ఈ వారం కథ

పూలమనసులు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రమణి మేడమ్, మీ జడలో మల్లెపూలు ఎంత బాగున్నాయి? గుప్పెడే అయినా ఇంకా ఫ్రెష్‌గా ఉండి ఒకటే చక్కటి సువాసన వస్తోంది..’’ ప్రశంసించింది భువన నా జడ వంక చూస్తూ.

భోజన విరామ సమయం. కొలీగ్స్ అందరూ ఒకే దగ్గర చేరి భోజనం చేయటం, ఉన్న అరగంటలో కబుర్లు, కాకరకాయలూ పంచుకొని గబగబా లంచ్ చేసి, మళ్లీ విధులలో పడటం మాకు అలవాటూ, ఆనవాయితీ..
‘‘నిజం రమణీ.. చాలా బాగున్నాయి..’’ అన్నది దుర్గ. ఆ మాటలు వింటూ ఉంటే నా ముఖం ఉక్రోషంతో పొంగింది. ముఖం ఎర్రగా చేసుకున్నాను. ‘‘రోజు రోజుకీ మనుషుల్లో నిజాయితీ తగ్గిపోతోంది..’’ అన్నాను కొంచెం కోపంగా...
‘‘ఏమైంది?’’ అన్నారందరూ ఒకేసారి.
‘‘నిన్న మన ఆఫీస్ అయ్యాక పూలు కొనటానికి ఇటువైపు వెళ్లానా? మన కోఠీ సెంటర్లో వరుసగా అమ్మాయిలంతా పూలు పెట్టుకుని అమ్ముతూ ఉంటారు కదా.. బాగా చీకటి పడిపోయింది. ఈ మల్లెపూలు చూసి, మూర ఎంతో అడిగి, రెండు మూరలు ఇవ్వమని అడిగాను. పదిహేను రూపాయలు ఇచ్చేసాను కూడా. ఈలోగా ఒక యువజంట వచ్చి పూలు బేరమాడుతుంటే నాకు త్వరగా ఇవ్వమని, ఆటో దొరకదనీ నేను అడుగుతూ వుంటే వెంటనే పూలు కట్ చేసి ప్యాక్ చేసి నాకు ఇచ్చేసింది ఆమె. తీరా ఇంటికివచ్చి చూసేసరికి ఒక్క మూరే ఉన్నాయి తెలుసా? మరీ టూ మచ్ కదా...’’
‘‘అయ్యో అవునా? నిజమే టూమచ్ అండీ..’’ అన్నారు అందరూ కోరస్‌గా..
‘‘మరింకేం, ఈ రోజు వెళ్లి అడుగు..’’ అంది దుర్గ.
‘‘్ఛ, ఏం అడుగుతాం దుర్గా.. ఒక్క ఎనిమిది రూపాయల కోసం.. పోనీలే.. పేదామె కదా..’’ అన్నాను.
‘‘కాదులే, అడిగితేనే మంచిది రమణీ..’’ అన్నది రమాదేవి.. ‘‘ఇవి మూరెడు పూలా? ఇంత తక్కువున్నాయ్?’’ సందేహం వెలిబుచ్చింది భువన.
‘‘ఓహ్, అదా? మా ఇంట్లో నాకో పోటీదారుంది కదా, అసలు నేను పూలు ఎప్పుడో కొనను.. కొన్నా దేవుడికే వేసేస్తాను. నిన్న రాత్రి మా రాక్షసి పేచీ పెట్టింది తనకీ కావాలని.. స్కూలుకి ఎలాగూ పెట్టుకోనివ్వరు కదా.. అందుకే నిన్న రాత్రి రెండు జడలు వేయించుకుని పూలు పెట్టించుకుంది..’’ నా కూతురిని తలచుకొంటూ, నవ్వుకుంటూ చెప్పాను...
లంచ్ ముగియగానే ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డాము. ఈలోగానే హోరున వర్షం మొదలైంది. మా కోఠీలో వర్షం వస్తే దుకాణాలు అన్నీ బందే.. పాపం పళ్ళు, పూలు, కూరలు అమ్ముకునే హాకర్లు లబోదిబోమంటూ అన్నీ సర్దుకుని వెళ్లిపోతారు నిస్సహాయంగా.. ఏడున్నరకి వర్షంలో తడుస్తూనే ఆఫీసు వాకిట్లో ఆటోని పిలిచి, ఇంటికి బయలుదేరాను.
