ఈ వారం కథ

స్వధర్మం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ క్షణాన మొదలైందో ఆ ఆలోచన వదలటంలేదు. అలా అని, ఓ నిర్ణయానికీ రాలేకపోతున్నాడు నిరంజన్‌రావు. ప్రతిసారీ ఆతృతే.. ఓ రకం జంకు, అపరాధ భావన.. ఉదిగ్న ఊష్ణం కమ్ముకున్నట్టు.. మనసుకి, శరీరానికి ఆరాటమే.
మంచి వాతావరణంలో పెరిగి పెద్దవాడయ్యాడు నిరంజనరావు. తండ్రి హైస్కూలులో ఉపాధ్యాయుడు. ఉమ్మడి కుటుంబం. పిల్లలకి చిన్నతనంనుంచే పాటలు, పద్యాల రూపంలో మంచిని నేర్పే సుమతీ, దాశరథీ శతకాల సంప్రదాయం. ఆర్థికంగా సామాన్య కుటుంబం. అందుకే అణకువ అబ్బింది. ఆ మంచి పునాది వల్ల మనుషులపట్ల ప్రేమ అన్న వౌలిక స్వభావం అలవడింది నిరంజనరావుకి.
డిగ్రీ పూర్తవగానే ఉద్యోగం వచ్చింది. పెద్దలు కుదిర్చిన సంబంధం. ఏ ఇబ్బందీ, ఆటంకం లేకుండా వివాహ జీవితం ఆరంభమైంది. ఆ రోజులు, ఆ తొలి ప్రణయం మరో లోకంలా ఉంది నిరంజనరావుకి. ఉద్యోగం వేరే ఊళ్ళో అవటంవల్ల కొత్త కాపురంలో భార్యాభర్తలే పూర్తిగా ఒకరికొకరు అయ్యారు. వచ్చిన జీతం సరిపోయేలా నిరంజనరావు భార్య నిర్మల పొదుపుగా సంసారం గడపటం.. పరస్పరం ప్రేమ.. ఆ కాపురం ఆనంద లోకంలా అనిపించింది.
ఉగాది పండుగంటే మరీ ఉత్సాహంగా ఉండేది నిరంజన్‌రావుకి. అదే రోజు నిర్మల పుట్టిన రోజు. కొత్తకాపురంలో మొదటి రెండు ఉగాదులు చాలా బాగా గడిచాయి. పద్ధతైన జీవితం.. పరిమితులకి లోబడిన నడత. మూడో ఉగాదికి ఆ మార్పు వచ్చింది. అప్పటినుంచే నిరంజనరావు బతుకు పద్ధతి మారింది.
అది చిన్న విషయమే. ఆ ఉగాదికి వారం రోజుల ముందు నిర్మల తమ పక్క పోర్షన్లో ఆవిడ కొనుక్కున్న పండుగ కొత్త చీర చూసింది. బాగా నచ్చిందనీ తీసుకొచ్చి భర్తకి చూపించింది. నచ్చటమంటే నిర్మలకి ఆ చీర కావాలన్న కోరిక వుందని అర్థమైంది నిరంజన్‌రావుకి. తన నెల జీతం అంతా పెడితేగానీ ఆ చీర రాదు.
దిగువ మధ్య తరగతి నూతన దంపతులు పడే గుంజాటనంతా పడ్డారు నిర్మల, నిరంజనరావు. ఆ చీర కొనే స్తోమత లేదు. అలా అని దానిమీద ఆశ చంపుకోనూలేరు.
పండుగ దగ్గరపడుతున్నకొద్దీ నిరంజనరావులో అస్థిమితం పెరుగుతూ వచ్చింది. చివరికి తోటి ఉద్యోగి లక్ష్మణరావు వల్ల పరిష్కారం దొరికింది. వాళ్ళ ఆఫీసుకి తరచుగా వచ్చే ఓ పెద్దమనిషి దగ్గర అప్పు ఇప్పించాడు లక్ష్మణరావు.
ఆ ఉగాదినాడు ఆ చీర కట్టుకున్న నిర్మల ఆనందంకన్నా ఆమె తృప్తిని చూసి సంతోషించిన నిరంజనరావు గర్వం పదింతలు ఎక్కువ. ‘జీవితమంటే ఇంతే కదా.. తన వాళ్ళ ఆనందమే కదా...’ అనుకున్నాడు.
తర్వాత ఆ అప్పు కూడా తీర్చాల్సిన అవసరం లేదు నిరంజనరావుకి. ఆ పెద్దమనిషికి తన సీటుతో అవసరమున్న ఆఫీసు పని చేసిపెట్టడంతో ఆ బాకీ తీరిపోయింది.
‘స్మాల్ ఫేవర్’ అని గౌరవంగా ఇంగ్లీషులో చెలామణి అయ్యే ఆ లంచం.. ఆ తర్వాత నిరంజనరావుకి అలవాటైపోయింది. ఆ మొదటిసారే అప్పు అనకుండా, లంచం అంటే జంకేవాడేమో.. కానీ ఆ పరిస్థితిలో ఆ బెదురూ లేకుండాపోయింది.
సవ్యంగా, అతి సాధారణంగా బతకాలనుకున్న నీతిపరుడైన నిరంజనరావుని ఆ పండుగ మార్చేసింది.
ఉన్నంతలో సరుకుని ఆనందపడాలనుకునే నిర్మల మారిపోయింది. కోరికలు పెరిగాయి. లంచం, అక్రమ సంపాదన.. జీవితంలో ఓ భాగం అన్న వాతావరణంలో బతుకుతున్నాం. వందల కోట్లు హవాలాలు ఎవరినీ ఆశ్చర్యపరచటంలేదు. వేలల్లో లంచాలు తీసుకుంటూ, లక్షల ఆర్జనకి ఎదిగిన నిరంజనరావుకీ క్రమేపీ ఆ జీవితం అలవాటైపోయింది.
పదేళ్ళు గడిచేలోపే అతని జీవితం మారిపోయింది. పై పదవివల్ల మకాం నగరానికి మారిపోయింది. తనవాళ్ళ తోటి, ఇంటితోటి అనుబంధం తగ్గిపోయింది. తనూ, నిర్మలా.. లేక లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు. తమ ముగ్గురూ బావుంటే చాలు.. ముగ్గురూ కూడా కాదు.. నిర్మలా, బాబు.. తన గురించి తాను మరిచిపోయాడు నిరంజనరావు. భార్యా కొడుకే లోకం.. వాళ్ళకోసమే తను, తన సంపాదన.. వాళ్ళ సంతోషమే తన సంతోషం.
సంపాదన బావుంది.. రోజులు కలిసొచ్చాయి.. ఆస్తులు కూడబెట్టాడు. వయసు యాభై దాటింది. ఇల్లు, కార్లు, అన్ని సౌకర్యాలు వున్నాయి. కొడుకు లా ఫైనలియర్ చదువుతున్నాడు. వచ్చే నెల అదీ అయిపోతుంది. నాలుగు నెలల క్రితం కొలీగ్ లక్ష్మణరావు ఓ కేస్‌లో దొరికిపోయి, సస్పెండ్ అయ్యాడు. అంతకుముందు అలాంటి విషయాలు వినక కాదు. కానీ చాలా దగ్గరగా వుండే మిత్రుడికి అలా అవటంతో.. అకస్మాత్తుగా.. అది తనకే జరిగితే.. అన్న ఆలోచన వచ్చింది నిరంజనరావుకి. అంతే ఆ ఆలోచన కొమ్మ కొమ్మగా పెరిగిపోయింది. దాని తాలూకు యాతన వదలటంలేదు.. అలా అని ఎటూ నిర్ణయం కూడా జరగటంలేదు. ఉక్కిరిబిక్కిరిగా ఉంటోంది నిరంజనరావుకి. స్థిమితం లేదు. ఆరాటం.. ఇప్పుడే కాదు.. ఇన్ని యేళ్ళలో ప్రతిసారీ.. లంచం మాట ఆరంభమైన దగ్గర్నించీ.. ఆ తంతు పూర్తయ్యేవరకూ ప్రతిసారీ ఆతృతే. పైకి ఎంత కాదనుకున్నా, లోలోపల తప్పు చేస్తున్నానని తెలుస్తూనే వుంది.
