర్చు చేశారా లేక మిగులు వుందా ఎపి దళితసమాఖ్య జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లె యల్లయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది ప్రజా శ్రేయస్సుకై ప్రవేశపెట్టిన బడ్జెట్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని, ఈ బడ్జెట్ ద్వారా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రతి సంవత్సరం మార్చినెలను బడ్జెట్ కేటాయింపుల మాసంగా చేసుకొని రాష్ట్ర స్థాయి బడ్జెట్‌ను కేటాయిస్తున్నప్పటికీ మరో సంవత్సరం మార్చి నాటికి పూర్తిగా ఖర్చు చేయాల్సివుంటుందన్నారు. కేటాయించిన బడ్జెట్‌ను ప్రతి మూడునెలలకొకసారి ఖర్చు చేసిన వివరాలను శే్వతపత్రం రూపంలో ప్రజలకు, పత్రికలకు బహిరంగపరచాలని ఆయన కోరారు. ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్‌ప్లాన్ నిధులు, కాపు, బ్రాహ్మణ కార్పోరేషన్లకు కేటాయించిన నిధులు, ఎన్‌టి ఆర్ భరోసా, ఎన్‌టి ఆర్ ఆరోగ్యశ్రీ, ఉపాధి పనుల కోసం కేటాయించి ఖర్చు చేసిన నిధులను ప్రజలకు బహిరంగపరిచి ప్రజల నుంచి మన్ననలు పొందాలని ఆయన డిమాండ్ చేశారు.
బడ్జెట్‌లో రాయలసీమకు అన్యాయం
ప్రొద్దుటూరు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీతో రాయలసీమ ప్రజలను మోసపుచ్చేదిగా వుందని లోక్‌సత్తా నియోజకవర్గ కార్యదర్శి సుగవాసి వెంకటరామాంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో రాయలసీమ అవసరాలను ఏమాత్రం పట్టించుకోలేదని, ఈ ప్రాంతానికి ప్రాణాధారమైన హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు పూర్తి కావడానికి సుమారు రూ.6 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. కాగా హంద్రీ-నీవాకు రూ.504 కోట్లు, గాలేరు-నగరికి రూ.345 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. బడ్జెట్ ప్రసంగంలో రాయలసీమకు స్పెషల్ ప్యాకేజీ గురించి మాట్లాడకపోవడం విచారకరమన్నారు.

14న రాధాకృష్ణ ఆలయ మహా కుంభాభిషేకం
కమలాపురం, మార్చి 11: పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీరాధాకృష్ణా ఆలయంలో ఈ నెల 14నుంచి 18 వరకు ఆలయ ప్రతిష్ట,మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం పంపాపీఠాధిపతి గోవిందానంద సరస్వతితో కలసి ఆలయంలో ముమ్మరంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఆయనకు ఆలయ ప్రారంభసందర్భంగా చేపట్టాల్సిన పనులను సూచించారు. ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం చేయాల్సిన పనులను పుత్తాకు తెలియచేసారు. ఈసందర్భంగా పుత్తా నరసింహారెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ మహాకుంభాభిషేక మహోత్సవానికి రాష్ట్ర,రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పీఠాధిపతులు,రాష్టమ్రంత్రులు, శాసనసభ్యులు,ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ట హాజరవుతారన్నారు. 14న ఉదయం మాచిరెడ్డిపల్లె నుంచి పంపాక్షేత్ర స్వర్ణహంపి పీఠాధిపతి గోవిందానందసరస్వతి స్వామివారి నేతృత్వంలో రాధాకృష్ణా శోభాయాత్ర, ఆలయ ప్రవేశం సాయంత్రం హంపి విరూపాక్షపీఠాధిపతి విద్యారణ్యభారతి స్వామికి పూర్ణకుంభ స్వాగతం స్వామివారిచే ప్రవచనాలు ఉంటాయన్నారు. 15న శాంతిహోమం, ప్రవచనాలు ఉంటాయన్నారు. 16న పుష్పగిరి మహాసంస్థాన పీఠాధిపతి విద్యాశంకరభారతి స్వామికి పూర్ణకుంభస్వాగతం సాయంత్రం ఆయన భక్తులకు ప్రవచనాలు చేస్తారన్నారు. 17న అహోబిలం పీఠాధిపతి రామానుజియ్యర్ స్వామి విద్యాశంకరస్వామి,గోవిందానందసరస్వతి స్వామి వారి పీఠాధిపతులతో కలశ ప్రతిష్ట,గరుడ ప్రతిష్ట,్ధ్వజప్రతిష్ట జరుగుతా యన్నారు. 18న కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామివారిచే రాధాకృష్ణుల మూలవిగ్రహప్రతిష్ట, అష్టబంధన ప్రతిష్ట జరుగుతాయన్నారు. అనంతరం శాంతి కళ్యాణం,గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్బంగా వాయిద్యాల పోటీలు,్భరతనాణ్య ప్రదర్శన,్భజన,రంగస్థల పద్యాల పాటల పోటీలు ఉంటాయన్నారు. అలాగే 16న జూనియర్ ఎద్దులు,17న సీనియర్ ఎద్దులతో రాతిదూలం లాగే పోటీలు, 18న సీనియర్ సైజ్ వృషభరాజములచే బండలాగుడు పోటీలు ఉంటాయన్నారు. కాగా ఈ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ హాజరై విజేతలకు బహుమతులు అందచేస్తారన్నారు. ఇదిలా ఉండగా ఆలయ విగ్రహప్రతిష్టాకార్యక్రమా లకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావుతో పాటు ఇతర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి,బొజ్జాగోపాలకృష్ణారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారన్నారు. పెద్ద ఎత్తున అన్నధాన కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు వివరించారు.