విజయనగరం

‘బెల్ట్’ తీయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్యం బెల్టుషాపులను అరికట్టాలి
ఎమ్మార్పీకే విక్రయించాలి
ఎక్సైజ్ అధికారులకు కలెక్టర్ ఆదేశం
విజయనగరం, నవంబర్ 27: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మద్యం బెల్టుషాపుల నిర్వహణను అరికట్టేందుకు, ఎంఆర్‌పి ధరలకు మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ఎంఎం నాయక్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. బెల్టుషాపుల నిర్వహణపై జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులు సక్రమంగా వ్యవహరించకుంటే పోలీసు, ఇతర శాఖలను రంగంలోకి దింపుతామని కలెక్టర్ స్పష్టం చేసారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్‌హాల్‌లో జిల్లాకు చెం దిన వివిధ స్థాయిల ఎక్సైజ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. విజయనగరం, గజపతినగరం, శృంగవరపుకోట, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో అత్యధికంగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఎక్సైజ్ అధికారులు బెల్టుషాపుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తు వాటిని మూసివేయించాలని, ఈ విషయంలో నిర్వాహకులు ఇబ్బందులు కల్పిస్తే వారిపై కేసులు పెట్టేందుకు వెనుకాడవద్దని స్పష్టం చేసారు. ఆదే విధంగా ఎంఆర్‌పిని మించి జిల్లాలోని చాలాప్రాంతాల్లో ఎక్కువ ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు,ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ చెప్పారు. ఎక్సైజ్ శాఖలో అవసరాల మేరకు సిబ్బంది ఉన్నా బెల్టుషాపులను, ఎంఆర్‌పి ధరలను నియంత్రించక పోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసారు. అవసరమైతే పోలీసుల సహకారాన్ని తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నాటుసారా తయారీ, అమ్మకాలు జరగకుండా తరచుగా దాడులు నిర్వహించాలని, ఒడిషాను ఆనుకుని ఉన్న జిల్లాకు చెందిన సరిహద్దు మండలాల్లో గట్టినిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్యమూర్తి, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు విక్టోరియా రాణి, శంభూప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ఐడిఎఫ్ పనులు వేగవంతం చేయాలి
జిల్లాలో ఆర్‌ఐడిఎఫ్ 18,19, 20 దశలలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కలేక్టర్ ఎంఎం నాయక్ సంబంధిత శాఖలను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం పంచాయితీరాజ్, ఆర్‌అండ్‌బి, గిరిజన సంక్షేమ, మత్సశాఖల ద్వారా ఆర్‌ఐడిఎఫ్ కింద చేపట్టిన పనుల ప్రగతిని ఆయన సమీక్షించారు. నిర్మాణం పూర్తిచేసిన భవనాలను సంబంధిత శాఖలకు అప్పగించాలని ఆదేశించారు. మంచినీటి పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి వాటిని వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. అంగన్‌వాడి భవనాల నిర్మాణం, రోడ్లు, భవనాల నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బి, పంచాయితీరాజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో నాబార్డ్ ఎజిఎం శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇలు గాయత్రీదేవి, వేణుగోపాలరావు, కాంతిమతి తదితరులు పాల్గొన్నారు.

భగవాన్‌దాస్ మెమోరియల్
42వ రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీలు
విజయనగరం, నవంబర్ 27: భగవాన్‌దాస్ 42వ రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీలు డిసెంబర్ మూడవ తేదీనుండి విజయనగరంలో నిర్వహిస్తున్నామని నిర్వహణ సంఘం చైర్మన్ ఐవిపి రాజు వెల్లడించారు. శుక్రవారం ఎంఆర్ స్టేడియంలో సంఘ సభ్యులతో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన టోర్నమెంట్ వివరాలను తెలిపారు. భగవాన్‌దాస్ మెమోరియల్ పేరిట జూనియర్ స్థాయి కబడ్డీ పోటీలను బాలురు, బాలికల విభాగంలో డిసెంబర్ మూడున విజయనగరం ఎంఆర్ కళాశాల క్రీడామైదానంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 13జిల్లాల నుండి 320మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని చెప్పారు. డిసెంబర్ మూడునుండి ఆరవతేదీ వరకు జరగే ఈ పోటీలో పాల్గొనే క్రీడాకారులు బాలురు 65 కెజీలుల బరువు మించరాదని, బాలికలు 60కెజీల బరువు మించరాదని వివరించారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో టోర్నమెంట్ జరుగుతుందని చెప్పారు.్ఫ్లడ్ లైట్ల వెలుగులో నిర్వహిస్తున్న పోటీలకు 60మంది న్యాయనిర్ణేతలు పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడాకారులకు ఉచితంగా వసతి, భోజనం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాయంత్రాంగం, క్రీడాప్రాధికార సంస్థ, ప్రజల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భగవాన్‌దాస్ విగ్రహాన్ని కస్పా హైస్కూలులో ఏర్పాటుచేయడానికి నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అవనాపు విజయ్, ఉపాధ్యక్షుడు బుచ్చిబాబు, రంగారావు, కమలనాభరావు, డిఎస్‌డిఒ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

