ఈ వారం కథ

పతియే ప్రతిపక్ష దైవం! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపురం లాంటి మొగుడని మురిసిపోతూ మొగలి పువ్వులా గుబాళిస్తూ, గులాబీ పువ్వులా నవ్వుతూ, జిలేబీ చుట్టలాంటి జుట్టుతో, కిలాకిలా రావాలతో కొత్తగా కాపురానికొచ్చింది పురం. ఆమె అసలు పేరు త్రిపుర. అందరూ ‘పురం’ అని పిలుస్తుంటారు. ‘పురం.. నీ పుట్టింట్లోలా నీ ఇష్టం వచ్చినట్లు చలాయించడానికి ఇక్కడ వీలు లేదు. ఇక్కడ నామాటే చెల్లుబాటు. నేనెలా చెబితే అలా నడుచుకుంటే నిన్ను నవనీతంలా చూసుకుంటా. లేకపోతే నీ కాపురానికి చరమగీతం పాడుతా..సరేనా?’ హెచ్చరిస్తున్న స్వరంతో చెప్పింది భాగ్యం.
‘అత్తయ్య గారూ! పెద్దల్ని గౌరవించడం, వారు చెప్పినట్లు నడుచుకోవడం నాకలవాటే. మీకా అనుమానం అక్కర్లేదు. మీ అబ్బాయి మాట అసలు వినను. మీ మాటే నాకు పూలబాట. స్వేచ్ఛాజీవిలా జీవించడం స్వార్థమవుతుంది. ‘స్వచ్ఛ్భారత్’లో దేశాన్ని శుభ్రం చేసినట్లు, మన ఇంటినీ, మీ వంటినీ శుభ్రం చేస్తా.. బాత్‌రూమ్‌కు వస్తారా..స్నానం చేయిస్తా..’ అంది పురం.
‘నిన్ను చూడగానే అనుకున్నా.. అణకువైన పిల్లవేనని. మా అబ్బాయి నా మాటే వింటాడు. అన్నావదినల మాటల్ని, అక్కచెల్లెళ్ల మాటల్ని నమ్ముతూ.. వాళ్లు చెప్పినట్లు మా అబ్బాయి పడుంటాడు. అందుకే మా వాళ్ళంతా వాడిని ‘నోట్లో నాలుక లేనివాడు, నెమ్మదైనవాడు’ అని మెచ్చుకొంటారు. సరే.. పొద్దుపోయింది పడుకో. నా స్నానం, తిండీ తిప్పలూ అన్నీ అయినయ్’ అంది భాగ్యం.
‘ఏమి దౌర్భాగ్యంరా నాయనా..!’ అనుకొంటూ పడక గదిలోకి చేరింది పురం. అప్పటికే లైటార్పి నిద్రస్తున్న భర్తను చూసి, తనూ ఓ పక్కకు ఒదిగి పడుకుంది- తన చిటికెన వేలు కూడా అతనికి తగలనీయకుండా. కాసేపటికే తలుపుతట్టిన శబ్దం విని, లేచి వెళ్లి తలుపు తీసింది పురం.
‘తలుపుగడియ పెట్టి పడుకోకు. ఒక్కోసారి నే పిలిస్తే మీకు వినబడదు. తలుపుకొడితే వాడు ఉలిక్కిపడి లేస్తాడు. వాడికి మొదట్నుంచీ హాయిగా పడుకొనే అలవాటు..’ అంటూ ఆవలిస్తూ వెళ్లింది అత్తగారు.
‘ఇదేం కంపరం పుట్టే కాపురం రా బాబూ!’ అనుకొంటూ తలుపు బార్లా తీసి, పక్క పైకెళ్లి బోర్లాపడుకుంది. పురం భర్త అసలు పేరు పరంధామ్. అందరూ ‘పరం’ అనే పిలుస్తుంటారు.
