డైలీ సీరియల్

బంగారుకల - 46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆయన మన మొర ఆలకిస్తాడా! అలా అయితే ఇంత దూరం వస్తుందా?’’ మొదటి వ్యక్తి అన్నాడు.
‘‘ఇందులో ఏదో కుట్ర ఉంది. వేరెవరో ఈ నేరం చేసి తిమ్మరుసుల వారిని బలిపశువును చేశారు. ప్రభువు తొందరపడి పుత్రశోకంతో అమాత్యులను శిక్షిస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఆపాలి. ఆ కుట్రని ఛేదించాలి. దీనికి మనమంతా పోరాడాలి’’ చంద్రప్ప ఆవేశంగా అన్నాడు.
‘‘అవును. మీరు చెప్పేదే సరియైన మాట. పదండి రాజ భవనానికి వెళదాం. శ్రీకృష్ణదేవరాయల వంటి న్యాయ పాలకుడు తప్పక మరోసారి ఆలోచిస్తాడు’’.
‘‘అవును పదండి’’ అంతా సమూహంగా బయలుదేరి రాజమందిరం చేరారు.
‘‘ప్రభూ! మాకు న్యాయం చేయండి’’ గగ్గోలు పెట్టారు.
మంజరి చంద్రప్ప ప్రజలకి నాయకత్వం వహించటం చూసి రామలింగనాయకుడు ఖిన్నుడయ్యాడు.
విజయనగర సామ్రాజ్యంలో కనీ వినీ ఎరుగని సంక్షోభం మొదలయింది. తిమ్మరుసు మంత్రిగా ఉన్నపుడు ప్రజలు ఇలా తిరగబడటం ఊహకందని విషయం. ఎంతలో ఎంత మార్పు!
‘‘ఏమిటా గోల’’ ప్రభువు చిరాగ్గా రామలింగ నాయకుడ్ని ప్రశ్నించాడు.
‘‘ప్రజల తిరుగుబాటు ప్రభూ! తిమ్మరుసు మంత్రిని శిక్షించటాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నరు. తిమ్మరుసులవారీ హత్య చేశారంటే ప్రజలెవ్వరూ విశ్వసించటం లేదు ప్రభూ! అందుకే అంతా తిరుగుబాటు చేస్తున్నారు’’.
‘‘హూ..’’ హుంకరించాడు రాయలు కోపంగా. అది తన నిర్ణయాన్ని తప్పు పట్టినందుకు ఎగసిన ఆగ్రహవేశం.
‘‘ఉద్యమాన్ని అణచేయండి రామలింగ నాయకా! న్యాయా న్యాయ విచక్షణ ప్రభువునైన మాకు తెలుసుననీ, సాక్ష్యాధారాలతోనే ఈ శిక్షను నిర్ణయించటం జరిగిందనీ మా ప్రజలకు తెలియజెప్పండి’’ రాయలు సంక్షుభిత హృదయంతో పెడమోమయ్యారు.
‘‘మరోమాట. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నవారిని నిర్దాక్షిణ్యంగా బందీలు చేసి కారాగారంలో వేయండి’’ ఆజ్ఞాపించారు రాయలు.
‘‘చిత్తం ప్రభూ!’’ రామలింగ నాయకుడు కర్తవ్య నిర్వహణకు బయలుదేరాడు. రాయల కన్నుల్లో అశ్రువుల్ని చూసే అవకాశం అతనికి లేదు. జాతక యోగమో మరేమోగానీ చంద్రప్ప, మంజరిలకు పెళ్లి అయిన కొద్ది రోజులకే కారాగారయోగం పట్టింది.
ప్రజలు! నిజంగా అదృష్టవంతులు. తాము నమ్మిన దానిని ధైర్యంగా చెప్పగల శక్తివంతులు. కానీ రాజుకా అదృష్టం లేదు. న్యాయానికి, సాక్ష్యానికి కట్టుబడి పూజ్యులైన అప్పాజీకి ఇంతటి ఘోర శిక్షను విధించాల్సి వచ్చింది. తాను తప్పు చేస్తున్నాడా! రాచరిక బాధ్యతలు ఇంత నిష్ఠూరంగా ఉంటాయా? ఇంతకాలం అప్పాజీయే ఎటువంటి జటిల సమస్యనైనా పరిష్కరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయనే సమస్యకు బలి అవుతున్నారు. రాయల హృదయం కల్లోలసముద్రంలా వుంది.
చిన్నారి తిరుమల రాయల ముద్దుమోము గుర్తొచ్చిన కొద్దీ రాయల పరితాపం పెరుగుతోంది. యువరాజు మృతికి కారణమైన వారెవరైనా, ఎంతటివారైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే! పట్టుదల పెరిగి మమకారం మరుగున పడింది.
బయట కోలాహలం విన్పిస్తున్నది. ప్రజలేం చేయగలరు. బల ప్రయోగానికి వారెప్పుడూ బానిసలే! తామెంతో ప్రేమించిన పాలకుని గురించి స్వరమెత్తి మాట్లాడగలరే గానీ నిరాయుధులుగదా! అన్యాయాన్ని ఎలుగెత్తి ఖండించగలరే కానీ నిరాయుధులు గదా! అనాదిగా ధర్మాన్ని అణచేసినట్లే ఈ రోజూ జరుగుతున్నది. చంద్రప్ప మంజరిలను కారాగృహంలో బంధించారు భటులు.
తెల్లవారితే విజయనగర సామ్రాజ్యానికే చూపునిచ్చిన తిమ్మరుసు మహామంత్రి అంధుడైపోతాడు. సామ్రాజ్యమే అంధకారంలో మునిగిపోతుంది. రామలింగ నాయకునికి నిద్రపట్టడంలేదు. అటు శ్రీకృష్ణదేవరాయలకు కూడా కంటిమీద కునుకు లేదు. దేవేరుల వేడికోలు కూడా రాయలు వినదలచుకోలేదు. ఎవ్వరినీ కలవటం లేదు. ఒంటరిగా ఏకాంత వేదనా మందిరంలో కుమిలిపోతున్నాడు. తెల తెలవారుతోంది.
రామలింగ నాయకునికి దూరంగా వసంత మండపంలో ఎవరో నక్కి గుస గుసగా మాట్లాడుకుంటున్నారు. రామలింగ నాయకుడు అనుయాయులతో పొదమాటున దాగి పరికిస్తూ వింటున్నాడు.
వీరేంద్రుడు రాజవైద్యులతో మంతనాలాడుతున్నాడు.
‘‘బాగా అభినయించారు. మీరు చేసిన ఉపకారానికి ప్రతిఫలం ఇది’’ అంటూ రెండు ధనపు మూటలను చెరొకటి ఇచ్చాడు వీరేంద్రుడు.
‘‘ఉపకారం అంటే అంతా ఇంతానా! విజయనగర సామ్రాజ్య లక్ష్మినే మీ చేతుల్లో పెట్టాం. అయినా రుూ...’’ నసిగాడు ఒక వైద్యుడు.
వాళ్ళ మాట పూర్తికాకుండానే వీరేంద్రుడు మరి రెండు బరువైన డబ్బు సంచుల్ని వాళ్ళ చేతుల్లో ఉంచాడు. వాళ్ళ మొహాలు వికసించాయి.
‘‘వీరేంద్రులవారిది బహు పెద్దమనసు. మేమిక వెళ్ళివస్తాం’’ రాజవైద్యులు బయలుదేరారు.
రామలింగ నాయకుడు ఇంక ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. తన భటులతో వాళ్ళమీద పడి ముగ్గుర్ని బందీలు చేశాడు. అనుకోని ఈ సంఘటనకు వీరేంద్రుడు స్థాణువయ్యాడు.
‘‘ఏమిటీ దౌర్జన్యం?’’ అహంకరించాడు.
‘‘ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రేపు సభలో చెప్పుకో’’ వీరేంద్రుని రాజవైద్యులతో సహా కారాగారబద్ధుల్ని చేశాడు రామలింగ నాయకుడు.
****
- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి