ఈ వారం కథ

కరప్రతం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిమెట్ల ముందు ఆటో దిగాను. నా వెనుకనే భార్య సుజీ, నా పధ్నాలుగేళ్ళ కూతురు మైథిలి దిగారు. మెట్లవైపు చూసాం. అన్ని మెట్లెక్కాలా? అనిపించింది. ముగ్థమనోహరుని దివ్య మంగళ రూపం దర్శించుకునే భాగ్యం అంత సులువుగా దొరికితే ఇక అతని గొప్ప తనమేముంది? ‘ఎంతో శ్రమపడి నీ దగ్గరకొచ్చాం స్వామీ!’ అని నిరూపించుకోకపోతే భక్తుని తపన స్వామివారికి తెలిసేదెలా? మెట్లదారిలో దారిపొడవునా యాచకులే! ‘అమ్మా! బాబూ! ధర్మం చెయ్యండి’ అంటూ ఆకలికేకలు చెవులు హోరెత్తిపోయేలా వినబడుతున్నాయి. కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేనివాళ్ళు, కుష్టువ్యాధిగ్రస్తులు, మొండిచేతుల వాళ్లు, తైల సంస్కారం లేని జుత్తు, చింపిరిగుడ్డలు మామూలే! దీనంగా మొహం పెట్టి వాళ్ళు యాచిస్తున్న తీరు, ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ, చలికి వణుకుతూ గుప్పెడు మెతుకుల కోసం బతుకులు వెళ్ళదీస్తున్నవాళ్ళ ఆర్తనాదాలను భరించడం కష్టమైంది.
అయితే వారికీ ఓ నియమం, నిజాయితీ ఉన్నాయి! గుడికి వెళుతున్నవారిని యాచించరు. తిరిగొస్తున్న వాళ్ళముందే ఇంత కూడు కోసం అంత గోడు వెళ్ళబోస్తారు. ‘దేవుడి తరువాతే మేము’ అనే భావన మెచ్చుకోదగ్గదే. ప్రస్తుతానికి మేం సేఫ్! తిరుగు ప్రయాణం సంగతి అపుడు చూద్దాం అని మెట్లెక్కుతున్నాం.
ఇంకొంత సేపట్లో చేరిపోతాం అనగా ఓ మెట్టుమీది అభాగ్యులు మా గుండెల్ని పిండేసారు. ఆరేడేళ్ల అమ్మాయి చిన్న మురికి లాగు మాత్రమే వేసుకుని ఉంది. ఐదారేళ్ళ పిల్లాడు గుడ్డల్లేకుండా ఉన్నాడు. నల్లటి శరీరాలు దట్టంగా మట్టిపేరుకుపోయి ఉన్నాయి. తలకు నూనె రాస్తారని, దువ్వుకుంటారని తెలియని వాళ్ళు జుత్తులు వేలాడేసుకుని అతి దీనంగా అడుక్కుంటున్నారు. కడుపు చూపెట్టి కనికరించమని వేడుకుంటున్నారు. కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నారు. నా ఎద కలుక్కుమంది! గోడవారగా నేలమీద ఓ కుళ్ళు గుడ్డ పరిచి దానిమీద ఒక ఏడాదిలోపు పసివాడిని పడుకోబెట్టి ‘‘మా తమ్ముడికి తాగడానికి పాలు లేవు, ఒక్క రూపాయి దానం చెయ్యండయ్యా’’ అని ఆ రెండు పసిమనసులు బ్రతిమాలడం చూసి సుజీ మనసు కకావికలమైపోయిందని తన చూపులే చెప్తున్నాయి!
వాళ్ళు ఎంతగా ప్రాధేయపడుతున్నారో అంతగా ఛీత్కారానికి గురవుతున్నారు. కసురుకున్నవాళ్ళు, చీదరించుకుని దూరంగా జరిగిపోయేవాళ్ళు, తిట్టేవాళ్ళు, పొమ్మని నెట్టేసేవాళ్ళు, చెయ్యెత్తి బెదిరించేవాళ్ళు, ఒకరో ఇద్దరో కనికరించేవాళ్ళు- వీళ్ళంతా ఆ చిన్ని మనసులకు ధర్మాత్ములే! ఇదంతా గమనిస్తున్న మైథిలికి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
వాళ్ళని దాటుకుని కొన్ని మెట్లెక్కేమేగాని, సుజీ, మైథిలి హుషారుగా లేరు!
