రాష్ట్రీయం

బారులు తీరిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాగానికి తరలివచ్చిన లక్షకుపైగా భక్తులు
మార్మోగిన వేద మంత్రాలు
యధావిధిగా యాగ ప్రక్రియ
సంగారెడ్డి, డిసెంబర్ 24: దేశ వ్యాప్తంగా ప్రధానంగా వినిపిస్తున్న అయుత చండీ మహాయాగాన్ని కన్నులారా వీక్షించి అమ్మ ఆశీస్సులు పొందడానికి భక్తజనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఐదు రోజుల కార్యక్రమంలో రెండవ రోజైన గురువారం ఎర్రవల్లి జనసంద్రంగా మారింది. ఒక దశలో భక్తులు యాగవల్లిగా ఎర్రవల్లి గ్రామాన్ని ఉచ్ఛరిస్తున్నారంటే అయుత చండీ మహాయాగానికి భక్తులు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయతో పాటుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్, ప్రభుత్వ సలహాదారు కెవి.రమణాచారి, తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వెంకన్న, దత్తన్నలు ఇద్దరు ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు ఎర్రవల్లికి చేరుకున్నారు. వీరిని మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిల నేతృత్వంలో రుత్వికులు పూర్ణకుంభంతో సాదరంగా ఆహ్వానించారు. నేరుగా యాగశాల ఆవరణకు చేరుకున్న కేంద్ర మంత్రులు విడది కుటీరాల్లోకి చేరుకుని దీక్షా వస్త్రాలను ధరించి యాగ ప్రాంగణానికి చేరుకున్నారు. వీరిని సిఎం కెసిఆర్ ఎదురుగా వెళ్లి స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి యాగశాలకు విచ్చేశారు. ఆంగ్లో-ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్‌సన్ సైతం హాజరయ్యారు. మొదటి రోజున పసుపు వస్త్రాలను ధరించిన రుత్వికులు రెండవ రోజున గులాబి వస్త్రాలను ధరించి యాగం నిర్వహించారు. యాగాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు 9.30 గంటలకు చేరుకుని యాగశాల చుట్టూ ప్రదక్షిణ నిర్వహించిన అనంతరం అమ్మవారిని మనసారా స్మరిస్తూ సాస్టాంగ ప్రణామాలు చేసి వేద పండితుల ఆశీస్సులు స్వీకరించారు. సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. కుంకుమార్చనలో పాల్గొనడానికి వచ్చిన మహిళలు ఉదయం 7 గంటల నుంచి క్యూ కట్టారు. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలందరికీ అమ్మవారి కుంకుమతో పాటు చీరలను కానుకగా సమర్పించారు. 50 వేల మంది వరకు మాత్రమే భక్తులు వస్తారని భావించినప్పటికీ ఆ సంఖ్య రెట్టింపుకంటే ఎక్కువగానే ఉంది. రెండవ రోజు లక్షకుపైగా భక్తులు యాగాన్ని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు యాగాన్ని నిలిపివేసిన రుత్వికులు భోజనాలకు ఉపక్రమించారు. వందల సంఖ్యలో వాహనాలు రావడంతో ఎర్రవల్లి రోడ్డును దాటడానికి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రెండవ రోజు తినుబండారాల దుకాణాలు వెలిశాయి. ఆర్టీసీ అధికారులు ప్రజ్ఞాపూర్ నుంచి ఎర్రవల్లి యాగస్థలం వరకు ప్రత్యేక బస్సులు నడిపించారు. డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి చొరవ తీసుకుని ఏడు స్కూల్ బస్సులను యాగశాల వద్దకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటుచేశారు.
గుండెపోటుతో సొమ్మసిల్లిన భక్తుడు
జగదేవ్‌పూర్: అయుత చండీ మహాయాగానికి రెండవ రోజు భక్తుల రాకడ విపరీతంగా పెరిగింది. అన్ని వర్గాలకు చెందిన వారు వస్తుండటంతో యాగశాల ప్రాంగణం ముగ్గురమ్మల మూలపుటమ్మ నామస్మరణ జరుగుతోంది. సికింద్రాబాద్‌కు చెందిన నర్సింగ్‌రావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం ఎర్రవల్లిలోని యాగస్థలానికి చేరుకున్నారు. క్యూలైన్‌లో నిల్చున్న నర్సింగ్‌రావుకు ఒక్కసారిగా గుండెనొప్పి రావడంతో సొమ్మసిల్లి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యుల సూచనల మేరకు పోలీసులు వెంటనే ఆరోగ్య శిబిరం వద్దకు తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్సలు అందించారు. 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. గురువారం నాటి యాగానికి ముఖ్యమంత్రి ఆలస్యంగా రావడం, యాగం ప్రారంభమయ్యే వరకు కుంకుమార్చన నిర్వహించకపోవడంతో దాదాపు నాలుగు గంటల పాటు మహిళలు క్యూలో నిల్చున్నారు. యాగం ప్రారంభమైన అనంతరం ఉదయం 11 గంటలకు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పటి వరకు క్యూలో ఉన్న మహిళలను ఒక్కసారిగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి వదిలిపెట్టారు. దీంతో మహిళలు ఒకరిని ఒకరు తోసుకోవడంతో ఓ మహిళ కిందపడిపోయింది. తోటి మహిళలు ఆమెకు అండగా నిలవడంతో కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొంది.
ఇదిలావుండగా అయుత చండీ మహాయాగాన్ని వీక్షించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇరుగుపొరుగు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో రానున్న దృష్ట్యా ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. గురువారం నాడు యాగశాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరానికి 250 మంది రోగులు తరలివచ్చి సేవలు ఉపయోగించుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలాజి పవార్ వెల్లడించారు. మూడువేలకుపైగా పోలీసులు వచ్చిన దృష్ట్యా వారి కోసం కూడా మరో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 250 మంది భక్తులు కూడా కాళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, స్వల్ప జరం లాంటి వాటికి ఆరోగ్య సేవలు పొందారని చెప్పారు.
రుచికరమైన భోజనం అందించిన నిర్వాహకులు
గజ్వేల్: అయుత చండీయాగానికి 70వేల మందికిపైగా భక్తులు హాజరుకాగా వారికి కార్యక్రమ నిర్వాహకులు రుచికరమైన భోజనాన్ని అందించారు. సాధారణ భక్తుల అన్నప్రసాద ఇన్‌చార్జి చీటి రామారావ్ నేతృత్వంలో రెండోరోజైన గురువారం రుచికరమైన, పసందైన ఆహారాన్ని పంపిణీ చేశారు. అన్నంతోపాటూ దోసకాయపచ్చడి, మసాల గుత్తివంకాయకూర, పాలకూర మామిడికాయపప్పు, పప్పుచారు, పెరుగు, పాపడ, లడ్డు వితరణ చేశారు. అయితే లక్ష మంది భక్తులు హాజరవుతారని కార్యక్రమ నిర్వాహకులు అంచనా వేసి ఏర్పాట్లు సిద్దం చేశారు. ఇందులో 400 మంది సప్లయర్స్, 300 మంది వంటవాళ్ళ, 110 మంది శుభ్రం చేసేవారితోపాటు మరో 20 మంది సేవలందించారు. కాగా మొదటగా పసుపులేటి రమేశ్‌బాబు నేతృత్వంలో చండీమాత అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని సాధారణ భక్తులకు అందించే భోజనంలో నిమితం చేశారు.
(చిత్రం) గురువారం అయుత చండీయాగానికి హాజరైన కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ.. వారితో కలిసి హోమగుండానికి నమస్కరిస్తున్న సిఎం కెసిఆర్ దంపతులు

