ఈ వారం కథ

బహుమతి పొందిన కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇది విన్నారా?... విద్యానగర్‌లో ఓ కాలేజీ లెక్చరర్ నుంచి లక్షా యాభై వేలు కాజేశారుట..’ స్ట్ఫా రూమ్‌లో పిచ్చాపాటీకి తెరతీస్తూ అన్నాడు ఫిజిక్స్ చెప్పే మాధవ్.
‘బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకువెడుతుంటే బ్యాగ్ లాక్కున్నారా?’ అడిగాడు కెమిస్ట్రీ లెక్చరర్ సతీశ్.
‘అలా అయితే అది రొటీన్ న్యూస్.. నేను ప్రత్యేకంగా చెప్పేవాడిని కాదు.. ఈ రోజు లక్ష డిపాజిట్ చేస్తే ఆరు నెలల తరువాత రెండు లక్షలు ఇస్తాం అని ఎవరో ఫైనాన్స్ కంపెనీవాళ్ళు చెబితే నమ్మేసి లక్షన్నర సమర్పించుకున్నాడట.. ఆ కంపెనీ వాళ్ళు సమయానికి బోర్డు ఎత్తేసి పారిపోయారుట...’ మాధవ్ చెప్పాడు.
‘పెట్టుబడి ఇట్టే రెట్టింపు అవ్వాలని మరీ అంత ఆశ పడ్డాడు కదా, తగిన శాస్తి జరిగింది’ అన్నాను నేను.
సాధారణంగా ఎక్కువ మాట్లాడని పవన్ నోరు విప్పాడు, ‘ఆయన కూడా మీలాగానే మ్యాథ్స్ లెక్చరర్‌ట’ అన్నాడు నన్ను ఉద్దేశించి.
నేను నుదురు చిట్లించాను.. పవన్ ఎక్కువ తక్కువ మాట్లాడడు.. ఏది చెప్పాలన్నా ఎత్తిపొడుపు లేకుండా సూటిగా అసలు పాయింట్ ప్రస్తావిస్తాడు.. నేనేం ఆశపోతుని కాదు.. అలాంటప్పుడు మా ఇద్దరికీ ఏదో పోలిక ఉంది అన్నట్లు మీలాగానే మ్యాథ్స్ లెక్చరర్ అన్న సంగతి చెప్పాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం అవలేదు.. అయితే ఒకటి.. పవన్ కాసింత విభిన్నంగా ఆలోచిస్తాడు. అతను రాసిన కొన్ని కథలు పత్రికలలో వచ్చాయి.. నిజం ఎంతో తెలియదు కాని పవన్ పంపిన రచనలలో పది కథలు వెనక్కి వస్తే ఒక కథ అచ్చు అవుతుంది అన్న జోక్ మా స్ట్ఫా రూమ్‌లో గుసగుసగా వినబడుతుంది.
‘మనం నేర్చుకున్న చదువుని నిత్య జీవితంలో సరిగ్గా అన్వయించుకోకపోతే ఇలాగే అవుతుంది.. రోజూ లెక్కలు చెప్పేవాడికి ఎంత వడ్డీకి పెట్టుబడి ఆరు నెలలో రెట్టింపు అవుతుందో తెలిసి ఉండాలి కదా?! ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్లు ఇంకెంత లాభసాటి వ్యాపారం చేస్తే వాళ్ళ ఖర్చులు, వాళ్ళ అవసరాలు పోనూ అంత ఎక్కువ వడ్డీ చెల్లించగలరో అవగాహన ఉండాలి కదా?! అలాంటి లాభసాటి వ్యాపారాలు సవ్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయో లేదో లెక్క కట్టాలి కదా?!’ అన్నాడు పవన్ నా సందేహానికి జవాబు ఇస్తున్నట్లు.
పవన్ చేసిన వ్యాఖ్యానం సబబుగానే ఉంది కాని సరదాగా నాలుగు జోకులు వేసుకునే వెసులుబాటు లేకుండా టాపిక్‌ని సీరియస్‌గా మార్చాడు అనిపించింది నాకు.
నా మనసులో కదలాడిన భావన తెలిసినట్లు సతీశ్ చిన్నగా నవ్వాడు. ‘పవన్! నువ్వో పని చెయ్యి.. ఈ టాపిక్‌పైన అత్యాశ.. నిరాశ అన్న కథ రాసి పత్రికకి పంపు.. అది తిరిగిరాదు అని అత్యాశ పడకు.. తిరిగివస్తే నిరాశ చెందకు..’ అన్నాడు.
పక్కవాడి పైన జోక్ పేలితే నవ్వనివాడు ఉండడు కదా!.. స్ట్ఫారూమ్ నవ్వులతో ప్రతిధ్వనించింది.
ఇంకో పది నిముషాలకి లంచ్ టైం ముగిసింది.. గత కొద్ది రోజులుగా మా కాలేజీలో నేనొక్కడినే లెక్కలు చెబుతున్నాను. ఇంకో మ్యాథ్స్ లెక్చరర్ వచ్చి మా కాలేజీలో చేరేంతవరకూ అన్నీ క్లాసులూ నేను తీసుకోక తప్పదు. అందుకనే నాకు వరసగా మూడు క్లాసులు ఉన్నాయి. అవి అయ్యాక స్ట్ఫారూమ్‌కి వెళ్లాను.. పవన్ కనబడలేదు. అతని రచనల గురించి కాసింత హేళనగా సతీశ్ మాట్లాడటంతో పవన్ నొచ్చుకున్నాడా అని అనుకున్నాను.
***
రెండు రోజుల తరువాత స్ట్ఫా రూమ్ కబుర్లలో ‘మనుషులలో స్వార్థం పెరిగింది..’ అన్నాడు సతీశ్.
‘మీరు అన్నది పూర్తిగా నిజం కాదండి.. ఉదాహరణకి ఈ రోజు పేపర్లో ఒకాయన గురించి రాశారు..’ అన్నాడు పవన్. ‘ఆయన రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యాడు.. మా పక్క కాలనీలో ఉంటాడు.. పొద్దునే్న స్కూటర్‌పైన తిరిగి కాలనీలో ఎక్కడెక్కడ రోడ్లకి గుంటలు ఉన్నాయో చూసుకుని ఆ తరువాత స్వంత ఖర్చుతో ఆటోలో కంకర గట్రా తీసుకువెళ్లి గుంటలు పూడుస్తాడుట.. ఇప్పుడు వాళ్ళ కాలనీలో రోడ్లన్నీ గతుకులు లేకుండా చక్కగా ఉన్నాయిట..’ పవన్ చెప్పాడు.
‘‘అదంతా పబ్లిసిటీ స్టంట్!... ఏదో అవార్డు కోసం పడే ప్రయాస...’ మాధవ్ తేల్చేశాడు.
‘అసలు రిటైర్ అయినవాడు స్వంత ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా సమాజం గురించి టైం వేస్ట్ చేస్తున్నాడు అంటే దాని వెనకాల ఏదో మతలబు, కథా ఉండి ఉండాలి..’ అన్నాడు సుధాకర్.
‘మాధవ్ చెప్పినదాంట్లో పాయింట్ ఉంది.. నిన్న టీవీలో చూపించారు.. తండ్రి ఆఫీసరట.. మిగిలిన వాళ్ళలాగా లంచాలు తీసుకోవటం లేదని కోపంతో కొడుకులు ఆయన్ని ఇంట్లో లాక్ చేశారుట.. ఇంటికి ఫైల్స్ తెప్పించి తండ్రి సంతకం ఫోర్జరీ చేసి శాంక్షన్లు మంజూరు చేసి లంచాలు వాళ్ళు తీసుకున్నారుట.. తీరా చూస్తే ఒక కొడుకు డిగ్రీ చదువుతున్నాడుట.. ఇంకొకడు ఇంటర్‌ట.. జనాలంతా అలా ఉంటే సొంత డబ్బుతో రోడ్ల గుంటలు పూడుస్తున్నాడు అంటే నమ్మబుల్‌గా లేదు..’ సతీశ్ అన్నాడు.
‘ఆ తండ్రీ కొడుకుల కథ మరీ అంత టూకీగా చెప్పేస్తే ఎలా సతీశ్?.. ఇంతకీ తండ్రి ఏ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు?’ ఆసక్తిగా అడిగాడు మాధవ్.
ఇక సంభాషణ అంతా లంచాలు, తండ్రులని సరిగ్గా చూసుకోని కొడుకులపైకి మళ్లింది. మధ్యలో నేను అనుకోకుండా పవన్ వంక చూశాను. అతని ముఖ కవళికలు చూస్తే మా మాటలు అతనికి అసహనం, ఇబ్బంది కలిగించాయి అన్న భావన కలిగింది.
నెల తరువాత ఇంకో మ్యాథ్స్ లెక్చరర్ మా కాలేజీలో చేరటంతో నా పనిభారం సగానికి సగం తగ్గింది. అమ్మయ్యా అనుకుని నేను పట్టుమని పది రోజులపాటు విశ్రాంతిగా ఉన్నానో లేదో కొత్తగా వచ్చిన ఆయనకి గుండెపోటు వచ్చి హాస్పిటల్‌లో చేరాడు. మళ్లీ ఊపిరి సలుపుకోకుండా క్లాసు తరువాత క్లాసు తీసుకోవడం మొదలుపెట్టాను. నా దురదృష్టం కాకపోతే ఇంకో ఊరినుంచి పనికట్టుకుని వచ్చి ఇక్కడ చేరిన వ్యక్తికి అనారోగ్యం ఉండటం ఏమిటీ?.. అష్టోత్తరంతో మొదలుపెట్టి క్రమంగా ఆయన్ని సహస్రనామాలతో తిట్టుకున్నాను. మూడు రోజుల తరువాత అలా తిట్టుకున్నందుకు నన్ను నేనే నిందించుకోవాల్సి వచ్చింది.. ఆయన ఐసియూలోనే చివరి శ్వాస వదిలాడు.
ఆయన మరణవార్త విని నేను, పవన్ హాస్పిటల్‌కి వెళ్లాం. ఆయన భార్య, పిల్లలు, బంధువులు వున్నారు అక్కడ.. వాళ్ళు అద్దెకి ఉంటున్న ఫ్లాట్ యజమాని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు పవన్. ఎందుకా అని పవన్ వంక ప్రశ్నార్థకంగా చూశాను.. ‘ఈయన ఆ ఫ్లాట్‌లో దిగి ఇంకా నెల కూడా కాలేదు.. ఇప్పుడు బాడీ తీసుకువెడితే ఓనర్ ఏమన్నా గొడవ చేస్తాడేమో కనుక్కోవాలి కదా?!’ అన్నాడు పవన్.
నిజమే కదా అనుకున్నాను.
ఓనర్‌తో మాట్లాడాక పవన్ తేలిగ్గా నిట్టూర్చాడు. ‘ఆయన ఏమన్నాడో తెలుసా?.. వాళ్ళు అంత విషాదంలో వున్నపుడు చేతనయిన సాయం చేయాలి కానీ అర్ధం పర్ధం లేని చాదస్తాలకి ఎలా పోతామండీ అన్నాడు. చాలా మంచివాడు...’ అన్నాడు పవన్.
ఆయనే కాదు ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా ఎంతో సాయం చేశారు.. సహకరించారు. ఒకాయనకి మెయిన్ రోడ్డుమీద టిఫిన్ సెంటర్ ఉందిట. పరామర్శ చేయటానికి వచ్చిన అందరికీ డబ్బులు తీసుకోకుండా కాఫీ, టీలు సప్లయి చేయించాడు. ఊరికి కొత్తగా వచ్చిన ఆ కుటుంబానికి ఏ ఇబ్బందీ లేకుండా మిగిలిన కర్మకాండ సజావుగా సాగేందుకు అందరూ తలా చేరుూ వేశారు.
మూడు నెలలు గడిచాయి.. ఇంకో లెక్చరర్ వచ్చి చేరి నాకు పని ఒత్తిడి తగ్గించాడు.
ఓ రోజున పవన్ స్వీట్ పాకెట్ పట్టుకువచ్చాడు. ‘్ఫస్ట్ టైం నా కథకి బహుమతి వచ్చింది..’ అని ఆనందంగా చెప్పాడు.
‘కథ పేరు అత్యాశ నిరాశ కాదు కదా?’ అడిగాడు సతీశ్. అందరం గొల్లుమని నవ్వాం.
పవన్ కూడా నవ్వి ‘కాదు.. కథ కాదు మరణానికి అటూ ఇటూ..’ అన్నాడు.
కథ పేరు విభిన్నంగా అనిపించింది నాకు. పైగా మంచి సర్క్యులేషన్ ఉన్న వారపత్రిక నిర్వహించిన పోటీ అది. అందుకనే ఆ తరువాత ఆసక్తిగా కథ చదివాను. అపార్ట్‌మెంట్‌లో ఒక వ్యక్తి మరణిస్తే మిగిలినవారు స్పందించిన తీరుని కళ్లకి కట్టినట్లు వర్ణించాడు పవన్.. ఆ రోజు ప్లాన్ చేసుకున్న మందు పార్టీకి వెళ్ళే అవకాశం పోయినందుకు ఒకాయన చింతిస్తాడు.. కొడుకు పుట్టిన రోజుని మ్యూజిక్ సిస్టంతో ఆర్భాటంగా జరుపుకోలేకపోయినందుకు ఇంకో ఆయన భార్యా సమేతంగా బాధపడతాడు. పసందుగా సాగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో చివరి పదిహేను ఓవర్లు మిస్ అవుతున్నాయి అన్న కసితో ‘ఆ చచ్చేవాడు ఇంకో గంట తరువాత చస్తే ఆయన సొమ్మేం పోయేదో!’ అని సణుక్కుంటూ చివరి చూపుకి బయల్దేరతాడు ఇంకో వ్యక్తి. భర్త మరణానికి శోకిస్తున్న స్నేహితురాలికి సానుభూతి చెప్పి వీలయినంత త్వరగా బయటపడి ముందుగా బుక్ చేసుకున్న సినిమా టికెట్లు వృధా అవకుండా సినిమా హాల్‌కి ఎలా వెళ్లాలా అన్న ఆలోచనతో ఒకావిడ సతమతమవుతుంది. వ్యంగ్యంగా సాగిన ఆ కథ బాగుంది.
కథ రాసింది వేరే ఇంకెవరో అయి ఉంటే ‘చాలా బాగా రాశాడే..’ అనుకునేవాడ్ని. తోటి వ్యక్తి మరణానికి హృదయం ఉన్న మానవులలాగా చుట్టుప్రక్కల వాళ్ళు సాయపడటం కొన్ని నెలల క్రితం ప్రత్యక్షంగా చూశాడు కదా పవన్!?.. ఆ మంచితనాన్ని చాటి చెప్పే రచన చేయకుండా మనుషులలో వున్న వికృత కోణాలని కథాంశంగా ఎందుకు తీసుకున్నాడో అర్థం అవలేదు.
ఆ మర్నాడు కాలేజీలో ఆ విషయమే పవన్‌ని అడిగాను.
పవన్ సన్నగా నవ్వాడు. ‘గురూ గారూ! మా పక్క కాలనీలో స్వంత ఖర్చుతో రోడ్లు బాగుచేసే మహానుభావుడి గురించి నేను చెప్పిన తరువాత ఆయన గొప్పతనం గురించి ఒక నిముషం సేపయినా మనం స్ట్ఫా రూమ్‌లో మాట్లాడుకున్నామా? లేదు.. అదే ఎన్నారయి భర్తల శాడిజం గురించో, కట్నాల వేధింపులలో జరిగే అకృత్యాల గురించో, లంచాలు మింగేవారి గురించో ప్రస్తావన వస్తే గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నాం..’
నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా వేరే సోది ఎందుకు చెబుతున్నాడో నాకు అర్థం అవలేదు.
‘మెడిసిన్ చదువుతూ ఆర్థిక స్థితి బాగుండక సాయంకాలం పూట ఒక అబ్బాయి ఆటో నడుపుతున్నాడుట.. డబ్బులు లేని వారెవరయినా హాస్పిటల్‌కి వెళ్ళటం కోసమని ఆటో ఎక్కితే అతను పైసా కూడా ఛార్జ్ చేయడుట.. ఆ అబ్బాయిని నిన్న టీవీలో ఇంటర్వ్యూ చేశారు చూశారా?’ పవన్ అడిగాడు.
నేను సమాధానం ఇవ్వలేదు.. కాదు ఇవ్వలేకపోయాను.. సరిగ్గా అదే సమయానికి ఇంకో చానెల్‌లో స్వామీజీ రాసలీలలు అన్న శీర్షికతో ఒక స్వామీజీ తెరచాటు వ్యవహారం ప్రసారం అవుతుంటే అది చూస్తూ ఉండిపోయాను..
‘అదే కాదు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ శని, ఆదివారాలలో పేద పిల్లలకి ఉచితంగా ఎంసెట్ కోచింగ్ ఇస్తున్న దంపతుల గురించి వచ్చిన పరిచయ కార్యక్రమం సంపూర్తిగా చూసినవాళ్ళు కూడా నాకు ఎవరూ తటస్థపడటలేదు.. మంచితనం, మానవత్వం గురించి కాకుండా విపరీత ధోరణులని తెలియజెప్పే కథనాలని చూడటానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ఓ చిన్న ప్రయోగం చేయాలన్న ఆసక్తి నాకు కలిగింది..’
పవన్ ఏం చెప్పబోతున్నాడో నాకు చూచాయగా అర్థం అయ్యింది.
‘మీరు అనుకున్నట్లు మన మ్యాథ్స్ లెక్చరర్ పోయినపుడు ఆయన ఆపార్ట్‌మెంట్‌లో వున్న అందరూ చేసిన సాయాన్ని, సానుభూతితో స్పందించిన తీరుని నేను ఎప్పటికీ మరచిపోలేను... సిటీ సింథటిక్ జీవితాలలో కూడా పక్కవారి గురించి తల్లడిల్లే వ్యక్తులు వున్నారు అని చెబుతూ ఇంకో కథని కూడా ఈ పోటీకి పంపాను.. అయితే ఎక్కువమంది పాఠకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని కాబోలు వికృత భావాలని చిత్రీకరించింది అని మీరు అనుకున్న రచనకి బహుమతి ఇచ్చారు..’ పవన్ స్వరంలో ఎత్తిపొడుపు లేదు. కాసింత వైరాగ్యమో విరక్తో ధ్వనించడంవల్ల కాబోలు అతని గొంతు వణికింది.
ఆ విరక్తో , వైరాగ్యమో బహుశా అతని మొహంలో కూడా కదలాడి ఉండాలి. కాని అతని మొహంలోకి చూసే ధైర్యం లేక సిగ్గుతో తల వంచుకున్నాను. నాలో కూడా ఎంతో కొంత ఆ వికృత ధోరణులు ఉన్నాయి అని ఒప్పుకునే ధైర్యం లేక సమాజంలో అవి ఇంకా ఎక్కువ స్థాయిలో పెరిగాయా అని వెతికే యత్నం ఇన్నాళ్ళూ చేస్తూ వచ్చానా అన్న ఆలోచన కలిగించిన సిగ్గు అది.

*

-శ్రీఉదయిని, సెల్ నెం:9246849318