భక్తి కథలు

యాజ్ఞసేని-14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మగధ సామ్రాజ్యానికి సార్వభౌముడు ‘జరాసంధుడు’.
జరాసంధుడు వృద్ధక్షత్రుడి కుమారుడు.
ఒక ముని యొక్క వరంతో వృద్ధక్షత్రుడి ఇద్దరి భార్యలకు ఒక్కొక్కరికి శరీరంలోని సగ భాగంతో ఒక కుమారుడు జన్మించగా వారు భయపడి ఆ రెండు అర్థశరీర భాగాలను కోట ఆవలగల చదుకం వద్ద పారవేయిస్తారు. ఆ ప్రాంతంలో సంచరిస్తూ యుండే ‘జర’ అనే ఒక రాక్షసి ఆ వికృత శరీర భాగాలను మాంసఖండాలని భావించి భుజింపనెంచి వాటిని ఒకటిగా పట్టుకొనగా అవి ఒక బాలుడుగా మారి పెద్దగా ఏడుస్తాడు. ఆ ఏడుపును విన్న దాసీజనం, రాజపరివారం రాజు అక్కడికి వస్తారు. ఆ జర రాక్షసి ఒక అందమైన స్ర్తిగా మారి ఆ పిల్లవాడిని రాజుకు అప్పగించి జరిగిన విషయాన్ని వివరిస్తుంది.
‘జర’ అనే ఆ రాక్షసిచే సంధింపబడినవాడు కాబట్టి ఆ బాలుడికి ‘జరాసంధుడు’ అనే పేరు పెట్టాడు రాజు.
జరాసంధుడు మహాబలవంతుడు. ఎందరో రాజులను పట్టి బంధించి వారిని కారాగృహంలో ఉంచుతాడు. రోజుకు ఒక్కడిని దేవికి బలిగా ఇస్తుంటాడు.
ఆ జరాసంధునికి ఛేదిదేశపు రాజైన శిశుపాలుడు సేనాపతిగా ఉంటాడు. శిశుపాలుడు శ్రీకృష్ణ బలరాములకు మేనత్త కొడుకు (సాత్త్వతిదమఘోషుల కుమారుడు).
జరాసంధునికి యిద్దరు కుమార్తెలు ‘అస్తి, ప్రాప్తి’ అనువారు. ఆ ఇద్దరు కుమార్తెలను జరాసంధుడు మధురానగరాధిపతి అయిన ‘కంసుని’కి ఇచ్చి వివాహం చేస్తాడు.
శ్రీకృష్ణుడు మేనమామ అయిన కంసుని సంహరిస్తాడు. తన అల్లుడిని సంహరించాడని పగబూనిన జరాసంధుడు శ్రీకృష్ణునిపైకి పదునెనిమిది పర్యాయాలు దండెత్తిపోతాడు.
శ్రీకృష్ణుడు అతడి బారినుండి ప్రజలను రక్షింపనెంచి మధురను వదలి కుశస్థలం అనే ప్రదేశం వద్దకు పశ్చిమ సముద్రంలో రైవతికాద్రిపై ఒక కోటను నిర్మింపచేయించుకుంటాడు. యదువృష్ణి కుకుర భోజకాంధకులనందరినీ అక్కడికి తరలించి అక్కడే నివాసముంటాడు. జరాసంధుని తరచు దాడులనుండి తప్పించుకుంటాడు.
జరాసంధునికి మహాబలవంతులు, మాయాయుద్ధ నిపుణులు అయిన ఇద్దరు మిత్రులు హింసడిభకులు (కౌశికచిత్రసేనులు) అనేవారు ఆప్తులు. జరాసంధునికి ఎల్లప్పుడూ కుడి ఎడమ భుజాలుగా ఉంటారు.
శ్రీకృష్ణుడు హింసడిభకులనిద్దరినీ ఉపాయంతో మట్టుబెట్టిస్తాడు. జరాసంధునికి పెద్ద దెబ్బ తగులుతుంది.
అంతేగాక పడమటి దేశపు రాజు ప్రాగ్జ్యోషితపురాధిపతి (నరకాసురుని కొడుకు) అయిన భగదత్తుడు, అంగ, వంగ, పుండ్రరాజులు, కిరాతరాజుల్లో పౌండ్రవాసుదేవుడు, తూర్పు దక్షిణ రాజులైన కరూశుడు, కలభుడు, నకులుడు, సంకర్షణుడు, సూపహితుడు, మనోదత్తుడు, చక్రుడు, సాల్వేయుడు, యవనులు జరాసంధునికి భయపడి అతడిని సేవిస్తూండేవారు.
ఉత్తర దిక్కున ఉన్న పదునెనిమిది రాజవంశీయులవారు కూడా జరాసంధునికి భయపడి ఉండేవారు.
అయితే హస్తినాపురం మీదకు రావటానికి జరాసంధుడు ప్రయత్నించలేదు. అతడికి కొంత భయము కూడా వున్నది. కారణం అక్కడ జయింపశక్యంగాని మహావీరుడైన భీష్మపితామహుడు, అస్తగ్రురువులైన ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఉన్నారనీ, వారిని జయింప అవశ్యమనీ, వారితో వైరం మంచిదిగాదని తలంచటమే.
అలాంటి బలలవంతుడైన జరాసంధుడు స్వయంవరానికి వచ్చి ఎలాంటి సమస్యలను తెచ్చి పెడతాడోనని ద్రుపదునికి భయం పట్టుకుంది. ద్రౌపదిని తన మనుమడైన మేఘనందికి భార్యగా చేయమని కబురు కూడా పంపాడు.
ద్రుపదుడికి కురు రాజ్యంతో తలపడే ధైర్యం కూడా లేదు. ఇదివరలో ద్రోణుడి చేతిలో పరాభవింపబడినాడు కావున రాగల ఆపదలను గురించి పసిగట్టి ముందుగానే తగు జాగ్రత్తలను తీసుకొనవలసిన ఆవశ్యకత పెరిగింది. అట్టి పరిస్థితులలో శ్రీకృష్ణవాసుదేవుని సహాయం అర్థిస్తే అటు కురు రాజ్యంతోనూ, ఇటు జరాసంధునితో కూడా ఎట్టి ప్రమాదం ఉండకపోవచ్చుని తలంచి, దృష్టద్యుమ్నుని గురుదేవులు సాందీపాని ద్వారా శ్రీకృష్ణుని ప్రార్థించి అతడిని తోడ్కొని రమ్మని పంపుతాడు. దృష్టద్యుమ్నుడు శ్రీకృష్ణవాసుదేవుని దర్శించి తన తండ్రి ప్రార్థన మన్నించి కాంపిల్యానికి రావలసినదిగా కోరుతాడు. అందులకు శ్రీకృష్ణుడు అంగీకరిస్తాడు.
శ్రీకృష్ణుడు సాత్యకిని వెంట నిడుకొని కాంపిల్యానికి వస్తాడు.
ద్రుపద మహారాజు సంతోషంతో ఎదురేగి శ్రీకృష్ణునికి స్వాగతం పలుకుతాడు. చేయవలసిన మర్యాదలు చేస్తాడు

- ఇంకా ఉంది

- త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము