భాస్కర వాణి

ప్రమాదంలో ప్రజాస్వామ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి జవహర్‌లాల్ నెహ్రూ గొప్ప ప్రజాదరణ గల నాయకుడు. ఆయన ఎంత సీరియస్ పొలిటీషియనో అంత హాస్య చతురత గలవాడు. ఎదుటివారు శత్రుపక్షం వారైనా మెచ్చుకొనే స్వభావం ఆయనకుండేది. నెహ్రూతో ఇంకెవరో పెద్ద మనిషి మాట్లాడుతుండగా- అక్కడికి అటల్ బిహారీ వాజపేయి వచ్చారట. యువకుడైన వాజపేయిని నెహ్రూ పరిచయం చేస్తూ ‘ఇతడెప్పుడైనా ఈ దేశానికి ప్రధాని అవుతాడు’ అన్నాడట. అలాగే 1948లో ‘శంకర్ వీక్లీ’ అనే పత్రిక నిర్వహించిన సమావేశంలో ఉపన్యసిస్తూ- ‘ఈ పత్రికను మీరు ఎలా నడుపుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ కార్టూన్‌లలో నన్ను వదలిపెట్టవద్దు’ అన్నాడట నెహ్రూ.
ఇదీ ఆనాటి నాయకుల ఉదాత్త హృదయానికి, ప్రజాస్వామ్య దృష్టికి తార్కాణం. మరి ఈరోజు కార్టూన్స్ వేస్తే భరించే శక్తి ఎంతమంది నాయకులకు ఉంది? దీనికి ప్రధాన కారణం నాయకుల హృదయాల్లో ప్రజాస్వామిక లక్షణం లేకపోవడం. ఎదుటివారి భావ వ్యక్తీకరణకు గౌరవం ఇచ్చే మనస్తత్వం లేకపోవడం! ఇలాంటి దృక్పథం వల్లనే తెలంగాణ అసెంబ్లీలో గత కొద్ది రోజుల నుండి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి.
ఇటీవల నల్లగొండలో మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగింది. అతను ఆ జిల్లాలోప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్య అనుచరుడు. శ్రీనివాస్ హత్యతో వెంకటరెడ్డి మనోధైర్యం దెబ్బతింది. ఈ హత్య టీఆర్‌ఎస్ నాయకుల పనే అని ఆయన ఆరోపిస్తున్నాడు. శ్రీనివాస్ సంతాప సభలో టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను తీవ్రంగా హెచ్చరించాడు. అప్పటినుండి ముఖ్యమంత్రిపై తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు. నిజానికి కోమటిరెడ్డిని ఉదార హృదయం గల నాయకుడిగా చెప్తారు. అంతేగాకుండా తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత మరింతగా ప్రజల్లో కలిసి తిరుగుతున్నాడు. ఒక్కసారిగా తన ముఖ్య అనుచరుడి హత్య అతనిలో అసహనాన్ని తెచ్చింది. ఈలోపు ఒక ప్రజాప్రతినిధిగా రైతు సమస్యలు ప్రస్తావించాడు. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే కోమటిరెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొంది. వీళ్ల మనస్తత్వాన్ని ముందే పసిగట్టిన కేసీఆర్ అంతకుముందు రోజు జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం సమావేశంలో కాంగ్రెస్ సభ్యుల వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో వివరించాడు. అంతేగాకుండా గంగుల కమలాకర్ లాంటి వారిని హెచ్చరిస్తూ, కాంగ్రెస్ ఉచ్చులో పడి ఆవేశానికి లోనుకావద్దని చెప్పినట్లు వార్తలొచ్చాయి. అనుకున్నట్లుగానే సభా ప్రారంభం రసాభసగా మారి కాగితాలు, హెడ్‌ఫోన్ సెట్లు వెంకట్‌రెడ్డి విసిరేయడం జరిగింది. ఈ గొడవలో ఏదో వస్తువు శాసనమండలి చైర్మన్ కంటికి తగిలి గాయం అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ బస్సు యాత్ర చేస్తే ప్రభుత్వం ఎంత పట్టించుకున్నదో తెలియదు కానీ మీడియా మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. బస్సు యాత్ర మామూలు వార్తగా మారిపోయింది. కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర, బిజెపి ఈశాన్య రా ష్ట్రాల అపూర్వ విజయం రెం టినీ అప్రాధాన్య అంశాలుగా మార్చడానికే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రస్తావన తెచ్చారన్నది విశే్లషకుల అంచనా.
కాగా, మండలి చైర్మన్ కంటికి గాయం అయ్యేట్లుగా వస్తువులు విసిరేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. అప్పుడప్పుడు విదేశాల్లో, ముఖ్యంగా కొన్ని పోకిరీ దేశాల్లో సభ్యులు హద్దులు మీరి ప్రవర్తించడం చూశాం. గతంలో తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వం జయలలితపై ఎంత దుర్మార్గంగా చట్టసభ సాక్షిగా ప్రవర్తించిందో కూడా మనకు తెలుసు. కరుణానిధిపై ఆ పగను జయలలిత మరణించేవరకూ వదలిపెట్టలేదు. మధ్యలో కరుణానిధిపై ఓ కేసు బనాయించి పంచె ఊడగొట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేసి జయలలిత తన పగ చల్లార్చుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో అయితే ఇలాంటి ఘటనలకు లెక్కేలేదు. ఇటీవల మహారాష్ట్ర, ఢిల్లీ శాసనసభల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకొన్నాయి.
నిజానికి పార్లమెంటు, శాసనసభ, శాసన పరిషత్తులు మొదలుకొని గ్రామ పంచాయతీల వరకు ఆరోగ్యకరమైన చర్చల కోసమే మనం రాజ్యాంగం ద్వారా చట్టసభలను, స్థానిక సంస్థలను ఏర్పరచుకొన్నాం. ఎవరి బలాన్ని వారు ప్రదర్శించేందుకైతే ప్రతి సభ్యుడూ ఓ తుపాకీనో, కర్రనో పట్టుకొని వెళ్లి మల్లయుద్ధంలో పాల్గొని తన బలాన్ని నిరూపించుకోవచ్చు. అలాకాకుండా నాగరిక దేశాల్లో రాజ్యాంగబద్ధంగా చర్చించడానికే ఈ ప్రజాస్వామ్య వేదికలు. అయితే కాంగ్రెస్ వారు కూడా దీనిని సమర్ధించలేదు. నిరసన తెలిపే భావస్వేచ్ఛను కేసీఆర్ ప్రభుత్వం అణచివేసిందని, హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ను ఎత్తేసి, కోదండరాం లాంటి వాళ్లను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. పిల్లిని కూడా గదిలో వేసి బంధిస్తే ఇలాంటి చర్యలే జరుగుతాయని వారి వ్యాఖ్యా నం. మన శాసనసభ చరిత్రలో ఎన్నడూ జరుగని విధంగా ఇద్దరు సభ్యులను తొలగిస్తూ సభ నిర్ణయం తీసుకొంది. ఇది సరైందా? కాదా? అని కోర్టులు, ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తాయి.
వాస్తవానికి కేసీఆర్‌లో ఉదాత్త నాయకుడు కన్పిస్తాడు. అంతే తీవ్రమైన కరుకుదనం కూడా కన్పిస్తుంది. ఇది ఇప్పటివరకు ప్రతిపక్షాలకు అర్థం కాలేదు. తనను నమ్మిన వారి పట్ల ప్రాణం ఇచ్చే స్వభావం గల వ్యక్తిగా, ఆపదలో ఉన్న వారిని తన, మన భేదం లేకుండా ఆదుకోవడం ఆయన నైజం. అప్పుడప్పుడు తన శత్రుపక్షం పట్ల అంతే వైరభావంతో ఉంటాడు. ఈ దృక్పథం అర్థం చేసుకోడానికి ప్రతిపక్షానికి, మీడియాకు నాలుగేళ్లు పట్టింది. ఇందులో భాగంగానే ఇద్దరు సభ్యులపై వేటు. అయితే కేసీఆర్ లాంటి పరిపక్వ రాజనీతిజ్ఞుడు మరుసటిరోజు వాళ్లను సభకు పిలిపించి క్షమాపణ చెప్పించి, సభ కొనసాగిస్తే ఆయనకు మరింత మంచి పేరు వచ్చేదని మేధోవర్గాల అభిప్రాయం. ‘తానాషాహీ హఠావో’ అంటూ రిజర్వేషన్ల అంశంపై రోజూ పార్లమెంటును స్తంభింపజేస్తున్న టీఆర్‌ఎస్ సభ్యులను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గౌరవంగా చూస్తున్న విషయం కేసీఆర్ కూడా విస్మరించరాదు.
‘ఆత్మహత్య నా నిరసన’- అని ఓ స్వాతంత్య్ర విప్లవవీరుడు అంటాడు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ గంగలో కలిసిపోయి, ఇలాంటి విషయాలే ముందుకువస్తాయి. ఇప్పటికే కాంగ్రెస్ తమ శిబిరంలో ఇద్దరు సభ్యుల సభ్యత్వం పోయినా, తమకు ప్రభుత్వంపై మైలేజ్ దక్కిందని లోలోపల సంతోషంగా ఉంది. కాంగ్రెస్ వాళ్లు దాడి చేయడంతో డిఫెన్స్‌లో పడినప్పుడు టీఆర్‌ఎస్ దానిని అందిపుచ్చుకోవాల్సిందని రాజకీయ వర్గాల ఆలోచన. ఎందుకంటే ఈ రోజుల్లో దాడి చేయడం కూడా కొందరికి హీరోయిజమే.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుస్తంభాల రాజకీయ క్రీడకు తెరలేచింది. కేంద్ర క్యాబినెట్ నుంచి తన ఇద్దరు మంత్రులను బయటకు రప్పించి, రోజూ బిజెపీని తిడుతూ ప్రజల్లో మోదీని విలన్‌గా చేయడంలో చంద్రబాబు కృతకృత్యుడయ్యాడు. ఇప్పుడైనా అక్కడి భాజపా నేతలు మేల్కోకపోతే నిజంగా కేంద్రంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే వారికీ పడుతుంది. కాంగ్రెస్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నికల ముందు తెలంగాణ ఇచ్చినట్లు, 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ప్రకటించినా భాజపాకు ఫలితం ఉండదు. ప్రజలకు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలి. చంద్రబాబుతో సంసారం పొసగేది కాదని ఇప్పటికైనా భాజపా గుర్తించాలి. కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, యూపీ ఎన్నికల్లో వ్యూహకర్తలను దింపినట్లు ఇప్పటి నుండే వ్యూహం పన్నకపోతే భాజపాకు పెద్ద ఎదురుదెబ్బ తప్పదు. గతంలో ఓసారి దేశమంతా కొట్టుకపోయినపుడు- తెలుగు రాష్ట్రాలే ఆ పార్టీకి పునర్జీవం ఇచ్చాయి. ఇప్పుడు నిర్జీవంగా ఉన్న కాంగ్రెస్‌కు తెలుగుదేశమో, తెరాసనో, వైఎస్సార్ సీపీనో బాసటగా నిలబడే ఛాన్స్ కూడా లేకపోలేదు. పార్లమెంటులో రిజర్వేషన్ల పేరుతో తెరాస, హోదా పేరుతో తెదేపా ఆందోళన చేస్తున్నా ఏమీ పట్టనట్లు వారి మానాన వారే పోతారని వదిలేస్తే భాజపాకు మిగిలేది పరాభావమే. వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చేకన్నా రాజకీయంగా ఎదుర్కోడమే దీనికి పరిష్కారం. పరిష్కారం కాని ప్రతి అంశాన్ని ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తూ కేంద్రంపై నెడుతున్న కుయుక్తిని భాజపాలోని పెద్దలు గమనించాలి. అందుకు తగిన ప్రతి వ్యూహం రచించాలి.
మరోవైపు మొన్న పవన్‌కల్యాణ్ ‘జనసేన’ పార్టీని పూర్తిస్థాయిలో ప్రజల ముందుకు తెచ్చాడు. ఇప్పటివరకు జగన్‌ను మాత్రమే శత్రువుగా భావించిన చంద్రాబాబుకు పవన్ మరోవైపు కన్పిస్తున్నాడు. జగన్‌కు ఎస్టాబ్లిష్‌డ్ రాజకీయ వ్యూహం ఉంది. పవన్‌కు కాపుకులం, సినీ అభిమానుల మద్దతు ఉంది. కాబట్టి చంద్రబాబు తెలివిగా ఏ వ్యూహం లేని భాజపాతో యుద్ధం చేస్తున్నట్లు కన్పిస్తూ వీళ్లను అధిగమించాలని చూస్తున్నాడు. రేపో, మాపో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంపైకి తెస్తారు! ఇంకోవైపు జగన్ ఆంధ్రాలోని మూడు ప్రధాన వర్గాలను తనవెంట ఉండేట్లు చూసుకుంటున్నాడు.
విచిత్రం ఏమిటంటే ప్రజలు ఇవన్నీ ఆలోచించకుండా కులాలకు, సెంటిమెంట్లకు లొంగిపోతున్నారు. ఇటీవలి కాలంలో వ్యవస్థల కన్నా వ్యక్తులపై జనం ఎక్కువ విశ్వాసం ఉంచుతున్నారు. చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ లాంటి నేతలు తమకు కావాలనుకొంటున్నారు. దాని పరిణామమే ప్రతి రాష్ట్రం ఓ కులం చేతిలోనో, కుటుంబం చేతిలోనో, ఓ వ్యక్తి కేంద్రంగానో నడుస్తుంది. అలాగే అభివృద్ధి ఫలాలు కూడా సమూహానికి జరగడం కన్నా వ్యక్తిగా తమకేం లాభం అని ప్రజలు ఆలోచిస్తున్నారు. నేడు రాజకీయం ‘ఈవెంట్ మేనేజ్‌మెంటు’గా మారుతోంది. ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తలు రాజకీయాలను తారుమారు చేస్తున్నారు. పూర్వం రాజులకు చతురంగ బలాలుగా అశ్వ, గజ, రథ, పదాతి దళాలు ఉంటే ఈరోజు రాజకీయానికి కులం, ధనం, బలం, వ్యూహం- ఈ నాలుగూ చతురంగ బలాలుగా మారిపోయాయి. ఇంకెప్పుడు మనం ప్రజాస్వామ్యం పరిరక్షించుకొంటాం?

-డా. పి.భాస్కరయోగి bhaskarayogi.p@gmail.com