రామాయణ ప్రవచనం.. భక్తి పారవశ్యం
జగదేవ్‌పూర్, డిసెంబర్ 24: బృహత్తరమైన లోక కల్యాణానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహిస్తున్న అయుత చండీ మహాయాగానికి హాజరవుతున్న భక్తులు తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు. సాయంత్రం ముగిసిన వెంటనే భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తేందుకు నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాల్లో గజ్వేల్‌కు చెందిన రుక్మభట్ల నరసింహశాస్ర్తి ఆలపిస్తున్న గేయ రామాయణం రసరమ్య భరితమై అగ్రపథంలో నిలుస్తోంది. ప్రతి రోజు రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తులను ఆనంద పరవశులను చేస్తోంది. శ్రీరామచంద్రుడి జననం మొదలుకుని అవతారం ముగింపు వరకు మొత్తం రామాయణాన్ని తనదైన శైలిలో ఆలపిస్తున్నారు. సాధారణ వ్యక్తి సైతం అర్థం చేసుకునే స్థాయిలో నరసింహశాస్ర్తీ తనకు అనుకూలమైన యాస భాషలోకి అనువదించుకుని సంవత్సరాల తరబడిగా లక్షలాది మందిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంతో పాటు ధార్మిక ప్రవచనాలను దేవి ఉపాసకులు ప్రతి రోజు వినిపిస్తున్నారు.

వృద్ధులకు, వికలాంగులకు ఆటో డ్రైవర్ చేయూత
జగదేవ్‌పూర్, డిసెంబర్ 24: మానవ సేవయే మాధవ సేవ అన్న మాట కేవలం సూక్తి కాదని నిరూపిస్తూ ఓ ఆటో డ్రైవర్ వృద్దులు, వికలాంగులకు తనవంతు చేయూతను అందిస్తున్నాడు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఎర్రవల్లి ఇప్పుడు వెలిగిపోతుంది. లోక కల్యాణం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన అయుత చండీ మహాయాగానికి గ్రామస్తులు తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఎర్రవల్లి గ్రామానికి చెందిన యువకులు, మధ్య వయస్కులంతా యాగశాల వద్ద ఉండి వస్తున్న భక్తులకు విశేష సేవలందిస్తున్నారు. విశేష ప్రాచుర్యం పొందిన మహాయాగాన్ని తిలకించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా అన్ని వర్గాల వారు వస్తుండగా ఇందులో ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కోవడం సహజం. దీన్ని గుర్తించిన ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తనవంతు సహాయం అందిస్తున్నారు. ఎర్రవల్లి గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగశాల వరకు వృద్ధులను, వికలాంగులను తన ఆటోలో ఉచితంగా తీసుకువస్తున్నాడు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వికలాంగులు క్షేమంగా చండీ మాతను ఆశీస్సులు పొందుతున్నారు.