ఇంతలో మళ్లీ భాగ్యం వచ్చి-‘అన్నట్లు మరిచాను.. రోజూ నన్ను మార్నింగ్ వాక్‌కు తీసుకెళ్లాలి సరేనా’ అని చెప్పి వెళ్లింది. అత్తగారు మాట్లాడే ప్రతి మాటకూ వాంతి అయ్యేలా అనిపిస్తోంది పురానికి. నిజంగానే వాంతి చేసుకొంటే, అందరూ వేవిళ్ళని అపోహపడతారేమోనని బలవంతంగా ఆపుకుంటోంది. అయినా ఇంతవరకూ ఒక్కసారైనా ఆ పరం, ఈ పురాన్ని తన పరం చేసుకొన్నది లేదు. తొలిరాత్రి మటుకు ఏదో సినిమా సీనులా ముగించాడు. బంధుమిత్రుల కోసం ఆపసోపాలు పడుతూ, అమ్మనూ, అక్కచెల్లెళ్లనూ చూసి బెదిరిపోతూ.
***
భాగ్యం ఆజ్ఞానుసారం పొద్దునే్న లేచి, ఆమెను తీసుకొని మార్నింగ్ వాక్‌కు బయల్దేరింది పురం. చైన్ స్నాచర్లు ఎక్కువయ్యారన్న వార్తలతో ఒక్క బంగారం ముక్క కూడా వొంటిపైన లేకుండా, పరమ బీదవాళ్ల లాగ బిక్కుబిక్కుమంటూ వాకింగ్ చేస్తున్నారు అత్తాకోడళ్ళిద్దరూ.
‘ఈ చల్లగాలికి వాకింగ్ చేస్తుంటే ఎంతో హాయిగా వుంది కదూ’ అంది భాగ్యం.
‘అవును.. నాకైతే హాయిగా నిద్రపోవాలనుంది’ అంది పురం ఆవులిస్తూ! ‘ఏంటి.. రాత్రంతా నిద్రపోలేదా?’ అనుమానంగా అంది భాగ్యం.
‘అయితే..ఇది రాత్రంతా మావాడితో బాగానే సుఖపడిందన్నమాట. ఎంతసేపని తను కాపలా కాస్తుంది. అక్కడికీ అర్ధరాత్రి 12 వరకూ ఓ కన్నటేసి చూస్తూనే వుంది. ఇలాగైతే మావాడు పూర్తిగా దీని మోజులో పడి, నన్నో దిక్కుమాలిన దానిలా చూస్తాడు. అబ్బాయిని అదుపులో పెట్టాలి. లేకపోతే నన్నో కుదుపు కుదిపి ఏ వృద్ధాశ్రమంలోనో పడేస్తాడు. అయినా- తనకేం ఫర్వాలేదు.. బోలెడు ఆస్తి వుంది. పింఛనూ వస్తోంది. ఇంటి యజమానురాలిని గనుక నా మాటే నెగ్గాలి..’ అనుకుంటూ నడుస్తోంది భాగ్యం.
‘ఏంటత్తయ్యగారూ! ఉన్నట్లుండి ఏదోలా అయిపోయారు. ఏదైనా మంచి పథకం ఆలోచిస్తున్నారా? మెరుగైన ఆరోగ్యం కోసం. ఈ మార్నింగ్ వాక్కే బెటరంటారా?’ అంది పురం.
‘అబ్బే ఏం లేదు.. కొత్త కోడళ్ళు కొత్తలో నిద్రమొహల్లానే ఉంటారు.. రాత్రిళ్ళు నిద్రుండదుగా. కొన్నాళ్ళు పోయాకగానీ ముద్దుమొహాల్లా వుండరు. ఇది మామూలే!’ అంది కొంచెం కోడల్ని అసూయగా చూస్తూ భాగ్యం.
‘మీవన్నీ ఎంతో అనుభవంతో చెప్పే మాటలు. ఎంతైనా నా పతికి మాతృమూర్తులు’ కాస్త పొగిడింది పురం. దాంతో పొంగిపోయింది భాగ్యం.
అలా నడుస్తుండగానే ఓ పార్కు వచ్చింది. కాసేపుమార్నింగ్ వాక్ చేశాక బయటకు వచ్చారు. అక్కడ తాజా ఆకుకూరల్ని కొనుక్కొని ఇంటి ముఖం పట్టారు అత్తాకోడళ్ళిద్దరూ- లోపలున్న భావాలను బైటకు కనబడనీయకుండా.
