సబ్ ఫీచర్

గుట్కా మానేందుకు చిట్కా ( అంధమె ఆనందం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓసారి నోరు తెరుచుకోని బాధితుడు దాని చికిత్స కోసం వచ్చాడు. ‘‘గుట్కా తింటారా’’’ అని అడిగా. ‘‘తినేవాడ్ని. వారం అయింది, మానేశా. ఇప్పుడు తినట్లే’’ అని చెప్పాడు. ‘‘‘అవునా! సరే పదండి పరీక్షిస్తా’’ అని తీసుకెళ్లి కూర్చోబెట్టి నోరు తెరవమన్నా. తన కింది ఎడమ వైపు దవడ పళ్లమధ్య గుట్కా ముక్కలు ఉన్నాయి. ‘‘మీరు పళ్లు తోమరా’’ అని అడిగా. ‘‘లేదు డాక్టర్, రోజూ పది నిమిషాలు తోముతా, అలా అడిగేరేంటి’’ అన్నాడు. ‘‘వారం క్రితం తిన్న గుట్కా ముక్కలు ఇంకా మీ పళ్లమధ్య కనిపిస్తే తోమట్లేదేమో అని అనుకున్నా’’. ఏం చెప్పాలో అర్థంకాక చిన్న నవ్వు నవ్వి, ‘‘లేదు డాక్టర్! మీ దగ్గరికి వచ్చేముందు మీరేం చెప్తారో అని టెన్షన్ ఫీలయి ఓ గుట్కా తిన్నా’’ అన్నాడు. ‘‘గుట్కా మానేశా అన్నంత సులువు కాదుగా మానడం’’ అని నేనన్నదానికి తను ‘‘చాలా కష్టం సార్, చాలాసార్లు మానాలనుకుంటా, కాని మానలేకపోతున్నా’’ అని నిజం పలికేడు. ‘‘నోరు తెరుచుకునే చికిత్స తరువాత చేద్దాం, ముందు గుట్కా మానే ప్రయత్నం చేద్దాం’’ అని కొన్ని చిట్కాలు చెప్పా.
ఓ వ్యసనాన్ని వదిలించుకోవడం అంత సులువు కాదు. చాలా కష్టం. చాలా పట్టుదల, సహనం ఉండాలి. చాలామంది గుట్కా, సిగిరెట్ వదిలేసినవారు పది రోజులు కాగానే మళ్లీ మొదలుపెడతారు. కారణం, ఏదో ఒత్తిడి, దాని నుంచి ఉపశమనం గుట్కా తింటే వస్తుందన్న భావన, గుట్కా తినాలనే కోరిక పుట్టడం. దండిగా చుట్టూ ఎన్నో పాన్ షాపులు, చిల్లర ఇస్తే ప్యాకెట్ ఇస్తాడు, నోట్లో వేసుకుంటే చిన్న మత్తు, అదే ఉపశమనం అనుకునే మన భ్రమ. ‘‘ఇదే ఆఖరిసారి, ఇవాళతో మానేస్తా, ఒకసారి వేసుకుంటే ఏం కాదు’’ అన్న ఆత్మవంచన. ఆఖరికి ‘‘కష్టంగా ఉంది, నా వల్ల కావట్లే’’ అని తిరిగి పూర్తిస్థాయిలో మొదలుపెట్టడం. మానేవారి ప్రక్రియ సాధారణంగా ఇలానే ఉంటుంది. ఓ పెద్దాయన ముల్లును ముల్లుతోనే తియ్యాలి అన్న సామెత ప్రకారం వ్యసనాన్ని వ్యసనంతోనే ఆపాలి అని చెప్పి గుట్కా మానడం కోసం సిగిరెట్ మొదలుపెట్టాడు. కొన్నాళ్లకి రెండు వ్యసనాలుగా మారాయి. ఇలా కాదని ఈ రెండు మానడానికి మందు సేవించడం మొదలుపెట్టాడు. మూడు నెలలయింది. ఇప్పుడు మూడింటితో సంసారం, సావాసం చేస్తున్నాడు. వ్యసనాన్ని వేరే వ్యసనంతో ఆపాలనుకోవడం మూర్ఖత్వం.
ఆపే చిట్కా తెలుసుకునే ముందు గుట్కా వల్ల వచ్చే సమస్యలేంటో చూద్దాం.
1.పళ్లమీద మరకలు- పళ్లు క్లీనింగ్ చేయించుకుంటే పోతాయి. పెద్ద భయపడాల్సిన సమస్య కాదు.
2.ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ (ORAL SUB MUCOUS FIBROSIS)P- అంటే నోరు తెరుచుకోకపోవడం. చాలా క్లిష్టమైన సమస్య. గుట్కా పెట్టిన చోట బుగ్గకు చికాకు కలగడం వల్ల అది గట్టిగా మారుతుంది. దాని కారణంగా నోరు తెరుచుకోదు. దానికి చికిత్స, కొద్దిగా తెరుచుకోకపోతే ఇంజెక్షన్లు ఇంకా మందులు వాడడం. బాగా తెరుచుకోకపోతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. నొప్పితో, డబ్బుతో కూడుకున్న సమస్య. తిండి లేక బాధితులు తీగల్లా మారిపోతారు.