‘ఏమైంది?’ అని శ్రీమతిని మాటల్లో దింపాను. ‘‘ఏంటోనండి ఈ వ్యవస్థ! కోట్లకు అధిపతులు కొందరు, తిండికి నోచుకోని అభాగ్యులు కొందరు! ఆ పిల్లల్ని చూస్తే జాలేస్తోంది...’’ అంది.
‘‘వదిలెయ్ సుజీ! ఇవన్నీ మామూలే! ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకుని ఎమోషనవకు! ఎవరికి ఎంత రాసిపెడితే అంతే! వాళ్ళ ఖర్మకి కర్తలెవరు? భగవంతుడు వాళ్ళకి అంతే రాసాడు’’ అన్నాను. అన్నానేగాని ఆ పిల్లల దయనీయ స్థితి నా నుంచి కూడా దాటిపోలేదని నాకర్థమవుతోంది!
‘ఏం భగవంతుడులెండి! అసలున్నాడో లేదో?’ అంది సుజి విరక్తిగా. కొంచెం తత్తరపడ్డాను. ఇంతలో, ‘‘అమ్మ చెప్పింది నిజమే నాన్నా, దేవుడు లేడు!’’ నిశ్చయంగా అంది మైథిలి. నేను ఒక్కసారిగా అదిరిపడ్డాను!
‘‘తప్పమ్మా! అలా అనకూడదు. దేవుడు లేకపోతే వీళ్ళంతా ఎందుకు గుడికి వచ్చి దండం పెడతారు చెప్పు? రోజుకి కొన్నివేలమంది, ఎన్నో దేవాలయాలలో భగవంతుణ్ణి దర్శించుకుంటున్నారు! వాళ్ళందరూ ఉన్నాడనుకున్న దేవుడు నువ్వు లేడంటే అది నిజమైపోతుందా?!’’ అని అడిగాను మైథిలిని. ‘‘దేవుడున్నాడో లేడో చెప్పలేం గాని, గుడికి వెళితే ఒక మానసిక ప్రశాంతత, మధురానుభూతి కలుగుతాయని తెలుసు! ఈ రోజు అవి కూడా కరవైపోయాయి!’’ అంది సుజి.
‘‘సుజీ! మనమెవరం చెప్పు? ఎంతటివాళ్ళం? ఆ పిల్లల దుస్థితిని రూపుమాపగల ఆస్తిపరులమా? మహా అయితే ఓ రూపాయి, లేదంటే ఐదు, ఇంకా చెప్పాలంటే ఓ పది రూపాయలు వాళ్లకిచ్చి చేతులు దులుపుకోగలం. మనం మధ్యతరగతి వాళ్ళం సుజీ! కిందనున్న వాళ్ళని చూసి జాలిపడి చెయ్యగలిగిందేమీ లేదు. పైనున్న వాళ్ళని చూసి అసూయపడి సాధించగలిగిందీ ఏమీ ఉండదు. ఎన్ని మెట్లెక్కేమో మరచిపోతేనే ముందుకెళ్లగలం!’’ అని బోధపరిచాను.
‘‘మైథిలి మనసు ఎంత గాయపడిందో చూడండి. అసలు దేవుడే లేడు అంటోంది!’’ అంది సుజి.
‘‘అమ్మా! బంగారూ! దేవుడున్నాడమ్మా! చూడు, ఆ దేవుడు ఆ ముష్టి పిల్లలకి సాయం చెయ్యమని మనకి కొంత డబ్బు కలిగేలా చేస్తాడు! అప్పుడు ఆ డబ్బు వాళ్ళకిచ్చి మనం ఆదుకుందాం’’ అని మైథిలిని భక్తివైపు మరల్చే ప్రయత్నం చేసాను.
నా ప్రయత్నం మరింత వికటించింది. మైథిలి, ఎవరైనా పోగొట్టుకున్న పర్సులు, హేండ్ బ్యాగులు వంటివి ఏమైనా దొరుకుతాయేమో అని పరిసరాలు వెదుకుతూ నడవడం మొదలెట్టింది!