***
పరం స్నానం ముగించుకొని హాల్లోకి రాగానే అత్తాకోడళ్ళిద్దరూ లోపలికొచ్చారు. పురం వంటింట్లోకెళ్లింది. భాగ్యం హాల్లోనే ఓ సోఫాలో కూలబడి, పేపరు తిరగేస్తుడగా ఓ వార్త ఆమెను ఆకర్షించింది.
‘కట్నం ఇంకా తెమ్మని భర్త వేధింపులు.. మరో పెళ్లి చేసుకోమని అతగాడిపై అత్త,ఆడపడుచుల ఒత్తిళ్లు.. దీంతో విసిగి వేసారి నవవధువు ఆత్మహత్య.. అత్తింటి అఘాయిత్యాలకు భయపడని మరో వధువు.. కత్తిపీటతో వాళ్లందర్నీ హత్య చేసి..’- ఇలాంటి వార్తలు చదివాక- క్షణకాలం వౌనంగా ఉండిపోయింది దిగాలుపడిన భాగ్యం.
పరం తన గదిలోకి వెళ్లి డ్రెస్సు వేసుకోగానే, పురం ముందుగా అతడికి, ఆ తర్వాత అత్తగారికి టిఫిన్ తెచ్చి ఇచ్చింది.
‘చూడు పురం.. మావాడికి మాతృభక్తి ఎక్కువ. ముందుగా టిఫిన్ నాకిచ్చిన తరువాతే వాడికివ్వడం అలవాటు చేసుకో’ అంది భాగ్యం.
‘అలాగే అత్తయ్యగారూ! నాకు కూడా మాతృభక్తి ఎక్కువ. ముందు మా అమ్మకి పాదాభివందనం చేశాక, మా నాన్నగార్కి చేస్తుంటా! అలాగే ముందు మీ పాదాలకు మొక్కిన తర్వాతే, మావారి పాదాలపై పడి పతిభక్తిని ప్రదర్శిస్తా!’ అంది అతివినయంగా పురం.
‘నన్ను బాగా అర్థం చేసుకున్నావ్. నాకిక భయం లేదు’ అంది తృప్తిగా భాగ్యం. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కాఫీలు అందించి, తను టిఫిన్ తినడం ఆరంభించింది పురం. ఇంతలో పరం సెల్ మోగింది.
‘హలో!’ అన్నాడు పరం.
‘హలో.. నేను మీ అంకుల్ని’
‘మీరూ, ఆంటీ ఎలా ఉన్నారు?’
‘బాగున్నాం బాబూ.. సంక్రాంతికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అమ్మగార్ని కూడా తీసుకొని మీ ముగ్గురూ రండి!’
‘సరేనండీ.. మా అమ్మగార్ని కనుక్కొని చెబుతాను’ అని చెప్పి తల్లి వద్దక వెళ్లాడు పరం.
‘అమ్మా.. పండక్కి మామయ్యగారు అందర్నీ రమ్మన్నారు. వెళ్దామంటావా?’ అన్నాడు భయం భయంగా మరోవైపు చూస్తూ పరం.
‘ఇంకా టైముందిగా ఆలోచిద్దాంలే’ అంది భాగ్యం.
అప్పుడే తన గదిలోకి వస్తున్న పురానికి కూడా ఆ విషయం చెప్పగా ఆమె సంతోషించింది.
‘ఎప్పుడు వెళ్దామండీ?’ అంది ఆసక్తిగా పురం.
‘మా అమ్మ ఎప్పుడు వెళ్దామంటే అప్పుడే!’
‘ఒకవేళ వద్దంటే..’
‘ఏముంది.. వెరీ సింపుల్.. వెళ్ళం. చిన్నప్పట్నుంచీ నేనంతే. అమ్మ వద్దన్న ఏ పనీ చెయ్యను’.
‘మీకు తెలీదేమో! చిన్నప్పుడు అమ్మ మాట, పెళ్ళయ్యాక పెళ్లాం మాట వినాల్సిందే! అదంతే. ఇదంతే! ఇలాంటి మామూలు విషయాలు కూడా తెలియకుండానే మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎట్లా అయ్యారన్న అనుమానం వస్తోంది. నేనే మీ అమ్మగార్ని అడిగి తేల్చుకుంటా! మీరేం కంగారు పడకండి’ అంటూ అతని వైపు అదోలా చూసి వేగంగా వెళ్లింది పురం.
