బాల భూమి

పరిష్కారం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరంధామయ్యకి కమల - విమల అని ఇద్దరు కూతుళ్లు. ఆయన పేరు మోసిన వైద్యుడు.
కమల నెమ్మదస్తురాలు, గుణవంతురాలు అని పేరు గడిస్తే, విమల అదృష్టవంతురాలనే పేరు గడించింది.
ఎందుకంటే విమల శకునం వచ్చిన రోజు పరంధామయ్యకు చక్కని ఆదాయం వచ్చి జేబులు నిండేవి. ఇల్లు లక్ష్మీదేవితో కళకళలాడేది. అదే కమల ఎదురువచ్చిన రోజు ఒక్క కేసూ వచ్చేది కాదు.
కానీ పరంధామయ్య బయటకి వెళ్లేటప్పుడు శోభస్కరం అనే ఉద్దేశంతో ఆడపిల్లలను ఎదురురమ్మనేవాడు. అంతేకాక భేదభావం పిల్లల మధ్య ఉండకూడదనే ఉద్దేశంతో ఒకోరోజు ఒక్కోరిని రమ్మనేవాడు. ఫలితం ఎలా ఉన్నా పట్టించుకునేవాడు కాదు.
కానీ ఇంట్లోని వారికి కమల దురదృష్టవంతురాలనే భావం ఏర్పడిపోయింది. ఆమె శకునం వేళాకోళంగా, భయంగా మారిపోయింది. దాంతో విమలలో గర్వం పెరిగింది. కమలని చిన్నచూపు చూడటం, వెక్కిరించటం చేసేది. అందరికీ ఆమె శకునం గురించే కాక జాతకం గురించీ భయం ఏర్పడింది.
ఇద్దరికీ యుక్తవయసు వచ్చింది. పరంధామయ్య సంబంధాలు చూడసాగారు. తాను వైద్యుడు కాబట్టి మగపిల్లలు లేని కారణంగా అందిపుచ్చుకుంటారనే ఉద్దేశంతో సహజంగా అల్లుళ్లుగా వైద్య వృత్తి వారినే చూడసాగాడు. అయితే కమల తన జాతకానికి తనే భయపడి తండ్రిని వైద్యవృత్తి వాడిని చూడవద్దని కోరింది. నిజానికి తనకి తండ్రిని చిన్నతనం నుంచి చూడటం వల్ల వైద్యులంటేనే ఇష్టం. కానీ రోగులు రాకుంటే వైద్యుడికి మనుగడ లేదు కాబట్టి వేరేవారిని చూడమని కోరింది. పరంధామయ్య ఓదార్చాడు.
‘నువ్వు శకునం వస్తే కేసులు రావంటే దానర్థం రోగులు రోగాలూ లేవనే కదా అర్థం. అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. అది మంచిదేగా. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఏముంటుంది? దానికి నువ్వు కారణం అయితే అందరూ నిన్ను అభినందించాల్సిన విషయం. అయినా నువ్వు బాధపడకు. నీకు తగిన భర్తను నేను తెస్తాను వైద్యుడినే. నీ కోరిక ప్రకారమే’ అన్నాడు.
పరంధామయ్య విమలకు మామూలు వైద్యుడి సంబంధం చూశాడు. కమలకి వైద్యునితోనే పెళ్లిచేశాడు ఆమె ఇష్టప్రకారం. కానీ అతను ‘ఆరోగ్య శాఖ’లో వైద్యుడు. విమల శకునం వల్ల ప్రైవేటు వైద్యుడైన విమల భర్త వైద్యశాల ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా వర్థిల్లసాగింది. కమల శకున జాతకం వల్ల ప్రభుత్వ వైద్యశాలల్లో రోగుల సంఖ్య తగ్గి, ‘ఉత్తమ ఆరోగ్య శాఖాధికారి’గా ప్రశంసలు, బహుమతులు అందుకుని పేరు గడించాడు కమల భర్త.
కూతుళ్లిద్దరూ ఆనందంగా ఉండటం చూసి ఆనందించాడు పరంధామయ్య.

-ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి 9849464017