ఈ వారం కథ

తన కోపమె... (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ పార్కు ఉదయం సాయంత్రం వాకర్స్‌తో బాగా సందడిగా వుంటుంది. ఏ యోగా గురువు చెప్పని సొంత విన్యాసాలు చేసే వాళ్ళు, పది నిముషాలే నడిచి మిగిలిన యాభై నిముషాలూ కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్ళు, నడిచినంతసేపూ సెల్‌ఫోన్‌లో మాట్లాడేవాళ్ళు అక్కడ తారసపడతారు. కానీ నడకతోపాటు నడవడిలో కూడా సాధన చేస్తూ ఓ ఆరుగురు అక్కడున్నారు.

రోజూలాగే ఆ సాయంత్రం ఆరు పదులు దాటినా ఇంకా యువకుల్లా హుషారుగా ఉన్న ఆ ఆరుగురు మిత్రులు నడక తరువాత తాము రోజూ కూర్చునే బెంచీలపై కూర్చున్నారు. ఇవాళ వారితో ఒక క్రొత్త వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ ఆరుగురిలో ఒకరి బంధువు. పేరు పురుషోత్తం. కలివిడి మనిషి. అందర్నీ పరిచయం చేసుకుని గలగలా మాట్లాడుతున్నాడు. భారతదేశంలోని మొత్తం ప్రముఖ దేవాలయాలు చూశాట్ట. అన్ని నదుల్లో మునిగాట్ట. అన్ని ఆశ్రమాలూ తిరిగాట్ట, అన్ని గ్రంధాలూ తిరగేశాట్ట.
జడమైన శరీరం గురించి, అందరిలో వున్న ఆత్మ గురించి హరిష్వర్గాల నియంత్రణ గురించి, అనర్గళంగా ఉపన్యాసం చెప్పాడు. ఆ ఆరుగురే కాక దారినపోయే మరో పదిమంది కూడా నిలబడి శ్రద్ధగా విన్నారు. అందరూ మెచ్చుకోలుగా చప్పట్లు కొట్టారు. ఇక ఇళ్ళకు వెళ్ళే వేళయింది.
ఆరుగురిలో శివయ్య అనే అతను ‘‘పురుషోత్తంగారు! మీతో పరిచయం చాలా సంతోషంగా ఉంది. మీరు మా జట్టులో చేరాలి. మా ఇల్లు అదుగో ఆ ప్రక్క వీధిలో వినాయకుడి గుడి ప్రక్కనే. ఈ శుభ తరుణంలో రేపు ఉదయం సరదాగా మా ఇంటికి రండి, కాఫీ త్రాగి ఇద్దరం కలిసి ఇక్కడకు వద్దాం! ఏమంటారు?’’ అన్నాడు చిరునవ్వుతో.
‘‘దాందేముంది! అలాగే. సరిగ్గా ఉదయం ఆరయ్యేసరికి గుడి దగ్గరుంటా’’ అన్నాడు.
‘‘్థంక్యూ, నేను బయట మీ కోసం ఎదురుచూస్తుంటా’’ అన్నాడు శివయ్య.
అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు.
తరువాత రోజు సరిగ్గా ఉదయం ఆరు గంటలకు అక్కడకు చేరాడు పురుషోత్తం. అక్కడే నిలుచుని ఉన్న శివయ్య అతన్ని పలకరించి ప్రక్క వీధిలో ఉన్న తనింటికి తీసుకెళ్లాడు.
ఇద్దరూ తలుపు దగ్గరకు వెళ్లారు. శివయ్య తలుపు కొట్టాడు. పది నిముషాల వరకూ తలుపు తెరుచుకోలేదు. ‘‘ఇదేంటి?’’ అనుకున్నాడు పురుషోత్తం.
‘‘మళ్లీ ఈ గడపదాటి బయటికొచ్చేదాకా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి’’ అన్నాడు శివయ్య. పురుషోత్తం అతనివైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
అంతలో శివయ్య భార్య తలుపు తెరిచి వీళ్ళ వైపు చూడకుండానే లోపలికి వెళ్లింది. ‘‘దుర్గా! ఇవాళ మనింటికి ఒక క్రొత్త స్నేహితుణ్ణి తీసుకొస్తానన్నానే! వీరే పురుషోత్తంగారు’’ అన్నాడు. ‘‘సర్లే! అప్పుడప్పుడూ ఉండేదేగా ఈ గోల’’ అని ఆమె నసుక్కోవడం ఇద్దరికీ బాగా వినపడింది. పురుషోత్తంకి ఆమె ఎవరి గురించో అన్నదా తన గురించేనా అర్థంకాలేదు.