30న డిఎస్సీ అభ్యర్థులు చలో విశాఖ
విజయనగరం , నవంబర్ 27: డిఎస్సీ 2014 ఉద్యోగ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30న చలో విశాఖ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు ఎ.జగన్మోహనరావు తెలిపారు. ఎల్‌బిజి భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సిఇఆర్‌టి చేసిన పొరపాట్లకు డిఎస్సీ అభ్యర్థులను బలిచేయడం సరికాదని అన్నారు. నోటిఫికేషన్ కోసం, డిఎస్సీ నిర్వహణ కోసం పోరాడిన వీరికి ఉద్యోగం వస్తుందో రాదో నిర్ధారణ చేసే ఫలితాలను ప్రకటించాలని పోరాడాల్సిను దుస్థితి రావడం సిగ్గుచేటని అన్నారు. వయోపరిమితి దాటిన వారు ఉద్యోగం వస్తుందో రాదో తెలియక మానసిక సంఘర్షణకు గురవుతున్నారని తెలిపారు. కోర్టులు, కేసులు పేరుతో కాలయాపన చేయడం మంచిది కాదని, తక్షణమే మెరిట్‌లిస్ట్ ప్రకటించి, పోస్టింగులు ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. విద్యావలంటీర్లగా నియమిస్తారని పత్రికల్లో ప్రచారం జరుగుతోందని, అప్రంటీస్ విధానికి పేరు మార్చి విద్యావలంటీర్లగా నియమిస్తారని ప్రశ్నించారు. డిఎస్సీ అభ్యర్థుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఛలో విశాఖ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిఎస్సీ సాధన కమిటీ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, బి.రమణ, బి.చంద్రరావు పాల్గొన్నారు.

ఎన్‌సిసి బెటాలియన్ ఏర్పాటుకు చర్యలు
* కలెక్టర్ నాయక్ వెల్లడి
విజయనగరం,నవంబర్ 27: దేశసేవలో కీలకపాత్ర నిర్వహిస్తున్న ఎన్‌సిసిని ప్రోత్సహించేందుకు జిల్లాకు మంజూరైన ఎన్‌సిసి బెటాలియన్‌ను వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎంఎం నాయక్ వెల్లడించారు. శుక్రవారం ఎన్‌సిసి కమాండింగ్ ఆఫీసర్ బిడి జేమ్స్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2800 మంది విద్యార్థులు ఎన్‌సిసిలో చేరి సేవలను అందిస్తున్నారని వివరించారు. వీరి సంఖ్య ఇంకా పెరగాలని, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలను గుర్తించి ఎన్‌సిసిలోకి విద్యార్థులను చేర్పించేలా చర్యలుతీసుకోవాలని సర్వశిక్ష అభియాన్ పిఓ లింగేశ్వరరెడ్డిని ఆదేశించారు. విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలలో విద్యార్థులను చేర్పించాలని, కొత్త బ్యాచ్‌లను త్వరలో ప్రారంభించాలని ఆదేశించారు. ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన కొత్త ఎన్‌సిసి బెటాలియన్‌ను వచ్చే ఏడాది జూన్‌లోగా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని కమాండింగ్ అధికారి జేమ్స్‌కు తెలిపారు.
త్వరలో ఫైబర్‌నెట్ సేవలు
త్వరలో ఫైబర్‌నెట్ సేవలు జిల్లాలో అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ ఎం.ఎం. నాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన టెర్రా ఫైబర్‌నెట్ ప్రతినిధులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆఫ్టికల్ ఫైబర్‌లైన్లను త్వరితగతిన పూర్తిచేయాలని చెప్పారు. త్వరితగతిన ఫైబర్‌నెట్ సేవలు అందుబాటులోకి తేవాలని చెప్పారు. 100 ఎంబిపిఎస్ స్పీడ్‌తో ఫైబర్‌నెట్ పనిచేస్తుందని ప్రతినిధి చిట్టిబాబు వివరించారు.

మహిళా అభ్యున్నతే గురజాడ ఆశయం
విజయనగరం , నవంబర్ 27: మహిళా అభ్యుదయానికి వందేళ్ళ క్రితమే మహాకవి గురజాడ ఎనలేని కృషి చేశారని ఐద్వా రాష్ట్ర అధ్యక్షరాలు ప్రభావతి తెలిపారు. గురజాడ శతవర్థంతి సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ మహిళా అభ్యుదయానికి, మహిళల పట్ల జరుగుతున్న సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు, కన్యాశుల్కానికి వ్యతిరేకంగా నాటకాన్ని రచించి, ప్రదర్శనల ద్వారా ఆ సాంఘిక దురచారాన్ని రూపుమాపేందుకు పోరాడిన యోధుడు మహకవి గురజాడ అని కొనియాడారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ దేశం పట్ల తనకున్న భక్తి భావాన్ని చాటుకున్న వ్యక్తి గురజాడని అన్నారు. శతాబ్ధాల క్రితమే మహిళల పట్ల జరుగుతున్న ఆకృత్యాలకు స్పందించి గురజాడ అలుపెరగని పోరాటం చేసారని అన్నా రు. ప్రతిరోజు మహిళల పట్ల లైంగిక, భౌతిక దాడులు పెరిగిపోతున్నా ప్రభుత్వాలు ఉదాసీన వైఖరిని అనుసరిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ చూసినా మహిళలు అనేక రకాలుగా వేధింపులకు గురవుతున్నారని వీటిని రూపుమాపేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. మహిళలపై పెరిగిపోతున్న సాంఘిక ఆకృత్యాలను నిరోధించేందుకు మరో గురజాడ లాంటి అభ్యుదయ వాది పుట్టాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో గురజాడ వారుసురాలు గురజాడ ఇందిర, మహిళాభ్యుదయ వేదిక నాయకరాలు చీకటి చంద్రకళ, ఐద్వా జిల్లా అధ్యక్షరాలు శ్రీదేవి, జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు వి.ఇందిర, జిల్లా సహాయ కార్యదర్శి పాలూరి రమణమ్మ, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు శ్రీదేవి, కృష్ణవేణి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.