***
మా అపార్ట్‌మెంట్ దగ్గర ఆటో దిగి మెట్లు ఎక్కుతూ ఉంటే వెనకాలనుంచి వాచ్‌మాన్ మల్లేష్ ‘‘అమ్మా, మీరు చెత్త పైసలు ఇవ్వలేదు.. ఇస్తారా ఇప్పుడు?’’ అని అడిగాడు. ప్రతిరోజూ మా ఫ్లాట్స్‌లోంచి చెత్త కవర్లలో తీసుకుపోయి కింద చెత్త బండీ అబ్బాయికి ఇస్తాడు మల్లేష్. అందుకుగాను ప్రతీ ఇంటివారూ నెలకి యాభై రూపాయలు ఇవ్వాలి.
‘‘అదేమిటి మల్లేష్, నిన్న నువ్వు సాయంత్రం వచ్చి అడిగితే ఇచ్చానుగా? మరచిపోయావా?’’ అన్నాను ఆశ్చర్యంగా.
‘‘ఎప్పుడిచ్చారు? నేను నిన్నసలు పైకి రాలేదమ్మా.. జ్వరమొచ్చి పడుకున్నాను..’’ చెప్పాడు మల్లేష్. నాకు పిచ్చెక్కింది.. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడేస్తాడని అనుకోలేదసలు. నేనేమీ మాట్లాడకుండా మెట్లెక్కి వచ్చి ఇంట్లోకి వచ్చేసాను. ‘‘ఏమైంది రమణీ?’’ అన్నారు శ్రీవారు నా ముఖాన్ని పరికించి చూస్తూ.
జరిగింది చెప్పాక, ‘‘నీకు తెలియంది ఏముంది? నువ్వు ఇచ్చిన డబ్బుతో తాగేసి ఉంటాడు. అందుకని మళ్లీ అడుగుతున్నాడు.. సరేలే, యాభై రూపాయలే కదా, వాడికి నేనిస్తాలే..’’ అన్నారాయన.
‘‘యాభయ్యా వందా అని కాదండి.. నేను అసలు ఇవ్వలేదని వాడంటున్నాడు.. నాకు చాలా బాధ కలిగింది.. అసలు మీరు వాడికిక ఇవ్వకండి. డైరెక్ట్‌గా చెత్త తీసుకుపోయే మనిషికే ఇద్దాం..’’ అన్నాను.
‘‘అమ్మా అమ్మా, పూలు తెచ్చావా?’’ నా కారియర్ బాగ్ అందుకుని చూసిన రశ్మి ముఖంలో ఎంతో ఆశాభంగం...
‘‘ఏంట్రా పూలంటే ఇంత పిచ్చి నీకు? ఎప్పుడైనా పెట్టుకోవాలి.. రోజూ కాదు.. నీ హోమ్ వర్క్ అయిందా?’’ అంటూనే లోనికి నడిచాను..
‘‘నిన్న చెప్పాను కదా ఈ రోజు కూడా పూలు తెమ్మని? తేలేదెందుకు? ఊ.. నువ్వెప్పుడూ అంతే..’’ బుంగమూతి పెట్టుకొని చదువులో పడింది రశ్మి.
‘‘వర్షాకాలంలో నీకో మల్లెమొక్క తెచ్చిస్తాలే, కుండీలో పెంచుకుందువుగాని.. దాని పూలన్నీ అచ్చంగా నీకే.. సరేనా? పాలు తాగావా? పది నిమిషాల్లో వంట చేసేస్తానేం?’’ నవ్వి వంటింట్లోకి నడిచాను.
మర్నాడు ఉదయమే వాచ్‌మాన్ భార్య నాగమ్మ వచ్చి భర్త తరఫున క్షమాపణ చెప్పి ‘‘తాగుబోతు సచ్చినోడు.. అందరి తానా గిట్లనే చేస్తుండు. పొద్దుగాలనే ఒకటో నెంబర్ ఫ్లాటాయన కొట్టొచ్చిండు కూడానమ్మా.. ఏమనుకోకుండ్రి.. నేను ఈ రోజు చెత్తాయనకి పైసలు కట్టేస్త..’’ అని చెప్పింది.
‘‘ఇలా అయితే ఎలా నాగమ్మా.. మరీ దారుణంగా తాగేస్తున్నాడు, పైగా పైసలు తీసుకుని కూడా తీసుకోలేదంటూ బుకాయిస్తున్నాడు.. ఇలా అయితే చాలా కష్టం.. నిన్నూ, పిల్లల్ని చూసి ఉండనిస్తున్నాం.. లేకపోతే ఏనాడో తరిమేసి ఉండేవాళ్లం..’’ కటువుగా అన్నారు మావారు.
‘‘అవును.. పంపించేసి కొత్త వాచ్‌మాన్ పెట్టుకోవడం క్షణాలమీద పని.. కాని చదువుకుంటున్న పిల్లలు ఏమైపోతారు? అందుకే మిగిలినవాళ్ళు ఒప్పుకోకపోయినా సారు సెక్రటరీ కాబట్టి మేమే ఏదో నచ్చచెప్పి మేనేజ్ చేస్తున్నాం నాగమ్మా..’’ అన్నాను నేను. ‘ఔ అమ్మ మీ కాల్మొక్కుత..’ దణ్ణం పెట్టి వెళ్లిపోయింది.
‘‘మద్యపానం గట్టిగా నిషేధించాలి.. అది నేరంగా పరిగణించి, కఠినంగా శిక్షించాలి..’’ తనలో తానే అనుకుంటున్నట్టు అన్నారీయన.
‘‘అది సాధ్యంకాదులెండి.. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖలు ఇవే.. పైగా, ప్రతీచోటా ఏరులై పారేది అదే.. అంత మంచి బిజినెస్‌ని వీళ్ళు నిషేధించలేరు. పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉంటారు.. అది జరిగేది కాదు.. వీడిని మనం తిడుతున్నాం. అదే ఎదురింటి చంద్రకాంత్ మొన్న ఇంట్లోనే పార్టీ పెట్టుకున్నాడు.. ఏం చేయగలిగాం? అర్థరాత్రి దాటేవరకూ ఆ పాటలూ, ఫ్రెండ్స్ గోలా, ఆ వాసనా తలుపు మూసుకుని మరీ భరించలేదూ? కనీసం మన అభ్యంతరాన్ని చెప్పగలిగామా వాళ్ళకి? ఇది ఒక విషవలయం.. అంతే.. సరేమరి, నేను ఆఫీసుకు బయలుదేరుతున్నాను..’’
****
మసక చీకటి పడుతూ ఉండగా ఆఫీసులోంచి బయటకు వచ్చి పూల దుకాణాలవైపు నడిచాను. అక్కడ చివర కూర్చున్న ఆమెతో..‘‘ఏమ్మా, మొన్న పూలిచ్చావు..’’ అని అడుగుతూనే మాట మింగేశాను. ఎందుకంటే ఇపుడు అక్కడ ఓ ముసలామె ఉన్నది.. ‘‘అయ్యో, మొన్న పూలిచ్చింది నేను కాదమ్మా.. యాదమ్మ.. ఇయ్యాల ఆమె రాలే..’’ చెప్పింది అవ్వ. ఉక్రోషంగా పళ్ళు కొరుక్కుని, ఆ పక్కన దుకాణంలో పళ్ళు కొనుక్కుని ఇంటికి బయలుదేరాను.
ఇంటికి వచ్చి చూస్తే రశ్మికి పక్కలు వెచ్చబడి కొద్దిగా జ్వరం వచ్చి పడుకుని ఉంది. నాకు మనసంతా వికలమైపోయింది. ‘‘అరెరే, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళకపోయారా? ఏమిటో.. ఆంజనేయస్వామికి మొక్కు తీర్చనే లేదు. ఈ శనివారం అయినా వడమాల వేయించాలి..’’ అన్నాను కంగారు పడుతూ ఆయనతో..
‘‘అంత వర్రీ ఎందుకు రమణీ.. పిల్లలన్నాక జ్వరాలు రావా ఏమిటి? అయినా నేనూ ఇపుడే వచ్చాను. అది టాబ్లెట్ కూడా వేసుకుని పడుకుని ఉంది.. నిన్నంతా జలుబు చేసింది కదా... తగ్గిపోతుందిలే.. కాసేపాగి లేపి ఆవిరి పట్టించు. నేను వెళ్లి బ్రెడ్ తెస్తాను..’’ అన్నారు బయటకు వెళుతూ.. సరేనని తలూపి రశ్మి పక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్నాను. దాని తల నిమురుతూ.. తెల్లారేసరికి రశ్మికి జ్వరం తగ్గి వద్దంటున్న స్కూలుకు బయలుదేరిపోయింది.
***
‘‘ఇదేమైనా నీకు పద్ధతిగా ఉందా? మరీ అంత మోసం చేస్తావా?’’ మెత్తని గొంతుతోనే నిలదీసాను ఆ యాదమ్మ అనే పూలమ్మాయిని.. తల వంచుకుని పూలు మాలకట్టుకుంటున్న యాదమ్మ ఉలిక్కిపడి తలెత్తి చూసింది..
‘‘మోసమేందమ్మా?’’ అంది అయోమయంగా.
‘‘ఆ రోజు నేను నీ దగ్గర పూలు కొన్నాను కదా.. రెండు మూరల పూలు ఇవ్వమని పదిహేను రూపాయలు ఇచ్చాను. నువ్వేమో పటుక్కున ఒక్క మూరే తెంపి కవర్లో వేసిచ్చావు.. చీకటి కదా చూసుకోననా?’’
