భాస్కర వాణి

పౌరసత్వ బిల్లుపై ‘పరాధీనత’ ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండవసారి అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక్కో పనిని చాలా జాగ్రత్తగా పూర్తిచేయడం మొదలుపెట్టింది. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, అయోధ్య వివాదంపై తీర్పును త్వరితగతిన ఇప్పించడం.. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లు.. ఇలా ఒక్కో అడుగు ముందుకేస్తుంటే ప్రతిపక్షాలు కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించింది. రామమందిరం తీర్పును మాత్రం స్వాగతించగా, కాంగ్రెస్ అధికార పత్రిక ‘నేషనల్ హెరాల్డ్’ తన అక్కసు వెళ్లగక్కింది. వ్యక్తిగతంగా ఎందరో కాంగ్రెస్ నాయకులు మాత్రం లోలోపల ఈ పరిణామాలను స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ భోగట్టా. ‘తూర్పు బెంగాల్‌లోని హిందూ రక్షణ భారత్‌ను విస్మరించవద్దు. మానవత్వం, స్వలాభం మాత్రమే కాకుండా స్వాతంత్య్రానికి, మేధోవికాసానికి తరాలుగా వారి త్యాగాలు, పడిన బాధలను దృష్టిలో ఉంచుకుంటే అది సముచితం’ అని ఏనాడో డా శ్యామాప్రసాద్ ముఖర్జీ సెలవిచ్చారు. ఇటీవలి వరుస పరిణామాలు వారి ఆత్మకు శాంతి కలిగించి ఉంటాయి.
దేశాన్ని పాలించడం అంటే మనం నాలుగు సరిహద్దులలోపల కూర్చొని రాజభోగాలు అనుభవించడం, శత్రువును కనిపెట్టకుండా, వారి ఎత్తులను అంచనా వేయకుండా చేసే పాలన ఎంత ఘోరంగా ఉంటుందో టిబెట్ విషయంలో నెహ్రూ చేసిన తప్పునుండి మనం గ్రహించవచ్చు. బ్రిటీషు పాలన వల్ల అందివచ్చిన అధికారాలను ఉచితంగా, అవగాహన లేకుండా చైనాకు ధారాదత్తం చేసి 1954లో టిబెట్ చైనాలో భాగమని ప్రకటించడం ఘోర తప్పిదం. గ్యాంట్సే యూటుంగ్‌లోని సైనిక స్థావరాలను కోట్లాది విలువైన పోస్టల్, టెలిఫోన్ వ్యవస్థలను అప్పనంగా భారత్ చైనాకు అప్పగించింది. దీంతో 24 అక్టోబర్ 1950న చైనా సైనికులు టిబెట్‌పై దురాక్రమణకు తెగబడ్డారు. దీనిని ఆనాటి ప్రముఖ నాయకుడు రామ్‌మనోహర్ లోహియా మంచుకొండల్లో ‘భ్రూణహత్య’ జరిగిందన్నాడు. అలాంటి తప్పే కశ్మీర్ విషయంలో నెహ్రూ బృందం చేసింది. ఇపుడు ఒక్కో ‘మరమ్మతు’ జరుగుతుంటే దేశం ఖుషీగా ఉంది. తమ జీవితకాలంలో 370 రద్దు, రామమందిరం తీర్పు, పౌరసత్వ బిల్లు.. చూస్తామా అనుకున్నవాళ్లు ‘ఇదే జీవిత పరమార్థం’ అంటున్నారు. ఇక ఉమ్మడి పౌరస్మృతి ఒక్కటే మిగిలి ఉంది..!
దేశంలో ఏది జరిగినా ‘ముస్లింలకు వ్యతిరేకం’ అంటూ భ్రమలు కల్పించడం కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఓ వర్గం మీడియా వారు పనిగా పెట్టుకున్నారు. పెద్దనోట్ల రద్దు కూడా ముస్లిం వ్యతిరేకం అంటూ వితండవాదం చేశారు. ఇపుడు దిగ్విజయ్‌సింగ్ లాంటి కాంగ్రెస్ నేతలు తెగ బాధపడిపోతున్నారు. ‘ఈ దేశ ముస్లింల పౌరసత్వంగాని, ఏ దేశ ప్రజల పౌరసత్వం రద్దుచేసేది కాదు. ఈ బిల్లు ఇచ్చేదే కాని లాగేసుకునేది కాదని’ హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇక కమ్యూనిస్టులు, వారి ప్రచార ప్రసార మాధ్యమాలు, తోక మేధావులు యధాలాపంగా ‘ఇది మతాల మధ్య చిచ్చు’ అన్నారు. ముస్లింలకు తనకు తానే ప్రతినిధిగా చెప్పుకొంటున్న ఓవైసీ బిల్లు ప్రతులను చించేశాడు. రెండు రోజుల చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందింది. ఇందులో మాట్లాడిన వారి మాటలు చూస్తుంటే వీళ్లా ఈ దేశాన్ని 70 ఏళ్లు పాలించింది అని నవ్వొచ్చింది.
భారతదేశంలో భారతీయులను వెతుక్కోవాల్సిన దుస్థితి చూస్తే అసహ్యం వేస్తోంది. అసలు ఈ పౌరసత్య సమస్య అస్సాంలో వచ్చింది. ఆ రాష్ట్రంలో 33 జిల్లాల్లో 9 జిల్లాల్లో బంగ్లాదేశీ చొరబాట్లు ఎక్కువ. ధూబ్రీ 79.67 శాతం, బార్పేట 70.74 శాతం, డారంగ్ 64.34 శాతం, హాలాకాండీ 60.31 శాతం, గోల్పారా 57.52 శాతం, మోరీగావ్ 52.56 శాతం, నాగాల్ 55.36 శాతం, కరీంగంజ్ 56.36 శాతం, భోంగాగావ్ జిల్లాల్లో 50.22 శాతం చొరబాట్లు జరిగినట్లు తేలింది. దాంతో 2012లో అస్సాం సమ్మిశ్రీత, మహాసంగ్ సుప్రీం కోర్టులో దావా వేసింది. ఫలితంగా 17 డిసెంబర్ 1996 నుండి 24 మార్చి 1971 వరకు అస్సాంలోకి వచ్చిన వాళ్లను గుర్తించాలని, ఎన్‌ఆర్‌సి అమలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ తేదీని పెట్టుకోవడానికి మార్చి 26న బంగ్లాదేశ్ ఏర్పడిందని, ఆ తర్వాత వచ్చినవారిని అక్రమ చొరబాటుదార్లుగా గుర్తించాలన్నది ఉద్దేశం. ఎన్నార్సీ కోసం 31 డిసెంబర్ 2017 నాటికి 3.29 కోట్లమంది అర్జీ పెట్టుకుంటే అందులో 1.90 కోట్లమందికి మాత్రమే అర్హత ఉందంటే మన దేశంలోకి చొరబాట్లు ఎంతలా జరిగాయో ఊహించుకోవచ్చు. ఈ క్రమం ఇలాగే కొనసాగి రోహింగ్యాలు సహా ఎందరో ఈ దేశంలోకి చొరబడ్డారు. మ యన్మార్ లాంటి చిన్న దేశం వాళ్ల అరాచకాలను భరించలేక బయటకు పంపుతుంటే, ఇక్కడి నాయకులకు మాత్రం వాళ్లపై అమితమైన ప్రేమ. ప్రక్క రాష్ట్రాలవారు ఉద్యోగాలు, నిధులు, నీళ్లు ఎత్తుకుపోతున్నారని వాళ్ల అసెంబ్లీలో తీర్మానాలు చేయించి.. స్థానికతను ముందుకు తెచ్చేవారు ఈ బిల్లును వ్యతిరేకిస్తుంటే నెటిజన్లు దుమ్మెత్తిపోతున్నారు. మన పొరుగున వున్న పాక్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అనే మూడు ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాల్లో అత్యాచారాలకు గురైన ఆరు మతాల వాళ్లకు స్థానం కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. అది సాధారణంగా పౌరసత్వం కోసం ఎవరైనా తస్లీమా నస్రీన్, అద్నాన్ సమీలా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదంతా మామూలుగా జరిగే ప్రక్రియ. కానీ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సూడో సెక్యులర్ పార్టీలు, ముస్లిం లీగ్, ఎంఐఎం లాంటి మత పార్టీలు, సూడో సెక్యులర్ పార్టీలు, ఇటీవల పుట్టుకొచ్చిన కొత్త మేధావులు, కళాకారులు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఇంతకన్నా ఆత్మవంచన ఇంకొకటి లేదు.
అందరూ మహమ్మదాలీ జిన్నా మాత్రమే దేశాన్ని మతపరంగా విభజించాలని మొదట కోరాడని అనుకుంటారు. ఇక కాంగ్రెస్ వాళ్లు 1937లోనే సావర్కర్ ‘ద్విజాతి సిద్ధాంతం’ తెచ్చాడని చెప్పారు. నిజానికి సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ దీనికి బీజం వేశాడు. 14 మార్చి 1880 నాడు మీరట్ సభలో సర్ సయ్యద్ మాట్లాడుతూ ‘ముస్లింలు ఈ దేశంలో సురక్షితంగా ఉండాలంటే ఆంగ్లేయుల పాలన అవసరం’ అన్నాడు. తాను స్థాపించిన విద్యా సంస్థకు ఆంగ్లేయుల నుండి గ్రాంట్లు పొందడం సయ్యద్ మొదలుపెట్టాడు. 20వ శాతాబ్దం ప్రారంభంలో కలకత్తా ‘స్వాతంత్య్ర ఉద్యమ కేంద్రం’గా ఉండేది. వైస్రాయి లార్డ్ కర్జన్ ‘స్వాతంత్ర పోరాటం ఆపాలంటే.. బెంగాల్‌ను విభజించాలి’ అన్నాడు. 6 డిసెంబర్ 1904నాడు హాబర్ట్ హాచోప్‌రిస్లే ‘బెంగాల్‌ను విభజిస్తేనే భారత్‌ను ముక్కలు చేయవచ్చు’ అన్నాడు. దీంతో 19 జూలై 1905 నాడు బెంగాల్ విభజన జరిగింది. ఢాకాలో కోటి 80 లక్షల మంది మస్లింలు, కోటి 20 లక్షల మంది హిందువులు ఉన్నారు. ముస్లిం నాయకుల రహస్య ఒప్పందం వల్ల ముస్లిం జనాభా అధికంగా వున్న బెంగాల్ ముక్కను ఆంగ్లేయులు వారికి అందించారు. 1906లో వెంటనే ముస్లిం లీగ్ పుట్టింది. 1907లో మింటో మార్లే సంస్కరణల ఫలితంగా ఏ ఎన్నికల్లోనైనా ముస్లింలే ముస్లిం ప్రజాప్రతినిధులను ఎన్నుకునే హక్కు వచ్చింది. 1939లో జిన్నా 14 సూత్రాలతో ముస్లింల డిమాండ్లు ఆంగ్లేయుల ముందు పెట్టి సాధించుకొన్నాడు. 1930 సైమన్ కమిషన్ రిపోర్టు ముస్లిం లీగ్‌కు మరింత బలం ఇచ్చింది. ఈలోపు 112 చోట్ల మత కల్లోలాలు జరిగాయి. 1938లో గులాం హసన్ షా ఖాజ్మీ అనే పాత్రికేయుడు పాకిస్తాన్ పేరుతో పత్రికకు అర్జీ పెట్టుకొన్నాడు. 1933లోనే చౌదరి రహ్మద్ అలీ ‘నౌ అండ్ నెవర్’ అనే బుక్‌లెట్‌లో మొదట పాకిస్తాన్ పేరు ప్రస్తావించాడు. ఈ పరిణామాల తర్వాత 26 జూలై 1947లో జిన్నాగ్యాంగ్ మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని కోరారు. అది జరిగిపోయింది, లక్షలాదిమంది శరణార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1950లో నెహ్రూ-లియాఖత్ ఖాన్‌లమధ్య ఒప్పందం జరిగి 4 సూత్రాలు ప్రవాసుల - ఆస్తుల రక్షణ, మహిళలపై అత్యాచారాలు ఆపడం, వాళ్ల ఆస్తులను అమ్ముకోవడం, బలవంతపు మత మార్పిడి నిరోధం వంటివి ఈ ఒప్పందంలో ఉన్నాయి. కానీ మతోన్మాదులైన పాక్ పాలకులు తమ దాష్టీకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. విభజన జరిగాక పాకిస్తాన్‌లో వున్న 15 శాతం హిందువులు ఇపుడు 1.5 శాతం అయ్యారు. 2015లో వచ్చిన ఒక నివేదిక ఆధారంగా ఏటా వేయిమంది యువతులు బలవలంతంగా మత మార్పిడికి గురవుతున్నారు. అత్యాచారం, మత మార్పిడి, దేశం నుండి వెళ్లగొట్టడం అనే మూడు సూత్రాలతో అక్కడి మైనారిటీలను తగ్గించారు. బంగ్లాదేశ్‌లో 22 శాతం వున్న హిందువులు 0.8 శాతానికి తగ్గారు. ఆప్ఘనిస్తాన్‌లో 1982లో 2.20 లక్షలున్న హిందూ, సిక్కులు ఇపుడు 1350 మంది మాత్రమే మిగిలారు. ఇన్ని అత్యాచారాలు జరిగినా అక్కడున్న మైనారిటీలపై ఆ దేశాలే గాక భారత్ కూడా ఇన్నాళ్లు దయ చూపలేదు. ఇంకా ఇక్కడి పాకిస్తాన్ భక్తులు ఇదే కోరుకొని దేశాన్ని ధర్మసత్రంగా మార్చేయాలనుకొంటే ఈ బిల్లుతో అది భ్రమగానే మిగులుతుంది.

డా॥ పి. భాస్కర యోగి bhaskarayogi.p@gmail.com