భక్తి కథలు

యాజ్ఞసేని-25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మృదంగవీణ పిల్లనగ్రోవుల రసమయ సంగీత ధ్వని అన్నివైపులా వ్యాపించింది.
అనేక విధాలైన వాద్యాల ధ్వనుల హోరు సముద్ర ఘోషను తలపించింది.
మంచి పూదండలు, గంధం వంటి మంచి మైపూతలు మొదలైన సువాసనలతో కూడిన చల్లనిగాలి స్వయంవర రంగ మధ్యలోనున్న జనులకు తృప్తి కలిగించే విధంగా వీచింది.
దట్టమైన బూడిద నడుమ నిప్పుకణాలవలె బ్రాహ్మణ శ్రేష్ఠుల మధ్య స్పష్టంగా తెలియకుండా ఆశీనులైయున్న ‘పాండవులైదుగురినీ’ యదువంశ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు సంతోషంతో గుర్తించాడు. అర్జునుడు ఈ ద్రౌపదిని చేపట్టగలడని హృదయంలో తలంచాడు.
ద్రౌపదిని చేట్టాలని మన్మథుని బాణాలతో పీడించబడుతూ అక్కడికి వచ్చిన రాజులందరూ పూర్వం స్నేహితులైనా అక్కడ మాత్రం ఒకరినొకరు ద్వేషించుకొనసాగారు.
బలరాముడు, వృష్ణివీరులు, అంధక యదువీరులు అందరూ శ్రీకృష్ణుని యిష్టానికి లోబడి ప్రేక్షక పాత్ర వహించి కూర్చుండిపోయారు. విల్లు ఎక్కుబెట్టదల్చుకోలేదు. అయిదు మదపుటేనుగుల్లా నివురు గప్పిన నిప్పులా యున్న ధర్మరాజు, భీమార్జున నకుల సహదేవులను శ్రీకృష్ణుడు మెల్ల మెల్లగా వరుసగా బలరాముడికి చూపించి చెప్పాడు. బలరాముడు సంతోషించాడు. ఇతర రాజులు శ్రీకృష్ణబలరాములను, పాండవులను ద్రౌపదిపైనున్న మనస్సుతో గుర్తించలేకపోయారు.
అంతకుముందే కొందరు రాజులు ‘‘ఈ ద్రౌపది ఏ విధంగానైనా ఎవ్వరికినీ లభించదు. మొదట ఈ విల్లు ఎక్కుపెట్టుటకు సాధ్యంగాదు. ఎక్కుబెట్టినా ఆకాశంలోని ఆ మత్స్యయంత్రాన్ని ఛేదించడం బ్రహ్మాదులకైనా అలవిగాదు’’ అని ఆలోచించి గర్వం వదిలి తమ తమ స్వస్థలాలకు దారిపట్టారు.
ఎందరో రాజులు ఆసీనులైయున్న సభాస్థలిని ఒక్కసారి కలియజూచింది ద్రౌపది. అగ్నిహోమం నుండి పైకెగిసి తిన్నగా వస్తున్న పొగ సభా ప్రాంగణమంతటినీ పల్చగా వ్యాపించింది. అలా వ్యాపిస్తూ వస్తున్న పొగ ద్రౌపది కళ్ళమీదనుండి ముందుకు సాగింది. ఆ పొగ ద్రౌపది కనుదోయిని అలికినట్లుగా చేసింది. ఆసక్తితో ఆశీనులై వున్న రాజలోకాన్ని తిలకిస్తున్న ద్రౌపదికి ఒక్కసారి వారంతా కత్తులు దూసుకొని ఒకరిపై ఒకరు విజృంభించినట్లుగా తోచింది. వారి శరీరాలనుండి జాలువారిన రక్తం ఏరుగా ప్రవహిస్తున్నట్లు, వారంతా హాహాకారాలు చేస్తున్నట్లు వినిపిస్తున్నది.
