సబ్ ఫీచర్

ఎడారి గ్రామాలకు జలసిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజస్థాన్‌లో ఎడారి భూములను హరిత వనాలుగా మార్చిన ఘనత ఆమెకే దక్కింది.. అందుకే ఆమెను అందరూ ‘వాటర్ మదర్’ అని గౌరవంగా పిలుస్తారు. ఎండిపోయిన చెరువులు, కుంటల్లో మళ్లీ జలకళ ఉట్టిపడేలా చేయడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. నీటిని ఒడిసి పట్టుకోవడం, పొదుపుగా వాడుకోవడం, వ్యవసాయానికి వినియోగించుకోవడంలో పల్లెవాసులకు ఆమె తగిన తర్ఫీదు ఇస్తుంటారు.
ముంబయికి చెందిన విద్యావేత్త అమ్లా రుయా సామాజిక సేవ చేయాలన్న సంకల్పంతో ‘ఆకార్ ఛారిటబుల్ ట్రస్టు’ రైతులకు అండగా నిలిచారు. రాజస్థాన్‌లో ఎడారి భూములను సస్యశ్యామలం చేస్తూ ఇప్పటికి దాదాపు వంద గ్రామాల్లో పంటల దిగుబడి పెంచేందుకు ఆమె కృషి చేశారు.
ఉష్ణతాపంతో భగభగమండే రాజస్థాన్‌లో నీటి నిల్వలను కాపాడుకోవడం అత్యంత దుర్లభం. ఎప్పుడో వర్షం కురిసినా నీరు ఆవిరైపోతుంది తప్ప నిల్వ ఉండే అవకాశం ఉండదు. వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే భవిష్యత్తు అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని రుయా పల్లెప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. నీటిని నిల్వ చేసుకునేందుకు ఎలాంటి అవగాహన లేకపోవడం వల్లే ఎడారి ప్రాంత వాసులు సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె ప్రత్యక్షంగా గమనించారు. ఎలాగైనా అక్కడి పరిస్థితిని మార్చాలని, నీటిని నిల్వ చేయడంలో సవాళ్లను అధిగమించాలని ఆమె భావించారు. ఎక్కడికక్కడ చెక్‌డ్యామ్‌లు నిర్మించుకుంటే నీరు నిల్వ ఉంటుందని, అవసరానికి తగ్గట్లు ఆ నీటిని వాడుకుని, అవసరాలు తీర్చుకోవచ్చని పల్లెప్రజలకు అర్థమయ్యేలా బోధపరిచారు. ఎండవేడి కారణంగా నీరు నిల్వ ఉండడం అంత సులువు కాదని అక్కడి ప్రజలు అనుకున్నారు. శ్రమదానంతో చెక్‌డ్యామ్‌లు నిర్మించుకుంటే మంచి ఫలితం ఉంటుందని వారికి వివరించారు. ఆమె మాటలపై గురికుదరడంతో ప్రజలు శ్రమదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ‘ఆకార్ ఛారిటబుల్ ట్రస్టు’ ద్వారా కొంత మేరకు నిధులను ఆమె అందజేశారు. ముందుగా సీకర్ జిల్లాలో గద్రాతా, హామెట్స్ గ్రామాల వద్ద చెక్‌డ్యామ్‌లు పూర్తయ్యాయి. అయితే, అప్పుడు కొన్ని నెలలకి గానీ వర్షం కురవలేదు. ఆలస్యంగా వర్షం కురిసినా ఆ నీరు చెక్‌డ్యామ్‌ల్లోకి చేరడంతో తమకు నీటి కష్టాలు తీరిపోయాయని జనం ఆనందంతో పొంగిపోయారు. ఆ నీటిని వాడుకుని పంటలు వేసారు. పంట దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో జనం ఆర్థిక స్థితి మెరుగుపడింది. సంపాదన పెరగడంతో చాలామంది రైతులు పాడి పశువులు కొన్నారు. కొందరు రైతులు ట్రాక్టర్లు, బైకులు వంటి వాహనాలు కొనుగోలు చేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదని రైతులు సంబరపడ్డారు. ఇదంతా అమ్లా చొరవతోనే సాధ్యపడిందని గ్రామస్తులు చెబుతుంటారు. సమీప గ్రామాల వారు కూడా చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి సాయం చేయాలని ఆమెను ఆశ్రయించారు. ఆమె కృషి ఫలితంగా మరికొన్ని గ్రామాలు కూడా జలకళను సంతరించుకున్నాయి. ఒకప్పుడు కడుపునిండా తినడానికి కూడా అనేక ఇబ్బందులు పడిన వారు ఇపుడు ఆహారోత్పత్తులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. దాదాపు వంద గ్రామాలు అమ్లా చొరవతో నేడు సుభిక్షంగా మారాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని దుర్భిక్ష ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు నిర్మించేందుకు అమ్లా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి చేస్తున్న సేవలకు గాను లక్ష్మీపత్ సింఘానియా అవార్డు, లక్నో ఐఐఎం నుండి సామాజిక సేవా అవార్డును ఆమె అందుకున్నారు. కష్టపడి పనిచేస్తే ఏదీ అసాధ్యం కాదని, సవాళ్లను అధిగమించడంలోనే అసలైన నైపుణ్యం దాగి ఉంటుందని ఆమె చెబుతుంటారు.
chitram..
రాజస్థాన్‌లోని గద్రాతా గ్రామం వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్‌ను స్థానిక రైతులతో కలిసి పరిశీలిస్తున్న ఆకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ అమ్లా రుయా