అక్కడ కాస్త ఉక్కపోస్తున్నది. శివయ్యకు ఫ్యాన్ స్విచ్ వేసే ఆలోచన తట్టలేదేమో అనుకున్నాడు పురుషోత్తం.
తరువాత కాసేపు మాటలు లేవు. ఇంతలో శివయ్య సెల్‌ఫోన్ మ్రోగింది. అది పట్టుకొని ఎవరితోనో బాతాకానీ మొదలుపెట్టాడు. పురుషోత్తానికి కాస్త చిరాకు మొదలయింది. ఒక పావు గంట తరువాత మాట్లాడటం ఆపి ‘‘దుర్గా! మాకు కాఫీ తీసుకరా!’’ అన్నాడు. ఆమె రెండు కప్పుల కాఫీ అక్కడ పెట్టి వెళ్లింది. ఆమె వైపు చూసి మర్యాదపూర్వకంగా నవ్వాడు పురుషోత్తం. ఆమె చూసి చూడనట్లు వెళ్లిపోయింది.
పురుషోత్తానికి చిరాకు మరికాస్త పెరిగింది. ఏమిటి ఈ నిర్లక్ష్యం? అనుకున్నాడు. కాస్త తమాయించుకొని కాఫీ కప్పు అందుకున్నాడు. ఇద్దరూ నోటి కందుకొని కాఫీ చప్పరించారు. చల్లగా వుంది. చక్కెర కూడా సరిపోలేదు.
‘‘కాఫీలో చక్కెర సరిపోయినట్లు లేదు, పైగా చల్లగా కూడా వుంది’’ అన్నాడు శివయ్య, భార్యతో. ‘‘దాదాపుగా మీ స్నేహితులందరూ షుగర్ పేషెంట్లేగా, ఫరవాలేదులే! ఇక ఆ ఎంగిలి కాఫీలను వేడిచెయ్యాలంటే నాకు చిరాకు, పైగా బోల్డంత పనుంది’’ అన్నది విసుగ్గా. పురుషోత్తం నివ్వెరపోయాడు. శివయ్య మాత్రం మామూలుగానే ఉన్నాడు.
అంతలో అక్కడికి శివయ్య కొడుచ్చాడు. తాటిచెట్టంతున్నాడు. నోట్లో బ్రెష్, నోటినిండా నురుగు. ‘‘ఒరేయ్! వీరు పురుషోత్తంగారు’’ పరిచయం చేశాడు శివయ్య. అతను తల కూడా త్రిప్పకుండా వెళ్లిపోయాడు.
మరి కాసేపటికి చీపురు పట్టుకొని దుర్గ వచ్చింది. ఇద్దరు మనుషులు అక్కడున్నారని కూడా చూడకుండా చీపురుతో దాదాపూ వాళ్లిద్దరి కాళ్లకు తగిలేట్లు చిమ్ముకుంటూ వెళ్లింది. పురుషోత్తానికి చిరాకు మరో రెండు పాయింట్లు పెరిగింది.
‘‘లోపలికొచ్చేప్పుడు ప్రశాంతంగా ఉండమని శివయ్య ఎందుకు చెప్పాడు? వీళ్లింట్లో అందరూ నిర్లక్ష్యం వ్యవహరిస్తారనా? అలాంటప్పుడు ఎందుకు ఇక్కడికి రమ్మని పిలవడం? ఏమిటో అనవసరంగా వచ్చినట్లయ్యింది’’ అనుకున్నాడు. ఇంక అక్కడ ఉండ బుద్ధి కాలేదు.‘‘వెళదామా మరి’’ అన్నాడు శివయ్యతో.
‘‘సారీ నాక్కొచెం పని పడింది రాలేను, మీరెళ్ళండి’’ అన్నాడు కాస్త నిర్లక్ష్యంగా. ఈసారి పురుషోత్తానికి కోపమొచ్చింది. ‘‘వాట్ ఆల్ దిస్ శివయ్యగారు? కొత్తగా పరిచయమైనారు కాబట్టి సరిపోయింది! లేకుంటే బుద్ధి చెప్పాల్సొచ్చేది!’’ అంటూ వెళ్లిపోయాడు.
పురుషోత్తం పార్కులో మిత్రుల దగ్గరకు వెళ్ళేసరికి వాళ్ళు ఇతని కోసమే ఎదురుచూస్తున్నట్లుగా ఉన్నారు. కాస్త ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. అది చూసి పురుషోత్తానికి ఇంకాస్త ఒళ్ళు మండింది. ఏమైయింది? ఇవాళ అందరూ అదోలా ప్రవర్తిస్తున్నారు?’’ అన్నాడు కాస్త చిరాగ్గా.