వారిమధ్యలో శ్రీకృష్ణవాసుదేవుడు చక్రాయుధం ధరించి వారిని వారిస్తున్నట్లు కనిపిస్తున్నది.
ఆ వాసుదేవుడు, తాను నమ్మిన స్వామి, తనకు సహాయంగావచ్చి నిలబడ్డాడు. ధైర్యం ఆవహించింది. వెంటనే పొగమంటకు కొంచెంగా మండినట్టయిన కళ్లను చిన్నగా నులుమి చూసింది. రాజులందరూ వారి వారి ఆసనాలలో యధావిధిగా ఆసీనులై యున్నారు.
అందులో కనులకు కనిపించేటంత దూరంలో శ్రీకృష్ణ్భగవానుడు ఆశీనుడై చిరునవ్వు చిలికిస్తున్నాడు. మనసు దిటవుపడింది.
సభాస్థలి అంతా నిశ్శబ్ద వాతావరణాన్ని ఆవహించింది.
వచ్చిన రాజులు తమ ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. మత్స్యయంత్రాన్ని ఛేదించ ప్రయత్నించే రాజు లేచి బయలుదేరగానే భేరీ మృదంగాలు వాయించి ఆహ్వానించారు.
వందిమాగధులు ఆయా రాజుల వివరాలను, గొప్పతనాన్ని, వంశ వివరాలను గానం చేశారు.
కొంతమంది రాజులు దృఢంగా వింటిని ఎక్కుబెట్టబోయి విసిరివేయబడ్డారు. కొందరు రాజులు చేష్టలుడిగి నేలమీద పడ్డారు.
కొందరు రాజులు తమ తమ బలాలకు తగినట్లుగా ప్రయత్నిస్తూ శక్తులుడిగి కిరిటాలు పడిపోయాయి. మరికొందరి ఆభరణాలు జారిపడిపోయాయి. ఇంకా కొందరు రాజులు ఆ ధనస్సును ఎత్తటానికి ప్రయత్నించి రొప్పుతూ క్రిందపడి శాంతించారు.
యదువృష్ణి భోజాంధకులు శ్రీకృష్ణుని అభిప్రాయాన్ననుసరించి ధనుస్సును ఎక్కుబెట్టే ప్రయత్నాన్ని చేయలేదు.
కొంత నిశ్శబ్దం ఆవహించింది.
ఇంతలో చేది ప్రభువైన ‘శిశుపాలుడు’ లేచాడు. అక్కడ వున్న రాజులందరినీ కలియజూచాడు. ఠీవి ఉట్టిపడేట్లుగా ద్రుపద మహారాజు వద్దకు వెళ్ళాడు.
ద్రుపదుడికి వంగి నమస్కరించాడు. ఆశీస్సులను పొందాడు.
యంత్రం ఉన్న స్థలానికి బయలుదేరాడు.
వెంటనే వాద్యాలు, భేరీ మృదంగాలు మ్రోగాయి. వందిమాగధులు గాత్రం సరిచేసుకొని ‘‘వీరు ఛేది రాజ్య ప్రభువులైన ‘శిశుపాల’ నామధేయులు. దమఘోషసాత్త్వతీ జేష్ఠపుత్రులు. ధనుర్విద్యానిపుణులు. అరివీర భయంకరులు. శ్రీకృష్ణ బలరామ ప్రభృతులకు మేనత్త తనయుడు’’ అని ఘోషించారు. శిశుపాలుని వంశాన్ని పొగిడారు.
శిశుపాలుడు బలగర్వంతో యంత్రస్థలికి చేరాడు. అక్కడయున్న పెద్ద ధనుస్సును చూచి దానిని చేతిలోనికి తీసుకున్నాడు. ఎడమకాలి బ్రొటనవేలు ప్రక్క వ్రేలిమధ్య వింటి ఒకకొన నదిమి పట్టాడు. ఎడమ చేతితో విల్లు పైభాగాన్ని పట్టుకొన్నాడు. - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము