భగత్‌సింగ్

ఇంకో దారి ఉందా అమ్మా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగత్‌సింగ్- 4
=========
ఇరవయ్యో శతాబ్దం మొదటి దశకం. బెంగాల్ విభజన, స్వదేశీ ఉద్యమాల దరిమిలా దేశంలో రాజకీయ ఉష్ణోగ్రత బాగా పెరిగింది. అప్పటికింకా గాంధీగారు దక్షిణాఫ్రికా వదిలి ఇండియాకు మరలి రాలేదు. తెల్లవారి సామ్రాజ్య ప్రయోజనాలకు తగ్గట్టుగా, వారి దొరతనానికి ఇంచుక ఇబ్బంది కలగని విధంగా కాంగ్రెసు ముసుగులో బ్రిటిషు రాజభక్తులు జాతీయోద్యమాన్ని లోపలి నుంచి నీరుగార్చే మహిమాన్విత కార్యక్రమం ఇంకా మొదలుకాలేదు. విప్లవ జ్వాలలు దేశమంతటా విస్తరించాయి. తెల్లవాడి పీచమణచి స్వాతంత్య్రాన్ని పోరాడి సాధించటానికి దేశవాసులు ఉద్యుక్తులయ్యారు.
"Everywhere people were sensible of a change, of a "new air' which was blowing through men's minds' (జనానికి ఎల్లెఢలా మార్పు కనిపిస్తున్నది. మనుషుల మనసుల్లో కొత్త గాలి హోరున వీస్తున్నది) - అని రాజద్రోహాలను ఎలా నివారించాలో కనుగొనేందుకు జస్టిస్ రౌలట్ ఆధ్వర్యాన ఏర్పాటైన సెడిషన్ కమిటీ తన నివేదికలో గుండెలు బాదుకుంది. రాజకీయ సభలు జరపటం నేరం అని చెప్పినా లెక్కచేయక, పంజాబ్‌లో ఆందోళనకారులు ఏకంగా పాతిక బహిరంగసభలు పెట్టారని బ్రిటిషు కామన్స్ సభలో విదేశాంగమంత్రి మార్లే గగ్గోలు పెట్టాడు. లాజపత్‌రాయ్, అజిత్‌సింగ్‌లను అరెస్టు చేశాక కూడా పంజాబ్‌లో కొనసాగుతున్న అలజడి, దానిపై లెఫ్టినెంట్ గవర్నరు వ్యక్తపరచిన తీవ్రాందోళనలను మరచిపోతే మనకు మనుగడ లేదని వైస్రాయ్ మింటో భారత లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో బెంబేలెత్తాడు.
దేశాన్ని కబళించిన విదేశీ దురాక్రమణదారులకు ఇంతలా ముచ్చెమటలు పట్టిస్తూ, దేశమంతటా విప్లవ వాతావరణం అలుముకుని, తిరుగుబాటు తత్వంతో యావద్భారతం అట్టుడుకుతున్న సమయాన 1907 సంవత్సరం సెప్టెంబర్ 28 ఉదయం 9 గంటలకు పంజాబ్‌లోని బంగా గ్రామంలో షహీద్ భగత్‌సింగ్ భూమి మీదికి వచ్చాడు. అతడు పుట్టిన తేదీ కచ్చితంగా తెలియదు. సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 25, సెప్టెంబర్ 27, సెప్టెంబర్ 28, అక్టోబర్ 5, అక్టోబర్ 19, అక్టోబర్ 27, డిసెంబర్ 28 ... ఇలా ఒక్కో చరిత్రకారుడు ఒక్కో తేదీని ఇచ్చాడు. భగత్‌సింగ్ తమ్ముడి కూతురు వీరేందర్ సంధుతో, భగత్‌సింగ్ తల్లితో మాట్లాడిన మల్వీందర్‌సింగ్ వారాయిచ్, రికార్డులను విస్తృతంగా పరిశీలన కుల్‌దీప్ నయ్యర్ సెప్టెంబర్ 28 అన్నారు కాబట్టి కొత్త రుజువు బయటపడేంత వరకూ ఆ తేదీనే ఒప్పుకుంటే తప్పు లేదు.
ఆరుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్న పెద్ద కుటుంబంలో భగత్‌సింగ్ రెండో బిడ్డ. అతడి అన్న జగత్‌సింగ్ పదకొండో ఏటే చనిపోయాడు.
