భాస్కర వాణి

కొత్త రిజర్వేషన్లతో నూతనోత్సాహం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నియంత అడాల్ఫ్ హిట్లర్ ప్రజల్లో తన పలుకుబడి సన్నగిల్లినప్పుడల్లా తన అనుచరులకు ‘దేశం ప్రమాదంలో ఉందని పదే పదే ప్రచారం చేయండి’ అని చెప్పేవాడట. ఒకే అబద్ధాన్ని వందలసార్లు చెప్పి కొంతమందికైనా అది నిజం అనిపించేటట్లు చేయడం హిట్లర్ విధానం. ఈ అబద్ధపు ప్రచారం ఎక్కువగా తన ముఖ్య అనుచరుడైన గోబెల్స్‌తో చేయించేవాడు. దీనికే ‘గోబెల్స్ ప్రచారం’ అని పేరు. ఈ ప్రచారాన్ని, దాని వెనుక వున్న రహస్యాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎవరు అందించారో తెలియదు కానీ ‘రాఫెల్’ విషయంలో ఆయన ఇదే పంథాను అనుసరిస్తున్నాడు. అలాగే, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు హద్దులు మీరిన ద్వేషంతో చేస్తున్న పోరాటం, కొనసాగిస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. వీటన్నిటికీ ‘చెక్’ పెట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఓ బ్రహ్మాస్త్రం బయటకుతీశాడు. అదే ‘అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్’. ఇటీవల మూడు రాష్ట్రాల్లో భాజపా అధికారాన్ని కోల్పోయింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో అధికారం కోల్పోవడం జీర్ణం కాని విషయం. ఎంపీలో అధికార పీఠానికి కేవలం 11 సీట్ల తేడాతో భాజపా ఆగిపోయింది. అయితే ఆ సీట్లలో భాజపా కన్నా ‘నోటా’కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. సాంప్రదాయకమైన కొందరు ఓటర్లు భాజపాకు ఓట్లు వేయకున్నా కాంగ్రెస్‌కు మాత్రం వేయలేదు. వాళ్లకు కాంగ్రెస్‌పై అంత కసి ఉంది.
గత 20 రోజుల్లో బయటకు కన్పించని పెద్ద మథనమే భాజపాలో జరిగింది. ఉత్తర భారతంలో రిజర్వేషన్లపై తీవ్ర ఉద్యమాలు వస్తున్నాయి. మరాఠాలు, గుజ్జర్లు, పాటీదార్లు, జాట్‌లు తమకూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఉద్యమాలు తెస్తున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టడం కూడా మోదీ ఉద్దేశం. దాని ఫలితంగానే ‘సవర్ణ పేదల రిజర్వేషన్’ అంశం తెరపైకి తెచ్చి కొత్తగా జంధ్యం ధరించిన రాహుల్ గాంధీకి, ఇతర ప్రతిపక్షాలకు మోదీ కక్కలేని మింగలేని స్థితి కల్పించాడు. అదీ పార్లమెంటు చివరి రోజులను దీనికి వాడుకోవడం మరో వ్యూహం. ఇటీవల ప్రతి విషయం తమ అనుకూలత కోసం కోర్టుకు లాగడం అలవాటైనందువల్ల ‘న్యాయ సమీక్ష’ అనే బూచి చూపిస్తున్నారు. కాంగ్రెస్ ఓ వైపు సమర్థిస్తుండగా, రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ కపిల్ సిబాల్ తన దుర్బుద్ధిని ‘‘రాజ్యవ్యవస్థపై న్యాయవ్యవస్థ స్పీడ్‌బ్రేక్ ఎలా వేస్తుందో చెప్తూ’’ బయటపెట్టుకున్నాడు. ఏది ఏమైనా ఇందులో మోదీదే విజయం. కాంగ్రెస్‌కు ముందరికాళ్ల బంధం వేయడం ఒక రాజకీయ కోణం కావచ్చు. కానీ ఉత్తర భారతంలో కులాల మధ్య చిచ్చు రేపి చలి కాచుకొంటున్న పార్టీలకు సంస్థలకు, నాయకులకు వారి కుట్రలకు దీని ద్వారా అంతం పలికి శాంతియుత వాతావరణాన్ని కలిగించడం మోదీ మరో లక్ష్యం.
1857లో ప్రథమంగా జరిగిన సిపాయిల తిరుగుబాటును అణచివేయాలని బ్రిటీషు ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తెచ్చింది. బ్రిటీషు వర్గాలు తమ పనులను చక్కబెట్టుకోవడానికి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎక్కువమంది అగ్రవర్ణాలకు అవకాశం కల్పించాయి. దీంతో మిగిలినవర్గాల్లో అసంతృప్తి మొదలైంది. 1871 జనాభా లెక్కలు, జాన్ విల్సన్ జనానా లెక్కల నివేదిక వీటి ఆధారంగా అగ్రవర్ణేతర కులాలకు విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యం కోసం సిఫార్సులు మొదలయ్యాయి. ఈ దేశంలో మొదటినుండి ప్రత్యేకమైన వర్గంగా భావించే ముస్లిం నాయకులు తమకు ప్రత్యేక నియోజక వర్గాలు కావాలని డిమాండ్ చేశారు. ‘విభజించు-పాలించు’ సూత్రంతో పాలన చేసే బ్రిటీషువారు అందుకనుగుణంగా ఉదారవాదిలా కన్పించే మతతత్వ వాది సర్ అహ్మద్ ఖాన్‌ను 1878లో బ్రిటీష్ వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించారు. 1886 ముస్లిం ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ పెట్టి అందరి ఓట్లతో గెలిచే నియోజకవర్గాలు కా కుండా తమకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్నాడు. సివిల్ సర్వీసు పరీక్షల్లో కూడా తాము అందరితో కలిసి ‘పోటీపడం’ అన్నాడు. ఆ తర్వాత 1906లో హెచ్‌హెచ్ ఆగాఖాన్ నేతృత్వంలో ఓ ముస్లిం ప్రతినిధి వర్గం లార్డ్ మింటోను కలిసి తమ ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్నారు. దీనిపై అనేక తర్జన భర్జనలు చేసిన బ్రిటీషు ప్రభుత్వం లార్డ్‌మెంటో సిఫార్సులను నాటి గవర్నర్ జనరల్ మోర్లే ఆమోదించారు.
1909లో ముస్లిం ప్రత్యేక నియోజకవర్గం బిల్లు ‘హౌజ్’లో ఆమోదం పొందింది. దీనిని మొదటి జాతీయ కాంగ్రెస్ వ్యతిరేకించి తర్వాత వౌనం దాల్చింది. ఇది ఆమోదం పొందాక దేశంలోని అన్ని వర్గాల్లో అలజడి మొదలైంది. ముస్లింలు పొందినట్లుగానే శూద్ర కులాలలోని అనేక మంది నాయకులు తమకూ ఇలాంటి పద్ధతే కావాలన్నారు. ఆనాడు అంటరాని కులాలుగా వివక్షను ఎదుర్కొన్నవారు, సిక్కులు, క్రైస్తవులు.. అందరూ తమ జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం, విద్యా ఉద్యోగ రంగాల్లో హక్కుల కోసం ఉద్యమం మొదలుపెట్టారు. ఈ ఉద్యమాలు బ్రిటీషు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఆ తర్వాత సిక్కులకు, అణగారిన వర్గాలకు, క్రైస్తవులకు, నిమ్న కులాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. 1919 మాంటెంగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు అమలుకు 1924లో ముద్దిమన్ కమిటీ ఏర్పాటై అణగారిన కులాల రిజర్వేషన్లు తెరపైకొచ్చాయి. మహారాష్టల్రో ఎస్కేబోలె, డా.అంబేడ్కర్, కలకత్తాలో నామశూద్రు లు, మద్రాసులో జస్టిస్ పార్టీ రిజర్వేషన్ల ఉద్యమంపై గళం విప్పాయి. ఆ తర్వాత 3 ఫిబ్రవరి 1928 లో సైమన్ కమీషన్ దేశమంతా తిరిగి ఏప్రిల్ 1929లో తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. తద్వారా బ్రిటీష్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటుచేసి మేధావులతో చర్చలు జరిపి 17 సెప్టెంబర్ 1932న కమ్యునల్ అవార్డులు ప్రకటించింది. ఆ తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో పూణా ఒప్పందం జరిగి రిజర్వేషన్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే 1902లోనే వెనుకబడిన కులాలకు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించిన ఛత్రపతి సాహు మహరాజ్ శూద్ర, అతిశూద్ర కులాల అభ్యున్నతి కోసమని ప్రకటిస్తూ రిజర్వేషన్లు ఇచ్చిన ధీరుడు. 1901లోనే జైన్ హాస్టల్, విక్టోరియా హాస్టల్, 1907లో లింగాయత్ హాస్టల్, విశ్వకర్మ, ఆర్య క్షత్రియులకు వసతి గృహాలను అందించి భారతదేశ నూతన శకానికి నాంది పలికాడు. ఇక రిజర్వేషన్ విధానానికి ఓ స్థిర రూపం కల్పించిన డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ 1932 పూణా ఒప్పందం ద్వారా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు పునాదులు వేశారు. అనేక పోరాటాలు చేసి స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖా మంత్రిగా ఎంపికై, మొదటి రాజ్యాంగ సవరణతోనే బీసీలకు రిజర్వేషన్లుకల్పించేందుకు ప్రయత్నించారు.