అందరూ మరోసారి పెద్దగా నవ్వి అతన్ని చేయి పట్టుకొని తమ మధ్య కూర్చోబెట్టుకున్నారు. అంతలో శివయ్య వచ్చాడు. వస్తూనే ‘‘సారీ పురుషోత్తంగారు, ఇందాక మా ఇంట్లో జరిగిందంతా ఒక ప్రవేశ పరీక్ష. అప్పట్లో అదుగో ఆ ఇద్దరైతే నన్ను నానామాటలని అన్నారు. మీరు చాలా నయం’’ అన్నాడు. పురుషోత్తానికి పూర్తిగా విషయం అర్థంకాక ‘‘ఇంటికి పిలిచి ఇదేం పరీక్ష మహానుభావా? కాస్త విశదపరచండి’’ అన్నాడు.
‘‘నిన్న మీరు చెప్పిన అరిషడ్వర్గాల్లో మేము క్రోధాన్ని ఎంచుకున్నాం. దాన్ని జయించటం సంగతి ఎట్లున్నా కనీసం అదుపులో పెట్టి ఈ వయసులో కాస్త మనశ్శాంతిని పొందుదామని ప్రయత్నిస్తున్నాం.
ఈ ప్రోగ్రాం మా ఆరుగురికీ ఒక్కోవారం ఒక్కో ఇంట్లో పెడతాం. ఒక్క మాటలో చెప్పాలంటే పనిగట్టుకొని వెళ్లి నిర్లక్ష్యానికి, కాస్త అవమానానికి గురై రావటం అన్నమాట. మేము తెలిసే వెళ్లినా కొంత చిరాకు కలుగుతుంది. ఈ సాధనవల్ల అలాంటి సంఘటనలు నిజంగా ఎదురైనప్పుడు ఉండాల్సిన దానికంటే ఆ కోపం స్థాయి తక్కువగా ఉంటున్నదని మాకు నమ్మకం కలిగింది. ఈ పరీక్షలు చాలా సహజంగా నిర్వహిస్తాం. ఒకసారి కాఫీ, మరోసారి భోజనాలు, మరోసారి ఏదో విషయంమీద చర్చ పెట్టి మాట్లాడే వాళ్ళకు అడ్డుతగులుతూ, కించపరుస్తూ ఉండటం. ఇలా కొన్ని ప్రక్రియలు కనిపెట్టి అమలు చేస్తున్నాం.
‘తన కోపమె తన శత్రువు’ మాత్రమే కాదు, అవతలవాళ్ళ కోపం కూడా మనకు శత్రువే. మన మనశ్శాంతిని ఎవరూ పాడుచెయ్యకుండా చూసుకోవడం ప్రధానాంశం అన్నమాట.
ఈ సాధన ముఖ్యంగా మూడు అలవాట్లతో ప్రారంభం అవుతుంది. అవేమంటే ఇంట్లోగానీ బయటగానీ ఏ ఇద్దరి సంభాషణల్లో తలదూర్చకపోవడం, అడగనిదే ఎవరికీ సలహా ఇవ్వకపోవడం. ఇదుగో ఇలా రోజూ తప్పకుండా వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం.
ఈ వయసులో ఈ మాత్రం జాగ్రత్త పడకపోతే చివరి అంకం చీదరింపులతో ముగుస్తుంది కదండీ! అని చెప్పడం ముగించాడు.
అప్పటిదాకా శ్రద్ధగా విన్న పురుషోత్తం ‘‘నడక మాత్రమే కాకుండా ఆసక్తికరమైన సాధన కూడా చేస్తున్నారన్నమాట. అయితే ఇంతకీ నేను పరీక్షలో పాసైనట్లా లేదా?’’ అని అడిగాడు.
‘‘ఆరోజు మీ ముఖంలో మారాల్సిన అన్ని రంగులూ మారలేదు కనుక పాసైనట్లే. ఇక మీరూ మా జట్టులో చేరినట్లే! మరో సంగతి ఈ జట్టులో అందరు భార్యామణులు కూడా సభ్యులే. అదుగో అక్కడ ఉన్నారు చూడండి’’ అని చూపించాడు. వాళ్ళు ఇటుగా వచ్చారు. శివయ్య భార్య ‘‘సారీ అన్నయ్యగారూ! ఈసారి వచ్చినపుడు మీకు తప్పక మంచి కాఫీ ఇస్తాను’’ అన్నది. ‘‘ఏది అసలో ఏది నాటకమో తెలిసేదెట్లా?’’ అన్నాడు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి. అందరూ పెద్దగా నవ్వి ఇంటిదారి పట్టారు. *

రచయిత సెల్ నెం:9849239945

-భమరాజు వెంకటరమణ