డైలీ సీరియల్

బంగారుకల - 41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియ సమాగమనానికి ఎదురు చూస్తున్నది. రాయలామె వెనుకగా వచ్చి నిలిచారు. పరిచితమైన గాఢస్పర్శ.. ఆపై ఆమె నడుము చుట్టూ ప్రభువు చేతులు. ఆమె వెనుదిరిగేలోపు రెండు అరచేతులతో వెనుకనుంచి ఆమె కన్నులు సుకుమారంగా మూసేశారు. ఆమె పరవశించి పోయింది.
‘‘ప్రభూ!’’ అనగలిగింది.
‘‘ఉహూ.. పేరు చెప్పాలి’’ శృంగార రాయలు కవ్వించారు. ఆమె సిగ్గుపడింది. రాయల హృదయంలో మొహం దాచుకుంది. ఆమె శరీరం అణువణువు ప్రభువు కోసం నిరీక్షిస్తున్నదని అర్థమయింది.
రాయలు ఆమె చుబుకాన్ని పట్టి కళ్ళలోకి చూశారు. ఆమె కళ్ళలో తన ప్రతిబింబం మరింత అందంగా కన్పిస్తోంది. ఆమె కళ్ళు వాల్చేసింది. దూరంగా జరిగింది.
‘‘దేవిగార్కి కోపమా’’ చమత్కరించారు.
‘‘లేదు ప్రభూ! కృష్ణచంద్రుని కోసం చకోరంలా ఎదురుచూపులు’’
‘‘మాటలు నేర్చారు దేవిగారు’’
‘‘మీ చేతల ముందు మా మాటలేం పనిచెయ్యవు లెండి’’ అలుక నటించింది. ‘‘మా చేతలు మీకంగీకారమైనవే కదా’’
‘‘మా అంగీకారాలతో ప్రభువులకు నిమిత్తమేముంటుంది’’ నిష్టురం ధ్వనించింది.
‘‘ఇన్నాళ్ళూ రాలేదని అలుకా!ఏవేవో అవాంతరాలు...ఓహ్... ఇంకా ఎడబాటా దేవీ!’’ ఆమెను బలవంతంగా తనవైపు తిప్పుకున్నారు రాయలు. ఆమె మొహం ముడుచుకున్న పద్మంలా ఉంది.
‘‘మీ మనసులోని మాట సెలవీయండి దేవీ! మేము దాసులం’’ చేతులు కట్టుకొని వినయం నటించారు.
‘‘మాట తప్పరుగా’’ ఆమె ఆ అవకాశం కోసమే వేచి ఉంది.
‘‘ఉహు...’’ చేతిలో చేయివేసి దగ్గరకి లాక్కున్నారు.
ప్రభువు కౌగిలి నుంచి విడివడుతూ...
‘‘తీరా కోరాక కాదనకూడదు మరి’’ మరింతగా నొక్కి చెప్పింది ఆమె.
‘‘అంత అనుమానమా దేవీ! మన కులదైవం విరూపాక్షస్వామి పాదాల మీద ఆన. సరేనా!’’ ఆమెను దగ్గరకి తీసుకున్నారు.
‘‘మన కుమారుడు తిరుమల రాయలు’’ సంకోచంతో ఆగింది.
‘‘ఊ! తిరుమల రాయలు’’ రెట్టించారు మురిపెంగా.
‘‘తిరుమల రాయలకు పట్ట్భాషేకం చేయండి ప్రభు! ఇదే నా విన్నపం’’ తీరా చెప్పేశాక రాయలేమంటాడోననే భయాందోళనలు ఆమెను చుట్టుముట్టినై.
రాయలు మందహాసం చేశారు. ఆమె హృదయం తేలికపడి వికసించిన పద్మమయింది.
‘‘ఇంతేనా! దీనికా ఇంత గుబులు. తిరుమలరాయలు గాక మరెవరికి పట్ట్భాషేకం చేస్తాం. యువరాజు మాకు వారసుడని మీరెరుగరా!’’ ఆదరగా ఆమెను సందిట చేర్చుకున్నారు.
