మెయిన్ ఫీచర్

జగజ్జేయంగా తిరంగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడుపదుల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావద్భారతం సమాయత్తమవుతున్న శుభ తరుణమిది. ఓ దేశ స్వాతంత్య్ర చరిత్రలో ఏడు దశాబ్దాల కాలం స్వల్పమే అయినా దాని దిశానిర్దేశనకు ఇది గీటురాయి అవుతుంది. గతాన్ని స్మరించుకుంటూ.. వర్తమానాన్ని బలోపేతం చేసుకుంటూ.. భవిష్యత్ దిశగా బలమైన అడుగులు వేయడానికి ఇది తోడ్పడుతుంది. రెండు వందల సంవత్సరాలు భారత్‌ను తమ కబంధ హస్తాల్లో బిగించిన ఆంగ్ల పాలకుల్ని తరిమేయడానికి చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి పౌరుడూ ఓ యోధుడయ్యాడు.
స్వాతంత్య్ర సంగ్రామంలో సామాన్యుడు సైతం దేశం కోసం సర్వం త్యాగం చేశాడు. జెండా పట్టుకుని భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు వజ్రాయుధమే అయ్యాడు. అలా అందరి రక్తం, కష్టం, త్యాగం సమ్మిళితంగా మన చేతికందిన స్వాతంత్య్రానికి ఏడు పదులు పూర్తయ్యాయి. ఇదో చారిత్రక అవకాశం. ఏమి సాధించామన్న విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవడానికి.. సాధించాల్సిందేమిటని నిర్దేశించుకోవడానికి ఇది అరుదైన అవకాశం. అందిపుచ్చుకుంటే.. అడుగడుగునా స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపుకుని ముందుకెళితే- భారతావని అజేయమవుతుంది. త్యాగధనుల కలల సాకారానికి మార్గం సుగమమవుతుంది. ‘ఈ దేశం మాది, దీని రక్షకులం, పరిరక్షకులం, భావి నిర్దేశకులం తామే’నని ప్రతి పౌరుడూ నినదించేందుకు స్వేచ్ఛా భారతం దారులు తీస్తుంది.
దేశ రాజకీయ చరిత్రను తిరగరాసి, కేంద్రంలో సొంత బలంతో బిజెపి సర్కారును ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ- ఇపుడు స్వాతంత్య్ర స్ఫూర్తిని నేల నలుచెరగులా.. దేశం నలుమూలలా విస్తరించే విస్తృత కార్యక్రమానికి నడుం బిగించారు. జెండా పండుగను ఓ అధికారిక తంతుగా ముగించి చేతులు దులిపేసుకోకుండా జనంతో మమేకమయ్యేలా 70వ స్వేచ్ఛా వేడుకలను నిర్వహిస్తున్నారు. జాతీయ గౌరవానికి, సమైక్య స్ఫూర్తికి, ఐక్యతా భావనకు, సామరస్యం, సమానత మేళవించిన సువిశాల భావనలకు భారతావని పట్టుగొమ్మ అన్న రీతిలో ఘనంగా, దివ్యంగా, అద్వితీయంగానే ఈ వేడుకలకు భారతావని సిద్ధమవుతోంది. స్వాతంత్య్ర పొరాటంతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ సువర్ణావకాశం సందర్భంగా ప్రజాప్రతినిధులు కలుసుకోనున్నారు. దేశ రక్షణే ఊపిరిగా అనునిత్యం జీవన పోరాటం సాగిస్తున్న సైన్యం వద్దకు మంత్రులే వెళుతున్నారు.
విభిన్న రీతుల్లో..
ప్రజల్లో ఐక్యతను పెంపొందించేందుకు, త్యాగధనులను స్మరించుకునేందుకు ‘్భరత్ పర్వ్’, ‘ఆజాదీ-70’, ‘తిరంగా యాత్ర’ వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టాలని ప్రధాని మోదీ జాతి జనులకు పిలుపునివ్వడంతో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గతంలో లేనంతగా విశిష్ఠతను, ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ ఏడాది స్వతంత్ర వేడుకలు విభిన్నంగా నిర్వహించాలని ఇటీవల బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. ఈనెల 12న దేశ రాజధాని దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రారంభమైన ‘్భరత్ పర్వ్’ 17వ తేదీ వరకూ సాగుతుంది. ఈ సందర్భంగా మన జానపద రీతులు, హస్తకళలు, సాంస్కృతిక వారసత్వం, భారతీయ వంటకాల ఘనతను చాటిచెప్పే ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. సైనిక దళాలు సాధించిన ప్రగతిని వివరించేందుకు రక్షణశాఖ ప్రదర్శనలను నిర్వహిస్తుంది. విదేశీయులను సైతం ఆకర్షించేలా ‘్భరత్ పర్వ్’ నిర్వహించాలని ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకాలను జారీ చేశారు. ‘ఆజాదీ-70’ కార్యక్రమం ఈనెల 9 నుంచి 23 వరకూ నిర్వహిస్తారు. ముగింపు సందర్భంగా ఈ నెల 23న ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో 25 కోట్ల మంది విద్యార్థులు ఒకేసారి జాతీయగీతమైన ‘జనగణమన’ను ఆలపిస్తారు. ఈ నెల 15 నుంచి 22 వరకూ దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ను జరుపుతారు. ఈ వేడుకల సందర్భంగా సమరయోధులు స్వస్థలాలను దర్శించాలని, వారి కుటుంబాలను గౌరవించాలని మోదీ పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో దేశ భద్రత కోసం అంకితమవుతున్న సైనికులను స్వయంగా కలుసుకోవాలని తన మంత్రివర్గ సహచరులకు ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది చేపట్టే విశేష కార్యక్రమాలన్నీ జాతిజనుల్లో స్ఫూర్తిని రగలించాలని, విదేశీయులకు మన ఘనచరిత్రపై ఆసక్తి కలిగేలా ఉండాలని ప్రధాని సూచించారు. ఇందులో రాష్ట్రాలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ భద్రతకు భారత్‌లో ఢోకా లేదని, అభివృద్ధి పథంలో అగ్రగామిగా దూసుకుపోతోందని ప్రపంచానికి చాటి చెప్పేందుకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అద్భుత అవకాశం అని ఆయన గుర్తుచేస్తున్నారు. ఐక్యతను చాటేందుకు ఇంతకు మించిన సందర్భం ఇంకొకటి ఉండదని మోదీ అంటున్నారు.
