భాస్కర వాణి

‘బురద’లో ‘కమలం’ వికసిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాజకీయ వేదికపై ఆక్రమించుకొన్న స్వార్థపరుల గుంపునుండి మన పార్టీని వేరుగా ప్రజలు భావించగలగాలి. పదవులను చేజిక్కించుకోవడమే మన లక్ష్యంగా వారు భావించకూడదు. మనది కొన్ని విలువల, సూత్రాలపై ఆధారపడి వున్న రాజకీయ పార్టీగా వారు గుర్తించాలి. పదవులు, హోదాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం ఉన్మాదంగా ఎగబడేవారికి భాజపాలో స్థానం లేదు. మాకు సంబంధించినంత వరకు మేము ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం నిరంతర పోరాటం సాగించేందుకు కృతనిశ్చయులమై ఉన్నాం’’- ఈ మాటలన్నది భారతీయ జనతా పార్టీని తన భుజస్కంధాలపై మోసుకొచ్చిన వారిలో అగ్రగణ్యుడైన అటల్ బిహారీ వాజపేయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల తర్వాత భాజపా తిరుగులేని శక్తిగా అవతరించగానే ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ అధినేత అమిత్ షాలు ఒక్కో రాష్ట్రంలో జైత్రయాత్ర మొదలుపెట్టారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో తప్ప అన్ని రాష్ట్రాల్లో భాజపా తన ప్రాతినిధ్యం నిలుపుకొన్నది.
దక్షిణాదిలో కర్ణాటక తర్వాత రెండవ గేటు తెలంగాణలో తెరిచినట్లు స్పష్టం అవుతున్నది. తెలంగాణలో 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడంవల్ల భాజపా శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిన మాట వాస్తవం. అప్రతిహతంగా సాగుతున్న టిఆర్‌ఎస్‌ను గతంలోనే మహబూమ్‌నగర్‌లో భాజపా ఎదుర్కొన్నది. ఎస్.డి.ఇబ్రహీంను భాజపాకు చెందిన యెన్నం శ్రీనివాసరెడ్డి ఓడించాడు. దేవీప్రసాద్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంచందర్‌రావు పరాజయం పాలుజేశాడు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో సాక్షాత్తూ కేసీఆర్ కుమార్తె కవితనే ఓడించేసరికి భాజపా నాయకుల్లో సమరోత్సాహం, ఇతర పార్టీల నేతలకు ఆశలు చిగురిస్తున్నాయి. అంతేగాకుండా రేపు ప్రారంభమయ్యే భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రధాని మోదీ వారణాసిలో ప్రారంభించనుండగా, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటించి ఆ కార్యక్రమం మొదలుపెట్టనున్నారు. ఇదంతా రేపు పార్టీని తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా మలిచేందుకు చేస్తున్న ఏర్పాటుగా చెప్పవచ్చు.
దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు మాత్రం 17 సెప్టెంబర్ 1948న విముక్తి కలిగింది. ఈమధ్యలో ఇక్కడి హిందువుల విమోచన పోరాటం స్వా తంత్య్ర పోరాటం కన్నా ఎక్కువైందిగా చెప్పవచ్చు. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మతతత్వం, రజాకార్ల మతోన్మాదం కలగలిసిపోయి తెలంగాణ రక్తసిక్తమైంది. ఆ రజాకార్ల మరో రూపమే మజ్లిస్ పార్టీ అని భాజపా ఎప్పుడూ ఆరోపిస్తుంటుంది. అలాంటి మజ్లిస్‌తో చెట్టపట్టాలేసుకుంటూ కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు తలొగ్గుతూ వచ్చాయి. ఒక్క కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రమే వాళ్లకు ఎదురొడ్డి నిలబడ్డాడు. తెరాస అధినేత కేసీఆర్ కూడా తెలంగాణ సాధించే క్రమంలో మజ్లిస్ పార్టీ తెలంగాణాను వ్యతిరేకిస్తే ‘పాతబస్తీలో నీది పిడికెడు పార్టీ’ అంటూ గట్టిగానే బదులిచ్చాడు. 2014లో తెలంగాణ వచ్చాక ‘హిందూ-ముస్లిం’ల మధ్య పొరపొచ్చాలు రాష్ట్భ్రావృద్ధికి మంచివి కావన్న ఒక సదుద్దేశం కేసీఆర్ మనసులో ఉండొచ్చు. దానివల్ల మజ్లిస్ పార్టీ అధినేత ఓవైసీని అక్కున చేర్చుకున్నాడు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల ఆశలు, బడ్జెట్‌లో మైనారిటీలకు పెద్దపీట, రంజాన్‌లో ఘనమైన ఇఫ్తార్లు, మహమూద్ అలీకి హోంమంత్రి లాంటి పనులు- కాంగ్రెస్‌ను మించి ‘సంతుష్టీకరణ’అనేది ఇక్కడి హిందువుల్లో కొంత మెరమెర మొదలైంది. ఇప్పటికీ హైదరాబాద్‌లో హిందువులకు అభద్రత ఉందని చాలామంది చెప్తుంటారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కో-ఆప్షన్ మెంబర్లు చాలామంది మైనారిటీలే ఎందుకయ్యారని సోషల్ మీడియా కోడై కూసింది. జెడ్పీటీసీ స్థాయి పదవులను అప్పనంగా మైనారిటీలకు కట్టబెడుతున్నారని చాలామంది టిఆర్‌ఎస్ నాయకులే గొణుక్కున్నారు. మహమూద్ అలీ తెలంగాణ హోంమంత్రిగా వున్నా అతను సాత్వికుడే గాక ‘గంగ జమునా తహెజీబ్’కు సరిపోవచ్చు. కానీ అతనిపై ఓవైసీ ప్రభావాన్ని ఎవరూ కాదనలేరు. మజ్లిస్‌కు పట్టు ఉన్న ప్రాంతంలో దళితులపై దాడి జరిగితే అంతగా ప్రచారం కాదు. మైనారిటీలపై ఎవరైనా దాడి చేశారంటే అది దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. దీన్ని జనం గమనిస్తున్నారు.
నిజానికి కెసిఆర్‌కు మజ్లిస్ విషయాల్లో ఎలాంటి సంబంధం లేకున్నా దాని ప్రభావం టిఆర్‌ఎస్‌పై పడే అవకాశం వుంది. హిందుత్వ ఆచరణలో కేసిఆర్‌ను మించి దేశంలో ఏ నాయకుడూ లేడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ మందిరం కట్టాక, ప్రభుత్వ సొమ్ముతో యాదాద్రిని నిర్మిస్తున్నది కెసీఆరే. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ‘హిందుగాళ్ళు బొందుగాళ్లు’ అన్న ఒక్క మాట ఉత్తర తెలంగాణ అంతటా ప్రభావం చూపించింది. ఆఖరుకు కవిత, వినోద్‌కుమార్ లాంటి టిఆర్‌ఎస్ అగ్ర నాయకులు సామాన్యులైన ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ చేతిలో మట్టిగరిచారు. దీంతో ఇపుడు కాంగ్రెస్, తెదేపా నాయకులు, కెసీఆర్‌పై కోపం వున్నవాళ్లంతా భాజపావైపు చూస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చాడ సురేశ్‌రెడ్డి, బోడ జనర్దన్, ఇనగాల పెద్దిరెడ్డి వంటివారు భాజపావైపు అడుగులు వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం చాలావుంది. రేపు చంద్రబాబుతో వున్న బంధాలు తెగితే రేవంత్‌రెడ్డి కూడా భాజపాలోకి రావచ్చు. త్రిపుర, అస్సాంలలో ఇతర పార్టీల నేతలతో భాజపా తన ఫార్ములా ప్రయోగం చేసింది. తెలంగాణలో ఆ కొరత ఏమీ లేదు. ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపిలో పనిచేసిన ఎందరో ఇతర పార్టీల్లో ఉన్నారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ‘చెల్లెలికి ఎక్కువ- అక్క కు తక్కువ’ అన్నట్లు అ య్యింది. రాహుల్ అస్త్ర సన్యాసం చేసి, రాబోయే అ సెంబ్లీ ఎన్నికల ఓటమి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. భాజపా 2023 నాటికి అయోధ్యలో రామాలయ నిర్మాణం లాంటి బృహత్తర కార్యక్రమం మొదలుపెడితే ప్రతిపక్షాల ఐదేళ్ళ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే. రేపుఎస్పీ, బిఎస్పీ వంటి పార్టీలు ఎన్‌డిఏలో చేరినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఆపరేషన్ మొదలైంది. మునుపటిలా చక్రం తిప్పడం చంద్రబాబుకు సాధ్యం కాదు. కమ్యూనిస్టులు ఓటమిని సమీక్షించుకొనే సరికి మరో ఎన్నికలు వస్తున్నాయి. కర్ణాటక, యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో భాజపా చెప్పుకోదగిన స్థాయిలోవుంది. ఇది 2024 ఎన్నికల్లో భాజపాకు లాభం చేకూర్చేదే. మన దేశంలో రాజకీయంగా ‘సెంటిమెంట్’ ఎంత బలమైందో తెలియనిది కాదు. తెలంగాణ సెంటిమెంట్ ముందు యూపిఏ ప్రభుత్వం సాగిలపడింది. అలాగే ఇక్కడ సంతుష్టీకరణ విధానమే భాజపాకు బలం. బోఫోర్స్ స్కామ్ రాజీవ్ గాంధీకి ఎంత అప్రదిష్ట కలిగించిందో, షాబానో కేసులో ఆయన అవలంబించిన సంతుష్టీకరణ విధానం అంతకన్నా ఎక్కువ పతనానికి కారణమైంది. తెలంగాణలో భాజపాకు ఏ రాష్ట్రంలో లేని విధంగా నక్సలైట్లతో పోరాడిన చరిత్ర ఉంది. సైద్ధాంతికంగా విశ్వవిద్యాలయాల్లో వామపక్ష విద్యార్థి సంఘాలకు ఎదురొడ్డి నిల్చింది ఏబీవీపీ విద్యార్థులే. 1970 దశకంలో ఓయూలో తీవ్రంగా ప్రవర్తించిన జార్జిరెడ్డి లాంటి వామపక్ష విద్యార్థి నాయకుడిని నిలువరించారు. కె.వి.రఘునాథరెడ్డి, యస్.జైపాల్‌రెడ్డి వంటి నాయకులను ఎదురించారు. వరవరరావు, బాలగోపాల్, కొడవగంటి కుటుంబరావు, త్రిపురనేని మధుసూదన్‌రావు వంటి అధ్యాపక మేధావులను నిలువరించారు. 1973లో ఆనాడు నగర ఏబివిపి కార్యదర్శిగా వున్న ఎన్.ఇంద్రసేనారెడ్డిని కత్తులతో పొడిచారు. 1975లో ఏబివిపి కార్యకర్త ఎం.పుల్లారెడ్డిపై రివాల్వర్ పేలింది. 1974లో నక్సల్స్‌ను ఎదిరించినందుకు ఏబీవీపీకి చెందిన రాజు, బ్రహ్మం, భాస్కరరరావు, ఇ.రామ్మోహన్‌రావులను తీవ్రంగా కొట్టారు. 1981లో ఏబివిపి కార్యకర్త ఏచూరి శ్రీనివాస్‌ను హత్యచేశారు. ఆనాడు తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో కమ్యూనిస్టు రాజ్యం సాగుతుండేది. 26 జనవరి 1980 నాడు కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ జాతీయ పతాకం ఎగరేస్తుంటే ఓ రాడికల్ విద్యార్థి జెండాను కాల్చేందుకు ప్రయత్నిస్తే అక్కడే ఏబివిపి నాయకుడు సామా జగన్‌మోహన్‌రెడ్డి పతాకాన్ని విడిపించి ఎగరేసి ‘్భరత్‌మాతాకీ జై’ అంటూ నినదించాడు. ఈ కేసు నడుస్తుండగా 1982 ఏప్రిల్ 29న కోర్టునుండి వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని నక్సల్స్ దారుణంగా చంపారు. ఏబీవీపీ నేతల్లో ఎంతోమంది నక్సల్స్ బాధితులే. వీరిలో కొందరు ప్రాణాలు పోగొట్టుకోగా, ఇంకొందరు తమ సర్వస్వం కోల్పోయారు. 1986లో ప్రస్తుత భాజపా జాతీయనేత పి.మురళీధర్‌రావు ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నాడు. అలాగే రామచంద్రరావు..! పాతబస్తీలో అల్లర్లకు ఎదురొడ్డి నిల్చిన టైగర్ నరేంద్ర, బద్దం బాల్‌రెడ్డి అజేయులు,అమరులు. ఇదంతా భాజపాకు తెలంగాణలో వున్న చరిత్ర.