అతను అయోమయానికి లోనై, ఏమీ చెప్పలేక ఆఫీసుకెళ్లిపోయాడు.
‘పేపరు చదవడం పూర్తయిందా అత్తయ్య గారూ..!’ అంటూ రాగం తీస్తూ రగిలిపోతూ దగ్గరగా వెళ్లింది పురం.
‘రోజూ ఏముంటాయ్‌లే కొత్త వార్తలు. నీ వార్తేమిటో చెప్పు’ అంది భాగ్యం.
‘పండుగ విషయం.. మీ అబ్బాయి చెప్పే ఉంటారు’ అంది పురం.
‘ఆ.. చెప్పాడు. అదే ఆలోచిస్తున్నా! అందరం వెళ్తే ఇల్లంతా ఎవరు కాపలా కాస్తారు. ఈరోజుల్లో ఇంటికి తాళం వేసి ఎటూ వెళ్ళలేని పరిస్థితి. అందుకని ఓ పని చేస్తే బాగుంటుందేమో!’ అంది భాగ్యం.
‘ఏంటది?’
‘నువ్వొక్కదానివే వెళ్లిరా’
‘అదేంటండీ! వారు రాకుండా నే వెళ్తే ఏం బావుంటుంది?’
‘నిజమేననుకో! నువ్వొచ్చాక వాడెళ్ళొస్తాడు. వాడొచ్చాక నే వెళ్ళొస్తా!’
‘మనిద్దరం వెళ్ళొద్దాం. మీ అబ్బాయి వొక్కరూ ఉంటారు’
‘మా అల్లుడూ, కూతురూ, మా పెద్దబ్బారుూ, కోడలూ, పిల్లలూ ఎప్పట్నుంచో వద్దామనుకుంటున్నారు. పండక్కి వాళ్ళను రమ్మంటే ఎలా ఉంటుందంటావ్?’
‘అలాగే రమ్మనండీ! ఇదీ ఓ రకంగా బాగానే వుంది. నేనూ, మా నాన్నగార్ని, అమ్మనూ కూడా ఇక్కడికే రమ్మంటాను. ఎక్కడైతేనేం..? పండుగ బాగా చేసుకోవడమేగా’
‘ఇంతమందికీ కొత్తబట్టలు తెమ్మంటే మీ నాన్నగారేమనుకుంటారో?’
‘అదేమిటండీ అలా అంటారు. మనకేం తక్కువ? మనింటికొచ్చిన వాళ్ళకు మనం బట్టలు పెట్టాలి గానీ, వాళ్ళను తెమ్మంటే ఏం బావుంటుంది?’.
‘ఇది ఆలోచించాల్సిన విషయమే!’
‘మీరలా ఆలోచిస్తూ కూర్చోండి.. ఇంటికి కాపలాగా ఉన్నట్లూ ఉంటుంది. మేము వెళ్ళిరావడమూ జరుగుతుంది. తొలిసారి పిలిచిన పండుగకు వెళ్ళడం మన బాధ్యత. పిలవడం వాళ్ళ మర్యాద..అంతే!’ అంటూ భాగ్యం వైపుతీక్షణంగా చూసి, తోటకూర ఆకులు తీసి కాడలు పారేస్తోంది పురం.
మెల్లమెల్లగా కోడలు మేకులా తయారవుతోందే.. తనను కూడా ఆ తోటకూర కాడల్ని విసిరేసినట్లు చేస్తుందేమోనన్న ఆలోచనలో పడ్డది భాగ్యం.
***
కొన్నాళ్ళపాటు సాగిన ఈ కీచులాటల తర్వాత, ఒక రాత్రి పురం కిటికీ దగ్గర కూర్చోని ఏదో ఆలోచిస్తోంది. పరం పక్కపైన వాలిపోయి ఆవలిస్తున్నాడు. క్షణకాలం గడిచాక పురం వైపు చూశాడు. ఆమె ఎందుకలా కూర్చుందో తెలుసుకోవాలనిపించి దగ్గరగా వెళ్ళాడు. అప్పటికే పురం ఒక నిర్ణయానికి వచ్చేసింది.