‘‘అయ్యో అట్లనా, ఎంత పనైంది? ఉండండి..’’ అంటూ అల్లిన మాలలోంచి ఒక మూర కట్ చేసి కవర్లో వేసి నాకు ఇచ్చేసింది. ‘జల్దీ జల్దీ ఇవ్వటంలో పొరపాటైందేమోనమ్మా.. ఆ దినం ఇంకెవరో అమ్మ కూడా మీరొచ్చినపడే వచ్చింది. ఆ యమ్మకి రెండు మూరలు ఇచ్చేసి ఉంటాను.. సారీ అమ్మా..’’ అంది నవ్వుతూనే...
పెద్ద షాక్.. ‘నాకు తెలీదు, గుర్తులేదు..’ అని దబాయిస్తుంది అనుకున్నాను. ఐదున్నర అడుగుల మనిషిని కాస్తా ఒక్కసారిగా ఐదు అంగుళాలకి కుంచించుకుపోయాను.. ఆప్ట్రాల్ ఒక్క ఎనిమిది రూపాయల కోసం ఎన్ని మాటలు అన్నాను ఈమెను? ‘పాపం పొరపాటు జరిగిందేమో’ అని కూడా అనుకోలేదు. ఆ ఎనిమిది రూపాయలతో మేడ కడతానా? పెద్ద నేనే ఏదో సిన్సియర్ అయినట్టు.. మిగిలిన వాళ్లంతా పాపులు, నేరస్థులు అయినట్టు పెద్ద బిల్డప్పు ఇచ్చాను కదా.. వాడేదో ఆ మల్లేష్ తాగుడు మైకంలో అబద్ధాలు ఆడితే నా ఇంటెగ్రిటీ అంతా నాశనమైపోయినట్టే బాధపడిపోయా కదా.. ఒక్కసారిగా నన్ను ఆవరించి ఉన్న అహంకారమంతా పటాపంచలు అయిపోయినట్టు అనిపించింది నాకు...
‘‘మీ యసుంటోర్ని మోసం జేస్తే మంచి జరుగుతదా మేడమ్.. ఏ జనమలో ఏం పాపం జేసిన్నో గాని నా కొడుక్కి పోలియో వచ్చింది.. రెండు కిలోల పూలు కొని మాలలు కట్టి అమ్మితే రోజుకు రెండు వందలు కూడా మిగలవు. వాన కురిసినా, పోలీసోళ్లు వచ్చి ఎల్లగొట్టినా ఇడిపూలూ, మాలలూ కూడ దండగే ఐతాయి.. ఈ దినవుండి రేపటికి వాడిపోయి చెత్త కుప్పలో ఇసిరేసే పూల తాన తమర్ని మోసం చేస్తే నా కళ్ళు పోవా అమ్మా?’’ అన్నది యాదమ్మ..
‘‘అయ్యో, సారీ యాదమ్మా.. నేనే పొరపాటు పడ్డాను.. నీ కష్టం ఉంచుకోను.. ఇదిగో నీ డబ్బులు.. పైగా ఆ రోజు నువ్వు వేరే అమ్మాయికి రెండు మూరలు ఇచ్చేసావు కదా..’’ అని వద్దన్నా పది రూపాయలు చేతిలో పెట్టేశాను. యాదమ్మ మొహమాటపడుతూ ఉంటే ‘‘పోనీలే, నీ కొడుక్కి బిస్కట్లు కొనుక్కుని వెళ్ళు.’’ అని చెప్పి ‘‘రేపటి నుండి రోజూ ఐదు మూరల పూలు తీసుకుంటాను నీ దగ్గరే.. మరి వస్తాను..’’ అని బయలుదేరాను ఇంటికి...
మర్నాటినుంచీ నా కారియర్ బాగ్‌లో పూల పొట్లాం చూస్తున్న నా కూతురి ఆనందానికి అవధులు లేవు.. ఆశ్చర్యంగా చూస్తున్న రశ్మితో అన్నాను.. ‘దేవుడికీ, మనకీ పూవులు.. పూల యాదమ్మకేమో పైసలు..’’ అని యాదమ్మ గురించి, ఆమె కొడుకు గురించీ చెప్పాను...
‘‘అవునమ్మా, మనం దేవుడికి పూలు వేస్తే, ఆయన యాదమ్మ కొడుక్కి తగ్గిపోయేలా చేస్తాడు కదూ..’’ రశ్మి మాటలకి చెమ్మగిల్లిన కళ్ళతో దాన్ని దగ్గరగా తీసుకున్నాను.
*
- నండూరి సుందరీ నాగమణి

రచయిత్రి సెల్ నెం:9849989201

- నండూరి సుందరీ నాగమణి