అన్ని మెట్లూ ఎక్కేసాం. అల్లంత దూరంలో గుడి ఉంది. ఆయాసం తీర్చుకుందికి ఓ చెట్టు కింద ఆగాం. మైథిలి మామూలుగా లేదని నాకర్థమైంది. ‘‘సుజీ! పాపతో మాట్లాడు. తనలోంచి ఆ దృశ్యం చెరిగిపోయేలా చెయ్యి!’’ అని భార్యకి చిన్నపాటి ఆజ్ఞను జారీచేశాను. సుజీ, తక్షణ కర్తవ్యంలా కూతురివైపు తిరిగింది. అంతే మైథిలి విప్పారిన ముఖంతో పరుగుపెట్టింది. మైథిలి వంగి ఏదో వస్తువు తీసి, గట్టిగా అపురూపంగా పట్టుకుని చేటంత మొహం చేసుకుని పరుగు పరుగున వస్తూ ‘‘నాన్నా పర్సు! అమ్మా! దేవుడున్నాడు!’’ అని అరిచింది.
నా ఆశ్చర్యానికి అంతేలేదు! సుజీ కూడా ‘ఎవరి పర్సో ఏమిటో వెతుక్కుంటూ పిల్లని చూస్తే దొంగ అంటారేమోనని’ కలవరపడింది. మైథిలి పర్సు తెచ్చి నా చేతిలో పెట్టింది. ఇది తనదీ అని మా దగ్గరకు ఎవ్వరూ రాకపోవడంతో పర్సు తెరచి చూసాను. ఐదొందల రూపాయల నోటు ఉంది! ఆతృత ఆపుకోలేకపోతున్న సుజీ ‘‘ఎంతుంది?’’ అని అడిగింది. నేనామె ప్రశ్నకి జవాబివ్వకుండా పర్సంతా వెతికాను. కొన్ని విజిటింగ్ కార్డ్స్ దొరికాయి. పర్సు యజమాని ఓ కాంట్రాక్టర్ అని అర్థమైంది. ‘‘్ఫరవాలేదు, దోచుకోవడం తెలిసిన వ్యక్తిదే ఈ పర్సు. ఇది యాచక పిల్లలకు చెందినా తప్పులేదు!’’ అన్న నిర్ణయానికొచ్చాను. అప్పుడు సుజీకి చెప్పాను
‘‘ఎవడో కాంట్రాక్టర్ పడేసుకున్నాడు, ఐదొందలున్నాయి’’ అని.
వేసిన రోడ్డు నెల్లాళ్లకే గోతులు పడిపోయేలా నాణ్యత పాటించే పెద్దమనిషి పర్సులో ఐదొందలేనా పెట్టుకుని తిరుగుతున్నాడు? అని వ్యాఖ్యానించింది. పర్సులో ఎంత ఎక్కువ ఉంటే, అంతా ఆ మెట్లమీదున్న పిల్లలకు ఇచ్చి పుణ్యం కట్టుకోవచ్చని సుజీ ఉద్దేశం. అందుకే అంత దీర్ఘం తీసింది. ఇంతలో మైథిలి అందుకుంది!
‘‘అమ్మా! ఏ ఐదు వేలో, పదివేలో ఉంటే, పర్సు పోగొట్టుకున్న అంకుల్ మళ్లా వచ్చి వెతుక్కుని పట్టుకుపోతాడు. ఐదొందలే కదాని రాలేదు! అందులో తక్కువ ఉండడమే మనకి మంచిదైంది. అది నీకు తక్కువ గానీ ఆ పిల్లలకు చాలా ఎక్కువ!’’ అంది. మైథిలి చేసిన విశే్లషణకి నేను అబ్బుర పడ్డాను!
మెట్లమీదున్న పిల్లలకి డబ్బులివ్వాలన్న ఆలోచన మంచిది కాబట్టి దేవుడు దారి చూపించాడని మురిసిపోయాను.
పర్సు దొరికిన ఆనందంలో మేం ఆయాసం మర్చిపోయాం! అర్జంటుగా దేవుడిని దర్శించుకోవాలని ఆలయంవైపు అడుగులేసాం. పూజా సామగ్రి కొనుక్కుని, చెప్పులు ఒక చోట భద్రపరిచి ‘క్యూ’లో నిల్చున్నాం.
