సబ్ ఫీచర్

మధుమేహం ఉన్నవారిలో దంత చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంధమె ఆనందం
మనం ఏ వైద్యుడి దగ్గరకెళ్లినా వారు సాధారణంగా రెండు ప్రశ్నలు అడుగుతుంటారు. ఒకటి- బి.పి (రక్తపోటు) ఉందా, రెండు- షుగర్ (మధుమేహం) ఉందా అని. అసలు మధుమేహం అంటే ఏంటి? దీనికెందుకు ఇంత ప్రాముఖ్యత? దంత చికిత్సకూ దీనికీ సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు అసలు మధుమేహం అంటే ఏంటో తెలుసుకుందాం. మనం తిన్న ఆహారం మన శరీరంలో గ్లూకోజ్ కింద మారుతుంది. ఈ గ్లూకోజ్ మన రక్తంలోంచి శరీర కణజాలాల్లోకి వెళ్లి వాటికి శక్తిని ఇస్తుంది. అలా వెళ్లడానికి ఇన్సులిన్ అనే పదార్థం సహాయం తీసుకుంటుంది. ఈ ఇన్సులిన్ పదార్థం అసలు ఉత్పత్తి కానివారిలో లేక తక్కువగా ఉత్పత్తి అవుతున్నవారిలో ఈ గ్లూకోజ్ రక్తం నించి శరీర కణజాలంలోకి వెళ్లలేక రక్తంలోనే ఉండిపోతుంది. దీనిని మధుమేహం అంటారు. అందుకే వీరిలో రక్తపరీక్ష చేస్తే రక్తంలో గ్లూకోజ్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. సుమారు ఆరు కోట్లకుపైగా భారతీయులు నేడు ఈ మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ మధుమేహం రెండు రకాలు.
టైప్ 1: చిన్న వయసులోనే (30 సంవత్సరాలకి ముందు) ఇన్సులిన్ అస్సలు ఉత్పత్తి కాకపోవడం మూలాన వచ్చే మధుమేహాన్ని టైప్-1 అంటారు. వీరు జీవితాంతం ఇన్సులిన్ సూది ద్వారా బయటనుంచి తీసుకోవాలి.
టైప్ - 2: 30 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో (ఈమధ్య చిన్న వారిలో కూడా ఇది కనిపిస్తున్నది) ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అవ్వడం మూలాన లేక ఇన్సులిన్ సరిగా పనిచేయలేకపోవడం మూలాన ఈ మధుమేహం వస్తుంది. వీరు వీరి ఆహారాన్ని వైద్యుడు చెప్పినట్లుగా నియంత్రించుకుంటే సరిపోతుంది. అలా చేసినా లాభం లేనివారు మాత్రలు వేసుకోవాల్సి వుంటుంది.
మధుమేహం నియంత్రణ
మధుమేహం ఉన్నవారిలో గాయం త్వరగా మానదు. పైగా గాయానికి సంక్రమణ వ్యాపించే ప్రమాదం కూడా వుంటుంది. మధుమేహం ఎక్కువగా ఉన్నవారిలో, ఎంతోకాలంగా వున్నవారిలో వారి గుండె, నరాలు, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఏ ఆపరేషన్ చేసినా లేక చికిత్స చేసినా మధుమేహం ఉందా లేదా అన్నది తెలుసుకొని, రక్తపరీక్షల ద్వారా దానిని నిర్థారించుకొని, తగిన మందులు మరియు అవసరమైతే ఇన్సులిన్ వాడి దానిని నియంత్రించి ఆ తర్వాతే వేరే చికిత్స చేస్తారు.
దంత చికిత్సలో మధుమేహం ప్రాముఖ్యత
పళ్ల క్లీనింగ్, పుచ్చు తీసి సిమెంటు పెట్టడానికి, రూట్ కెనాల్ చికిత్సకి, కృత్రిమ పన్ను పెట్టడానికి, తీసి పెట్టుకునే పళ్ల సెట్టు కట్టడానికి మధుమేహంతో సంబంధం లేదు. కానీ పన్ను తియ్యాలన్నా, జ్ఞాన దంతం ఆపరేషన్ ద్వారా తియ్యాలన్నా, చిగురు సర్జరీ (్ఫ్లప్ సర్జరీ), దవడ ఎముకకు ఏ ఆపరేషన్ చెయ్యాలన్నా, వాపు కోసి చీము బయటికి తియ్యాలన్నా, డెంటల్ ఇంప్లాంట్ పెట్టాలన్నా మధుమేహం ఉందో లేదో తెలుసుకొని దాన్ని రక్త పరీక్షల ద్వారా నిర్థారించుకొని, ఇన్సులిన్ లేక మందుల ద్వారా నియంత్రించుకొని ఆపైన తగిన దంత చికిత్స చేయవలసి వుంటుంది.
మధుమేహం ఉందో లేదో తెలీనివారిలో పైగా ముప్ఫై సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో తప్పనిసరిగా చెయ్యవలసిన రక్తపరీక్ష- రాండమ్ బ్లడ్ సుగర్- మనకి వీలు దొరికినపుడు వెళ్లి రక్తం ఇచ్చినట్లయితే దానిలో ఎంత స్థాయిలో గ్లూకోజ్ వుందో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఈ పరీక్ష ద్వారా మధుమేహం ఉందో లేదో తెలుస్తుంది.
ఇలా ఉందని తెలిసిన వారిలో ముందే ఉందని చెప్పిన వారిలో చేయించాల్సిన రక్త పరీక్షలు..
ఖాళీ కడుపు మీద రక్త పరీక్ష: ఆహారం తిన్న ఎనిమిది గంటల తర్వాత రక్తం ఇస్తే అందులో ఎంత గ్లూక్లోజ్ వుందో పరీక్షిస్తారు. ఇది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్.
ఆహారం తర్వాత రక్తపరీక్ష: తిన్న రెండు గంటల తర్వాత రక్తం ఇస్తే దానిని పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అంటారు.
గ్లైకోజ్‌లేటెడ్ హీమోగ్లోబిన్: ఈ రక్తపరీక్ష ద్వారా మధుమేహం ఉన్నవారు ఎంత బాగా దానిని నియంత్రించుకుంటారో తెలుస్తుంది.
పై పరీక్షల ద్వారా మధుమేహం కంట్రోల్‌లో ఉందా లేదా అన్నది మనకి తెలుస్తుంది. కంట్రోల్‌లో ఉన్నవారిలో చికిత్స కొనసాగించవచ్చు. లేనివారిని మధుమేహం స్పెషలిస్ట్ దగ్గరకు పంపాలి.
రక్తం- గ్లూకోజ్ స్థాయి 200 ఎంజి/డిఎల్‌కి పైన ఉన్నవారిలో ఆపరేషన్ ద్వారా కలిగే గాయం, పన్ను తీయడం వల్ల కలిగే గాయానికి సంక్రమణ వచ్చే ప్రమాదం నాలుగింతలు రెట్టింపు అవుతుంది. అందుకే వీరిలో అత్యవసర పరిస్థితులలో తప్పితే చికిత్స చేయరాదు. మధుమేహం స్పెషలిస్టు టైప్-1 ఉన్నవారికి ఇన్సులిన్ మోతాదు పెంచో, టైప్-2 ఉన్నవారికి ఆహార నియంత్రణ ద్వారా లేక మందుల ద్వారా గ్లూకోజ్ స్థాయి తగ్గించే ప్రయత్నం చేస్తారు. అత్యవసర పరిస్థితులు అనగా, మందులకు తగ్గని పన్నునొప్పి, దవడ వాపు పెద్దదయి ఊపిరితిత్తులమీద ఒత్తిడి కలిగించడం, దవడ ఎముకలు విరిగి అక్కడనించి రక్తప్రవాహం ఆగకపోవడం లాంటి పరిస్థితులలో తగిన చికిత్స చేసి వెంటనే మధుమేహం స్పెషలిస్టుకి తెలియపరచాలి.
మధుమేహం ఉంటే..
చాలా సందర్భాలలో మధుమేహం ఉన్నవారు చికిత్సకి వచ్చే రోజు (పన్ను తీయించుకోవడానికో, చిగురు సర్జరీకో) వారి ఇన్సులిన్ లేక మధుమేహం మాత్రలు వేసుకొని ఆ ఒత్తిడిలో ఇంకా కంగారులో ఆహారం తినకపోవడమో, లేక తక్కువగా తినడమో చేస్తారు. దీనివల్ల వారి రక్తం గ్లూకోజ్ స్థాయి కిందకి పడిపోయి వారు స్పృహ కోల్పోతారు. ఇది చాలా ప్రమాదకరం.
ఇలా కాకుండా సూచన
నిద్రమత్తు ఇవ్వని చికిత్సా విధానాలలో, మీ చికిత్సకి ముందు ఆహారం తినడం మరువవద్దు. అది మీ తినే సమయం కాకపోయినా ఓ గ్లాసు పళ్ల రసమో లేక ఆహారమో తప్పకుండా తీసుకోండి. తినద్దని డాక్టరు హెచ్చరిస్తే తప్ప తినడం మరువరాదు.
వాళ్లమ్మకి చాలా పన్ను నొప్పి ఉందని కంగారుగా ఉదయానే్న నా దగ్గరికి ఆ కూతురు తీసుకొచ్చింది. పరీక్షించి జ్ఞాన దంతంవల్ల నొప్పి, అది తీసేయాలి, షుగర్ వుందా అని అడిగా. ఉందని జవాబిచ్చింది ఆ కూతురు. కంట్రోల్‌లో ఉందా అని అడిగా. ఉంది అని నా వెనుక నుంచొని వున్న ఆమె కూతురు మళ్లీ జవాబిచ్చింది. మందులు, రక్తపరీక్ష రాస్తున్నా. వాడి చేయించుకొని రండి, పన్ను తీసేద్దామని చెప్పా. ఏ జవాబూ లేదు. ఎందుకా అని వెనక్కి తిరిగి చూస్తే ఆ కూతురు స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే లేపి మంచంమీద పడుకోబెట్టి ‘ఈమెకి షుగర్ వుందా’ అని వాళ్ళమ్మని అడిగా. ‘ఉంది’ అని ఆమె సమాధానమిచ్చింది. వెంటనే గ్లూకోజ్ ఇంజెక్షన్ రక్తకణాల్లోకి ఇచ్చా. స్పృహలోకి వచ్చింది. జరిగింది ఏంటంటే, ఆమెకి మధుమేహం ఉంది. అమ్మకి నొప్పి ఉంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలన్న కంగారులో ఇన్సులిన్ తీసుకుంది కానీ టిఫిన్ తినలేదు. దానికి పర్యవసానమే ఈ స్పృహ తప్పడం. చూపించుకోడానికి తల్లి వచ్చింది, చికిత్స కూతురికి జరిగింది. ఊహించనిది జరగడం అంటే ఇదేనేమో. పన్ను తీయాల్సిన రోజు మా జూనియర్ డాక్టర్ ఆమెకి ఫోన్ చేసి ఇవాళ మీ అమ్మగారి అపాయింట్‌మెంట్ ఉందని గుర్తుచేసింది. నేను ఫోన్ చేసి ఇద్దరూ తిని రండి అని హెచ్చరించా!

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డా. రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com