తల్లి విద్యావతికి రెండో కాన్పు తేలిగ్గానే అయింది. పసిమిరంగు మేనిచాయ, మెరిసే పెద్ద కళ్లు, చక్కటి ముఖ కవళికలతో పండంటి బిడ్డ. చూడ ముచ్చటగా ఉన్నాడు. ఆ సంతోషం ఉన్నప్పటికీ ఇంటిల్లిపాదికీ దిగులు. బిడ్డను కళ్లారా చూసుకోవటానికి తండ్రి దగ్గర లేడు. అరెస్టును తప్పించుకోవడానికి పోలీసుల కళ్లుగప్పి దేశాంతరం వెళ్లాడు. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఎప్పుడు తిరిగొస్తాడో తెలియదు. అతడు లేకపోయినా అన్నీ చూసుకోవడానికి ఉమ్మడి కుటుంబంలో మిగతా సోదరులైనా ఉన్నారా అంటే ఆ తృప్తీ లేదు. ఇంటి పెద్ద అర్జున్‌సింగ్‌కి ముగ్గురు కొడుకులు. పెద్దవాడు కిషన్ సింగ్ ప్రవాసంలో ఉండగా, రెండో వాడు అజిత్‌సింగ్ పంజాబ్‌ను కదిలించి, సమరానికి ఆయత్తం చేసిన నేరానికి బర్మాలోని మాండలే దీవి కారాగారంలో కఠిన శిక్ష అనుభవిస్తున్నాడు. మూడోవాడు స్వరణ్‌సింగ్ అన్నలకు చేదోడుగా నిలిచిన అపరాధానికి లాహోర్ సెంట్రల్ జైలులో చిత్రహింసల వల్ల ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి ఉన్నాడు. అన్నదమ్ములు అందుబాటులో లేకపోవటం కుటుంబానికి అనుక్షణం తొలిచే వెలితి. మానసికంగా సంక్షోభం.
అందరూ ఉసూరుమంటూండగానే - ఆశ్చర్యం! ఇలా బిడ్డ పుట్టాడో లేదో అలా కబురు మీద కబురు. అన్నీ శుభవార్తలే. తండ్రి కిషన్ సింగ్ నేపాల్ నుంచి తిరిగి వచ్చేస్తున్నాడు. చిన్నాయన స్వరణ్‌సింగ్‌ని లాహోర్ జైలు నుంచి బెయిలు మీద విడిచిపెట్టారు. పెద్ద బాబాయ్ అజిత్ సింగ్ కూడా మాండలే నుంచి తిరిగొస్తాడని సమాచారం. ఇంకేం కావాలి? మూడు రోజుల్లో చింతలన్నీ తీరి అందరి మొగాన ఆనందం వెల్లివిరిసింది. నాయనమ్మ జయ్‌కౌర్ పసివాడిని ముద్దులతో ముంచెత్తి ‘నా మనవడు చాలా అదృష్టవంతుడు. వస్తూనే కుటుంబాన్ని కలిపాడు. పూర్వజన్మలో గొప్ప భగత్ (మహాత్ముడు) అయి ఉండాలి. ఈ జన్మలో మనల్ని ఉద్ధరించడానికి వచ్చాడు’ అని మురిసిపోయింది. భాగ్యాన్ని తెచ్చిన ‘్భగన్‌లాల్’ అనీ, ‘్భగత్’ అనీ పిలుస్తూపోగా చివరికి ‘్భగత్‌సింగ్’ పేరు స్థిరం అయింది.
అన్నదమ్ములు తిరిగొచ్చినా ఎక్కువ కాలం కలిసున్నది లేదు. పగబట్టిన బ్రిటిషు వారు ఎటునుంచి వేటు వేస్తారోనని కాచుకుంటూ, జైలుకో ఉరికో సిద్ధపడి నిత్యం టెన్షను పడేకంటే దేశాంతరానికి పోయి జాతి విముక్తికి అక్కడి నుంచి పోరాడటం మేలని కిషన్ సింగ్ నచ్చచెప్పి, అజిత్‌సింగ్‌ను విదేశాలకు పంపాడు.
స్వరణ్‌సింగ్ జైల్లో ముదిరిపోయిన క్షయతో కొంతకాలానికే కన్ను మూశాడు.