‘‘నాన్నా, ఈ క్యూ వేగిరం నడిస్తే బాగుణ్ణు!’ అంది మైథిలి. ‘అవునమ్మా! నువ్వు అలా అనడానికి కారణాలు రెండున్నాయి కదా?’ అని అడిగాను.
‘ఏమిటో అవి?’ అడిగింది సుజి. ‘‘ఒకటీ, కోరినట్లుగా డబ్బులు పర్సు చూపించిన దేవుడికి థాంక్స్ చెప్పడం, రెండు ఆ పిల్లలకి డబ్బులిచ్చి ఏమైనా కొనుక్కోమని చెప్పడం!’’ అంది మైథిలి. ‘‘పొద్దున్నుంచీ ఏమీ తినలేదు కాబట్టి అర్జంటుగా కిందికెళ్లి ఐస్‌క్రీమో, కూల్‌డ్రింకో పొట్టలో ఎక్కించడం మూడోది!’’ అంది సుజీ కూతురి పొట్ట గిల్లుతూ. మైథిలి గలగలా నవ్వింది. నేను కూడా చిన్నగా నవ్వుకుంటూ, వీళ్ళు ఇంతలోనే మామూలుగా అయిపోయినందుకు ఆనందించాను.
‘క్యూ’ నడిచింది. కనులారా స్వామినివారి దర్శనం చేసుకున్నాం. హారతి కళ్ళకి అద్దుకున్నాం. తీర్థం పుచ్చుకుని, శఠగోపం నెత్తిన పెట్టించుకుని, ఆ దేవదేవునికి మనసులోనే వేనవేల కృతజ్ఞతలు తెలుపుకుని, పక్కనే ఉన్న అమ్మవారి గుడికి వెళ్లాం.
అమ్మవారి గుడిలో పెద్దగా రద్దీ లేదు. తెచ్చిన పసుపు, కుంకుమ పొట్లాలు విప్పి తల్లి పాదాలమీద స్వయంగా తానే చల్లింది సుజీ! ఇల్లయినా, గుడైనా వేరే ఏ ప్రదేశమైనా పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచాలన్నది సుజీ సిద్ధాంతం!
పసుపు, కుంకుమ కట్టిన కాగితాలు అక్కడే పడేయకుండా, నా చేతికిచ్చి ‘‘పట్టుకోండి.. తర్వాత డస్ట్‌బిన్‌లో వేద్దాం’’ అంది. నేను ‘సరే’ అంటూ అందుకున్నాను.
ముగ్గురం మనస్ఫూర్తిగా అమ్మవారికి చేతులు జోడించి నమస్కరించాం. ‘పదండి’ అన్నాను. ‘‘ఏమండీ! ఇవాళ ఏమిటో ఆశ్చర్యకరంగా అనిపించింది. తల్లి మహత్మ్యమో ఏమిటో పర్సు దొరికింది. ఒకసారి ఈ ఆవరణలో కూర్చుని లలితా సహస్రం చదువుకుని వస్తానుండండి’’ అంది సుజి. ఎలా కాదంటాను? మైథిలి కూడా తల్లి పక్కనే కూర్చుంది.
నేను టిఫిన్ కింద హోటల్లో ఎక్కడైనా చేద్దామా? ఇంటికెళ్లి చేసుకుందామా? అని ఆలోచిస్తూ డస్ట్‌బిన్ వైపు నడిచాను. నా చేతిలో వున్న రెండు కాగితం ముక్కలూ ఒక కాగితానివే! అడ్డంగా చింపబడ్డ ఒక కరపత్రం అది. ఎవరో ఏదో ఆశించి ఇలా కరపత్రాలు ముద్రించి పంచిపెడుతూ ఉంటే, వాటిని చింపి పొట్లాలుగా వాడుకునే ప్రబుద్ధులు వీళ్ళు! ‘వ్యాపారంలో లాభాలు పొందడానికి ఎన్ని దారులో కదా?’ అనుకున్నాను.
మండపంలో తల్లీ కూతుళ్ళు సుఖాసనంలో తదేకంగా అమ్మవారివైపు చూస్తూ లలితా సహస్రం చదువుతున్నారు. ఇక్కడ నేను ఆ రెండు కాగితం ముక్కల్ని సరిగ్గా చేర్చి అతికి చూద్దును కదా! పైభాగంలో అక్కడక్కడ ఎర్రని కుంకుమ అంటుకుని ప్రమాదానికి ప్రతీకలా, కింద పసుపు రంగు శుభానికి సూచికలా కనపడ్డాయి!
లలితా సహస్రం పూర్తయింది. ముగ్గురం కిందికి దిగడానికి మెట్లు బాట పట్టాం. తల్లీ కూతుళ్లిద్దరూ కలిసి అమ్మవారి సహస్రం చదవడంవల్ల కామోసు, వాళ్ళిద్దరూ ఒక పార్టీ అయిపోయి మాట్లాడుకుంటున్నారు! అమ్మా! వాళ్ళు వెళ్ళిపోయారో ఏంటో?’ సందేహం వెలిబుచ్చింది మైథిలి. ‘‘వాళ్ళు ఎక్కడికీ వెళ్లరమ్మ, వాళ్ళ నివాసమే అది! నువ్వేం బెంగపడకు’’ అంది సుజి.
మేం వాళ్ళున్న మెట్లు సమీపిస్తున్న కొద్దీ వాళ్ళిద్దరి ముఖాల్లో ఒక రకమైన వెలుగు! మెట్టు దగ్గరకు రానే వచ్చాం! ఆ పిల్లల దీనాలాపనలు మొదలయ్యాయి. ‘‘మీరెప్పుడూ ఇలలో కానీ, కలలో కానీ చూడని మొత్తం మేమిస్తున్నాం’’ అన్నట్టు మొహాలు దర్పంగా పెట్టారు సుజీ, మైథిలీ. వాళ్ళ ఆర్తనాదం నన్ను కరిగించలేదు! వాళ్లు ‘అమ్మా’ అంటూ సుజీ వెంటపడ్డారు.
చేసేది లేక సుజీ వాళ్ళని దాటుకుని మెట్లు దిగింది. అక్కా! అంటూ వాళ్ళు మైథిలి కాళ్ళమీద పడ్డారు. మైథిలి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. నామీద కోపం కూడా తోడవడంతో నిల్చున్నచోటే భోరున ఏడ్చేసింది. ‘ఈ పిల్ల ఇలా ఏడుస్తోందేంటి?’ అని తత్తరపడ్డారు. మైథిలికి దూరంగా జరిగిపోయారు ఆ పిల్లలు. అయినా మైథిలి మెట్టుమీంచి దిగలేదు. నేనే పైకెళ్లి తన చెయ్యి పట్టుకుని బర బరా ఈడ్చుకుంటూ కిందికి దింపాను! ఎలాగోలా రోడ్డున పడ్డాం.
తల్లీ కూతుళ్ళిద్దరూ వౌనవ్రతం! ‘టిఫిన్ చేద్దామా’ అంటే కనీసం పలకలేదు. ‘కాఫీ తాగుదామా?’ అన్నా, ‘వద్దు’ అని కళ్ళతోనే తిరస్కరించారు! ఆటో పిలిచి ఇంటికి బయలుదేరాం. బొమ్మల్లా కదిలారే తప్ప ఉలుకూ పలుకూ లేదు! నేనూ సైలెంట్ అయిపోయాను.
తలుపు తాళం తీసి లోనికెళ్ళగానే సుజీ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అంది. ‘‘మీరింత స్వార్థపరులు అనుకోలేదు! పరుల సొమ్ము ఆశించడం పాపం! మీరు కనీసం ఒక్క రూపాయైనా ఆ పిల్లలకి ఇవ్వకుండా ఐదొందలూ నొక్కేసారే! అదేమంత మంచి పని కాదు! నాకు తలచుకుంటేనే ఒళ్ళు కంపరమెత్తుతోంది!’’ అంది.
వెంటనే మైథిలి అందుకుంది. ‘‘అవి నీ డబ్బులు కావు, ఆ పిల్లల కోసం దేవుడు ఇచ్చినవి! వాళ్ళకివ్వడం పోయి, నువ్వు వాడుకుంటే పాపం చుట్టుకుంటుంది’’ అంది.