జనంతో మమేకం..
దేశ సమగ్రతను కాపాడుకోవాలన్నా, అభివృద్ధిలో ముందుకు సాగిపోవాలన్నా అది ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్ని విషయాల్లోనూ జనం ఐక్యతతో సాగాలని పిలుపునిచ్చారు. జాతిజనులను చైతన్యవంతం చేసేందుకు ఆయన అనేక మార్గాలను ఎంచుకున్నారు. విదేశీ పర్యటనల్లో భారత్ ఘనతను, శక్తిసామర్ధ్యాలను చాటిచెబుతున్నారు. స్వదేశంలో ఎక్కడ పర్యటించినా సమగ్రత, అభివృద్ధికి ప్రజలంతా కలిసిరావాలని కోరుతున్నారు. ‘ఆకాశవాణి’లో నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలకు నేరుగా చేరవేయడమే కాకుండా, వారి నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నారు. వారి హక్కులను ప్రస్తావిస్తూ పాలనలో వారి భాగస్వామ్యాన్ని ఆకాంక్షిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి తాను చేసే స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఏయే అంశాలు ఉండాలని కోరుకుంటున్నారో ప్రజలే తెలపాలని సూచించారు. ఈ రకమైన ఆహ్వానం గతంలో ఏ ప్రధాని నుంచి లేదన్నది నిర్వివాదాంశం. సాంకేతికతలో మనకు తిరుగులేదని, మన ఆర్థికవ్యవస్థ బలంగా ఉందని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. కాశ్మీర్‌లో అంగుళం కూడా వదలేది లేదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ముమ్మాటికీ భారత్ అంతర్భాగమని, ఇది దేశ ప్రజలందరి అభిప్రాయమని మోదీ చెబుతున్నారు. యావత్ ప్రపంచం నేడు భారత్ వైపు చూస్తోందని, సమగ్రత, అభివృద్ధే లక్ష్యంగా ప్రజలంతా దూసుకుపోవాలని ఆయన స్ఫూర్తిని కలిగిస్తున్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణతో యావత్ ప్రపంచ దృక్పథాన్ని భారత్ అందిపుచ్చుకుని అగ్రగామిగా పయనిస్తోందన్నారు. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, క్లీన్ ఇండియా వంటి నినాదాలతో సరికొత్త చైతన్యాన్ని రగిలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడితే భారత్ మాత్రం ముందుకు వెళ్తోందని భరోసా ఇస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానమే కీలకశక్తి అని ఆయన అభివర్ణిస్తున్నారు. సాంఘిక భద్రత, సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉండగలరని అంటున్నారు.
ఆజాద్ జన్మస్థలంలో నాంది..
త్యాగధనుల సేవలను స్మరించుకుంటూ.. సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని భభ్రలో ‘70 సాల్ ఆజాదీ.. యాద్ కరో కుర్బానీ’ పేరిట ఓ ప్రచారోద్యమాన్ని ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితమే ‘క్విట్ ఇండియా వజ్రోత్సవాల’ సందర్భంగా ప్రారంభించారు. ఆజాద్ జన్మస్థలాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఇదే రీతిలో కేంద్రమంత్రులు కూడా సమరయోధుల స్వస్థలాలకు వెళ్లి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ జలియన్‌వాలా బాగ్ అమరులకు నివాళులర్పిస్తారు. మంత్రులు మనోహర్ పారికర్, స్మృతి ఇరానీలు సెల్యులర్ జైలు స్మారక కేంద్రం, సియాచిన్‌లను సందర్శించనున్నారు. మొత్తం 75 మంది కేంద్ర మంత్రులు సమరయోధుల జన్మస్థలాలను సందర్శిస్తారు. స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం ఉన్న అన్ని స్మారక కేంద్రాలను త్రివర్ణ కాంతులతో అలంకరిస్తారు. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా ప్రభాతభేరి, కాగడాల ప్రదర్శన, సమరయోధుల కుటుంబాలకు ఆత్మీయ పలకరింపు వంటి అంశాలు ఉంటాయి. 18వ తేదీన రక్షాబంధన్ సందర్భంగా మహిళా మంత్రులు దేశ సరిహద్దులకు వెళ్లి సైనికులకు రాఖీలు కడతారు. ఆకాశవాణి, దూరదర్శన్ సమరయోధుల ప్రసంగాలను ప్రసారం చేస్తాయి.
తిరంగా రెపరెపలతో.. ఘనమైన వారసత్వ సంపదతో.. మొక్కవోని భవిష్యత్ సంకల్పంతో భారతావని మున్ముందుకు దూసుకుపోతోంది..జై తిరంగా..జై త్రివర్ణ పతాక అంటూ జగతిని అలరించనుంది.
*