భాస్కర వాణి

పెనుమార్పులను స్వాగతించండి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఓ వ్యక్తి అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కాడు. దివంగత రాజీవ్ గాంధీ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసి, రాజీనామా చేసి బయటకొచ్చి ‘జాతీయవాద ముస్లిం’గా తన భావాలను స్వేచ్ఛగా ప్రకటించిన నేత ఆరీఫ్ మహమ్మద్ ఖాన్. ఇందిరా గాంధీ మరణానంతరం అఖండ మెజారిటీతో అధికార పీఠం ఎక్కిన రాజీవ్ గాంధీకి- కాంగ్రెస్‌ను తన చేతులతో పెంచాలన్నా, ముంచాలన్నా.. రెండు అవకాశాలు ముందు నిలబడ్డాయి. కానీ, రాజీవ్ రెండవ మార్గం ఎంచుకొని తన కొడుకు రాహుల్ చేతిలో మరింత దీనస్థితిలోకి కాంగ్రెస్ పార్టీ దిగజారేందుకు దారులు వేశాడు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 62 ఏళ్ళ షాబానో అనే ముస్లిం మహిళ 1978లో తన భర్తనుండి తలాక్ పొందింది. ఆమెకు ఐదుగురు సంతానం. 62 ఏళ్లు పైబడిన వయసున్న ఆమె తనకు జీవనాధారం లేకపోవడంతో న్యాయస్థానాల తలుపు తట్టింది. కింది కోర్టులు చెల్లించాలని ఆదేశించిన 500 రూపాయలు కూడా భృతిగా చెల్లించేందుకు భర్త నిరాకరించాడు. తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లగా అక్కడ షాబానో విజయం సాధించింది. భారత శిక్షాస్మృతిలోని 125వ సెక్షన్ కుల, మత భేదాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసులో అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వై.వి.చంద్రచూడ్ తీర్పు రాస్తూ ‘మతస్వేచ్ఛ మన సాంస్కృతిక హక్కు. కానీ మత సంప్రదాయాలు మనుషుల గౌరవ మర్యాదలు, మానవ హక్కులు హరించేట్టయితే అది స్వాతంత్య్రం కాదు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు, జాతి ఐక్యత కోసం ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఎంతైనా ఉంది..’ అన్నారు. కానీ దేశంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ముస్లిం మతతత్వ శక్తులు తమ పెత్తనం నిరూపించాలనుకొన్నాయి. ‘ముస్లిం పర్సనల్ లా’పై సుప్రీం కోర్టు జోక్యాన్ని ఈ శక్తులు లోలోపల వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. నిజానికి ‘ముస్లిం పర్సనల్ లా’ అనేది ఆ మతంలోని ఆధ్యాత్మికతతో సంబంధం లేని అంశం. కాబట్టి దీనిని పవిత్ర మత గ్రంథాలను అనుసరించి చూసేది కాదు.
1971లో లార్డ్ వార్న్ హేస్టింగ్ ద్వారా పుట్టింపబడిన ఈ చట్టం ద్వారా హిందూ, ముస్లింలు తమ ధార్మిక ఆచారాలను అనుసరించి వివాహం, విడాకులు, విరాసత్ మొదలైనవి పాటించాలని స్పష్టం చేయబడింది. అయితే 1832లో అదే బ్రిటీష్ ప్రభుత్వం ‘క్రిమినల్ కోడ్’ను ఇస్లామిక్ షరియత్ నుండి తీసివేసింది. నిజానికి షరియత్ చట్టం ప్రకారం ముస్లింలలో ఎవరైనా కొన్ని నేరాలకు పాల్పడితే చేతులు నరకమని, రాళ్ళతో కొట్టమని ఉంది. కానీ 1832 చట్టం ద్వారా క్రిమినల్ కోడ్‌లో హిందూ-ముస్లింలకు సమానమే. అయితే సమాజంలో కొన్ని మార్పులు స్వీకరించే గుణం ఛాందసులకు ఉండదు. నిజానికి హిందువుల్లో ‘విడాకులు’ అనే పద్ధతి లేనే లేదు. వివాహ బంధం జన్మ జన్మల బంధం అయినప్పటికీ హిందూ సమాజం వి డాకులు స్వీకరించింది. భార త రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుంది. బాల్య వివాహాల నిషేధం, సతీ సహగమన నిర్మూలన, కుల తత్వ నిర్మూలన వంటి అంశాలను సంస్కరణలుగా స్వీకరించింది.
