భక్తి కథలు

కాశీక్షేత్ర దర్శనం.... అలౌకిక ఆధ్యాత్మిక ఆనందకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ అనే నామాలతో విశ్వనాథస్వామి సహచర్యంతో నిత్యం జ్ఞానాన్ని, అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించే జగన్మాత ఆదిపరాశక్తి దర్శనం అలౌకిక ఆనంద ఆధ్యాత్మిక వరం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పరమేశ్వరుడు కాశీలో నివాసం ఏర్పర్చుకోవడానికి ఆ ప్రాంతాన్ని దర్శించి భక్తులకు కాశీ విశ్వనాధుడిగా అవతరించాడు. పురాణ గ్రంథాలు తిరగవేస్తే కాశీ నగరాన్ని దర్శించి రమ్మని కొంతమంది యోగులను పరమేశ్వరుడు పంపించాడు. కాశీనగర శోభకు ఆశ్చర్యానంద భరితులై ఆ యోగులు అక్కడే ఉండిపోయారు. ఈ విషయం గ్రహించిన పరమేశ్వరుడు కాశీనగరానికి బ్రహ్మను, గణపతిని పంపిస్తాడు. వారు కూడా కాశీనగర శోభకు ముగ్దులై అక్కడే వుండిపోయారు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువుకాశీనగరం చేరి అక్కడ శివలింగ ప్రతిష్టచేసి నిత్యం అభిషేక అర్చనలు చేయించాడు. ఆ కాలంలో కాశీనగరాన్ని దివోదాసు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు శివభక్తుడు. అతనికి శివసాయిజ్యం అనుగ్రహించి కాశీపురాదీశుడుగా పరమేశ్వరుడు కాశీనగరంలో ఉండిపోయాడు. శివుని ఆనందాన్ని వీక్షించిన గౌరీదేవి ఆ ప్రాంతంలో విశాలాక్షిగా నివాసం ఏర్పర్చుకుంది. ఒకానొక సమయంలో భర్తపై ప్రేమానురాగాలతో శివుని వెనకాలవెళ్ళి ఆయన కళ్ళు మూసింది. సూర్యచంద్రులు ఆ పరమేశ్వరుని కళ్ళు అవడంతో పార్వతీదేవి చేసిన చిలిపి పనికి లోకమంతా చీకటిగా మారిపోయింది. ఆ నల్లని చీకటికి పార్వతీదేవి నల్లగా మారిపోయింది. నల్లగా పారిన పార్వతీదేవి ఆ తరుణంలో కాళికాదేవిగా మారిపోయింది. తాను చేసిన చిలిపి పనికి పాప పరిహారం కోసం శివుడిని ప్రార్థించగా అన్నదానం చేయమని సలహా ఇచ్చాడు. శివుని ఆదేశానుసారం కాశీవాసులకు ప్రతి నిత్యం అన్నదానం చేస్తూ అన్నపూర్ణాదేవిగా పూజలందుకుంటూ పార్వతీదేవి కాలక్రమేణ నలుపు రంగుపోయి బంగారు చాయతో ప్రకాశించింది. అందుకే జగన్మాతకు ఈ కాశీక్షేత్రంలో విశాలాక్షిగా, అన్నపూర్ణగా భక్తులు పూజిస్తుంటారు. శిష్య పరివారంతో వచ్చిన వ్యాసమహర్షి కాశీనగర శోభకు, అన్నపూర్ణ దేవి అన్న ప్రసాదానికి పులకించి కాశీనగరంలో వుండిపోయాడు. ఆ మహర్షిని శివుడు పరీక్షింపదలచి మూడు రోజులపాటు మహర్షికి, ఆయన శిష్య బృందానికి భోజనం దొరక్కుండా చేసాడు. కోపంతో కాశీనగరాన్ని శపించబోతున్న ఆ మహర్షిని అన్నపూర్ణాదేవి వృద్ధురాలిగా ప్రత్యక్షమై ఆ మహర్షిని శాంతపరచి అందరికి భోజనాలు ఏర్పాటుచేసింది. ఎటువంటి ప్రయత్నం, ఆర్బాటం లేకుండా భోజనం ఏర్పాటుచేసిన ఆ వృద్ధురాలిని చూసి పార్వతీదేవిగా గుర్తించాడు. ఆ మరుక్షణమే సింహాసనంపై కూర్చున్న పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. తాను కాశీనగరాన్ని శపించడానికి పూనుకున్న పాపానికి పరిహారంగా పరమేశ్వరుడిని స్తుతించి ప్రసన్నం చేసుకున్నాడు. గంగానదికి అవతలపై స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. అదే వ్యాసకాశిగా ప్రచారంలోకి వచ్చింది. పరమపవిత్రమైన ఆ సన్నిధి శక్తిపీఠంగా ప్రాచుర్యం పొంది ఆ జగన్మాత ఆ ప్రాంతంలో విశాలాక్షిగా భక్తులకు దర్శనమిస్తూ అత్యంత మహిమగల మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ భక్తుల పాపాలను నశింపచేస్తూ భక్తుల కోర్కెలు తీరుస్తూ నిత్యశోభాయమానంగా కాశీక్షేత్రం ప్రకాశిస్తోంది. అత్యధిక దేవాలయాలున్న కాశీనగరం మహాపుణ్యక్షేత్రంగా చరిత్రపుటలలో లిఖించారు.
కాశీ నగరానికి ఇరువైపులా వరుణ నదీ ప్రవహిస్తుండటం మన ఈ ప్రాంతానికి వారణాసి అనే పేరు కూడా సార్థకమైంది. కాశీనగర దర్శనంతో కాశీవిశ్వనాధ నామస్మరణతో చేసిన పాపాలు తొలగిపోతాయని భృగు మహర్షి చెప్పినట్లు పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి. కాశీనగరంలో అతి పెద్ద బెనారస్ విశ్వవిద్యాలయం, కాశీ విద్యాపీఠం, సంస్కృత విశ్వవిద్యాలయం వున్నాయి. కాశీ నగరం గంగానదిలో భక్తుల స్నానాలకోసం హరిశ్చంద్రఘాట్, కేధార్‌ఘాట్, ఆనందమయ ఘాట్‌లను ఏర్పర్చారు. ఈ ప్రాంతంలో ఎటువంటి అపచారాలు, అశాంతి జరగకుండా అష్ట భైరవమూర్తులు కాపలా కాస్తుంటారు. వీరిలో కాళభైరవ మూర్తిని భక్తులు విధిగా దర్శించుకుంటారు. పరాశక్తితో శివశక్తి కూడా తోడుగా వుంటుంది. ఆదిపరాశక్తి అవతారాలలో జగన్మాత ఏ పేరుతో ఎక్కడ వున్నా అక్కడ లింగరూపంలో శివుడు వుంటాడు. ప్రకృతి స్వరూపమే మహాశక్తి, ఆమె మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలతో జగన్మాతగా భక్తుల పూజలు అందుకుంటోంది. శివుని తలపై నుండి భూమి పై జాలువారుతున్న గంగానది కాశీలో ప్రవహిస్తూ తనను స్మరించిన వారికి సకల పాపాలను పోగొడుతోంది. ప్రస్తుతం కనిపిస్తున్న కాశీ నగరాన్ని క్రీ.శ. 1785లో ఇండోర్ మహారాణి నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది. నిత్యం వేద మంత్రాలతో హిందూ ధర్మానికి ఆత్మగా కాశీనగరం ప్రకాశిస్తోంది.

-బ్రహ్మశ్రీ కురువాడ మురళీధర్