‘తను ఉద్యోగంలో చేరినప్పటి పరిస్థితికి, ఇప్పటి స్థితికీ చాలా తేడా వుంది. విజిలెన్స్ బాగా పెరిగింది. మీడియా ప్రభావం చాలా వుంది. ఎంత జాగ్రత్తగా వున్నా, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కసారి దొరికితే సంపాదించినదంతా పోతుంది. పోతే.. నిర్మల, కొడుకు పరిస్థితి ఏమిటి? ఎంతో సౌకర్యంగా వాళ్ళని చూసుకుంటూ వచ్చాడు. డబ్బులేని కష్టం వాళ్ళకి తెలియకూడదు. ఇంక రిస్క్ తీసుకోవటం మంచిది కాదు. తనమీద ఇప్పటివరకూ అదృష్టవశాత్తూ ఏ గొడవలూ లేవు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే ఏ గొడవా వుండదు’.
మళ్లీ మరో ఆలోచన.
‘ఇంకా ఆరేళ్ళ సర్వీసుంది. ఇంతకాలం గడిచింది ఈ ఆరేళ్ళు గడవదా.. ఆరేళ్ళంటే.. అంతా చూసుకుంటే.. కనీసం కోటి రూపాయలు వదిలెయ్యటమే.. ఎలాగోలా కాలం గడిపితే.. నిర్మలకి, బాబుకి మరో కోటి రూపాయలు.. ఎటూ తెగటం లేదు నిరంజనరావుకి ఆలోచన. ఎటూ తెగకపోవటం మరీ ఇబ్బందిగా ఉంది. అంతవరకూ ఏదైనా నిర్ణయం తనదే అన్న ఉద్దేశంలో వున్న నిరంజనరావుకి.. ఒకసారి భార్యకి, కొడుక్కీ కూడా చెబితే మంచిది అనిపించింది.
****
నిరంజనరావు చెప్పినంతా విన్నారు తల్లీ కొడుకులు. అంతా విన్న కొడుకు ‘‘్భలేవాడివి డాడీ.. అంతా రబ్బిష్.. ఎక్కడో లక్ష్మణరావు అంకుల్ దొరికితే.. నువ్వు దొరుకుతావు అనుకోవటం రబ్బిష్.. చూస్తూ.. చూస్తూ.. ఒన్ క్రోర్.. కోటి రూపాయలు వదులుకుంటామా? చేసెయ్యండి డాడీ! ఆరేళ్ళే కదా.. అప్పటికి నేనూ సెటిల్ అవుతాను.. అయినా మీరు భయపడినట్టు ఏదైనా జరిగితే చట్టం లేదా.. కోర్టులు లేవా? పైగా మా సీనియర్ ఇలాంటి కేసుల్లో జెమ్.. డోంట్‌వర్రీ.. మరీ ప్రమాదమైతే కొద్దిరోజులు జైల్లో వుండాలి.. అంతే తప్ప ఏం జరగదు..’’ అన్నాడు. కొడుకు మాటలు ధైర్యాన్నివ్వలేదు నిరంజనరావుకి. తండ్రి మనసుని, స్థితిని ఎంతమాత్రం పట్టించుకోని అలక్ష్యం కనిపించింది. కొడుకు మాటలతో దిగాలుపడిన నిరంజనరావువైపు చూస్తూ నిర్మల.. ‘‘ఏమిటండీ ఇదంతా.. ఎప్పుడో ఏదో జరుగుతుందేమోనని ఇప్పుడు కంగారా? పైగా అబ్బాయి ధైర్యం చెబుతున్నాడుగా. అయినా మీ ధైర్యం ఏమైపోయింది. అనవసరంగా బుర్ర పాడుచేసుకోండి’’ అంటూ ఓదార్పు కాకుండా, ఇటు వ్యతిరేకం కాకుండా మాట్లాడిన నిర్మలని పూర్తిగా అయోమయంగా చూశాడు నిరంజనరావు.