‘‘అదికాదు ప్రభూ! కొన్నాళ్ళుగా నాకెందుకో కొన్ని ఉత్పాతాలు గోచరిస్తున్నాయి. పీడకలలొస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యానికి భావి సామ్రాట్ మన చిరంజీవి కావాలనే నా కోరిక ప్రభూ!’’ అభ్యర్థించింది. ఆమె మీద వీరేంద్రుని నీడ పూర్తిగా కమ్ముకుంది.
‘‘కాదనం. తొందర ఎందుకు? యువరాజుకింకా ఆ వయస్సు రాలేదుగా!’’ అనునయించాడు.
‘‘తొందరపడక తప్పదు ప్రభూ! మీరు విజయనగర సింహాసనాన్ని అధిష్టించిన విధానాన్ని గుర్తుచేయక తప్పటం లేదు. మన్నించండి ప్రభూ! తరతరాలుగా ఈ సింహాసనం తండ్రిబిడ్డల వారసత్వంగా రావటం లేదు. అదే నా బాధ. మన యువరాజు తండ్రికి వారసుడిగా రాజు కావాలని కోరుకుంటున్నాను. మీరు ఎంత త్వరగా తిరుమలరాయలకు పట్ట్భాషేకం చేస్తే నామనసు అంత కుదుటపడుతుంది ప్రభూ!’’ అన్నపూర్ణాదేవి తల్లి మనసు రాయలకు అర్థమైంది.
‘‘సరే దేవీ! రేపే అప్పాజీ వారితో సంప్రదించి నిర్ణయిస్తాం‘‘ అన్నారు మెత్తగా.
‘‘అప్పాజీ వారిని అడిగితే ఈ పని జరుగుతుందనే ఆశ నాకు లేదు ప్రభూ’’! మెల్లగా అంది.
రాయలు ఉలిక్కిపడ్డారు. వినకూడనిదేదో విన్నట్లు దిగ్గున లేచారు.
‘‘ఏమిటిది దేవీ! అప్పాజీవారినే అనుమానిస్తున్నారా! వారు మీకు పితృసమానులు’’ కఠినంగా అన్నారు.
‘‘పితృసమానులే గానీ పితృదేవులు కారుగా! వారు ఈ పట్ట్భాషేకాన్ని అంగీకరిస్తారని నేననుకోను. వారి ఆలోచన వేరువిధంగా ఉంది ప్రభూ!’’ అన్నపూర్ణాదేవి కంఠం మృదువుగా ఉన్నా స్పష్టంగా ఉంది.
‘‘ఏమిటది?’’
‘‘తమ కుమారుడు గోవిందరాయలను విజయనగర సింహాసనంపై...’’
ఆమె మాట పూర్తికాకముందే రాయలు అసహనంగా కదిలాడు. రెండు చేతులతో చెవులు మూసుకుంటూ ‘‘ఆపు అన్నపూర్ణాదేవీ! మీ అభియోగానికి ఋజువులున్నాయా?’’ ప్రశ్నించాడు.
ఆమె మాట్లాడలేదు.
‘‘సరే! ఈ పట్ట్భాషేకానికి అప్పాజీవారు అంగీకరిస్తారనే నమ్మకం నాకుంది. ఇలాగైనా వారిమీద మీకున్న అనుమానం తొలగిపోతుంది’’ అంటూ వేగంగా వెళ్ళిపోతున్న రాయలను వెనుక నుంచి చూస్తుండిపోయింది అన్నపూర్ణాదేవి. అమె కనుకొలకుల్లోంచి అశ్రుబిందువులు ధారగా చెక్కిళ్ళును తడుపుతున్నాయి.
తనకేమయింది? తనేం చేసింది? ఏం మాట్లాడింది? ప్రేమమూర్తిని నొప్పించింది. ఇన్నాళ్ళ ఎడబాటు తర్వాత ప్రియ సంగమాన్ని నిరాకరించి కైకలా వరం కోరింది. కైకలాగానా? అంటే వంశ నాశనం కోరిందా? అలా జరగటానికి వీల్లేదు.
- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి