మెయిన్ ఫీచర్

‘అమ్మ’ భాషతోనే ఆత్మవిశ్వాసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి మాట్లాడే శక్తి ఆ దేవుడు ఇచ్చిన వరమైతే.. తొలిసారిగా నాలుకమీద మాతృభాషా పదాలు ఉచ్ఛరించగలగటం అంతకన్నా పెద్ద వరం.. అదృష్టం కూడా! తెలుగు పిల్లవాడయితే ముందుగా పెదాలు కదుపు... నాలుక కదిలిస్తూ ‘అత్త, తాత’ అంటాడు. ఆ తరువాత ‘అమ్మ, నాన్న’ అంటాడు. ఆలాగే పెరిగి పెద్దయిన తరువాత ఎన్ని భాషలు నేర్చుకున్నా.. వంటికి నొప్పో, మనసుకు బాధో కలిగినప్పుడు ‘అమ్మా’ అని తెలుగులోనే ఏడుస్తాడు. ఇంతటి సెంటిమెంట్‌తో కూడుకున్న మన మాతృభాష విషయంలో మనం ఎంతటి శ్రద్ధ తీసుకుంటున్నామో ఏ పాఠశాలకు, ఏ కళాశాలకు వెళ్లి చూసినా.. ఏ విద్యార్థిని పలకరించినా అర్థమైపోతుంది.

ఈ ఆధునిక యుగంలో ఎవర్ని పలకరించినా అందరూ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించే మాట్లాడుతున్నారు. ‘ఏం చేస్తున్నారు?’ అని అడిగితే ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్’ అని ఠక్కున సమాధానం ఇస్తున్నారు. పిల్లలూ అంతే..! సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సబ్జెక్టులు తప్ప మరో సబ్జెక్ట్ చదవటంలేదు. దీనికితోడు ‘అన్నప్రసాన నాడే ఆవకాయ’ సామెతలా టెక్నో స్కూల్సు వెలిసి.. ‘చిన్నప్పటినుంచే మీ పిల్లలను టెక్నాలజీ చదువులకు సిద్ధం చేస్తాం’ అని తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ భారీ ఫీజులు వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ప్రాథమిక పాఠశాల స్థాయినుంచే తమ పిల్లాడు శాస్త్ర పాఠాలు చదువుకుంటున్నందుకు మురిసిపోతున్నారు.
విద్యార్థి ఏ శాస్త్రం నేర్చుకోవాలన్నా దానికి ఆధారంగా ఏదో ఒక భాష ఉండి వుండాలి. డిగ్రీలు, పట్టాలు.. ఇలా దేన్ని పొందాలన్నా ఆ విద్యార్థి పరీక్ష పేపర్లో ఏదో ఒక భాష ద్వారానే వ్యక్తం చేయాల్సి వస్తుంది. ఇలా భాష ఒక అవసరమే కాదు! ప్రతి భాషకూ ఒక సౌందర్యం, సౌలభ్యం, గొప్పతనం, వైభవం అనేవి కూడా వుంటాయి. ఏ భాషా పదాల ఆనందం ఆ భాషదే! ఏ భాషా పలుకుబడులు, ఏ భాష సామెతలు, ఏ భాష మాండలీకాలు ఆ భాషవే.. అన్నీ దేనికవి అందమైనవే, ప్రత్యేకమైనవే. వాటి విశిష్టతను ఆ భాష మాతృభాషగా కలవాడు మాత్రమే బాగా అర్థం చేసుకుని ఆనందించగలుగుతాడు. ఎవరి మాతృభాష వాళ్ళకు కన్నతల్లిలాంటిది. అమ్మను ఎంతగా అభిమానిస్తామో, గౌరవిస్తామో, మాతృభాషనూ అంతే!. శాస్త్ర పాఠాలను విద్యార్థులకు నేర్పుతూనే ద్వితీయ భాషగా పెట్టబడిన తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, తమిళం భాషలలో చక్కగా చదవటం, వ్రాయడం, మాట్లాడటం నేర్పించాలన్న శ్రద్ధ ముందు ఉపాధ్యాయులలోనే కొరవడుతున్నది. సెకండ్ లాంగ్వేజ్ క్లాసు అనగానే విద్యార్థులు ఆసక్తి చూపించకపోవటం, క్లాసులు ఎగ్గొట్టడం వెనక కారణాలు ఏమిటన్నది అధ్యయనం చేసి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం వున్నది.
లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అంటే అందులో భాష మాత్రమే కాదు.. నేర్చుకోవలసిన బోలెడంత సాహిత్యం ఉంటుంది. ఆయా భాషలలో పద్య, గద్య, కథ, నవల రూపంలో కవి వ్యక్తీకరించిన భావాలను విద్యార్థులకు తెలియజెప్పి ఆసక్తికరంగా తరగతిని తయారుచెయ్యాల్సిన బాధ్యత, ప్రతిభ ఉపాధ్యాయుడికి ఉండాలి. ‘సైన్స్ చెప్పలేని ఎన్నో విషయాలను సాహిత్యం చెబుతుందనీ.. అది ఒక సృజనాత్మక కళ గనుక దాని వ్యక్తీకరణకు నైపుణ్యం తప్ప నియమ నిబంధనలు ఏవీ ఉండవని’ విద్యార్థికి తెలియచెప్పాలి.
శాస్త్ర పాఠాన్ని పుస్తకంలో ఎలా వుంటే అలాగే ఉపాధ్యాయుడు చెబుతాడు. విద్యార్థి అలాగే రాయాలి. అంతకుమించి స్వంతంగా, స్వకపోల కల్పితంగా ‘పొల్లు’ కూడా వ్రాయలేడు. కానీ సాహిత్యం అలా కాదు ‘వ్రాయగలిగినవాడికి వ్రాసినంత..’ అన్నట్లు ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. సైన్స్ ‘మేథ’కు సంబంధించింది అయితే.. సాహిత్యం ‘మనసు’కు సంబంధించింది.. అనుభూతి ప్రధానమయినది.. రసభరితము, రాగరంజితము అయినది. ఎన్నో పదబంధాలు, ఎన్నో వాక్య విన్యాసాలు, నవరసాలు, అష్టాదశ వర్ణనలు, లెక్కకుమించిన ప్రక్రియలు ఇలా ఒకటా రెండా.. సాహిత్యం అంటే అదో సముద్రం. ఎంత ఈదగలిగినవాడికి అంత! ఎంత దూరం చేరగలిగితే అంత విస్తృత సాహిత్యం మన స్వంతమవుతుంది. ఎంత లోతుకు వెళ్లగలిగితే అన్ని ముత్యాలు, రత్నాలు మన స్వంతమవుతాయి.
ఇంతటి వైభవాన్ని సంతరించుకున్న సాహిత్యం స్కూళ్ళలో, కళాశాలల్లో ఎంతటి నిరాదరణకు గురి అవుతున్నదో చూస్తుంటే భాషా సాహిత్యాల విలువ తెలిసినవాళ్ళకు ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. కొంతమంది అనుకుంటున్నట్లు శాస్త్రాలు ఈనాడు కొత్తగా పుట్టినవేమీ కాదు. సకల భాషలకు జనని అయిన సంస్కృతంలో ఏనాడో అన్ని శాస్త్రాలూ రాశారు. వైద్య శాస్త్రం, భూగర్భ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, గణిత శాస్త్రం వంటివన్నీ ఆనాడూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పటికన్నా గొప్పగా కూడా అప్పుడు చెప్పబడ్డాయి. వాటిని ఆధారం చేసుకుని ఆ మూలాల నుంచే క్రమక్రమంగా సైన్స్ అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ దశకు చేరుకుంది.
ప్రస్తుతం విద్యా రంగంలో భాషా సాహిత్యాలపట్ల ఉన్న నిర్లక్ష్యం, నిరాదరణ తొలగిపోయి.. మళ్లీ అవి మూడు పువ్వులు, ఆరు కాయలుగా వెలిగిపోవాలంటే ప్రాథమిక విద్యా తరగతులనుంచే విద్యార్థులకు భాషా, సాహిత్యాలను బోధించాలి. ఒకసారి వాళ్ళు భాషమీద ఇష్టాన్ని పెంచుకుని, సాహిత్య రుచిని చవి చూసారంటే ఇక ఆ తర్వాత వాళ్ళను ఎవరూ ఆపలేరు. వాళ్ళంతటవాళ్ళే చక చకా ఎదిగిపోతారు.

- కొఠారి వాణీచలపతిరావు