ఇలా అనేక పోరాటాలు, నివేదికలు, వినతుల ద్వారా పొందిన రిజర్వేషన్లు ఈ డెబ్బై ఏళ్ళ పాలనలో కొంత ప్రగతికి తోడ్పడ్డాయి. అగ్రకులాల్లో కొందరు అనేక కారణాలవల్ల ఆర్థికంగా చితికిపోయారు. వారి కుటుంబాల పరిస్థితి ఎదుగూ బొదుగూ లేక దళితుల ఆర్థిక పరిస్థితి కన్నా హీనంగా తయారైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల దృష్టి కోణంలో చూస్తే అర్థం కాదు. ఉదాహరణకు ఆంధ్రలో కాపు, ఒంటరి, బలిజ, తెలగ లాంటివి తెలంగాణ మున్నూరు కాపులతో సమానంగా వున్నా వాళ్లలో ఆంధ్రా ఇతర కులాల్లో వున్న ఎదుగుదల లేదు. తెలంగాణ రెడ్డి, వెలమలతో మున్నూరు కాపులు పోటీపడలేని స్థితి. తెలంగాణలో గొల్ల, కుర్మ, గౌడ కులస్థుల్లో అభివృద్ధి అంతా ప్రభుత్వాలు, పార్టీలు చేసిందేమీ కాదు. దేశ వ్యాప్తంగా రిజర్వేషన్లపై ఓ సమగ్ర వ్యూహం పార్టీలకు లేకపోవడం వల్ల, గంపగుత్త ఓట్ల కక్కుర్తివల్ల రిజర్వేషన్ ఫలాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఇటీవల తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలగించిన కింతలి కళింగ వంటి కులాలను మొన్న ఎన్నికల్లో తిరిగి తెస్తామనడం రాజకీయాలకు ఉదాహరణ. ఈ క్రమంలో ఇటీవల వైఎస్‌ఆర్, కెసీఆర్ వంటివారు ముస్లిం ఓటు బ్యాంకు సుస్థిరత చేసుకోవడానికి 5 శాతం కోటా అని ఒకరు ప్రకటిస్తే, 12 శాతం అని మరొకరు ప్రకటించారు. 15 శాతం పైబడి వున్న ఎస్సీ, ఎస్టీ జనాభాల్లో అనేక ఉప కులాలున్నాయి. వాటినే వర్గీకరించి ఎవరి వాటా వారికి ఇవ్వాలంటున్న తరుణంలో కేవలం ఒక మతవర్గానికే 12 శాతం రిజర్వేషన్ ఇస్తే ఎలా? అన్నది కులసంఘాల ఆరోపణ. అపుడు ముస్లిం మైనారిటీలకు ఎస్సీ, ఎస్టీలకు కూడా లేని ఫలితం దక్కుతుంది. ఇది మళ్లీ సమాజంలో ఓ రకమైన అసహనానికి దారితీస్తుంది.
ఈ అగ్నిగుండం నుండి సమాజాన్ని రక్షించేందుకే మోదీ తాజా నిర్ణయం తీసుకున్నాడు. ఈ దేశంలో ఎర్ర రంగుల కళ్లద్దాలతో చూచే కుల మేధావులు రామ్‌నాధ్ కోవింద్‌ను రాష్టప్రతిగా చేసినా దళితుడిగా గుర్తించరు. తేలీ కులుస్థడైన మోదీని బీసీగా గుర్తించరు. బహుజన సెక్యులరిస్టు ముఖం కప్పుకొన్న వీళ్లు వివిధ పార్టీలను తమ చెప్పు చేతల్లో ఉంచుకొన్న అగ్ర కుల బుద్ధిగలవాళ్లు. కాబట్టే ఒక బీసీ నేత ఈ దేశానికి ప్రధాని కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన గద్దెనెక్కకముందు నుండి ఇప్పటివరకు రోజూ మోదీని దించేస్తాం అంటూ ఆగర్భశత్రుత్వం ప్రదర్శిస్తారు. వీటికి అతీతమైన స్వభావం గల మోదీ ఇపుడు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ల కులాలకు సాంత్వన కలిగించాడు. త్వరలోనే దీనిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక చర్యగా ప్రతిపక్ష పార్టీలు, కమ్యూనిస్టు మేధావులు కులవాదం రెచ్చగొట్టే ప్రమాదం ఉందనే విషయం గ్రహించాలి. దేశంలోని అన్నివర్గాల అభివృద్ధికి ఈ రిజర్వేషన్లు ఉపయోగపడితే సాహూ మహరాజ్ నుండి మోదీ వరకు అందరి తపస్సూ ఫలించినట్లే.

డా॥ పి. భాస్కర యోగి bhaskarayogi.p@gmail.com