నోటి క్యాన్సర్: నోట్లో ఏదైనా పుండు రెండు వారాలైనా తగ్గకపోతే దానిని కాన్సర్‌గా భావించి, చిన్న ముక్క కోసి పరీక్షకి పంపుతారు. సాధారణంగా మానని పుండ్లు క్యాన్సర్ అనే నిర్థారించబడతాయి. గుట్కా పెట్టే ప్రదేశంలో బుగ్గకి కాని చిగురుకి కాని చికాకు కలిగీ కలిగీ అది పుండులా మారి క్యాన్సర్‌కి కారణమవుతుంది. దానికి చికిత్స దాని పరిమాణాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా ఆ వైపు దవడని కోసి తీసేస్తారు.
గుట్కా మానాలని
మానాలని దృఢంగా నిర్ణయించుకున్నవారిలోనే ఏ చిట్కా అయినా ఫలిస్తుంది. గుట్కా కారణంగా నోటి క్యాన్సర్ వచ్చి బాధపడుతున్న వారి దృశ్యాలు ,వీడియోలు, ఆపరేషన్ తరువాత వారి కష్టాలని చూపే దృశ్యాలు, వీడియోలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండని. సాధ్యపడితే స్వయంగా క్యాన్సర్ హాస్పిటల్‌కి వెళ్లి అక్కడి బాధితులని చూడండి. మీరు భరించలేనంతవరకు చూడండి, వాంతులు వచ్చేదాకా చూడండి. ‘‘వారి బాధలోంచి మీలో భయం పుడుతుంది. అదే మీ వ్యసనాన్ని చంపే ఆయుధంగా మారుతుంది. ఎక్కడైనా గుట్కా తినాలని అనిపించినపుడు ఆ సందర్భాన్ని గుర్తుతెచ్చుకోండి. సజీవంగా చూసిన దృశ్యాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ఫోన్‌లో దాచుకున్న దృశ్యాల్నీ, వీడియోల్ని చూడండి. తినాలన్న కోరిక చచ్చేవరకూ చూడండి. సరిగా వాడుకుంటే భయం కూడా చాలా భయంకరమైన ఆయుధం. భయం ఎప్పుడైనా తగ్గుముఖం పడుతున్నట్టు, బలహీనమైపోతున్నట్టు అనిపిస్తే తిరిగి మళ్లీ క్యాన్సర్ హాస్పిటల్‌కు వెళ్లండి, చూడండి. గుట్కా తిని తర్వా త ఆ బాధపడటం అవసరమా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీ పట్టుదలని పరీక్షించుకోండి. ఓ ఇరవై సంవత్సరాల పిల్లవాడికి గుట్కా అంటే భయం, ముట్టుకునేవాడు కాదు. కారణం ఆ గుట్కా కారణంగా నోటి క్యాన్సర్ వచ్చి వాళ్ల నాన్న బాధపడడం, చనిపోవడం అతను చూసాడు. ఆ భయం మనసులో నాటుకుపోయింది. ఆ భయం మనసులో ఉన్నంతకాలం తన నోట్లో గుట్కా ఉండదు. మానాలన్న దృఢ సంకల్పం మీలో వుంటే ఈ చిట్కా ప్రయత్నించండి. రాత్రి తొమ్మిదయ్యేసరికి రామూకి గొంతులో మందు గుటకపడకపోతే ఏం తోచదు. అలాంటిది ఓ రోజు ఆఫీసులో బాగా ఆలస్యం అయింది. పది నిమిషాలలో మందు షాపులు మూసేస్తారు. అందుకే వేగంగా బండిమీద వెళ్లసాగాడు రాము. ఇంతలో యాక్సిడెంట్. ముఖంపై పెద్దగా కోసుకుంది. రక్తాన్ని హ్యాంకీతో ఆపి ఇంకో ఇద్దరి సహాయంతో ఆటో ఎక్కి ఆసుపత్రికి వచ్చాడు.
గాయాన్ని చూసి, ఏం జరిగిందో తెలుసుకొని కుట్లు వేసా. మర్నాడు పొద్దున తనతో, ‘‘దేనికోసం బయలుదేరావో అది దొరకలేదు కదా!’’ అని అడిగా. అప్పుడు తనకి గుర్తొచ్చింది, తను తాగలేకపోయాడని. ‘‘నిజమే సార్, పడిన తర్వాత ఆ భయానికి తాగాలనే మర్చిపోయా’’’ అన్నాడు. భయం, నొప్పి తాగాలనే తన తపనని చంపేశాయి. మెదడును మరోవైపుగా ఆలోచింపజేశాయి. దీనినే సైకలాజికల్ డైవర్షన్ అంటారు. మీ వ్యసనం కన్నా ఇంకా బలమైన ప్రేరణ మీకు దొరికితే మీ వ్యసనం అంతమయినట్టే. ఆలోచించండి, ఆచరించండి, భయాన్ని పెంపొందించండి. వచ్చే ఆదివారం కొత్త సంవత్సరం ప్రారంభం. కొత్త సంవత్సరంలో వదిలేద్దాం అని అప్పటిదాకా వేచి చూడకండి. మానడానికి ఈ క్షణమే మంచి ము హూర్తం.

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com