మెయిన్ ఫీచర్

అమ్మానాన్నలే ఆదర్శం కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లు ఆహ్లాదకరంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు ముందుగా మానసిక ఆరోగ్యవంతురాలుగా ఉండాలి కదా! అప్పుడే ఆ కుటుంబంలోని సభ్యులంతా ఉత్తములుగా ఎదుగుతారు. ‘సంస్కారం’ అనే బండి సజావుగా ముందుకువెళ్ళాలంటే తల్లీదండ్రులు బుద్ధిమంతులై ఉండాలి.

* తమిళనాడులో ప్రిన్సివా అనే ఉపాధ్యాయురాలిపై ప్రేమించానంటూ ఒకడు వేధించాడు. ఆమె తిరస్కరించడంతో ఆ వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. తర్వాత తనూ ఆత్మహత్యకు ఒడికట్టాడు.
* ఇదే రాష్ట్రంలో ఇటువంటిదే మరో దుర్ఘటన... తిరుచ్చి జిల్లాలో పిచ్చాండవర్ కోవిల్ ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థిని మోనికా (21) అదే ప్రాంతానికి చెందిన బాలమురుగన్ (26) రెండేళ్ళ క్రిందట మనస్సులు పంచుకున్నారు. మోనికా తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ప్రేమపక్షులు ఆత్మహత్యాయత్నం. కొద్ది రోజులు పరిస్థితి సద్దుమణిగింది. అయినా ప్రియుడు వెంటపడ్డాడు. కాదన్న ఆమెపై అప్పటికే విషం తాగిన బాలమురుగన్ కత్తితో దాడి చేశాడు.
* ఈ సంఘటన మరీ దారుణం! అభం శుభం తెలియని చిన్నారులను దత్తత తీసుకున్న ఆ దత్తత తండ్రి ఆ ముగ్గురి బాలికలపై ఏళ్ళ తరబడి అత్యాచారానికి ఒడిగట్టాడు. మళ్లీ ఆ వ్యక్తి చదువులో తక్కువేమీ కాదు. మాజీ శాస్తవ్రేత్త. 72 ఏళ్ల మక్సూద్ అన్సారీ! రెండు వివాహాలు చేసుకున్న అన్సారీ సంతానం లేకపోవడంతో వీరిని దత్తత తీసుకుని, సభ్య సమాజం తలదించుకునేలా ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో ఎన్నో.. ఎనె్నన్నో..
సమాజంలోని మహిళలు, ఆడపిల్లలపై సాగుతున్న ఇటువంటి దాడులు రోజురోజూకూ పెరిగిపోతూ దిగ్భ్రాంతిని కలగజేస్తున్నాయి. 2015కి సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాలు 2,37,394గా నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తున్నామని జబ్బలు చరచుకుంటున్న తరుణంలో పై గణాంకాలు సిగ్గుపడేలా చేస్తున్నాయి.
తల్లిదండ్రులకు మొదటి ఆస్తి.. పిల్లలే కదా! అందుకే పిల్లల పెంపకంపై మరింత శ్రద్ధ వహించాల్సి వుంది. ఇది తల్లిదండ్రులకు ఉండాల్సిన మొదటి బాధ్యత. ఒకవేళ ఆ తల్లిదండ్రులే నిరక్షరాస్యులైతే ఈ బాధ్యత పాఠశాలల్లోని గురులది లేదా స్వచ్ఛంద సంస్థలు/ ప్రభుత్వానిది అవుతుంది. నిజానికి బిడ్డ ప్రవర్తన, బుద్ధికి సంబంధించిన వ్యవహరాలన్నీ 80 శాతం వరకు గర్భంలోనే జరిగిపోతాయని పూర్వీకులు చెబుతున్నారు. పుట్టే బిడ్డ ఆది నుంచి ఉత్తమ వ్యిక్తిత్వం కలిగివుండి, విధేయతగా నడుచుకోవాలంటే గర్భంలో వుండేటప్పుడే ఆధ్యాత్మిక బోధన జరగాలి. అంటే ఆ కాబోయే తల్లికి నీతి కథలు, నైతిక విలువలు వివరించాలి. పురాణాలు, భగవద్గీత వంటివి స్నేహపూరిత వాతావరణంలో చెబుతుండాలి.
తల్లికి ఏ ఆపద లేకుండా ప్రసవం జరగాలంటే అలాగే బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలంటే వైద్యం ఎంత అవసరమో- ఆ బిడ్డ మానసిక ఆరోగ్యంగా ఈ లోకంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే గర్భంలో ఉండేటపుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది. మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెతలా మొదటినుంచి జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధ వహించిన తల్లిదండ్రులు బిడ్డ పుట్టి, స్వాతంత్రుడైనప్పుడు ఈ సమాజానికి లేదా తల్లిదండ్రులకు మేలు కలుగజేయాలని, ఉద్ధరించాలని, తోటివారిని ఆదుకోవాలని ఆశపడడం అత్యాసే అవుతుంది.