వాళ్ళిద్దరూ అంత తీవ్ర స్థాయిలో నిందించేసరికి నా అహం దెబ్బతింది. ‘నాకేం ఈ బోడి డబ్బులు అక్కర్లేద్దు! అతగాడి ఫోన్ నెంబరు కార్డుమీద ఉంది, పిలిచి అతని డబ్బు అతనికి పర్సుతో సహా ఇచ్చేస్తాను’’ అన్నాను.
‘‘ఆ.. అతగాడికి ఈ ఐదొందలు ఓ లెఖ్కా? ఓ కాంట్రాక్ట్ తగిలితే ఇలాటి నోట్లు వందో, వెయ్యో మిగుల్చుకుంటాడు! ఆ పర్సుకోసం నీ ఇంటికి నేనొస్తానా? నువ్వే ఉంచుకో’’ అంటాడు. ‘అపుడు మొహం ఎక్కడ పెట్టుకుంటావో?’ అంది సుజీ వెటకారం, ఆగ్రహం కలగలిపి.
‘‘ఎందుకు నన్ను దోషిలా చూస్తారు?’’ అని అరిచాను. ఆ అరుపుకి మైథిలి తుళ్లిపడింది. సుజీ విస్తుపోయింది. అటువంటి గావుకేకలు గతంలో నా నుండి ఎరగని వాళ్ళిద్దరూ ఒక్కసారి అదిరిపడి అడుగు వెనక్కేసారు! వెంటనే ఈ కాగితం ముక్కలు సరిగ్గా అమర్చి చదవండి! అని జేబులోంచి తీసి విసిరికొట్టాను.
‘‘డోన్ట్ సపోర్టు ఛైల్డ్ బెగ్గర్స్!’’ అని పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగ్.
బాల యాచకులకు మీరిచ్చే రూపాయి- ఆ పిల్లల్ని ముడిసరుకుగా చేసుకుని దొంగల్ని, వ్యభిచారుల్ని, అమ్మాయిల బ్రోకర్లని, రౌడీలని, గూండాలని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీకి పెట్టుబడి అవుతుంది!
చైల్డ్ బెగ్గర్స్‌కి మీరు జాలితో విదిలించే ప్రతి రూపాయి వారి బాల్యాన్ని చిదిమేస్తుంది. వారి భవిష్యత్‌ని బూటుకాలికింద సిగరెట్ పీకలా నలిపేస్తుంది ప్లీజ్! అడుక్కుంటున్న పిల్లల్ని చూసి జాలిపడకండి.
ఆ అనాథలకి, అభాగ్యులకి రూపాయో, రెండో ఇచ్చి పుణ్యం మూటకట్టుకున్నానని తలచకండి. మీ దానం- ఓ పాపకార్యం!
మీకు జాలి ఉంటే, మీరు బాధ్యత ఫీలైతే, మీకు పుణ్యం కావాలంటే, అటువంటి పిల్లల్ని దిగువ చూపిన స్వచ్ఛంద సంస్థల్లో చేర్పించండి. వారికి విద్య, పౌష్టికాహారం అందిస్తాం. ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు అందించామన్న తృప్తి మిగుల్చుకోండి.
వీధి బాలలు మీకు తారసపడితే ఈ నెంబర్లని సంప్రదించండి. కరపత్రం ఆసాంతం చదివారు తల్లీ కూతుళ్ళు. నేను నా మొబైల్ నుంచి ఆ నెంబర్‌కి ట్రై చేస్తున్నాను. ‘ఎవరికి ఫోను?’ అడిగింది సుజీ. పర్సు పోగొట్టుకున్న వ్యక్తికి అన్నాను. ‘ఆ తర్వాత మీరు ఇంకో ఫోను చెయ్యాలి!’’ అంది. ‘ఎవరికి?’ అడిగాను సందేహంగా.
‘‘ఈ కరపత్రంలో ఇచ్చిన నెంబరుకి’’ అన్నారు తల్లీ కూతుళ్లు ముక్తకంఠంతో.

-కాండూరి వెంకట సన్యాసిరావ్
జామి, విజయనగరం జిల్లా. 9866088531

-కాండూరి వెంకట సన్యాసిరావ్