కిషన్‌సింగ్ ఇంటి పట్టునే ఉన్నా అతడికి సవాలక్ష వ్యాపకాలు. ప్రభుత్వంతో బాహాటంగా పోరాటం చేయకపోయినా, అప్పట్లో ఉద్ధృతంగా సాగుతున్న విప్లవ కార్యకలాపాలకు అతడు క్రియాశీల, ఆర్థిక సహాయాలు చాలా చేసేవాడు. ఎప్పుడూ ఎక్కడెక్కడికో వెళుతూండేవాడు. ఇంట్లో ఉన్నప్పుడైనా ఎప్పుడూ వచ్చేపోయే అతిథులు. ఆ కాలాన పేరు మోసిన ఎందరో విప్లవకారులకు ఆ ఇల్లు ఒక రహస్య ఆశ్రయం. పెద్దాయన అర్జున్‌సింగ్ జాతీయవాదులకు పెద్ద అండ. పేర్లు బయటపెట్టరు కనుక వచ్చేవారి తబిసీళ్లు ఇంట్లో వారికే తెలియదు. రాత్రి పొద్దుపోయేదాకా రాజకీయ చర్చలు, రహస్య కార్యాచరణ ప్రణాళిక రచనలు, సమాలోచనలు జరుగుతూండేవి. తాత ఒళ్లో కూచునో, తండ్రి వెనక నిలబడో పసి వయసు నుంచే భగత్‌సింగ్ వాటిని వింటూండేవాడు. తెల్లవాళ్లు చేస్తున్న రాక్షసకృత్యాలను, దేశాన్ని రాచిరంపాన పెడుతున్న తీరును పెద్దవాళ్ల సంభాషణల్లో వింటూ వుంటే అతడికి రక్తం మరిగేది. మిగతా పిల్లలు బొమ్మలతో, బొంగరాలతో ఆటలాడుకునే వయసులోనే అతడికి ఈడుకు మించిన రాజకీయ చైతన్యం కలిగింది. మాతృభూమి విముక్తికి ముందుకురకాలని అతడి మనసు ఉరకలు వేసేది.
పసివాడు లెమ్మని పెద్దవాళ్లు పట్టించుకోకపోయినా, ఇంట్లోని ఆడవాళ్ల ముందు భగత్ పెద్ద కబుర్లు బాగా చెప్పేవాడు. ఇద్దరు పినతండ్రుల భార్యలూ పుట్టెడు దుఃఖంతో ఉండేవారు. భర్త గతించాడన్న బాధ ఒకరికి; భర్త క్షేమ సమాచారాలు తెలియక, నిరంతర వేదన ఇంకొకరికి. అజిత్‌సింగ్ భార్య హర్నామ్ కౌర్‌కి భగత్ అంటే చాలా ముద్దు. రోజూ అతడికి బాబాయి చేసిన పోరాటాల గురించి, స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసి, ప్రాణాలు అర్పించిన వీరుల గురించి కథలు కథలుగా చెప్పేది. పరులకు తెలియకుండా పొద్దంతా కడుపులో దాచుకున్న దుఃఖం రాత్రివేళ వెళ్లుకొచ్చి ఆమె నిశ్శబ్దంగా రోదిస్తూంటే పక్కలోని భగత్ ఆమెను దగ్గరికి తీసుకుని నుదురు నిమురుతూ ‘్భయపడకు పిన్నీ. నేను పెద్దయ్యాక యుద్ధం చేసి తెల్లవాళ్లను గెంటేస్తా! బాబాయిని తీసుకొచ్చి మన దగ్గరే ఉంచేస్తా’ అని ధైర్యం చెప్పేవాడు.
పినతండ్రి విప్లవ భావాలు, తండ్రి కార్యకలాపాలు భగత్ మనసులో గాఢమైన ముద్ర వేసినా, చిన్నతనంలో అతడికి ప్రధాన ఆలంబనం తాత అర్జున్‌సింగ్. ఆర్య సమాజ్‌లో చురుకైన సంస్కరణశీలిగా, అభ్యుదయ వాదిగా తాత మాటలు విని, ఆయన చేతలు గమనించి, అస్తమానం ఆయన చుట్టూ తిరిగి అతడు చాలా నేర్చుకున్నాడు. భగత్ వ్యక్తిత్వాన్ని మలిచిన వారిలో మొదటివాడు అర్జున్‌సింగే. విద్య లేకపోయినా చక్కని సంస్కారంగల తల్లి విద్యావతి ప్రభావం సరేసరి.