నేటి కాలంలో సిజేరియన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే పుట్టబోయే శిశువు తల్లిదండ్రులు అనుకొన్నంత గొప్పవాడిగా ఉండాలని, కోరుకున్న మంచి లక్షణాలతో ఉండాలని అనుకొనేవారంతా పండితుల, జ్ఞానుల అభిప్రాయాలను తెలుసుకుని మంచి ముహూర్తంలో జన్మిస్తే ఆ తిథి వార నక్షత్రాల ప్రభావంతో తమ పుత్రుడో పుత్రికనో తిరుగులేని మేటి వీరులు అవుతారన్న సదాశయంతో ఈ విధంగా చేస్తున్నారని మనం అక్కడక్కడా వింటూ వుంటాం. కానీ వీళ్ళు ఉత్తినే ఇలా తాపత్రయం పడడం లేదన్న సంగతి మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఈ సంగతి మన పురాణాల్లో కూడా కనిపిస్తోంది.
రాక్షసులకు రాక్షసులు, జంతువులకు జంతువులు పుట్టినట్లుగానే మనుషులకు మనుషులే పుడతారనేది నిత్యసత్యం.
కడుపులో ఉండగానే సాటిలేని మేటి వీరులుగా ఎదగడానికి, ఉత్తములుగా, అత్యంత జ్ఞాన సంపన్నులుగా పుట్టడానికి, పుట్టకముందే అంటే తల్లి కడుపులో ఉండగానే దానికి కావలసిన వ్యవహారాలన్నీ పకడ్బందీగా చేయవచ్చు. ఇలా గర్భంలో ఉన్నపుడు సకల జాగ్రత్తలు తీసుకున్నాక ఆ బిడ్డ పుట్టాక మంచి వాతావరణంలో సాకాలి. ఉత్తమ పాఠశాలలో వేసి, ఆధ్యాత్మిక గ్రంథాలను పరిచయం చేయాలి. నిజానికి ఆ విద్యార్థి ఆ వయస్సులో వాటిని పఠించడు. కానీ మొదటిసారిగా తన కంటితో తిలకిస్తాడు. ఆ బొమ్మలతో భగవంతుని దివ్య దర్శనాన్ని పొందుతాడు. మళ్లీ తన మెదడులో మరోసారి ముద్రించుకుంటాడు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకుని, ఆ భగవంతుని లీలలను ఈ గ్రంథాల ద్వారా అవగతం చేసుకుంటాడు. అలా ఆ విద్యార్థిని కల్మషం లేని తన మనస్సు ఆ దశ నుంచే ఆధ్యాత్మిక భావాలపై తనకు తెలియకుండానే మళ్లుతుంది. ఉత్తమ జీవనాన్ని అందించే సంస్కృతీ సంప్రదాయాలు అలవడుతాయి. ఆ వ్యక్తి నుంచి లోకానికి కొండంత ప్రయోజనాన్ని ఆశించవచ్చు.
ఇల్లాలు మానసిక ఆరోగ్యవంతురాలుగా ఉండాలి
యువతీ యువకుల్లో పాశ్చాత్య సంస్కృతి ఇపుడు విషం కక్కుతోంది. ఆ విషపు కోరల్లో ఎందరో చిక్కుకుని బలైపోతున్నారు. మరీ ముఖ్యంగా కొంతమంది మహిళలు. ‘సంస్కారం’ అనే బండి సజావుగా ముందుకువెళ్ళాలంటే తల్లీదండ్రులు బుద్ధిమంతులై ఉండాలి. సంప్రదాయబద్ధంగా తాము నడుచుకుంటూ వేళకు పనులు చేస్తూ తమ పిల్లలకు ఆదర్శవంతులుగా కనిపించాలి.
వయస్సు పెరుగుతున్న పిల్లలు తల్లిదండ్రుల అలవాట్లను తమకు తెలియకుండానే గమనిస్తుంటారు. అందుకే పెద్దలంటారు- చిన్న పిల్లల ముందు దంపతులు కీచులాడుకోవద్దని. సమాజానికి, తనకు ఉపయోగపడే విషయాలవైపు పిల్లలను ఎదగనీయాలి. వారు సంస్కారవంతులు అవుతారు.
ఇతరులకు మార్గదర్శకులుగా నిలుస్తారు. పై న ప్రస్తావించిన వేధింపులు, అఘయిత్యాలు ఉత్పన్నం కావు. లోకమంతా హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- జి.కల్యాణి