తనకి తనే తప్ప.. వేరెవరూ లేరు అనిపించింది అతనికి ఆ క్షణం. ‘కుర్రాడు పోనీ కుత్రరం అనుకున్నా, భార్య.. తను సర్వస్వం అని బ్రతికిన తోడు.. తనకీ పట్టటంలేదా?’
‘డబ్బు.. కోటి రూపాయలు.. అదే విలువైనదా? ఈ ఆరేళ్ళు.. భయపడుతూ, జంకుతూ.. అనుక్షణం అస్థిమితంగా తను ఉద్యోగం చెయ్యాల్సి వచ్చినా.. వాళ్ళకేం పట్టదా?’
డబ్బొక్కటే కాదు.. ఏదో.. ఇంకేదో ధర్మబంధం తప్పిపోయింది. కలిసున్న ఉమ్మడి కుటుంబానికి ఇదివరకు డబ్బు అదనపు ఆనందాన్నిచ్చింది. ఇపుడు డబ్బు కలిపి ఉంచేందుకే ఉపయోగపడుతోంది. వాళ్ళకోసం.. తను ధర్మం తప్పాడు.. అవినీతిని కుటుంబం కోసం నీతి అనుకున్నాడు.. వాళ్ళకోసం తను అన్నీ చేశాడు. తన కోసం వాళ్ళూ అంతే అనుకున్నాడు.
ఒక్కమాట.. ఒక్కమాట.. ‘పోనీలెండి.. అంత ఇబ్బందిగా ఉంటే.. మీరు మనసు కష్టపడుతుంటే.. వెధవ ఉద్యోగం వదిలెయ్యండి..’ అంటే తనేం చేసేవాడో?
‘వాళ్ళకోసమే కాదు.. తన కోసం తను ఆలోచించుకోవాలి. లేకపోతే ఇనే్నళ్ళ జీవితం అర్థం లేనట్టు, కేవలం తప్పే చేసినట్టు తయారవుతుంది.’
నిరంజనరావులో నిర్ణయం జరిగిపోయింది. మర్నాడే స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలెయ్యడానికి అప్లికేషన్ సిద్ధం చెయ్యాలనుకున్నాడు.
భార్యాబిడ్డలకన్నా, డబ్బుకన్నా, ఆరేళ్ళపాటు మనస్థిమితమే కాదు.. జీవితానికి తనకి తానుగా అర్థం వెతుక్కునే అవకాశం ఈ రకంగా వచ్చిందనుకున్నాడు.
అయినా అతనికి పూర్తిగా మనశ్శాంతిగా లేదు. తన వాళ్ళకోసం, ఉద్యోగ జీవితమంతా తప్పుచేస్తూనే వచ్చానే అన్న బాధ, డబ్బుకి ఆత్మీయుల్ని దూరం చేసే ఇంతటి దుర్మార్గమైన శక్తి వుందా అన్న చింత.
తను, తన కుటుంబం సుఖంగా ఉండాలనుకోవటంలో తప్పులేదు. కానీ దాంతోపాటు మనిషిగా కూడా ఓ ధర్మం ఉంది. అది తను పాటించలేదు. మనుషులు ఆ ధర్మం పాటించటం మీదే సమాజ స్థాయి, అందరి మేలు ఆధారపడి వుంటుంది. తన లంచగొండి జీవితంవల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా మనస్తాపానికి గురి అయ్యారో, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని జీవితాలు పాడయ్యాయో? లంచం తీసుకోటం మామూలే, అందరూ చేస్తున్నదే అన్న భావన ఎంత దారుణం.
నిరంజనరావుని పశ్చాత్తాపం కమ్ముకుంది. ఉద్యోగం మానేయడమే కాదు, ఇంక ప్రాయశ్చిత్తంగా శేష జీవితాన్ని సవ్యంగా గడపాలన్న గట్టి ఆలోచన కలిగింది. ఆ యోచన కొంత ఊరటగా ఉంది. తన దారి తనకి తెలిసినట్టు అనిపించింది. *

రచయిత సెల్ నెం:9394738805

-వి.రాజారామమోహనరావు