విచిత్రం ఏమిటంటే షాబానో కేసు తర్వాత ముస్లిం పర్సనల్ లాబోర్డ్ లాంటి సంస్థలు ఇస్లామిక్ షరియత్ చట్టంలో సుప్రీం కోర్టు తీర్పును, జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆఖరుకు కొందరు ముస్లిం పర్సనల్ లా బోర్డు నేతలు 1986 జనవరి 26 గణతంత్ర దినాన్ని బహిష్కరించమని పిలుపు ఇచ్చే తీవ్ర స్థాయికి వెళ్లారు. మతోన్మాదానికి మచ్చుతునకలాంటి ముస్లిం లీగ్ పార్టీ సభ్యుడైన ఎంపి జి.యం.బనట్వాలా ఒక బిల్లుపై పార్లమెంటులో చర్చ మొదలుపెట్టాడు. మొదట రాజీవ్ గాంధీ కూడా షాబానో లాంటి పేద మహిళ పక్షాన నిలబడ్డాడు. ఈ అంశంపై తన మంత్రివర్గంలోని ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్‌ను మాట్లాడాల్సిందిగా కోరాడు. ఆనాడు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ షాబానోకు అనుకూలంగా చేసిన ప్రసంగం పార్లమెంట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పుట.
కానీ, రెండు నెలలు తిరుగకముందే రాజీవ్ గాంధీ ముస్లిం సంస్థల ఛాందసత్వానికి లొంగిపోయారు. ఓటు బ్యాంకు రాజకీయం, సంతుష్టీకరణకు ఆనాడు వేసిన అడుగు ఈ రోజు కాంగ్రెస్ పతనానికి, భాజపా ఎదుగుదలకు కారణభూతమైంది. 1986లో ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం పార్లమెంటులో పాసైంది. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చేసిన కాంగ్రెస్ ప్రసంగానికి విరుద్ధంగా మరో ముస్లిం మంత్రి జెడ్.ఆర్.అన్సారీని రాజీవ్ ఉసిగొల్పారు. ఆ తర్వాత ఆరిఫ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. సుప్రీం కోర్టు తీర్పును ముస్లింల అభిమతానికి అనుగుణంగా మార్చడం ‘లౌకికవాదం’ అని కాంగ్రెస్ పార్టీ చక్కగా దబాయించడం మొదలుపెట్టింది. వెంటనే హిందూ సంతుష్టీకరణ చేస్తానని రామజన్మభూమి తాళాలను రాజీవ్ తెరిపించారు. ఆ తర్వాత అద్వానీ రథయాత్రతో అయోధ్య ఉద్యమం భాజపాకు ఈ విరాట్రూపం సాధించిపెట్టింది. అయితే ఈ ముప్ఫై ఏళ్ళనుండి జరిగిన రాజకీయ పరిణామాలను ఇసుమంతైనా నెమరువేసుకోకుండా కుహనా లౌకికవాద పార్టీలు, సంస్థలు ఇంకా మొఘల్ రాజ్యంలో ఉన్నామనే భ్రమలో బతుకుతున్నాయి. అందువల్లనే కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి అనే దుర్మార్గపు రక్షణ కవచం తీవ్రవాదులకు ఉపయోగపడుతున్నా అక్కడా ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ‘సెంటిమెంటు’ను పదే పదే రెచ్చగొడుతున్నాయి. అలాగే జాతీయ పౌరసత్వ రిజిస్టర్ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే దానిని ‘ముస్లింలపై టార్గెట్’ అంటూ కూనిరాగాలు తీస్తున్నాయి. ఆఖరుకు ముస్లిం మహిళలకు మూర్ఖులైన భర్తల నుండి జరిగే అన్యాయాన్ని నివారించే ‘త్రిపుల్ తలాక్’పై పిల్లిమొగ్గలు వేస్తున్నాయి.
కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల వైఖరి ముస్లింలకు మేలు చేయకపోగా కీడుచేయడం ఖాయం. నరేంద్ర మోదీ, అమిత్ షాలను ఈ పార్టీలు తక్కువగా అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే. పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాక భాజపాను ఢీకొనే ప్రధాన ప్రతిపక్షం ఎక్కడా నిర్మాణాత్మకంగా వ్యవహరించట్లేదు. భాజపా కూడా ఇటీవల అన్ని చర్చల్లోకి మజ్లిస్ ఎంపీ అసదొద్దీన్ ఓవైసీని లాగింది. అంటే ప్రతి ఇష్యూను ఓవైసీ మాట్లాడితే అది భాజపాకే ఎక్కువ లాభం. ఎందుకంటే ఓవైసీకి వున్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. కానీ కుహనా లౌకిక పార్టీలు ఓవైసీని మోదీని ఢీకొట్టే వీరునిగా చూపిస్తున్నాయి. దాని దుష్పరిణామాలు దేశాన్ని మత పరమైన విభజన వైపు తీసుకెళ్తాయని గ్రహించడం లేదు. రెండు రోజుల క్రితం ఉన్నావ్ అత్యాచారం కేసులో బాధితురాలి కారుకు యాక్సిడెంట్ అయితే, ఆ కేసులో దోషులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరు యూపీ భాజపా నాయకుడికి బంధువు. వెంటనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వార్తల్లోకి వచ్చి దీన్ని మోదీకి అంటగట్టాలని చూసింది. ఇలాంటి అత్యుత్సాహం, రాజకీయ అజ్ఞానం కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీకి మాత్రమే స్వంతం.
అలాగే లౌకికవాద పార్టీల డొల్లతనం రాజ్యసభలో త్రిపుల్ తలాక్‌పై ఓటింగ్ జరిగినపుడు బయటపడింది. ‘తల చుట్టం తోక పగ’లా వ్యవహరించిన తీరు వీళ్ల నిబద్ధతను ప్రశ్నిస్తున్నది. ‘కమ్యూనిస్టు స్కూల్ ఆఫ్ థాట్’ నుండి పుట్టిన ఈ భ్రమలు ఇటీవల మిగతా పార్టీలకు అంటుకున్నాయి. అన్ని మతాల ప్రజలను సమానంగా చూస్తామని అనకుండా ముస్లింలను సంతుష్టీకరణ చేసే ధోరణి ఓ రాజకీయ విధానంగా ఈ దేశంలో కమ్యూనిస్టు సిద్ధాంతం మార్చింది. దానివల్ల ఈ దేశంలోని కొన్ని ముస్లిం సంస్థలు, పార్టీలు తమను తాము ప్రత్యేకంగా భావించడం మొదలుపెట్టాయి. ఈ ప్రత్యేక భావన వున్నవారే జాతీయ పౌరసత్వ బిల్లును, త్రిపుల్ తలాక్ నిషేధాన్ని, కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దును వ్యతిరేకిస్తారు. మతం మనుషుల్లో ఉండాలి కానీ మనిషే మతంలో ఉండకూడదు. మతాన్ని ఆధ్యాత్మిక సాధనంగా గాకుండా రాజకీయ గుంపును సృష్టించే ఆధారంగా ఉండడం భారత్‌లో సాధ్యం కాదు. దానికి వెయ్యేళ్ళ ముస్లిం, క్రైస్తవ పాలనను తట్టుకొని నిలబడిన హిందూ చరిత్రనే ఉదాహరణ.

డా॥ పి. భాస్కర యోగి bhaskarayogi.p@gmail.com