బాల భూమి

లెక్కకు మించిన తిక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంపవరం రాజ్యాన్ని మోహిత్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. అయితే అతనికి లెక్కకు మించిన తిక్క ఉంది. ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినప్పటికీ తనకు తోచిన తిక్క పనులు చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు. ఆ రాజ్యానికి మంత్రి యశోపతి. రాజ్యపాలన సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ రాజ్యంలో దొంగల బెడద అధికమైంది. దొంగలు రాత్రిపూట ఇళ్లల్లో దూరి దోచుకుపోతున్నారు. చీకటి పడితే చాలు ప్రజలు భయపడిపోతున్నారు.
‘సభాసదులారా! దొంగలు రాత్రిపూట, చీకటి వేళ ఇళ్లను దోచుకుంటున్నారు. వీటిని అరికట్టాలంటే పరిష్కార మార్గాన్ని సూచించండి’ అని రాజ్యసభలో ప్రకటించారు మహారాజు.
అనేక మంది ఎన్నో పరిష్కారాలు చెప్పారు. కానీ ఏ పరిష్కారం రాజావారికి నచ్చలేదు.
‘మహారాజా! రాత్రిపూట మన సైన్యంతోపాటు ప్రజల తరఫున కొందరు యువకులు బృందంగా ఏర్పడి వంతుల వారీగా రాజ్యంలో గస్తీ తిరిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది’ అని సూచించాడు మంత్రి యశోపతి.
అయితే తమకు నిద్రాభంగం కలుగుతుందనే సాకు చెప్పి గస్తీ తిరగడానికి ప్రజలు సుముఖంగా లేరు. ఈ వార్త విన్న తిక్క మహారాజుకు లెక్కకు మించిన తిక్క పెరిగిపోయింది.
ఇంతలో రాజుగారి మదిలో తళుక్కున ఒక తిక్క ఆలోచన వచ్చింది. దాన్ని సభలో ప్రకటించారు.
మహారాజు రాజ్యసభలో మాట్లాడుతూ ‘మా మదిలో ఒక ఆలోచన ఆవిర్భవించింది. అసలు రాత్రి అనేది లేకుండా చేస్తే చీకటి ఉండదు. అప్పుడు ఈ దొంగతనాలు జరగవు కదా? దీనికి పరిష్కార మార్గం చెప్పండి’ అని ఆస్థాన ఋత్వికుల్ని, జ్యోతిష్యులను కోరాడు.
‘మహారాజా! ప్రకృతి తన ధర్మాన్ని తాను నిర్వహించాలి. దాన్ని మనం మార్చాలనుకోవడం సహేతుకం కాదు. అనేక ఉపద్రవాలు వస్తాయి. రాత్రి లేకుండా నిత్యం పగలే ఉండాలనుకోవడం ధర్మం కాదు. మరోసారి ఆలోచించండి’ అని ఋత్వికులు కోరారు.
‘మేము మీ సలహాలు అడగలేదు. నిత్యం పగలు ఉండేలా ఏదైనా మార్గం ఉందా? లేదా? దానికి బదులివ్వండి’ అని పరమ తిక్కగా అన్నాడు మోహిత్ మహారాజు.
‘ఒక మార్గం ఉంది మహారాజా! సూర్యభగవానుడికి సంబంధించిన ఒక యాగం చేసి ప్రసన్నుడిని చేసుకుంటే నిత్యం సూర్యుడే మనకు కనిపిస్తాడు. రాత్రి అంటూ ఉండదు’ అని బదులిచ్చారు ఋత్వికులు.
‘అయితే వెంటనే ఆ యాగాన్ని ప్రారంభించండి’ అన్నాడు తిక్క మహారాజు.
మరోసారి ఆలోచించుకోమని మంత్రి యశోపతి సలహా ఇచ్చినప్పటికీ మహారాజు ససేమిరా అన్నాడు.
ఋత్వికులు యాగం మొదలుపెట్టారు. యాగం పూర్తి కాగానే అందరి భక్తికి మెచ్చి సూర్యభగవానుడు ప్రసన్నుడై మహారాజుకు కొన్ని సూచనలు చేశాడు.