‘పురం.. నిద్ర రావడం లేదా? ఏదోలా వున్నావ్?’ అన్నాడు పలకరింపుగా.
‘ఏమీ తెలియనట్లడుగుతారేం?’అంది అతనివైపుచూడకుండా.
‘తెలిసినట్లే అడుగుతున్నా.. మీ అత్తగారూ, నీ ఆడపడుచులూ సూటిపోటి మాటలతో, సూదిలాంటి చూపులతో నీ మనస్సును నిత్యం అతలాకుతలం చేస్తున్నారని నాకు తెలుసు. సమయం కోసం చూస్తున్నా! అంతే!’
‘ఇంకా సమయం మించిపోలేదు. నేను బతికే వున్నానుగా! ఫర్వాలేదు’
‘అలా అనకు పురం.. వాళ్ళను అదుపులో పెట్టాలంటే ఒక్కమాట చాలు. కొన్నాళ్లకైనా మార్పు రాకపోతుందా? అని చూస్తున్నా!’
‘అలా చూస్తూనే ఉండండి. పెళ్ళయి ఇన్నాళ్లయినా పిల్లలు కలగలేదని ఇరుగూ పొరుగూ గుచ్చి గుచ్చి అడుగుతుంటే వాళ్ళకెలా సమాధానం చెప్పాలో.. అది కూడా మీరే చెప్పండి’
‘దేవుడు కరుణించినప్పుడు పుడ్తారని చెప్పు’ అన్నాడు పరం.
‘మన చేతగాని తనాన్ని దేవుడిపైన రుద్దడమెందుకు? మా అత్తగారు కరుణించాలని, మా ఆడపడుచులు సూటిపోటి మాటలు అనకుండా.. నన్ను అసూయతో చూడకుండా ఉండాలని.. అప్పుడు ఈ ఇల్లు పిల్లాపాపలతో కళకళలాడుతుందని.. ఇప్పట్నుంచే ఊరంతా చెప్పొస్తా!’
‘అనవసరంగా హైరానా పడకు పురం.. టీవీ సీరియల్స్‌లోని అత్తా, ఆడపడుచుల కన్నా మా వాళ్ళు వెయ్యి రెట్లు నయం! వాళ్ళయితే తిండి కూడా సరిగా పెట్టరు. ఆ మొగుళ్ళు మూగజీవాల్లా ఎప్పుడూ ముడుచుకొనే వుంటారు- మాటా పలుకూ లేకుండా’
‘మనది సినిమా కాదు, టీవీ సీరియల్ కాదు నటించడానికి. మనం అనుభవిస్తున్నది జీవితం! పెళ్ళయిన కొత్తలో భార్యాభర్తలిద్దరూ స్వేచ్చగా, హాయిగా గడుపుతారు..’
‘అందరూ ఒకేలా వుండరు కదా.. నిన్ను అర్థం చేసుకున్నా.. ప్లీజ్ కొన్నాళ్ళు ఓపిక పట్టు! అన్నీ సర్దుకుంటాయ్’
‘నేను సర్దుకోవాల్సిందే పెట్టే బేడా తీసుకొని. పెళ్లికిముందు నేనూహించుకొన్నది వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. పతియే ప్రత్యక్ష దైవం అనుకొంటూ అడుగుపెట్టాను. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న మీ వాళ్ళంతా నాకు ప్రతిపక్ష సభ్యులైనారు. వాళ్ళను వెనకేసుకొస్తున్న మీరు కచ్చితంగా నాకు ‘ప్రతిపక్ష దైవమే’ కానీ, నా ప్రత్యక్ష దైవం కాదు. అందుకే నాదారి నే చూసుకుంటా..’ అంటూ ఆవేశంగా గదిలో నుంచి హాల్‌లోకి వెళ్లి అక్కడ సోఫాలో పడుకుంది పురం. ఇక చేసేదేమీలేక పరం తల గోక్కుంటూ పక్కపై వాలాడు.
ఒంటరిగా సోఫాలో పడుకున్న కోడలి దగ్గరికి వచ్చిన భాగ్యం- ‘ఏంటి.. ఇక్కడ పడుకున్నావ్. గొడవ పడ్డారా?’ అంది.
‘ఎక్కడ పడుకున్నా ఒకటే! మా గది తలుపుతీసే వుంటుందిగా. గొడవపడితే మీకు తెలీకుండా వుంటుందా? మీక్కావాల్సింది కూడా మేం గొడవపడటమేగా’.
‘మరెందుకిక్కడ పడుకున్నావ్?’
‘ఇక్కడ కాదు! మీ దగ్గరే పడుకుంటా!’
‘అదేమిటి?’’
‘అంతే! నేను పెళ్లి చేసుకొన్నది మిమ్మల్నీ, మీ అమ్మాయిల్నీ! వాళ్ళొచ్చినపుడు వాళ్ళ దగ్గర కూడా పడుకుంటా! మీరు చెప్పినట్లు, మీ అమ్మాయిలు చెప్పినట్లు నేను వినాల్సిందే.. మీ అబ్బాయి చెప్పినట్లు కాదు!’
‘ఎవరన్నా నవ్వేరు, ఏమిటా మాటలు?’
‘ఇప్పుడు నవ్వకుండా ఉన్నారు గనుకనా!’
‘మన ఇంటి బాగోతం బజారుకీడ్చావన్నమాట’’
‘కొన్నాళ్ళు పోతే వాళ్ళే మనల్ని బజారుకీడుస్తారు’
‘చాల్లే! ఇక ఆపు’
‘పదండి! మీ గదిలోకి వస్తున్నా!’ అంటూ లేచింది పురం.
‘ఏదో కొత్తగా మాట్లాడుతున్నావ్! పో.. ఆ గదిలో పడుకో!’
‘మీ అబ్బాయితో నేను కాపురం చేస్తే మీ పెత్తనం సాగదని మీ భయం! నేను మీతో కాపురం చేస్తే మీ అబ్బాయి పెత్తనం ఆరంభమవుతుందేమో.. పదండి.. ఇప్పటికే పొద్దుపోయింది’ అంటూ అత్తగార్ని బలవంతంగా ఆమె గదిలోకి తీసుకెళ్లింది పురం నవ్వుతూ.
గదిలోంచి ఇదంతా గమనించిన పరం- ఆవేశంగా బయటకు వచ్చి, తను ఇన్నాళ్ళూ భార్య పట్ల చేసింది తప్పేనని గ్రహించి, లోలోపల పశ్చాత్తాపంతో కుమిలిపోయి, పురాన్ని చేయి పట్టుకొని లాక్కొచ్చి వాళ్ళ అమ్మ చూస్తుండగానే గట్టిగా కౌగిలించుకొని, ముచ్చటగా మూడుసార్లు ముద్దు పెట్టుకొని తన గదిలోకి తీసుకెళ్లి తలుపేసుకున్నాడు తృప్తిగా.
భాగ్యం ఒక్కసారిగా గుటకలు మింగుతూ సోఫాలో కూలబడింది. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలన్న విషయాన్ని గ్రహించి.
పడక గదిలో- ‘నన్ను క్షమించు పురం.. నాలాంటి దద్దమ్మలకు చక్కని గుణపాఠం చెప్పావు. ఇకనుంచీ నీ జోలికి ఎవరొచ్చినా ఊరుకోను. మనల్ని చూసి ఈర్ష్యపడేవాళ్ళున్నచోట ఇక ఉండకూడదు. మరోచోటకు పోయి సుఖంగా బతుకుదాం! మనకు తప్పకుండా పిల్లలు పుడతారు! మనకోసం మనం బతకాలి గానీ ఎవరికోసమో కాదు. వాళ్ళంతా సంతోషంగా ఉండొచ్చుగానీ మనం హాయిగా ఉండకూడదా? ఇకనుంచీ ఎవరికీ నువ్వు భయపడనక్కర్లేదు. నేనికనుంచి నువ్వనుకొన్నట్లు ప్రతిపక్ష దైవాన్ని కాదు. నా మాట నమ్ము!’ అంటున్న పరం కళ్ళలోకి చూస్తున్న పురం - తన పాచిక పారినందుకు సంతోషించింది. ఆ రాత్రే వాళ్ళకు తొలిరాత్రయ్యింది. *

షణ్ముఖశ్రీ సెల్ నెం: 889 785 3339