ఆర్‌ఎస్‌ఎస్ శాఖలో సంస్థాగతంగా బలంగా కన్పించినా సమయం ఇచ్చేవారు తగ్గిపోయారు. ఏబివిపి పరిస్థితి ఘోరంగా ఉంది. ఇవన్నీ సరిచేసుకుంటే కార్యకర్తల నిర్మాణం జరుగుతుంది. బలంగా, నిజాయితీగా వున్న నాయకులను పార్టీలకు ఆహ్వానించి వారిని ఉన్న నాలుగు గ్రూపుల్లో చేర్చుకోకుండా పార్టీని ఏకోన్ముఖంగా నడిపించాలి. బలంగా వాదన వినిపిస్తున్న వారిని విస్మరించవద్దు. కేసిఆర్‌లా మేధావులను, సిద్ధాంతవేత్తలను, కవులను గుర్తించాలి. కొన్ని ప్రచార, ప్రసార మాధ్యమాల విషపు రాతల్ని, కూతల్ని నిలువరించేలా ప్రణాళిక ఉండాలి. కాంగ్రెస్ కల్చర్ నుండి కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కేసిఆర్‌లా ‘తన - పర’ అనే రాజకీయ వైఖరితో స్పష్టంగా ఉండాలి. తన వెంట నడిచి, సిద్ధాంతం వున్న వాళ్లను కెసిఆర్ తెలంగాణ ఉద్యమం పేరుతో కొందరికైనా మంచి గుర్తింపు ఇచ్చాడు. ‘జాతీయవాద భావజాలం’ వున్న వ్యక్తులను భాజపా రాష్ట్ర నాయకత్వం గుర్తించడంలేదనే ఆరోపణ ఉంది. చుక్కా రామయ్య, ప్రొ.కోదండరాం వంటి వామపక్ష భావజాలం వున్న వాళ్లకు ప్రాధాన్యతనివ్వడం మానుకోవాలి. పంచెగట్టుకున్న వాళ్లంతా జాతీయవాదులే అనుకోవడంవల్ల యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంటివారు ఆంధ్రా నాయకుల సందుల్లోకి దూరుతున్నారు. మరోవైపు జాస్తి చలమేశ్వర్ లాంటివారు మోదీని దోషిగా నిలబెట్టేందుకు చూస్తున్నారు. అలాంటివారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. రఘునందన్‌రావు, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, రావుల శ్రీ్ధర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి వంటివారిని మరింత ప్రోత్సహించాలి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డికన్నా ఉత్తమంగా బ్యాటింగ్ చేస్తున్న డా. లక్ష్మణ్‌కు వెన్నుదన్నుగా నిలవాలి. ఇతర పార్టీలనుండి వచ్చేవాళ్లను కలుపుకుపోవాలి. కేంద్ర మంత్రిగా వుంటూ సమర్థుడైన కిషన్‌రెడ్డిని వినియోగించుకోవాలి. సంఘ్‌ను విస్మరించవద్దు. ఇంద్రసేనా, దత్తాత్రేయ, చింతల, ఎన్‌ఎస్‌ఎస్ సేవలను వినియోగించుకుంటూనే రాజాసింగ్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లను రంగంలోకి దింపాలి. పరివార సంస్థల నిర్వహణలో వున్నవారి పేర్లు కూడా తెలియని అజ్ఞానంలో భాజపా నాయకులు ఉండకూడదు. శాంతకుమార్ లాంటి వ్యక్తులను కాపాడుకోవాలి. పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవించాలి. అప్పుడే ‘అంధేగా ఛటేగా.. సూరజ్ నికలేగా.. జార్ కమల్ ఖిలేగా..’ అన్న వాజపేయి మాటలు నిజం అవుతాయి.

డా॥ పి. భాస్కర యోగి bhaskarayogi.p@gmail.com