‘మహారాజా! నువ్వు విపరీతమైన కోరికను కోరుతున్నావు. దొంగలను పట్టుకోవాలంటే నీ సైన్యాన్ని పెంచి రాజ్యంలో పహారా తిరిగేలా చేయాలి. ఇలా నిత్యం పగలు మాత్రమే ఉండాలని కోరుకోవడం సమంజసం కాదు’ అని సూర్యభగవానుడు సలహా ఇచ్చాడు.
‘మేము నిర్ణయం తీసుకున్నాము. మాకు చీకటితో పనిలేదు. నిత్యం సూర్యుడు ఉండవలసిందే’ అని రాజావారు ఖరాఖండిగా చెప్పాడు.
భక్తుల కోరికను సూర్యభగవానుడు కాదనలేకపోయాడు.
ఆ రోజు నుండి గణపవరం రాజ్య ప్రజలకు చీకటి అంటే తెలియదు. నిత్యం సూర్యకాంతితో ధగధగమంటూ రాజ్యమంతా మెరిసిపోతూ కనిపించింది. కొత్తలో ఈ వింత అందరికీ చాలా బాగా తోచింది. నిత్యం పగలు ఉండటం వల్ల దొంగలు భయపడి దొంగతనాలు చేయడం మానేసారు. సమస్య పరిష్కారమైనందుకు అందరూ ఆనందించారు. తిక్క మహారాజు తన నిర్ణయం వల్లే రాజ్యంలో దొంగల బెడద పోయిందని విజయగర్వంతో మీసాలు దువ్వసాగాడు. కానీ కొద్ది రోజులకు ప్రజలకు అనేక సమస్యలు ఎదురైనాయి. రాత్రి అనేది లేకుండా నిత్యం సూర్యుడు ఉండటం వల్ల ఎండ తీవ్రత పెరిగిపోయి విపరీతమైన వడగాలులు వీచసాగాయి. చెరువులు, బావులు, పచ్చని చెట్లు సైతం ఎండిపోయాయి. తాగు, సాగు నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. పశువుల మేత సైతం మాడిపోయి తినడానికి వీలులేకుండా అయిపోయింది. రాజుగారికి సైతం స్నానపానాదులకు నీళ్లు కరువైనాయి. ఎండ వేడితో ఉక్కపోతను భరించలేక ప్రజలు తమ దుస్తులను తీసేసి చిన్నపాటి అంగవస్త్రాన్ని చుట్టుకుని పిచ్చివాళ్లలా వీధుల్లో తిరుగుతున్నారు. ప్రజలకు ఆహారం కొరత ఏర్పడింది. వర్షం ఎలా ఉంటుందో? ప్రజలు మరచిపోయారు. రాజ్యంలో కరువు కాటకాలు తాండవిస్తున్నాయి. ప్రజలంతా మహారాజు వద్దకు వెళ్లి తమ గోడును వినిపించుకున్నారు.
‘మహారాజా! ప్రతి ఇంటి నుండి ఒక యువకుడు రాత్రిపూట గస్తీ తిరిగి దొంగల బారి నుండి మాకు మేము సంరక్షించుకుంటాము. దయచేసి తిరిగి యాగం చేసి సూర్యభగవానుని ప్రసన్నం చేసుకుని రాత్రి, పగలు రెండూ ఉండేలా చేయండి’ అని ప్రజలు వేడుకున్నారు.
మహారాజు చేసేది లేక ఋత్వికుల్ని పిలిపించి తిరిగి యాగం చేయించాడు. సూర్యభగవానుడు ప్రసన్నుడై వారి కోరిక తీర్చాడు. ఆ రోజు నుండి రాత్రి, పగలు తిరిగి ఏర్పడినాయి. నాటి నుండి రాజుగారు తన తిక్కను వదిలి అందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ చక్కటి పరిపాలనను అందించాడు. తిక్క కోరికలకు స్వస్తి పలికాడు. ప్రజలు సైతం తమ బాధ్యతను తెలుసుకుని ప్రతి చిన్న విషయానికీ రాజుగారిపై ఆధారపడకుండా రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతూ రాజుగారికి సహకరిస్తూ దొంగలను పట్టుకుని కారాగారానికి పంపించారు. అందరూ బాధ్యతగా పని చేయడం వల్ల గణపవరం రాజ్యం అనతికాలంలోనే దుర్భిక్షానికి దూరమై సుభిక్షంగా మారిపోయి పొరుగు రాజ్యాలకు ఆదర్శప్రాయమైంది.

-షేక్ అబ్దుల్ హకీం జాని