డైలీ సీరియల్

బంగారుకల - 42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పితృసమానులైన అప్పాజీవారుప్రోద్బలం చేయనిదే రాయలతో తన వివాహం జరిగేదేనా? ఆయనకే అలాంటి దురాలోచన ఉంటే రాయలను ఏనాడో మట్టుబెట్టగల శక్తిమంతుడు గదా! తననెంత ఆదరంగా చూస్తాడు. తను ఎందుకింత కఠినంగా మారిపోయింది. ఎన్నడూ లేనిది రాయల మనసునెంత నొప్పించింది. తీవ్రంగా పరితాపం చెందింది అన్నపూర్ణాదేవి.
‘‘జగన్నాథ! జగన్నాథ! మంచి పని చేశావు. నీ కుమారుని భవిష్యత్ నీకు ముఖ్యం కదా! అదే నిరూపించి వీరమాతవనిపించు కుంటున్నావు’’ అంతదాకా చాటున వుండి అన్నీ విన్న వీరేంద్రుడు కపట ప్రశంస చేశాడు.
‘‘్ఛ! ఆలుమగల మాటలు కూడా చాటుగా వింటున్న నీదేం సంస్కారం’’ ఆమె వ్యథగా ఛీత్కరించింది.
‘‘నాకు ఆ తేడాలేం లేవులేమామ! నేననుకుంటున్నట్లు జరిగితే అది చాలు. రాయల మాటలను ఆ కుటిల తిమ్మరుసు అంగీకరిస్తాడన్న నమ్మకం మాత్రం నాకు లేదు’’ వ్యంగ్యబాణం విసిరి వెళ్లిపోయాడు వీరేంద్రుడు.
అన్నపూర్ణాదేవి ఆవేదనగా శయ్యాగతురాలై రోదిస్తున్నది. మంజరి కొంత సంకోచిస్తూనే ఆమె దగ్గరికి వెళ్లింది.
‘‘దేవిగార్కి ఉపచారాలేమైనా చేయమంటారా’’ మెత్తగా అడిగింది.
‘‘వద్దు. మంజరీ! నా మనసేం బాగాలేదు’’ బేలగా అంది.
‘‘పానీయం ఇవ్వమంటారా దేవీ’’ అనునయంగా అడిగింది మంజరి.
‘‘వద్దు ప్రభువు మనసు నొప్పించాను. వీరేంద్రుని మాటకి లోనయ్యాను’’ రోదించింది రాణి.
‘‘వారి మాటలకేముంది దేవీ! ఏది యుక్తమో మహారాజుగార్కి తెల్సు. తిమ్మరుసుల వారున్నారుగా! మీరు కలత పడకండి’’ ఆమెను ఓదార్చుతున్నదే గానీ మంజరి మనసు మనసులో లేదు. అన్నపూర్ణాదేవి కోరిక ఎటువంటి దుష్ఫలితాన్ని కలిగిస్తుందోనని ఆమెకూ భయంగా వుంది. వీరేంద్రుని నీడ ఇంతింతై అన్నపూర్ణాదేవి మందిరం మీదే కాదు, యావత్ విజయనగర సామ్రాజ్యమంతటా పరుచుకుంటున్నట్లనిపిస్తున్నది.
****
చంద్రప్ప తెచ్చిన సమాచారం విని తిమ్మరుసు ఆశ్చర్యపోయారు, బాధపడ్డారు. రాయలు మంత్రి మండలి సమావేశం ఏర్పాటుచేశారనీ, తిరుమల రాయలి పట్ట్భాషేకం గురించి ప్రకటించారనీ, తనతో మాట మాత్రం సంప్రదించకుండా రాయలీ నిర్ణయం తీసుకోవటం తిమ్మరుసు మంత్రిని కలవరపెడుతోంది.
రాయలు తనను శంకిస్తున్నారా? రాయలలో ఎందుకీ మార్పు? ఇది దేనికి నాంది?
ఆలోచిస్తుండగానే రాయలు తిమ్మరుసు మందిరంలోకి ప్రవేశించారు.
సాధారణంగా మహారాజు దగ్గరికి మంత్రి వెళ్ళటం ఉంటుందిగానీ మంత్రి దగ్గరికి రాజు వెళ్ళటం ఉండదు. రాయలు, తిమ్మరుసుల బంధం ఇటువంటి సూత్రాలకు అతీతమైంది. రాయల్ని చూస్తూనే తిమ్మరుసు మనసులోని ఆలోచనలు, అనుమానాలన్నీ మాయమైనై.
‘‘రాయా! రండి. ప్రభువులవారి రాకకు కారణం’’ ఆదరించారు.
తిమ్మరుసును చూస్తూనే రాయలు తాను వచ్చిన పని ఎలా చెప్పాలా అని కొంచెం సందిగ్ధపడ్డారు.
‘‘అప్పాజీ! మిమ్మల్ని సంప్రదించకుండా ఒక నిర్ణయం తీసుకున్నాం. అది చెప్పాలని ఇలా వచ్చాం’’.
‘‘ఏమిటది రాయా! నా దగ్గర దాపరికం దేనికి’’ తిమ్మరుసు ప్రోత్సాహంగా మాట్లాడారు.
‘‘మా కుమారుడు తిరుమల రాయలకు పట్ట్భాషేకం చేస్తామని అన్నపూర్ణాదేవికి వాగ్దానం చేశాం. ఆ ప్రకారం యువరాజు పట్ట్భాషేకానికి నిర్ణయించాం. ఏర్పాట్లు మొదలయ్యాయి’’.
తిమ్మరుసు ఊహించిందే గదా! ఆయన కళ్ళల్లో రాయలపట్ల పితృప్రేమ తొణికిసలాడింది.
‘‘చాలా సంతోషం రాయా! కానీ యువరాజు ఇంకా పసివారు గదా! అయినా మీరు దక్షిణ జైత్రయాత్రకు వెళ్ళే ముందు ఈ పట్ట్భాషేకం శుభంగా అన్పించదు’’.
‘‘తిమ్మరుసు మాటకు రాయల మొహంలో రంగుల మారినై.’’
‘‘శుభంగా ఉన్నా లేకున్నా మేమిచ్చిన మాట అమలు జరిగి తీరాల్సిందే!’’ పట్టుదలగా అంటూ వెళ్లిపోతున్న రాయలకేసి నిస్సహాయంగా చూశాడు తిమ్మరుసు. ఆ మేధో నాయకునికేదో స్ఫురించింది. వెంటనే రామలింగ నాయకునికి కబురు చేశారు.
***
‘‘అంతా మనం అనుకున్నట్లుగానే జరుగుతున్నది’’ వీరేంద్రుడు ఉద్యావనంలో కంటకుడితో ఆనందం పంచుకున్నాడు.
‘‘తిమ్మరుసు ఈ పట్ట్భాషేకానికి ఒప్పుకోడనే అనుకున్నాను. ఆశ్చర్యంగా ఉందే’’ కంటకుడు ఆశ్చర్యపోయాడు.
‘‘అదే తిమ్మరుసు తెలివి. ఒప్పుకోకపోతే రాయలకు అనుమానం రాదూ! తిమ్మరుసు ఒప్పుకోకపోతే మన పని మరింత సులువయ్యేది’’ వీరేంద్రుడి గొంతులో కోపం ధ్వనిస్తున్నది.
‘‘ఎలా’’ కంటకుడు అడిగాడు.
‘‘ఎలాగంటే, తిమ్మరుసు తిరుమల రాయల పట్ట్భాషేకాన్ని తిరస్కరిస్తే రాయలకి తిమ్మరుసుకు మధ్య వైరం పెరిగేది. ఇప్పుడలా కాదే! ఇద్దరూ ఒకటిగా ఉన్నంతకాలం మనకి అగచాట్లే’’ వీరేంద్రుడు చేతులు నులుముకుంటూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.
హఠాత్తుగా కంటకుడు హుషారుగా చిటికేశాడు.
‘‘ఆ! నాకో ఉపాయం తట్టింది’’
వీరేంద్రుడు కంటకుడి దగ్గర ఆతృతగా చేరాడు.
‘‘ఏమిటది చెప్పు’’

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి