బాల భూమి

నక్క వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లి నక్క పిల్ల నక్కని వైద్యుని దగ్గరకి తీసుకొచ్చింది.
అప్పటికే కొన్ని నక్కలు వైద్యుని పిలుపు కోసం గుహ బయట ఎదురుచూస్తున్నాయి. అదే వరుసలో కూర్చున్నాయి తల్లి నక్క, పిల్ల నక్క.. ‘వైద్యులు అడిగిన దానికి జవాబు చెప్పు. మూతి ముడుచుకుని కూర్చోక’ అంటూ హెచ్చరించింది తల్లి నక్క పిల్ల నక్కని. అలాగే అన్నట్టు మూతి ముడుచుకునే తలూపింది పిల్ల నక్క.
ఇంతలో ‘ఏమైంది?’ అని అడిగింది వరుసలో వీళ్లకి ముందున్న నక్క.
‘పిల్ల తిండి తినటం లేదు’
‘అయ్యో ఏమైందో..? మాకేమో దొరక్క ఏడుస్తున్నాం. నువ్వేమో దొరికింది తినటం లేదా’ అంటూ తోక తొంభై వంకర్లు తిప్పింది ముందు నక్క. కాసేపయ్యాక వైద్యుని పిలుపుతో లోపలికి వెళ్లారు తల్లి నక్క, పిల్ల నక్క.
‘ఏమిటి సమస్య?’ అంది వైద్యురాలైన నక్క పిల్ల నక్కను పరీక్షిస్తూ..
‘తిండి తినటం లేదు’ అంది తల్లి నక్క బాధగా.
‘అంటే తినబుద్ధి కావటం లేదా? లేక తింటే అరగటం లేదా?’ అడిగింది వైద్య నక్క.
‘అరగటం సమస్య లేదు. అరుగుతుంది. అయితే ఏదైనా ఇది వరకు దొరికింది దొరికినట్టు తినేది. ఇప్పుడు అలా కాదు. గబగబా దగ్గరలో ఉన్న కొలనులోనో, నదిలోనో, గుంటల్లోనో కాళ్లు కడుక్కుని వచ్చి తింటుంది..’
‘ఎప్పట్నించీ ఇలాగ?’ అన్నాడు వైద్యుడు.
‘ఈ మధ్యనే. అంతకు ముందు లేదు’
‘మంచిదే కదా! అది మనిషి లక్షణం. పోనీ అలాగే తిననివ్వు’ అంది వైద్య నక్క.
‘అది చిన్నది. ఇప్పుడు నేను పెడుతున్నాను కాబట్టి అలా తిన్నా ఫర్వాలేదు. నేను రక్షణగా ఉంటాను కదా. కానీ పెద్దయ్యాక అలా ఎలా కుదురుతుంది? దొరికింది దొరికినట్టుగాతినకపోతే ఎవరైనా ఎత్తుకు పోతారు కదా!’ అంది బాధగా తల్లి నక్క.
‘ఆ.. దానిదేముందిలే. ఒకటి రెండుసార్లు అలా ఎవరైనా ఎత్తుకుని పోతే అప్పుడే దానికి తెలుస్తుందిలే..! ఇంతేనా ఇంకేమైనా సమస్య ఉందా?’ అంది వైద్య నక్క.
‘ఉందండి. కాళ్లు కడుక్కుని వచ్చి పూర్తిగా తినడం లేదండి. సగం తిని మళ్లీ కాళ్లు కడుక్కుని వస్తుంది. కాళ్ల వెనక్కి చూస్తూ తింటుంది.. మళ్లీ కాళ్లు కడుక్కుని వస్తుంది.. ఎప్పుడూ లేనిది, మనలో ఎవ్వరూ చెయ్యనిది ఇది ఎందుకు అలా చేస్తుందో అర్థం కావటం లేదు’ అంది తల్లి నక్క.
అది విన్న వైద్య నక్క.. తెల్లబోయి
‘ఇది ఈ మధ్య దారితప్పి ఊరులోనికి కానీ వెళ్లలేదు కదా?’ అని అడిగాడు.
‘వెళ్లింది. ఈ మధ్యనే. దారి తప్పి ఊరు శివార్లలోకి వెళ్లిపోతే వెతుక్కుని వెనక్కి తీసుకువచ్చారు. మీరెలా కనిపెట్టారు?’ అంది తల్లి నక్క వైద్య నక్క వైపు ఆశ్చర్యపోయి చూస్తూ..
‘అదీ సంగతి. అర్థమై పోయింది. నాకు పక్క అడవిలో కూడా వైద్యశాల ఉంది నీకు తెలుసు కదా!’
తెలుసన్నట్టు తలూపింది తల్లి నక్క. దాంతో..
‘ఆ అడవికి వెళ్లాంటే మన శివార్లలో ఉన్న ఊరు పక్కగా వెళ్లాలి. ఒకరోజు అలా వెళుతుంటే ఒక స్వామీజీ ఏదో చెబుతూంటే కాసేపు పొదల మాటున నిలబడి విన్నాను. అది ఇదే. అన్నం తినే ముందు కాళ్లు కడుక్కుని పాదాలు తడి ఆరేలోపు అన్నం తినటం పూర్తి చెయ్యాలి. బహుశా అదే రోజు మీ అమ్మాయి కూడా విని ఉండవచ్చు. లేదా దానికి ఎవరైనా చెప్పి ఉండవచ్చు..’ అని వైద్య నక్క చెప్పగానే, అప్పటిదాకా మూగగా ఇదంతా వింటూ కూర్చున్న పిల్ల నక్క ‘అవును... అవును’ అంటూ చప్పట్లు చరుస్తూ ఎగిరి గంతులేయసాగింది.
తెల్లబోయారు తల్లి నక్క, వైద్య నక్కా.
‘అదిగో చూశావా? నేనన్నది నిజం..’ అని తల్లి నక్కతో అని.. పిల్ల నక్కను దగ్గరికి రమ్మని..
‘అవి మనుషులకమ్మా! మనకి వర్తించవు. వారి జీవన విధానం వేరు. మన జీవన విధానం వేరు. వాళ్లు ఆహారాన్ని నిలువ చేసుకుంటారు కాబట్టి అలాంటి నియమ నిబంధనలు ఎన్ని పెట్టుకున్నా అవి చెల్లుతాయి. కానీ మనం జంతువులం. మనకి నిలువ చేసుకునే అవకాశం లేదు. దొరికింది దొరికినట్టుగా తినాలి. లేదంటే ఎవరైనా ఎత్తుకుపోతారు. పోటీ ఎక్కువ. కాబట్టి తినే ముందు కాళ్లు కడుక్కోవాలి అనుకోవటం, కాళ్లు తడి ఆరక ముందే తినెయ్యాలని పదేపదే పరిగెత్తటం మనకి కుదరవు.. సరేనా?’ అంది వైద్య నక్క.
సరేనన్నట్టు తలూపి ఉత్సాహంగా బయటికి పరిగెత్తింది పిల్ల నక్క.
కృతజ్ఞతగా చూసిన తల్లి నక్క వైద్యునికి తాను తెచ్చిన ఆహారాన్ని చెల్లించి మరింత ఆనందంతో వెనుతిరిగింది పిల్ల నక్కతో కలిసి.

-కనె్నగంటి అనసూయ 9246541249