ఇల్లే తొలి పాఠశాల కాగా భగత్‌సింగ్ అక్షరాలు దిద్దుకున్న తొలి బడి బంగాలోని ప్రైమరీ స్కూలు. తాత చేయి పట్టుకుని బడిలోకి అడుగు పెట్టే ముందు కాస్త భయపడ్డా, కొత్త వాతావరణంలో తేలిగ్గానే కలిసిపోయాడు. అన్న జగత్‌సింగ్ తోడుగా ఉండటంవల్ల, టీచర్లకు అర్జున్‌సింగ్ అన్నా, ఆయన కుటుంబమన్నా గౌరవభావం ఉండటం వల్ల, బళ్లోని పిల్లలూ చాలామంది తన సావాసగాళ్లే కావటంచేత బడి అంటే ఇష్టం ఏర్పడింది. చదువులో, ఆటల్లో చురుకుగా ఉన్నా, చిన్నతనం నుంచీ భగత్ ఏకాంతాన్ని ఇష్టపడేవాడు. అతడి లోకజ్ఞానం. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల గురించి అతడికున్న అవగాహన చూసి టీచర్లు ముచ్చటపడేవారు. అతడి ఇంటి వాతావరణం తెలుసు కనుక అది వారికి అబ్బురమనిపించలేదు.
ఓ రోజు బళ్లో ఉపాధ్యాయుడు ‘పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నారు’ అని అడిగితే, ‘డాక్టరునవుతా, జడ్జీనవుతా’నంటూ కుర్రాళ్లు తలా ఒక రకంగా చెప్పారు. తన వంతు వచ్చినప్పుడు భగత్‌సింగ్ ‘సర్! నేనేమవుతానో నాకు తెలియదు. కాని ఏది చేసినా నా దేశానికీ, నా ప్రజలకు మంచి చేసేదే చేస్తాను’ అని తడుముకోకుండా, దృఢంగా అన్నాడు.
అన్న జగత్ అంటే భగత్‌కి మహా ఇష్టం. ఇద్దరూ ఎప్పుడూ కలిసి తిరిగేవాళ్లు. లోకులు వారిని ‘రామలక్ష్మణులు’ అని పిలిచేవాళ్లు. అది విన్న తల్లి తన బిడ్డలకు ఎవరి దిష్టీ తగలకూడదని దేవుళ్లకు మొక్కుకునేది. ఆమె భయం చూసి భర్త నవ్వేవాడు. చివరికి భయపడినంతా అయంది. ఓ రోజు సలసలలాడే జ్వరంతో బడి నుంచి వచ్చిన జగత్, ఏ మందు వాడినా ప్రయోజనం లేక, కొన్నాళ్లకు కన్నుమూశాడు. ముఖ్యంగా భగత్‌కి అది పెద్ద షాకు. తిండి సరిగా తినక ఏదీ పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా దిగాలుగా ఉండేవాడు. మిగిలిన ఒక్క కొడుకూ ఏమైపోతాడోనని తల్లి తల్లడిల్లేది. ఆమె బాధను చూడలేక కిషన్‌సింగ్, వాతావరణం మారితే భగత్‌లో మార్పు రావచ్చని తలిచి తన మకాం లాహోర్‌కు మార్చాడు. అక్కడ ఇన్సూరెన్సు కంపెనీ ఏజంటుగా పనిచేస్తూ, ఊరి శివారులో వ్యవసాయ క్షేత్రం కొనుక్కొని, తండ్రి అనుమతితో అక్కడ వేరు కాపరం పెట్టాడు.
కొత్త ఊరు. కొత్త చోటు. పల్లెటూరి ప్రశాంత వాతావరణానికి, నగర వాసానికీ చాలా తేడా. స్కూలు మరీ కొత్త. సాధారణంగా లాహోర్‌లో సాటివారు పిల్లల్ని ఖాల్సా స్కూలులో వేస్తుంటారు. దాని యాజమాన్యం తెల్లదొరల ప్రాపకానికి వెంపర్లాడుతుంటుంది. దానికి ఎంత పేరున్నా తన బిడ్డకు అది వద్దనుకుని, తమ కుటుంబానికి ప్రీతిపాత్రమైన ఆర్యసమాజ్ వారికి చెందిన డి.ఎ.వి. స్కూల్లో తొమ్మిదో ఏట భగత్‌ను చేర్చాడు కిషన్‌సింగ్.
ఆ కాలాన లాహోర్ డి.ఎ.వి. స్కూలుకు జాతీయవాదుల్లో మంచి పేరు ఉండేది. అనంతరకాలంలో పంజాబ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన దేశభక్తుల్లో చాలామంది డి.ఎ.వి.లో పాఠాలు నేర్చినవారే. గంభీరంగా తోచిన కొత్త పరిసరాలకు అలవాటు పడటం మొదట్లో కాస్త కష్టమనిపించినా భగత్ తేలిగ్గానే కలిసిపోయాడు. అతడు చలాకీ కుర్రాడు; ఆటల్లో హుషారైనవాడు కావడంతో; సహాధ్యాయులకు బాగా దగ్గరయ్యాడు. చదువులో చురుకు; ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదివి కొత్త విషయాలు తెలుసుకుందామనే రకం కాబట్టి ఉపాధ్యాయులకూ అతడు నచ్చాడు. ఊరు మారాక తండ్రి కార్యకలాపాలు ఇంకా ఎక్కువయ్యాయి. పేరుకు వ్యవసాయ క్షేత్రమైనా, పాడి, పంటలకంటే ఎక్కువగా రాజకీయ విషయాలే వారి లోగిలిలో చర్చించబడుతూండేవి. కిషన్‌సింగ్ నివాసం విప్లవకారులకు రహస్య నెలవుగా మారింది. వారి మాటలు, భావాలు యధాలాపంగా వింటూండే కొద్దీ భగత్ ఆలోచనా పరిధి విస్తృతమైంది. ఇల్లు అతడికి రెండో పాఠశాల అయింది.
చిన్ననాటి నుంచీ భగత్‌సింగ్ జాగ్రత్త మనిషి. తన పుస్తకాలు, వస్తువులు పనికాగానే యథాస్థానాల్లో నీటుగా పెడుతూండేవాడు. ఓ రోజు రాత్రి పొద్దుపోయేదాకా ఏదో పుస్తకం చదువుతూనే నిద్రపోయాడు. మర్నాడు స్కూలుకు వెళ్లే తొందరలో కొన్ని పుస్తకాలను టేబుల్ మీదే వదిలేశాడు. కాసేపటికి కొడుకు గదిలోకి ఎందుకో వెళ్లిన తల్లి విద్యావతికి అవి కంటపడ్డాయి. తెరిచి ఉన్న ఒక పుస్తకాన్ని చూస్తే మార్జిన్లో రాసిపెట్టిన లైన్లు భగత్ చేతిరాతలో కనిపించాయి. విద్యావతి పుస్తకాన్ని తిరగేసింది. అది కొడుకు క్లాస్‌బుక్ కాదు. బల్ల మీద పరకాయించి చూస్తే క్లాసు పుస్తకాలు కానివి ఇంకా కొన్ని కనిపించాయి. వాటి నిండానూ కుర్రవాడు రాసుకున్న నోట్సు ఉన్నాయి.
సాయంత్రం భగత్ ఇంటికొచ్చాక తల్లి అతడి గదిలోకి వెళ్లింది. మామూలుగా పాలగ్లాసు ఇచ్చేసి వెళ్లకుండా మంచం మీద కూర్చుంది. అమ్మ ఏదో మాట్లాడాలనుకుంటున్నదని అబ్బాయికి అర్థమైంది. పాలు తాగాక ప్రశ్నార్థకంగా చూశాడు. తల్లి లేచి బుక్‌షెల్ఫ్ లోంచి కొన్ని పుస్తకాలు తీసి చూపించి ‘వీటిని పొద్దున నీ బల్లమీద చూశానురా. ఇవేవీ నీ పాఠం పుస్తకాలు కావుగదా?’ అంది.
‘అవి స్వాతంత్య్రం కోసం పోరాడిన అనేక దేశాల మహనీయుల జీవితాలకు సంబంధించినవమ్మా!’ అని బదులిచ్చాడు భగత్.
తల్లి నిట్టూర్చింది. కుటుంబంలో ఇప్పటికే కావలసినంత మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తన కొడుకు కూడా వారి అడుగుజాడల్లోనే నడవబోతున్నాడా? కష్టాలూ, దిగుళ్లూ ఇంకా ఎక్కువ కానున్నాయా?

‘ఎందుకమ్మా అలా ఉన్నావ్?’ అని అడిగాడు భగత్‌సింగ్.
‘ఈ పుస్తకాలను చదివి నువ్వు కూడా వాళ్లలాగే కావాలనుకుంటావేమో! అదే జరిగితే పోనుపోను నువ్వు సర్కారుకు ఎదురుతిరిగి ఎన్ని అవస్థలు పడతావో.. ఎక్కడ జైలుపాలవుతావో అని నా భయంరా’ అంది విద్యావతి.
భగత్ తల్లిని గట్టిగా వాటేసుకుని అడిగాడు.
‘్ఫతేసింగ్ మునిమనవడిగా, అర్జున్‌సింగ్ మనవడిగా, కిషన్‌సింగ్ కొడుకుగా, అజిత్‌సింగ్ అన్న కుమారుడిగా నాకు ఇంకోదారి ఉందా అమ్మా!?’
తల్లి నోట మాట రాలేదు.
[Shaheed Bhagat Singh, Harish Dhillon, P.45]

*

ఎం.వి.ఆర్. శాస్త్రి